శాంతి చర్చలకు రష్యా, ఉక్రెయిన్ అంగీకారం


Ukraine’s President Volodymyr Zelensky

రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన ప్రతిపాదనను ఆమోదిస్తున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు ప్రకటించాడు. అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ ప్రతినిధి/ప్రెస్ సెక్రటరీ సెర్గీ నికిఫోరోవ్ శనివారం పత్రికలకు చెప్పాడు.

“చర్చలను మేము తిరస్కరిస్తున్నట్లు వస్తున్న ఆరోపణలను నేను ఖండిస్తున్నాను. శాంతి, కాల్పుల విరమణలపై చర్చించడానికి ఉక్రెయిన్ ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నది. ఇది మా శాశ్వత అభిప్రాయం. రష్యన్ అధ్యక్షుడి ప్రతిపాదనను మేము అంగీకరించాం” అని ప్రెస్ సెక్రటరీ తన ఫేస్ బుక్ ఖాతాలో ప్రకటించాడు (టాస్ న్యూస్ ఏజన్సీ, ఫిబ్రవరి 26, 2022).

శుక్రవారం మొదట చర్చలకు సిద్ధం అని జెలెన్ స్కీ ప్రకటించాడు. చర్చల కోసం అత్యున్నత ప్రతినిధి బృందాన్ని పంపడానికి సిద్ధంగా ఉన్నామని పుతిన్ ప్రతినిధి పెష్కోవ్, విదేశీ మంత్రి లావరోవ్ ప్రకటించారు.

అయితే ఆ వెంటనే ఉక్రెయిన్ అధ్యక్షుడి నుండి ఎటువంటి స్పందనా రాలేదని రష్యా విదేశీ మంత్రిత్వ శాఖ ఆరోపించింది. కాంటాక్ట్ కోల్పోయామని తెలిపింది. ఇరు దేశాల మధ్య చర్చలు జరగకుండా అమెరికా మొదటి నుండి అడ్డం పడుతున్నదని పుతిన్ ఆగ్రహంగా స్పందించాడు.

ఈ నేపధ్యంలో శనివారం ఉదయం జెలెన్ స్కీ ప్రెస్ సెక్రటరీ ప్రకటన వెలువడింది. చర్చలు జరిపేందుకు తాము ఎవరికి భయపడేది లేదని, ఎవరి మాటా వినబోమని జెలెన్ స్కీ చెప్పినట్లు కొన్ని పత్రికలు తెలిపాయి.

ప్రెస్ సెక్రటరీ నికోఫోరోవ్ ప్రకారం “చర్చలు జరగవలసిన చోటు, సమయం నిర్ణయించేందుకు ఇరు పక్షాల మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయి. చర్చలు ఎంత త్వరగా చర్చలు మొదలైతే సాధారణ జన జీవనం అంత త్వరగా పునరుద్ధరించవచ్చు.”

గతంలో లాగానే చర్చలు బెలారూస్ రాజధాని మిన్స్క్ లో జరుపుదామని అందు కోసం ప్రతినిధి బృందం పంపేందుకు సిద్ధంగా ఉన్నామని పుతిన్ సమాచారం ఇచ్చాడు. ఈ మేరకు బెలారూస్ అధ్యక్షుడు లుకషెంకో కూడా చర్చలకు ఏర్పాట్లు చేస్తామని చెప్పాడు.

కానీ ఉక్రెయిన్ అధికారులు మిన్స్క్ బదులు పోలండ్ రాజధాని వార్సాలో చర్చలు చేద్దామని ప్రతిపాదించారు. ఆ తర్వాత వారి నుండి స్పందన రాలేదు. ఈ లోపు జ్ర్మనీ లోని ఉక్రెయిన్ రాయబారి “ఈ దశలో చర్చలు జరపడం దాదాపు అసాధ్యం” అంటూ ప్రకటించాడు. దానితో ఉక్రెయిన్ ను చర్చలకు రాకుండా ఆటంకాలు పెడుతున్నారని రష్యా ఆరోపించింది.

