అణ్వాయుధాలను అప్రమత్తం చేసిన పుతిన్!


Yars ground mobile missile system

రష్యా అధ్యక్షుడు అసాధారణ చర్యకు పూనుకున్నాడు. అమెరికా, నాటో నేతల ప్రకటనలకు స్పందనగా దేశంలోని అణ్వాయుధాలను ‘హై అలర్ట్’ లో ఉంచాలని రష్యన్ మిలట్రీని, రక్షణ శాఖను ఆదేశించాడు.

పుతిన్ ఆదేశాలను ‘బాధ్యతారాహిత్యం’ గా నాటో కూటమి అభివర్ణించింది.

నాటో కూటమికి చెందిన ఉన్నతాధికారులు “దూకుడు ప్రకటనలు” (Aggressive Statements) జారీ చేస్తున్నారని పుతిన్ ఆరోపించాడు. తమ దేశం రష్యా గురించి అభ్యంతరకరంగా వ్యాఖ్యానిస్తున్నారని తప్పు పట్టాడు.

“నాటో కూటమికి నేతృత్వం వహిస్తున్న దేశాలు మా దేశం గురించి దూకుడుగా ప్రకటనలు ఇస్తున్నారు. కాబట్టి మా రష్యన్ మిలట్రీకి చెందిన బెదిరింపు నిరోధక బలగాలను (deterrence forces) ప్రత్యేక పోరాట విధి నిర్వహణ దశలో ఉంచమని నేను మా రక్షణ మంత్రికి, చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ కీ ఆదేశాలు ఇస్తున్నాను” అని రక్షణ మంత్రి సెర్గి షోయిగు, చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ వెలరి గెరాసిమోవ్ లతో జరిపిన సమావేశంలో పేర్కొన్నాడు. (స్పుత్నిక్ న్యూస్, 27/02/2022)

డిటరెన్స్ బలగాలు అంటే న్యూక్లియర్ డిటరెన్స్ బలగాలు అని అర్ధం. నాటో నాయకత్వ దేశాలు ఇస్తున్న ప్రకటనలు రష్యాతో ఘర్షణకు సిద్ధపడుతున్నట్లు ప్రకటనలు ఇస్తున్నారని పుతిన్ ఆరోపణ.

ఉక్రెయిన్ పై “క్రూరమైన రీతిలో, ఎలాంటి ప్రోవొకేషన్ లేకుండా” జరుపుతున్న దాడులకు “రష్యా మరియు బెలరూస్ దేశాలను బాధ్యులను చేస్తామని ప్రతిన బూనుతున్నాం” అనీ, తన చర్యలకు గాను మాస్కో “అత్యంత భారీ మూల్యం చెల్లించుకునే విధంగా” చేస్తామని నాటో నేతలు ప్రకటించడం పుతిన్ కు ఆగ్రహం తెప్పించిందని టాస్ న్యూస్ ఏజన్సీ తెలిపింది.

“ఉక్రెయిన్ లో తన మిలట్రీ ఆపరేషన్ ను రష్యా వెంటనే ఆపకపోతే అది నాటో తో ఘర్షణకు దారి తీసే అవకాశం ఉంది” అని యూ‌కే విదేశీ మంత్రి లిజ్ ట్రస్ శనివారం ప్రకటించింది. (బి‌బి‌సి, 26/02/2022) ఈ ప్రకటన ఉక్రెయిన్ కు మద్దతుగా నాటో యుద్ధంలోకి దిగుతుంది అని హెచ్చరించినట్లుగా రష్యా అధ్యక్షుడు భావించినట్లు తెలుస్తోంది.

“బెలారూస్ సహాయంతో రష్యా ఉక్రెయిన్ పై పూర్తి స్థాయి దాడికి తెగబడింది. మాస్కో వెంటనే తన మిలట్రీ దాడి ఆపాలి. తన సేనలను వెంటనే ఉక్రెయిన్ నుండి పూర్తిగా ఉపసంహరించాలి. తాను ఎంచుకున్న దాడి మార్గం నుండి వెనక్కి మళ్లాలి” అని నాటో ఉమ్మడి ప్రకటన హెచ్చరించింది.

నాటో అనేకమార్లు చర్చల మార్గాన్ని రష్యాకు మళ్ళీ మళ్ళీ అందుబాటులో ఉంచినప్పటికీ రష్యా ఘర్హణనే ఎంచుకుంది” అని నాటో ప్రకటన పేర్కొంది.

నిజానికి నేటి స్థితికి ప్రధాన కారణం నాటోయే. నాటో నేత అమెరికాయే. రెండు దశాబ్దాలుగా రష్యా అభ్యంతరాలను, విజ్ఞప్తులను పక్కకు నెట్టేస్తూ నాటోను రష్యా సరిహద్దుల వరకు తెచ్చింది. అమెరికా ఏక పక్షంగా ఐ‌ఎన్‌ఎఫ్ ట్రీటీ నుండి తప్పుకుంది. అణ్వాయుధాల నిర్మూలనకు తోడ్పడే START ఒప్పందం మురిగిపోయేలా చేసింది. అణ్వాయుధ పోటీ మళ్ళీ తలెత్తడానికి బాట వేసింది.

ఉక్రెయిన్ పై చేసే దాడిలో బయటి శక్తులు ఏ మాత్రం జోక్యం చేసుకున్నప్పటికీ వారు చరిత్రలో మునుపు ఎన్నడూ ఎరగని పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని పుతిన్ హెచ్చరించడం ఈ సందర్భంగా గమనించాలి. దీని అర్ధం అణు దాడికి సైతం వెనకాడబోనని పుతిన్ హెచ్చరించినట్లుగా అందరూ భావించారు. చెప్పినట్లే నాటో దేశాల ప్రకటనల దృష్ట్యా అణ్వాయుధాలను ‘హై అలర్ట్’ లో ఉంచాలని విధి నిర్వహణకు సిద్ధంగా ఉంచాలని పుతిన్ ఆదేశించాడు.

ఉక్రెయిన్ పై దాడి ప్రపంచ వినాశకారిగా పరిణమించకముందే ఉక్రెయిన్ బాధ్యతాయుతంగా చర్చలలో పాల్గొనేలా నాటో, అమెరికాలు చూడవలసి ఉంది. చర్చలపై పదే పదే కప్పదాటుగా వ్యవహరిస్తున్న ఉక్రెయిన్ అధ్యక్షుడిని ఒక దారికి తేవలసి ఉంటుంది. కానీ అమెరికా, నాటో లు అందుకు పూనుకుంటాయా అన్నది అనుమానమే.

అసలు ఉక్రెయిన్ చర్చలకు దిగకుండా నాటో ఆటంకాలు పెట్టకుండా ఉంటే అదే పదివేలు!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s