
Lvov
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ రాజధాని విడిచి పెట్టి పరారీ అయినట్లు వార్తలు వస్తున్నాయి.
రష్యా పార్లమెంటు (డ్యూమా) స్పీకర్ వ్యాచెస్లావ్ వొలోడిన్ ఈ సంగతి వెల్లడి చేశాడు.
జెలెన్ స్కీ కీవ్ నుండి వెళ్లిపోయాడని, ఆయన లువోఫ్ నగరంలో ఏర్పాట్లు చేసుకున్నాడని డ్యూమా స్పీకర్ చెప్పాడు. లువోఫ్ (Lvov) నగరం ఉక్రెయిన్ లోనిదే. అయితే అది ఉక్రెయిన్-పోలండ్ సరిహద్దుకు 85 కి.మీ దూరంలో ఉంది.
కీవ్ అధ్యక్ష భవనాన్ని కూడా రష్యన్ బలగాలు ఆక్రమించి తనను అరెస్ట్ చేసే పరిస్తితి ఏర్పడకుండా జెలెన్ స్కీ లువోఫ్ కు వెళ్ళిపోయినట్లు భావిస్తున్నారు.
“జెలెన్ స్కీ హడావుడిగా కీవ్ వదిలి వెళ్ళాడు. నిన్న కూడా ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో ఆయన లేడు. తన మంది మార్బలాన్ని వెంటబెట్టుకుని లువోఫ్ నగరానికి పారిపోయాడు. అక్కడ ఆయన, ఆయన అనుచరగణం నివశించడానికి తగిన ఏర్పాట్లు చేయబడ్డాయి” అని డ్యూమా స్పీకర్ వొలోడిన్ వెల్లడించాడు.
తాను కీవ్ లోనే ఉన్నానంటూ జెలెన్ స్కీ ప్రచురించిన వీడియోలు అన్నీ ఆయన ముందే తయారు చేసి పెట్టుకున్నాడని, వాటిని లువోఫ్ నుండే సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని వొలోడిన్ చెప్పాడు.
రాడా (ఉక్రెయిన్ పార్లమెంటు) లోని కొందరు డిప్యూటీలు తనకు ఈ సమాచారం ఇచ్చారని కూడా వొలోడిన్ వెల్లడి చేశాడు.
దాడి జరిగిన రోజు నుండి జెలెన్ స్కీ రోజుకు కనీసం రెండు సార్లు తాను కీవ్ లోనే ఉన్నానని, అధ్యక్ష భవనం లోనే ఉన్నానని చెప్పే వీడియోలను సోషల్ మీడియాలో ప్రచురిస్తూ వచ్చాడు. ఎవరూ అడగకపోయినా వీడియోలు విడుదల చేశాడు.
అదంతా నిజం కాదని వొలోడిన్ ఇచ్చిన సమాచారం ద్వారా తెలుస్తోంది. ఆయన పరారీ విషయం వెల్లడి అయితే పోరాటానికి సైన్యం సిద్ధపడకపోయే అవకాశం ఉంది.
అదీ కాక కొన్ని నగరాల్లో ఉక్రెయిన్ సైనికులు ఆయుధాలు విడిచి రష్యా సైన్యానికి లొంగిపోతున్న సంఘటనలు జరిగాయి. మరిటోపోల్ నగరంలో అయితే రష్యా సేనలకు ప్రతిఘటన ఎదురు కాకపోగా అక్కడి జనం రష్యన్ జెండాలతో రష్యా సేనలకు స్వాగతం పలికారు.