ఉక్రెయిన్: రష్యా హఠాత్ నిర్ణయం!


Donbass area in Ukraine

ఉక్రెయిన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తలపడుతున్న తూర్పు ఉక్రెయిన్ ప్రాంతాల విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ సోమవారం హఠాత్తుగా ఎవరూ ఊహించని నిర్ణయం ప్రకటించాడు. తమను తాము స్వతంత్ర రిపబ్లిక్ లు గా ప్రకటించుకున్న డోనెట్స్క్, లుగాన్స్క్ (లేదా లుహాన్స్క్) లను స్వతంత్ర రాజ్యాలుగా గుర్తిస్తున్నట్లు ప్రకటించాడు.

తలవని తలంపుగా వెలువడిన ఈ ప్రకటనకు ఎలా స్పందించాలో అర్ధం కాని అయోమయంలో అమెరికా తదితర పశ్చిమ రాజ్యాలు పడిపోయినట్లు కనిపిస్తున్నాయి.

ఉక్రెయిన్ పై దాడి చేస్తే తీవ్రంగా ప్రతిస్పందిస్తామని అమెరికా ప్రకటిస్తూ వచ్చింది. ఇదిగో రేపో మాపో రష్యా దాడి చేయబోతోంది అని అమెరికా అధ్యక్షుడి నుండి దౌత్యవేత్తల వరకు ఒకటే హెచ్చరించారు. కానీ రష్యా దాడి చేయలేదు. కేవలం వాస్తవంగా ఏ పరిస్ధితి నెలకొని ఉన్నదో దానిని అధికారికంగా గుర్తిస్తున్నట్లు ప్రకటించింది.

2014లో ఉక్రెయిన్ లో ప్రజాస్వామికంగా ఎన్నికయిన విక్టర్ యనుకోవిచ్ ప్రభుత్వాన్ని అమెరికా సహాయంతో నయా నాజీ గ్రూపులు కూల్చివేసినప్పటి నుండి డోనెట్స్క్, లుగాన్స్క్ ప్రాంతాలు అమెరికా, ఈ‌యూ లు నిలబెట్టిన ప్రభుత్వాన్ని గుర్తించడం లేదని ప్రకటించాయి. తమను తాము రిపబ్లిక్ లుగా ప్రకటించుకున్నాయి. తమను కూడా రష్యాలో కలుపుకోవాలని రష్యాను అభ్యర్ధించాయి. వారి అభ్యర్ధనను పుతిన్ తిరస్కరించినప్పటికి వాటి రక్షణకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించాడు. ఆ విధంగా రెండు ప్రాంతాలు ఆచరణలో రష్యా సంరక్షణలోనే ఉన్నాయి. ఈ పరిస్ధితిని అధికారికంగా గుర్తిస్తున్నట్లు ఇప్పుడు పుతిన్ ప్రకటించాడు.

డాన్ బాస్ ప్రాంతాన్ని (డోనెట్స్క్, లుగాన్స్క్ రెండింటినీ కలిపి డాన్ బాస్ ఏరియాగా పిలుస్తారు) స్వతంత్ర రాజ్యాలుగా గుర్తించాలని వారం క్రితం రష్యా పార్లమెంటు అధ్యక్షుడికి సిఫారసు చేస్తూ తీర్మానం ఆమోదించింది. సదరు తీర్మానాన్ని పుతిన్ ఆమోదించినట్లు ఇప్పుడు ప్రకటించాడు.

రష్యా గుర్తించినప్పటికి ఇతర దేశాలు ఏవి డాన్ బాస్ రిపబ్లిక్కులను స్వతంత్ర రాజ్యాలుగా గుర్తించలేదు. గుర్తిస్తాయన్న గ్యారంటీ కూడా లేదు. కానీ రష్యా అండదండలు ఉన్నంత వరకు వాటి రక్షణకు, మనుగడకు ఎలాంటి ప్రమాదము ఉండదు. పేరుకు స్వతంత్ర రాజ్యాలు అయినప్పటికి ఆచరణలో రష్యాలో భాగంగానే ఉండే అవకాశం కనిపిస్తోంది.

