అంతుబట్టని పుతిన్ వ్యూహం!


రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ పై పూర్తి స్థాయి యుద్ధానికి దిగినట్లు స్పష్టం అవుతోంది.

ప్రస్తుతం ఉక్రెయిన్ పై రష్యా సైన్యం సాగిస్తున్న దాడి చూస్తుంటే పుతిన్ మాదక ద్రవ్యాలు సేవించిన స్థితిలో నిర్ణయాలు తీసుకుంటున్నాడా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

గత రెండు దశాబ్దాలుగా పుతిన్,

అమెరికా ఏకపక్ష నాటో విస్తరణ పట్ల పాటిస్తూ వచ్చిన సంయమనం,

సిరియా, లిబియాల విషయంలో అనుసరించిన సాపేక్షిక హేతుబద్ధత,

రష్యా ఆర్ధిక-రాజకీయ వ్యవస్థ నిర్మాణంలో చూపించిన దార్శనికత,

తూర్పు యూరప్ దేశాల (ఉదా: పోలండ్, లిధుయేనియా, ఎస్తోనియా మొ.) నేతలు ప్రదర్శించిన పుతిన్ వ్యతిరేక ద్వేషం పట్ల చూపిన సహనం,

రష్యా జాతీయ ప్రతిష్ట పునః స్థాపనలో కనబరిచిన నిబద్ధత

ఇవన్నీ నేడు (ఫిబ్రవరి 24 తేదీ) ఉక్రెయిన్ పై సాగిస్తున్న భూతల, గగనతల, జలతల యుద్ధం ద్వారా ఒక్క పెట్టున సునామీలో కొట్టుకు పోయినట్లు కొట్టుకుపోతున్నాయి.

పుతిన్ తాను హామీ ఇచ్చినట్లు కేవలం తూర్పు ఉక్రెయిన్ స్వయం ప్రకటిత రిపబ్లిక్ లను పూర్తిగా విముక్తం చేయడం వరకే తన దాడులను పరిమితం చేయబోవడం లేదా అన్న అనుమానాలను మిగుల్చుతున్నాడు.

చివరికి అమెరికా అధ్యక్షుడు బైడెన్ జోరీగ లా వినిపిస్తూ వచ్చిన ‘రష్యా దుర్మార్గ దాడి’ ఆరోపణలను నిజం చేసేలా ఉక్రెయిన్ పై దాడులు చేస్తున్నాడు.

ఈ తరహా దాడి పూర్తిగా ఖండనార్హం!

పుతిన్ కు వరుస విజయాల మత్తు పూర్తిగా ఎక్కేసిందా?

టెర్రరిస్టుల మూకల చేతుల్లోకి వెళ్లిపోయింది అనుకున్న సిరియాను దాదాపు ఒడ్డుకు చేర్చడం,

జార్జియాను అడ్డం పెట్టుకుని అమెరికా, నాటో లు సాగించిన నాటకాన్ని వమ్ము చెయ్యటం,

దశాబ్దం పైగా అమెరికా, ఐరోపాలు అమలు చేస్తూ వచ్చిన అన్యాయమైన వాణిజ్య, ఆర్ధిక ఆంక్షలను ఎదుర్కొని కూడా సమర్ధవంతమైన దేశాధినేతగా తన ప్రజల ముందు నిరూపించుకోవటం,

ప్రైవేటు మిలట్రీ కంపెనీల ద్వారా పలు ఆఫ్రికా దేశాలలో మునుపు లేని భద్రత, మరియు వాణిజ్య పరమైన నమ్మకాన్ని సంపాదించుకోవటం

సిరియా విషయంలో టర్కీ నుండి ఎదురైన అసంభావపూరిత తెంపరితనాన్ని విజయవంతంగా సామరస్యపూర్వకంగా నిలువరించగలగడం,

ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలలో అమెరికాకు దీటుగా రక్షణ, భద్రతలు రష్యా అందించగలదన్న నమ్మకాన్ని సంపాదించడం,

ఇవన్నీ వ్లాదిమిర్ పుతిన్ సాపేక్షిక హేతుబద్ధ దృష్టి కోణాన్ని అహంభావ తెరలతో కమ్మేసేలా దోహదం చేసాయా?

ఏం జరిగింది? ఏం అవసరం వచ్చిందని రష్యా అధ్యక్షుడు ఉక్రెయిన్ పై మూడు తలాల నుండి మూకుమ్మడి దాడికి తెగించాడు?

అసలు ఇదే పని 2014లోనే ఎందుకు చేయలేదు? అప్పుడు ఉక్రెయిన్ అత్యంత బలహీనంగా ఉంది. సైన్యం చాలా తక్కువ. ఉన్న సైన్యానికి సరైన ఆయుధాలు లేదు. వారికి నిబద్ధతా లేదు. ఇప్పుడు ఉక్రెయిన్ మరింత బలం సంతరించుకుంది. పదుల వేల నుండి రెండు లక్షల పైన సైన్యం సమకూర్చుకుంది. అమేరికా, నాటోలు మెరుగైన ఆయుధాలు సరఫరా చేశాయి.

