
How GPS works
వ్యూహాత్మక ప్రయోజనాలు నెరవేర్చుకునేందుకు ఇన్నాళ్లూ అమెరికాపై ఆధారపడుతూ వచ్చిన ఐరోపా దేశాలు (యూరోపియన్ యూనియన్) ఇక తమకంటూ సొంత ఏర్పాట్లు చేసుకునే ప్రయత్నాల్లో పడ్డాయి. అందుకు అవసరమైన మౌలిక నిర్మాణాలను (ఇన్ఫ్రాస్ట్రక్చర్) ఉనికిలోకి తెస్తున్నాయి.
ఐరోపా వ్యాపితంగా దృఢమైన, గ్యారంటీతో కూడిన ఇంటర్నెట్ కనెక్టివిటీని స్థాపించడం కోసం సొంత ఉపగ్రహాలను భూ కక్ష్యలో ప్రవేశ పెట్టాలని యూరోపియన్ యూనియన్ నిర్ణయించింది. ఇందుకోసం 6 బిలియన్ యూరోల ($6.8 బిలియన్లు) నిధులు కేటాయించినట్లు యూరోపియన్ కమిషన్ ప్రకటించింది.
ఉపగ్రహాల ద్వారా అంతరిక్ష ఆధారిత సురక్షిత ఇంటర్నెట్ కనెక్టివిటీని నెలకొల్పడానికి ఈ నిధులను ఈయూ ఖర్చు చేయనుంది. స్పేస్ ట్రాఫిక్ మేనేజ్^మెంట్ (ఎస్‌టిఎం), స్పేస్ బేస్డ్ కనెక్టివిటీ అనే పేర్లతో రెండు స్కీములకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం “ఈయూ అంతరిక్ష ఆధారిత సురక్షిత కమ్యూనికేషన్ వ్యవస్థ” ను ఈయూ ఏర్పాటు చేస్తోంది.
ఈ వ్యవస్థ ద్వారా ఆటంక రహిత ప్రపంచ వ్యాపిత కనెక్టివిటీని చౌకగా అందించే శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలను అభివృద్ధి చేయనున్నట్లు ఈయూ నేతలు ప్రకటించారు. కీలక నిర్మాణాల రక్షణ, నిఘా, సంక్షోభ నిర్వహణ మొ.న సేవలకు ఇది మద్దతు ఇస్తుందని తద్వారా ఈయూ సభ్య రాజ్యాల ఆర్ధిక వ్యవస్థలు, భద్రత, రక్షణ రంగాల్లో మరింత నాణ్యత సాధించవచ్చని ఆశిస్తున్నారు. అటు పౌరులకు, ఇటు వ్యాపార ప్రయోజనాలకు ఈ సేవలను అందుబాటులోకి తెస్తున్నారు.
సొంత శాటిలైట్ల ద్వారా ఈయూ సభ్య దేశాల మధ్య కమ్యూనికేషన్ వ్యవస్థల్లో ఖాళీలు లేకుండా చేయడం, పొందికను మెరుగుపరచటం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈయూ రక్షణ విధాన లక్ష్యాలను ఆర్ధిక ప్రయోజనాలతో ఈ పధకం అనుసంధానం చేస్తుందని భావిస్తున్నారు.
అన్నింటి కంటే ముఖ్యంగా సొంత శాటిలైట్ల ద్వారా వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి (Strategic Autonomy) సాధించడం ఈయూ లక్ష్యంగా పెట్టుకుంది.
ఎలాన్ మస్క్ కు చెందిన ‘స్పేస్ ఎక్స్ స్టార్ లింక్’ ఉపగ్రహ ఇంటర్నెట్ నెట్ వర్క్ 42,000 శాటిలైట్ల తోను, జెఫ్ బెజోస్ కు చెందిన ‘కూపర్ నెట్ వర్క్’ 3,200 శాటిలైట్ల తోనూ, యూకే ప్రభుత్వానికి చెందిన ‘వన్ వెబ్ నెట్ వర్క్’, 650 శాటిలైట్ల తోనూ ఏర్పాటు చేసేందుకు పధకాలు రూపొందించారని, ఈయూ నెలకొల్పే సొంత శాటిలైట్ల వ్యవస్థ వీటికి ప్రత్యామ్నాయంగా ఉంటుందని ఈయూ వర్గాలు చెబుతున్నాయి. ఈయూ తో పాటు ఆఫ్రికా, ఆర్కిటిక్ లలో కూడా తమ శాటిలైట్ వ్యవస్థ కనెక్టివిటీ అందించేందుకు ప్రతిపాదించారు.
ఈ వ్యవస్థకు 2022 నుండి 2027 వరకు 2.4 బిలియన్ యూరోల నిధులు అందుబాటులో ఉంచుతారు. మొదటి సేవ మరియు క్వాంటమ్ ఎన్^క్రిప్షన్ లను 2025 నాటికి అందజేసేందుకు, 2028 నాటికి వినియోగానికి అందుబాటులో ఉంచేందుకు పధక రచన చేశారు. ఈ పధకాన్ని ప్రస్తుతం ఈయూ దేశాలు ఈయూ పార్లమెంటులో చర్చిస్తున్నారు.
ఇది విజయవంతమై ఆచరణలోకి వస్తే యూరప్ వ్యాపితంగా విస్తరించిన అంతరిక్ష ప్రాజెక్టుల్లో ఇది మూడవది అవుతుంది. మొదటిది గెలీలియో శాటిలైట్ నేవిగేషన్ వ్యవస్థ కాగా రెండవది కోపర్నికస్ అబ్జర్వేషన్ శాటిలైట్ వ్యవస్థ.
