తూర్పు, దక్షిణ ఉక్రెయిన్ లపై రష్యా దాడులు, గందరగోళంలో అమెరికా!


Donbass and Ukraine

రష్యన్ బలగాలు తూర్పు మరియు దక్షిణ ఉక్రెయిన్ రాష్ట్రాలలోని నగరాలపై దాడులు చేస్తోంది. ప్రస్తుతం వైమానిక దాడుల వరకే రష్యా పరిమితమయింది. రష్యా సైనికులు మాత్రం తూర్పు ఉక్రెయిన్ వరకే పరిమితం అయ్యారు.

రాయిటర్స్ ప్రకారం రష్యన్ బలగాలు ఉక్రెయిన్ లోని పలు బలగాలపై వైమానిక దాడులు చేస్తున్నాయి. రష్యా దాడులను పూర్తి స్థాయి దాడిగా చెప్పలేని గందరగోళంలో అమెరికా పడిపోయినట్లు కనిపిస్తోంది.

డోనెట్స్క్ పీపుల్స్ రిపబ్లిక్ (డి‌పి‌ఆర్), లుగాన్స్క్ పీపుల్స్ రిపబ్లిక్ (ఎల్‌పి‌ఆర్) లను స్వతంత్ర రాజ్యాలుగా గుర్తిస్తున్నట్లు ప్రకటించిన దరిమిలా ఈ రాజ్యాలకు చెందిన భూభాగాలను పూర్తిగా వశం చేసుకునేందుకు తాజా దాడులను రష్యా లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది.

2014 నాటి నయానాజీ గ్రూపులు కుట్రతో ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని కూల్చి అమెరికా అనుకూల సొంత ప్రభుత్వం ఏర్పాటు చేయటంతో ఎల్‌పి‌ఆర్, డి‌పి‌ఆర్ లు స్వతంత్ర రాజ్యాలుగా ప్రకటించుకున్నాయి. రక్షణ కోసం రష్యా సాయం కోరాయి. తమను రష్యాలో కలుపుకోవాలని సైతం అభ్యర్ధించాయి. వాటి అభ్యర్ధనను రష్యా తిరస్కరించినప్పటికి గత ఫిబ్రవరి 21 తేదీన ఎల్‌పి‌ఆర్, డి‌పి‌ఆర్ లను స్వతంత్ర రాజ్యాలుగా గుర్తిస్తున్నట్లు ప్రకటించింది.

అయితే డోనెట్స్క్, లుగాన్స్క్ ప్రాంతాల భౌగోళిక ప్రాంతం మొత్తం ఎల్‌పి‌ఆర్, డి‌పి‌ఆర్ ప్రభుత్వాల ఆధీనంలో లేవు. వాటిలో దాదాపు సగానికి పైగా ప్రాంతం ఉక్రెయిన్ బలగాల ఆధీనంలోనే ఉండిపోయింది. 2014 నుండి రెండు ప్రాంతాలను పూర్తిగా వశం చేసుకోవటానికి ఉక్రెయిన్ బలగాలు ప్రయత్నిస్తుండగా ఎల్‌పి‌ఆర్, డి‌పి‌ఆర్ ప్రతిఘటిస్తూ వచ్చాయి.

ఉక్రెయిన్ బలగాల ఆధీనంలో ఉన్న మిగిలిన సగం భూభాగాన్ని కూడా ఎల్‌డి‌పి‌ఆర్ ల స్వాధీనం చేసేందుకు ప్రస్తుత దాడి జరుగుతున్నట్లుగా పుతిన్ మాటల ద్వారా తెలుస్తోంది.

స్పష్టత కోసం: అంతర్జాతీయ చట్టాల ప్రకారం చూసినపుడు ఉక్రెయిన్ దేశంలో భాగంగా ఉన్న  తూర్పు ఉక్రెయిన్ లోకి రష్యా తన సైన్యాలు నడిపించడం చట్ట విరుద్ధం. ఐరాస ఛార్టర్ దీనికి అనుమతించదు.

అయితే ప్రజాస్వామ్య బద్ధంగా ఉన్న ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని ‘కేవలం ఈ‌యూ అసోసియేషన్ ఒప్పందంపై సంతకం చేయటాన్ని వాయిదా వేసినందుకు 2014లో కక్ష గట్టి అమెరికా, ఈ‌యూలు కూల్చివేయటం, సమస్య పరిష్కారం కోసం తామ సంతకాలు చేసిన మిన్స్క్ 1 మరియు మిన్స్క్ 2 ఒప్పందాలను అమలు చేసేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడం, పైగా ఆ ఒప్పందాలకు కాలం చెల్లిందని అమెరికా, ఈ‌యూ, ఉక్రెయిన్ లు మూడూ ప్రకటించడం… ఇవన్నీ చూసినప్పుడు తూర్పు ఉక్రెయిన్ భద్రత, ఆర్ధిక భవిష్యత్తు రీత్యా రష్యా తీసుకుంటున్న చర్యలు న్యాయబద్ధంగా కనిపిస్తాయి.

