శుక్రవారం మరో పరిణామం. ఓ వైపు రష్యా దాడులు కొనసాగుతుండగానే “చర్చించుకుందాం రండి” అంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఒక వీడియో సందేశం విడుదల చేశాడు.
కాగా, “చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం” అంటూ రష్యా అధ్యక్షుడి ప్రతినిధి డిమిట్రీ పెష్కోవ్ ఉక్రెయిన్ అధ్యక్షుడి ప్రతిపాదనకు ప్రతిస్పందించాడు.
అయితే ఈ పిలుపు, ఆ తర్వాతి స్పందన నిజాయితీగా చేసినవేనా లేక యుద్ధ వ్యూహంలో భాగంగా చేసినవా అన్నది ఇంకా స్పష్టం కావటం లేదు.
అయితే బెలారూస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో మాత్రం యుద్ధంలో ఉన్న ఇరు దేశాల చర్చలకు ఆతిధ్యం ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు. చర్చలకు సిద్ధపడితే ఇరు దేశాల ప్రతినిధులకు అవసరమైన సౌకర్యాలు, రక్షణ, భద్రత సమకూర్చుతామని ఆయన ప్రకటించాడు.
ఉక్రెయిన్ సమస్య పరిష్కారం కోసం 2014, 2015 సం.ల్లో జరిగిన చర్చలకు కూడా బెలరూస్ రాజధాని మిన్స్క్ నగరమే వేదికగా నిలిచింది. అయితే మిన్స్క్ 1 ఒప్పందం, మిన్స్క్ 2 ఒప్పందం రెండింటికి ఉక్రెయిన్ కట్టుబడకపోవడంతో తాజా పరిస్తితి ఏర్పడింది.
అసలు తాజా చర్చల ప్రతిపాదనకు జెలెన్ స్కీ కి అమెరికా, ఈయూల మద్దతు ఉన్నదా లేదా అన్నది స్పష్టం కాలేదు.
“ప్రజల మరణాలను నిరోధించడానికి వీలుగా కూర్చొని చర్చించుకుందాం” అని ఉక్రెయిన్ అధ్యక్షుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ కు అప్పీలు చేసినట్లు స్పుత్నిక్ న్యూస్ తెలిపింది.
“ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ అభ్యర్ధనకు ప్రతిస్పందనగా రష్యన్ విదేశీ మంత్రిత్వ శాఖ ప్రతినిధులను, అధ్యక్ష భవనం అధికారులను చర్చల నిమిత్తం పంపేందుకు మేము సిద్ధంగా ఉన్నాం” అని పెష్కోవ్ ప్రకటించాడు.
“ఉక్రెయిన్ మిలట్రీ ఆయుధాలను కిందకు దించినట్లయితే ఏ క్షణంలోనైనా చర్చలు ప్రారంభించేందుకు మేము సిద్ధమే” అని రష్యా విదేశీ మంత్రి సెర్గి లావరోవ్ కూడా ప్రకటించాడు.
సెర్గీ లావరోవ్ చర్చలకు “ఉక్రెయిన్ సేనలు ఆయుధాలు దించాలి” అన్న షరతు విధించాడు. కనుక ఈ చర్చలు మొదలు కాకముందే విఫలం అయ్యేట్లు కనిపిస్తోంది.
బెలారూస్ అధ్యక్షుడు లుకషెంకో సైతం చర్చలకు పుతిన్ విధించిన షరతులు ప్రకటించాడు. “చర్చలు సజావుగా సాగాలంటే కీవ్ (ఉక్రెయిన్) నాటో సభ్య దేశంగా చేరేందుకు నిరాకరించాలి. డోనెట్స్క్, లుగాన్స్క్ రిపబ్లిక్కులతో శత్రు వైఖరి విడనాడాలి” అని ఆయన కోరాడు.
ఉక్రెయిన్ లో నాజీలు ఉన్నారన్న ఆరోపణలను జెలెన్ స్కీ తిరస్కరించాడు. రష్యాకు ఉక్రెయిన్ ప్రమాదకారిగా పరిణమించందన్న ఆరోపణలను కూడా తిరస్కరించాడు. రష్యా జరుపుతున్న ఆపరేషన్ “పూర్తి స్థాయి దాడి” గా ఆయన స్పష్టం చేశాడు. ఉక్రెయిన్ లో 137 సైనికులు చనిపోయారని మరో 316 మంది గాయపడ్డారని చెప్పాడు.
కీవ్ లోని పౌర ఆవాసాల పైనా, వారి సౌకర్యాల నిర్మాణాల పైనా రష్యన్ దాడులు జరుగుతున్నాయని జెలెన్ స్కీ ఆరోపించాడు. ఈ ఆరోపణలను రష్యా రక్షణ శాఖ తిరస్కరించింది. ఉక్రెయిన్ సైన్యం తన దేశ పౌరులను “మానవ రక్షణ కవచం” గా వినియోగిస్తోందని ఆరోపించింది. తాము కేవలం ఉక్రెయిన్ మిలట్రీ నిర్మాణాల పైన మాత్రమే దాడులు జరుపుతున్నామని తెలిపింది.
ఇదిలా ఉండగా కీవ్ గగనతలం పై ఎగురుతున్న రష్యన్ జెట్ ఫైటర్ ని కూల్చేశామని అది ఒక నివాస భవనం పై కూలిపోయిందని ఉక్రెయిన్ ప్రకటించింది. కానీ రష్యా అలాంటిదేమీ జరగలేదని చెప్పింది. వాస్తవానికి ఉక్రెయిన్ జెట్ ఫైటర్ నే శత్రు విమానంగా భావించి ఆ దేశ మిసైల్ రక్షణ వ్యవస్థ పొరపాటున కూల్చివేసిందని అది తమది కాదని రష్యా తెలిపింది. అసలు తాము జెట్ ఫైటర్ తో కీవ్ పైన మిసైల్ దాడులు చెయ్యడం లేదని స్పష్టం చేసింది.