ఈ మూడు ప్రాజెక్టులు అమెరికా నెలకొల్పిన జిపిఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) మరియు ‘లాండ్ శాట్’ భూ ప్రతిబింబ సేకరణ శాటిలైట్ వ్యవస్థ లకు పోటీ లేదా ప్రత్యామ్నాయం అవుతాయని ఈయూ ఆశిస్తోంది.

GPS constellation
ఈయూకు సొంత సైన్యం ఉండాలని ప్రతిపాదించిన ఫ్రాన్స్ అధ్యక్షుడు మేకరాన్, యూరప్ కు సొంత ఇంటర్నెట్ శాటిలైట్ వ్యవస్థ ఉండాలని గట్టిగా ప్రతిపాదించటం విశేషం. ప్రతిపాదించడమే కాక ఆచరణలోకి తెచ్చేందుకు కృషి చేశాడు. “అంతరిక్షం నిర్వహణ సామర్ధ్యం సంతరించుకోకుండా పూర్తి శక్తి (power) గానీ, స్వయం ప్రతిపత్తిని గానీ సాధించలేము. అది లేకుండా నూతన సరిహద్దులను జయించడం అటుంచి మన సొంత వాటిపై నియంత్రణ కూడా సాధించలేము” అని ఫ్రాన్స్ అధ్యక్షుడు తన సహచర దేశాలకు ఉపదేశించాడు.
ఇమానుయెల్ మేకరాన్ చెప్పిన ముఖ్య విషయం: “సొంత ఇంటర్నెట్ శాటిలైట్ల సమూహాన్ని నిర్మించుకునేందుకు ఐరోపా చేస్తున్న ప్రయత్నాలు నిజానికి దాని సార్వభౌమత్వానికి సంబంధించినవని గ్రహించాలి. శాటిలైట్ల విషయానికి వచ్చినప్పుడు ఐరోపా తన స్థానాన్ని తాను సొంతం చేసుకోక తప్పదు.” అని.
మేకరాన్ ఉద్దేశ్యం స్పష్టమే. అమెరికా అందించే పరిశోధన సేవలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లపై ఆధారపడి మనుగడ సాగించడం ఇక ఎంతమాత్రం కొనసాగరాదు అన్నదే ఆయన సందేశం. ఐరోపా వాణిజ్య, రాజకీయ, ఆర్ధిక ప్రయోజనాలను అమెరికా అడుగడుగునా శాసించడం, ప్రతి చిన్న అంశానికి అమెరికా అనుమతికోసం పరుగులు పెట్టడం ఇక జరగకూడదని ఫ్రాన్స్ అధ్యక్షుడు ప్రతిపాదిస్తున్నాడు.
“మన ఉనికికి, మన జీవితాలకు శాటిలైట్ల సమూహం (satellite constellations) హృదయం లాంటిది. హై-స్పీడ్ ఇంటర్నెట్, అటానమస్ డ్రైవింగ్, ఎమర్జెన్సీ సేవలు, సముద్ర రవాణా… లాంటి రానున్న నూతన టెక్నాలజీలకు ఇది అత్యంత కీలకం అని ఇటీవల టౌలోస్ (Toulouse) లో జరిగిన సమావేశంలో ఆయన స్పష్టం చేశాడు.
సొంత వ్యవస్థలు లేనట్లయితే ఐరోపాకు చెందిన సున్నిత డేటా మొత్తాన్ని అమెరికా లాంటి ఇతర రాజ్యాల చేతుల్లో పెట్టాల్సి వస్తుందని, చైనా-రష్యా-అమెరికా లాంటి అంతరిక్ష శక్తులను ఐరోపా త్వరితంగా అందిపుచ్చుకోవాలని మేకరాన్ నొక్కి చెప్పాడు.
‘ఆసియా పివోట్’ వ్యూహాన్ని అమెరికా ప్రకటించి అమలు చేస్తున్న నేపధ్యంలో కూడా సొంత శాటిలైట్ల వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాల్సిన అగత్యం ఐరోపాకు ఏర్పడిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ‘ఆసియా పివోట్’ వ్యూహంలో మధ్య-ప్రాచ్యం మరియు ఆఫ్రికాలలో సంక్షోభాలను గాని ఇతర అవసరాలను గాని నిర్వహించవలసిన అవసరం అమెరికాకు ఉండదు. కనుక ఈ ప్రాంతాలను నిర్వహించే భారం ఐరోపా పైనే పడిపోయింది. ఈ భారాన్ని నెత్తిన వేసుకోనట్లయితే చైనా, రష్యాలు తామే ఆ పని కాస్తా చేసేస్తాయి. అప్పుడిక ఐరోపాకు మధ్య-ప్రాచ్యం, ఆఫ్రికాలలో చోటు దక్కకుండా పోతుంది.
ప్రస్తుతం ఉన్న శాటిలైట్లలో మెజారిటీ అమెరికా మిలట్రీ, రాజకీయ ప్రయోజనాలకు అనుసంధానం చేయబడి ఉన్నవే. వాటి ద్వారానే ఐరోపా దేశాలు తమ అవసరాలు తీర్చుకున్నాయి. ఇవి కాస్తా తమ ఆపరేషన్ ను వేరే చోట (ఇండో-పసిఫిక్, ఆగ్నేయాసియా) కేంద్రీకరిస్తే ఐరోపా అవసరాలు తీరే దారి ఉండబోదు. కనుక సొంత శాటిలైట్ వ్యవస్థ నిర్మించుకోవటం ఐరోపాకు తప్పనిసరి అవసరం.
మారిన ప్రపంచ పరిస్థితుల్లో ఇది అంతిమంగా ఐరోపా తన ‘వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి” వైపు ఆలోచించటానికి, ఆ ఆలోచనలను కార్యరూపంలో పెట్టడానికి దారి తీసింది.