తూర్పు ఉక్రెయిన్ ప్రజలకు తమ భవిష్యత్తును తాము నిర్ణయించుకునే హక్కు ఉంటుంది. అవి రష్యాలో కలుపుకోవాలని కోరినప్పటికి రష్యా ఎగిరి గంతెయ్యలేదు. సమస్య పరిష్కారాని కోసం రష్యాయే చొరవ తీసుకుని మిన్స్క్ ఒప్పందాలకు బాట వేసింది. ఒప్పందాల అమలుకు 8 సం.లు రష్యా, తూర్పు ఉక్రెయిన్ ఎదురు చూశాయి.

ఈ నేపధ్యంలో తమ భద్రతకు, భవిష్యత్తుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి తూర్పు ఉక్రెయిన్ ఏర్పడింది. వాటి భద్రతకు హామీ ఇచ్చిన రష్యా తన హామీ నిలబెట్టుకోవలసిన అగత్యం ఏర్పడింది. సమస్యను ఒప్పందాల ద్వారా పరిష్కరించుకునే అవకాశాలను అమెరికా, ఉక్రెయిన్ లు చేజేతులా తిరస్కరించాయి. సొంత చర్యలు తీసుకునే వైపుగా రష్యా, ఎల్‌పి‌ఆర్, డి‌పి‌ఆర్ లను నెట్టాయి.

ఈ నేపధ్యంలో చూసినప్పుడు రష్యా దాడి నైతికంగా సమర్థనీయం అవుతుంది. కానీ అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం అనడంలో సందేహం లేదు. అయితే అమెరికా, ఈ‌యూలు యధేచ్ఛగా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తుంటే నోరు మూసుకుని వాటికి రష్యా మాత్రమే కట్టుబడి ఉండాలనడం న్యాయ సమ్మతం కాదు.

ఇప్పటి వరకు చూస్తే ఉక్రెయిన్ మొత్తం తమదే కనుక ఆక్రమిస్తాం అని రష్యా అనడం లేదు. అందుకు సాకులు చెప్పడం లేదు అయితే ఎల్‌పి‌ఆర్, డి‌పి‌ఆర్ లను గుర్తిస్తూ పుతిన్ చేసిన ప్రసంగంలో ఉక్రెయిన్ ఒక దేశంగా ఉండటానికి తగిన ప్రాతిపదిక లేదు అని అన్నట్లు కొన్ని పత్రికలు చెబుతున్నాయి. అది నిజమే అయితే అలా చెప్పడం చట్ట సమ్మతం కాదు. న్యాయ సమ్మతం కూడా కాదు. ఉక్రెయిన్ లో రష్యన్లు ఉన్నప్పటికి ఆ దేశాన్ని కట్టిపడేయాలనుకోవడం విస్తరణ వాదం మరియు సామ్రాజ్యవాదం. అలాంటి ధోరణిని ప్రపంచం ఎట్టి పరిస్థితుల్లోనూ తిరస్కరించాల్సిందే.

ఇప్పటి వరకు చూస్తే ఎల్‌పి‌ఆర్, డి‌పి‌ఆర్ ల ప్రాదేశిక సమగ్రత కోసమే దాడి చేస్తున్నట్లు రష్యా చెబుతోంది. ఉక్రెయిన్ భూభాగాలను వశం చేసుకోబోమని చెబుతోంది. ఇందుకు భిన్నంగా రష్యా వ్యవరిస్తే అది ఖండనార్హం అవుతుంది.

బైడెన్ గందరగోళం

రష్యా వైమానిక దాడుల నేపధ్యంలో మరిన్ని కఠిన ఆంక్షలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ప్రకటించాడు. అయితే రష్యా చేస్తున్నది పూర్తి స్థాయి దాడా లేక తూర్పు ఉక్రెయిన్ కోసం చేస్తున్న పరిమిత దాడా అన్నది తేల్చుకోలేని గందరగోళంలో బైడేన్ పడిపోయినట్లు రాయిటర్స్ పత్రిక సైతం వ్యాఖ్యానించింది.

ఎందుకంటే రష్యా ‘పరిమిత దాడి చేస్తే దానికి అనుమతిస్తాం” అని బైడెన్ కొద్ది రోజుల క్రితం నోరు జారాడు. ఆ తర్వాత ఇతర అధికారులు, దౌత్య వేత్తలు బైడెన్ మాటలకు ప్రత్యేక అర్ధాలు లేవని, ఏ దాడినైనా అమెరికా ఒప్పుకోదు అనీ కవర్ చేసేందుకు ప్రయత్నించినా అమెరికా/బైడెన్ ఉద్దేశ్యం ఏమిటో స్పష్టం అయింది.