ఇప్పుడు చర్చలు ఎక్కడ జరిపేది ఇంకా నిర్ణయం కాలేదు. ఈ లోపు రష్యా దాడులు కొనసాగనున్నాయి. కీవ్ సమీపంలోని ఎయిర్ ఫీల్స్ ని రష్యన్ సైన్యాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పాయి. దీనికోసం గురువారం నుండి ఇరు పక్షాల మధ్య పోరాటం జరిగింది. ఈ ఎయిర్ ఫీల్డ్ నుండి రాజధాని కీవ్ పైన దాడి చేసేందుకు రష్యన్ బలగాలు సిద్ధపడుతున్నాయి. ఇప్పటికే కీవ్ లో పలు మిలట్రీ భవనాలపై దాడి జరిగినట్లు తెలుస్తోంది.

తాము కేవలం మిలట్రీ వనరులపైనే దాడులు చేస్తున్నామని, జనావాసాలపై దాడి చేయడం లేదని రష్యా చెబుతోంది. కానీ జననష్టం జరగకుండా కేవలం మిలట్రీకి మాత్రమే నష్టం జరిగేటట్లు దాడులు చేయడం అసాధ్యం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కోలేటరల్ నష్టం నివారించడం సాధ్యమయ్యే పనికాదు.

ఏమిటి లక్ష్యం?

రష్యా అధ్యక్షుడు పుతిన్ దాడి ద్వారా ఏమి సాధించదలిచాడు అన్న విషయంలో కొంత స్పష్టత వస్తోంది.

  • తూర్పు ఉక్రెయిన్/డాన్ బాస్ ఏరియాను పూర్తిగా ఉక్రెయిన్ పాలన నుండి విముక్తి చెయ్యడం
  • దక్షిణాన క్రిమియా ద్వీపాన్ని, డాన్ బాస్ ఏరియాను కలుపుతూ రష్యా అధీనంలో భూతల కారిడార్ ఏర్పాటు చేయడం. ఇప్పటివరకు క్రిమియాను చేరేందుకు నల్ల సముద్రం ద్వారా తప్ప భూతలం ద్వారా వెళ్ళే మార్గం లేదు. ఈ కారిడార్ ద్వారా భూతలం ద్వారా క్రిమియాకు నేరుగా వెళ్ళే అవకాశం వస్తుంది.
  • నైరుతి మూలలోని ఉక్రెయిన్ రాష్ట్రాలను కూడా రష్యా చెప్పుచేతల్లోకి తెచ్చుకోవడం. తద్వారా నల్ల సముద్రంతో ఉక్రెయిన్ కి పూర్తిగా సంబంధం తెగిపోతుంది. ఉక్రెయిన్ పేరు చెప్పి అడపా దడపా అమెరికా, యూ‌కే యుద్ధ నౌకలు, జలాంతర్గాములు నల్ల సముద్రంలోకి రావడం, క్రిమియా/రష్యా బద్రతకు ముప్పు తేవడం జరుగుతూ వచ్చింది. ఈ ముప్పు తప్పించడం రష్యా లక్ష్యం.
  • మిగిలిన ఉక్రెయిన్ (పశ్చిమ ఉక్రెయిన్) లో వీలైతే కీలుబొమ్మ ప్రభుత్వాన్ని నిలబెట్టడం లేదా ఇప్పటి ప్రభుత్వాన్నే ఒప్పందాల ద్వారా నాటోలో చేరకుండా కట్టిపడెయ్యడం.

రష్యా దాడికి ముందు పుతిన్ కేవలం పైవాటిలో మొదటి అంశాన్ని మాత్రమే లక్ష్యంగా పెట్టుకున్నాడని పలువురు భావించారు. అంతే కాకుండా ఉక్రెయిన్ పై దాడి చెయ్యడం లేదని, ఆ ఉద్దేశ్యమే తమకు లేదని పుతిన్ తో సహా రష్యా మంత్రులు, అధికారులు అందరూ నమ్మ బలుకుతూ వచ్చారు.