బైడెన్ చెప్పినట్లు నిజంగానే ఉక్రెయిన్ పై పూర్తి స్థాయి దాడి చేసి, ప్రభుత్వాన్ని కూల్చివేసి, తన కీలుబొమ్మ ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకే పుతిన్ నిర్ణయించాడా?

ఇదే పేజీల్లో కొద్ది రోజుల క్రితం ఈ బ్లాగర్ చేసిన విశ్లేషణ నాటికి కనిపించిన పుతిన్ / రష్యా వేరు; ఇప్పుడు ఉక్రెయిన్ పై చేస్తున్న అనాలోచిత భీకర దాడిలో కనిపిస్తున్న పుతిన్ / రష్యా వేరు!

నిజానికి ఈ బ్లాగర్ మాత్రమే కాదు. అనేక మండి రష్యా పరిశీలకులను, అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల విశ్లేషకులను రష్యా దాడి షాక్ కి గురి చేస్తోంది.

ఈ దాడితో రష్యా ఈ‌యూ ను కూడా అయోమయం లోకి నెట్టివేసింది. నార్డ్ స్ట్రీమ్ 2 పైప్ లైన్ కు అనుమతి ఇచ్చే ప్రాసెస్ ను జర్మనీ ఇప్పటికే నిలిపేసింది. తద్వారా అమెరికా ఎత్తుగడను పుతిన్ స్వయంగా నెరవేర్చినట్లయింది.

నార్డ్ స్త్రీమ్ 2 కొత్తది. ఇంకా సరఫరా మొదలు కాలేదు. కానీ ఇతర పైప్ లైన్ల ద్వారా అందజేస్తున్న గ్యాస్ పరిస్తితి ఏమిటి? రష్యాతో ఈ‌యూ గ్యాస్ వాణిజ్యం కొనసాగించాలా, లేదా? కొనసాగిస్తేనేమో రష్యా ను ఆంక్షలతో శిక్షిస్తామన్న హెచ్చరిక తేలిపోతుంది. వాణిజ్యం ఆపేస్తేనేమో ఈ‌యూ గ్యాస్ అవసరాలు తీరవు. అమెరికా గ్యాస్, ఐరోపా చేరేందుకు ఇప్పటికైతే మార్గం లేదు. అంట్లాంటిక్ లో పైప్ లైన్ నిర్మిచదలిస్తే అది రెండు మూడేళ్లు పడుతుంది. మరి అప్పటివరకూ?

A Russian soldier

రష్యా సామ్రాజ్యవాద దేశం అనడంలో సందేహం లేదు. కానీ ఇప్పటివరకు రష్యా లేదా పుతిన్ అమెరికా లాగా పచ్చిగా, నగ్నంగా దురాక్రమణ దాడులు చేయలేదు. ఇతర దేశాలకు నష్టం కలిగించే వ్యూహాలు అమలు చేయలేదు. ఒక పద్ధతి ప్రకారం శక్తి పెంచుకుంటున్న సామ్రాజ్యవాద రాజ్యాంగానే చర్యలు తీసుకుంటూ వచ్చింది.

ఇప్పుడు ఉక్రెయిన్ పై దాడి అందుకు భిన్నంగా సాగుతోంది.

అసలు పుతిన్ వ్యూహం ఏమిటి? తూర్పు ఉక్రెయిన్ ని విముక్తం చెయ్యడంతో పరిమితం అవుతాడా? లేక క్రిమియా, తూర్పు ఉక్రెయిన్ ల మధ్య కారిడార్ ఏర్పాటు చేసుకునేలా ఇంకొంత ప్రాంతాన్ని వశం చేసుకుని అంతటితో ఆగుతాడా? లేక కీవ్ ప్రభుత్వాన్ని కూల్చి కీలుబొమ్మ ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడా?

మొత్తం ఉక్రెయిన్ ని తన చెప్పు చేతల్లో తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తే ఉక్రెయిన్ ప్రజలు ఊరుకుంటారా? సైన్యం ఊరుకుంటుందా? ఎంతటి ప్రాణ నష్టం జరుగుతుంది?

రష్యా ఆర్ధిక ప్రయోజనాలను పూర్తిగా పక్కనబెట్టి కేవలం భద్రత ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇవ్వడం తెలివైన పనేనా?

మరి కొద్ది రోజులు ఆగితే, రష్యా ఏమి చేయనున్నదో చూస్తే గాని కాస్తయినా విషయం బోధపడదు.

అప్పటివరకూ ఫింగర్స్ క్రాస్డ్!

2 thoughts on “అంతుబట్టని పుతిన్ వ్యూహం!

  1. No. Such subjective thinking can not be applied. Only objective analysis should be done. At the most some gaps can be filled with subjective facts. But Putin’s actions are quite against the objective facts he so far provided. Or he should have hidden certain objectives. He seldom did so. They will be pronounced some way or other in coming days. Then we can have a relatively definitive picture.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s