పైగా ఉక్రెయిన్ లో తమ సైన్యాలను పంపబోమని, రష్యాతో యుద్ధానికి తలపడబోమని, ఉక్రెయిన్ తరపున సాయుధ ఘర్షణకు దిగబోమని బైడేన్ అనేకసార్లు స్పష్టం చేశాడు.

నిజానికి గతంలో ఏ అధ్యక్షుడు ఇవ్వనన్ని ఆయుధాలను బైడెన్ ఉక్రెయిన్ కు సరఫరా చేశాడు. నాటో తూర్పు సరిహద్దు దేశాలైన పోలండ్, రుమేనియాలలో 3 వేల వరకు అదనపు బలగాలు పంపించాడు. చివరికి నార్డ్ స్ట్రీమ్ 2 పైప్ లైన్ కు అనుమతులు ఇచ్చే ప్రాసెస్ ను నిలిపివేస్తున్నామని జర్మనీ చేత కూడా చెప్పించాడు.

అయినప్పటికి పుతిన్ ఏ మాత్రం బెదరకుండా ఎల్‌పి‌ఆర్, డి‌పి‌ఆర్ లను గుర్తించడమే కాకుండా ఉక్రెయిన్ ఆధీనంలో ఉన్న ఎల్‌పి‌ఆర్, డి‌పి‌ఆర్ భూభాగాలను స్వాధీనం చేసేందుకు సైన్యాన్ని నడిపించడం, వైమానిక దాడులు చేయడం… ఇవన్నీ బైడెన్ ప్రతిష్టకు మచ్చగా పరిణమిస్తున్నాయి. పుతిన్ దూకుడును నిలువరించలేని అసమర్ధ అధ్యక్షుడుగా ఆయన్ను ప్రపంచం ముందు నిలబెడుతున్నాయి. ఈ పరిస్ధితి బైడెన్ ను మొత్తంగా అమెరికాను గందరగోళంలో పడవేస్తున్నది.

ఉక్రెయిన్ సంక్షోభం అనేక యేళ్ళ తర్వాత తలెత్తిన అతి పెద్ద యూరోపియన్ సంక్షోభం. అమెరికాకు నాటో సభ్య దేశాలతో మిలట్రీ ఒప్పందం ఉన్నది గాని ఉక్రెయిన్ తో లేదు. కనుక జోక్యం చేసుకునే అవకాశం లేదు. ఇరాక్, ఆఫ్ఘన్, లిబియా, సిరియా లలో పచ్చిగా జోక్యం చేసుకునే పరిస్ధితి ఇప్పుడు అమెరికాకు లేదు.

కనుక రష్యా దాడి ‘అన్యాయం, దారుణం. తీవ్రంగా ఖండిస్తున్నాం’ అని రోజువారీ ప్రకటనలు ఇవ్వడం తప్ప ఏమీ చేయలేని పరిస్ధితి.

పైగా రష్యా దాడి ఎంతవరకు సాగుతుంది, ఎక్కడి వరకు పరిమితం అవుతుంది అన్న అంశాలు కూడా అమెరికా అధ్యక్షుడికి స్పష్టం కావడం లేదు. ఈ విషయంలో పుతిన్ మాటల్ని నమ్మడం తప్ప అమెరికాకు మరో గత్యంతరం లేదు.

ఆంక్షల విషయానికి వస్తే వాటిని రష్యా అసలు ఒక సమస్యగా పరిగణించడం లేదు. ఉక్రెయిన్ పై దాడి చేసినా, చేయకపోయినా, పూర్తి దాడి చేసినా లేక పాక్షిక దాడి చేసినా అమెరికా ఆంక్షలు విధించడానికే కట్టుబడి ఉన్న సంగతి తమకు తెలుసని రష్యా విదేశీ మంత్రి సెర్గి లావరోవ్ స్పష్టం చేశాడు. ఇప్పటికే అనేక ఆంక్షలు రష్యాపై అమెరికా, ఈ‌యూలు ఉన్నాయని వాటికి అదనంగా మరి కొన్ని కలిసినా ఖాతరు చేయబోమని ఆయన స్పష్టం చేశాడు.

హెచ్చరికలను పట్టించుకోరు; ఆంక్షలకు లొంగరు. ‘నార్డ్ స్ట్రీమ్ 2’ గ్యాస్ పైప్ లైన్ కు అనుమతి సస్పెండ్ చేసినా ఖాతరు చేయరు. దౌత్య సమంధాలు కుదించినా పట్టించుకోరు. రష్యన్ సూపర్ ధనికులపై అనేక ఆంక్షలు, కట్టుబాట్లు విధించినా విదిల్చేశారు. సైన్యాలు దింపే పరిస్ధితి లేదు.