మాట తప్పిన పుతిన్

ఇప్పటివరకు పుతిన్ తాను బహిరంగంగా ప్రకటించినదానికి భిన్నంగా ఎన్నడూ వ్యవహరించలేదు. ముఖ్యంగా భౌగోళిక రాజకీయాల విషయంలో ఈ నియమాన్ని పుతిన్ పాటిస్తూ వచ్చాడు. సిరియా, లిబియా, టర్కీ, ఇజ్రాయెల్, ఇతర కొన్ని ఆఫ్రికా దేశాలు… ఇలా పలు దేశాల విషయంలో రష్యా వివిధ స్థాయిల్లో జోక్యం చేసుకుంటూ వచ్చింది. ఈ జోక్యం సందర్భాల్లో పుతిన్ చెప్పిందే చేశాడు. అంతకు మించి ఎప్పుడూ అడుగు వేయలేదు. సిరియా లాంటి చోట్ల రష్యా పూర్తి స్థాయిలో యుద్ధానికి దిగేలా చేసేందుకు అమెరికా శత విధాలా రెచ్చగొట్టినా పుతిన్ సంయమనం పాటించాడు.

ఉక్రెయిన్ విషయంలో మొదటిసారి రష్యా/పుతిన్ చెప్పిన మాటకు భిన్నంగా ఉక్రెయిన్ పై పూర్తి స్థాయి దాడి జరిగింది. తాము కూడా అణ్వస్త్రాలు సమర్చుకుంటామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రకటించడంతోనే సీన్ అంతా మారిపోయిందని రష్యా అధికారి ఒకరు చెప్పినట్లుగా స్పుత్నిక్ న్యూస్ చెబుతోంది.

సోవియట్ రష్యా విభజనకు ముందు యూ‌ఎస్‌ఎస్‌ఆర్ కు చెందిన అణ్వాయుధాలలో కొన్ని ఉక్రెయిన్ లోనే ఉన్నాయి. విడిపోతున్న సందర్భంలో ఈ అణ్వాయుధాలు ఏం చేయాలన్న సమస్య వచ్చింది. అణ్వస్త్రాల నిర్వహణ అంత తేలిక కాదు. ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అప్పటికే చెర్నోబిల్ అణు ప్రమాదం ప్రభావాన్ని ఉక్రెయిన్ ప్రజలు చవిచూసి ఉన్నారు. ఇరు దేశాలు చర్చించుకుని అణ్వస్త్రాలు రష్యాకు తరలించేందుకు అంగీకారానికి వచ్చారు.

అణ్వస్త్రాలు తరలించినప్పటికి అణ్వస్త్ర తయారీకి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం, డెలివరీ వ్యవస్థలు ఉక్రెయిన్ వద్దనే ఉండిపోయాయి. వీటి ద్వారా అణ్వస్త్రాలు తయారు చేసుకోవటం ఉక్రెయిన్ కు తేలిక. అణు ఆయుధాలు సమకూర్చుకునే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు జెలెన్ స్కీ ప్రకటించడంతో పుతిన్ అప్రమత్తం అయ్యాడని, అదే జరిగితే రష్యా భద్రతకు తీవ్ర ప్రమాదం ముంచుకు వస్తుందని రష్యా నేతలు భావించారని స్పుత్నిక్ న్యూస్ వెల్లడి చేసింది.

అయితే ఈ కధనం ఎంతవరకు నిజం అన్నది అప్పుడే ధృవీకరించడం కష్టం. అందునా ఉక్రెయిన్ పై దాడి చేయటం లేదని అదే పనిగా చెప్పి కూడా దాడి చేసిన ఈ తరుణంలో రష్యా/పుతిన్ ఉద్దేశ్యాల గురించిన వివరణలను వెనువెంటనే అంగీకరించే పరిస్థితి అసలే లేదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s