అమెరికా ఇంకేం చేయగలదు? అందుకే అధ్యక్షుడు జో బైడెన్ కు అయోమయం, గందరగోళం!

స్పెషల్ మిలటరీ ఆపరేషన్

గురువారం ఉదయం టెలివిజన్ లో ప్రసంగించిన వ్లాదిమిర్ పుతిన్ డాన్ బాస్ ఏరియాలో ‘స్పెషల్ మిలట్రీ ఆపరేషన్’ నిర్వహించేందుకు అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఆ వెంటనే తూర్పు, దక్షిణ ఉక్రెయిన్ రాష్ట్రాల్లో ఉన్న ఉక్రెయిన్ సైనిక బలగాలు, పరికరాలపై వైమానిక దాడులు మొదలయ్యాయి.

ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో కూడా పేలుళ్లు జరిగాయని తెలుస్తోంది. కానీ ఇది రష్యా బలగాల దాడిలో భాగామా కాదా అన్నది పత్రికలు చెప్పలేకపోయాయి. తమ మౌలిక నిర్మాణాలపై రష్యా దాడులు చేసిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ ఝెలెన్ స్కీ ప్రకటించాడు.

దక్షిణ ఉక్రెయిన్ లోని రేవు పట్టణం మరియుపూల్ తో పాటు ఒడెస్సా రాష్ట్రంలో రష్యన్ బలగాలు దిగాయని పత్రికలు తెలిపాయి. ఈ వార్తను మొదట ఖండించిన ఉక్రెయిన్ ఆ తర్వాత ధృవీకరించింది.

“ఉక్రెయిన్ భూభాగం లోని ప్రాంతాలను ఆక్రమించుకోవటం మా పధకంలో భాగం కాదు. మేము ఎలాంటి అంశాన్నీ బలవంతంగా రుద్దబోవడం లేదు” అని పుతిన్ ప్రకటించాడు. తూర్పు ఉక్రెయిన్ ప్రజల రక్షణ కోసమే తాము ప్రయత్నిస్తున్నామని, అక్కడ ఉన్న ఉక్రెయిన్ బలగాలు ఆయుధాలు త్యజించి వెనక్కి వెళ్లాలని పుతిన్ కోరాడు.

అత్యవసర ఐరాస భద్రతా సమితి సమావేశానికి అమెరికా పిలుపు ఇచ్చింది. జి7 దేశాలతో సంప్రతింపులు జరిపి తదుపరి చర్య ప్రకటిస్తామని బైడెన్ చెప్పాడు. కాగా ఉక్రెయిన్ లో మార్షల్ లా ప్రకటించారు.

ఉక్రెయిన్ లో వాయు స్థావరాల లోని నిర్మాణాలను నిర్మూలించామని, ఆ దేశ వాయు రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేశామని రష్యన్ రక్షణ మంత్రి పుతిన్ ప్రసంగం ముగిసిన మూడు గంటల అనంతరం ప్రకటించాడు. తూర్పు ఉక్రెయిన్ గగనతలం లోకి వచ్చిన ఉక్రెయిన్ జెట్ ఫైటర్లు రెండింటిని రష్యా కూల్చివేసింది.

ఉక్రెయిన్ బలగాల దాడి నుండి తమను రక్షించాలని ఎల్‌పి‌ఆర్, డి‌పి‌ఆర్ లు కోరిన పిమ్మట రష్యా సైనిక చర్య మొదలయిందని రాయిటర్స్ తెలిపింది.

ప్రపంచ స్టాక్ మార్కెట్లు పతన దిశలో ఉన్నాయి. మాస్కో స్టాక్ ఎక్ఛెంజీ 10 శాతం పతనం కావడంతో దాన్ని మూసేశారు. డాలర్ విలువ పెరిగిపోయింది. మదుపుదారులు భద్రమైన మదుపు కోసం డాలర్లను కొనుగోలు చేయడం వలన దాని విలువ పెరుగుతోంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారేల్ కు 100 డాలర్లకు పైన పెరిగింది. 2014 తర్వాత 100 డాలర్లు దాటడం ఇదే మొదటిసారి.

రష్యా ఉక్రెయిన్ సమీపంలోని ఎయిర్ పోర్ట్ లలో విమాన ప్రయాణాలు రద్దు చేసింది. రష్యా, బెలారస్ లకు వెళ్లొద్దని ఈ‌యూ విమాన యాన నియంత్రణ సంస్థ ఈ‌యూ దేశాల విమాన కంపెనీలను కోరింది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s