ఆగస్టు 2008లో జార్జియా నుండి రెండు ప్రాంతాలు విడిపోయినప్పుడు కూడా ఇదే జరిగింది. జార్జియా ప్రభుత్వం రష్యాను కాదని అమెరికా పక్షం చేరడంతో సౌత్ ఒస్సేటియా, అబ్ఖాజియా ప్రాంతాలు స్వతంత్రం ప్రకటించుకున్నాయి. జార్జియా వెంటనే ఆ ప్రాంతాలపై మిలట్రీ దాడికి దిగింది.వెంటనే రష్యా స్పందించి తన సైన్యాలను జార్జియా మీదికి నడిపించింది. జార్జియా రాజధాని వరకు రష్యా సైన్యాలు ఆక్రమించాయి.

అనంతరం ఈ‌యూ మధ్యవర్తిత్వంలో కుదిరిన ఒప్పందం మేరకు రష్యా సేనలు వెనక్కి వెళ్ళాయి. సౌత్ ఒస్సేటియా, అబ్ఖాజియాలు స్వతంత్ర రిపబ్లిక్కులుగా అవతరించాయి. అమెరికా తలపెట్టిన నాటో విస్తరణ పధకంలో జార్జియా కూడా ఒక భాగంగా ఉండడం గమనార్హం.

అమెరికా ఆంక్షలు

డాన్ బాస్ లో రక్షణ పరిస్ధితిని సరిదిద్దడానికి రష్యా సైన్యాలు వెళ్లాలని పుతిన్ ఆదేశించాడు. అయితే ఇంకా వెళ్లలేదు. రష్యా ట్యాంకులు కదిలిన వెంటనే తాము కఠిన ఆంక్షలు విధిస్తామని అమెరికా ప్రకటించింది.

రెండు రిపబ్లిక్ లను గుర్తిస్తున్నట్లు పుతిన్ ప్రకటించడంతో అమెరికా కొన్ని ఆంక్షలు ప్రకటించింది. డోనెట్స్క్, లుగాన్స్క్ లతో సంబంధం ఎవరు పెట్టుకున్నా వారిపై వాణిజ్య, ఆర్ధిక ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది. రష్యా సైన్యాలు మరింత పురోగమిస్తే మరిన్ని ఆంక్షలు ఉంటాయని ప్రకటించింది. అధ్యక్షుడు జో బైడేన్ పుతిన్ చర్యను గట్టిగా ఖండించాడు(!)

డాన్ బాస్ ఏరియాలో కొత్త పెట్టుబడులు, వాణిజ్యం లు నిషేదిస్తాం. అమెరికా వ్యక్తులు ఎవరూ అక్కడ ఫైనాన్స్ ఇవ్వరు. అక్కడి నుండి ఫైనాన్స్ తీసుకోరు. రష్యా, ఉక్రెయిన్ పై మరింత దాడికి పూనుకుంటే మిత్రులతో కలిసి మరిన్ని కఠిన ఆంక్షలు ప్రకటిస్తాం” అని అమెరికా విదేశీ ప్రతినిధి జెన్ సాకి ప్రకటించింది.

రష్యా చర్య అంతర్జాతీయ ఒప్పందాల ఉల్లంఘనగా నాటో కూటమి ప్రకటించింది. అనేక ఐరాస తీర్మానాలను, అంతర్జాతీయ ఒప్పందాలను, జెనీవా ఒప్పందాలను ఉల్లంఘించి ఇదే నాటో కూటమి ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, సిరియా, లిబియా దేశాలపై దాడి చేసి లక్షల మందిని చంపేసి ఆ దేశాలను ఛిన్నాభిన్నం చేసిన నాటో కూటమి ఇప్పుడు రష్యాకు నీతులు చెబుతోంది.

జర్మనీ ఛాన్సలర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు పుతిన్ చర్య పట్ల అసంతృప్తి ప్రకటించారు. రష్యన్ ఫెడరేషన్ చర్య ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారాలను ఉల్లంఘించిదని, ఐరాస ఛార్టర్ కు వ్యతిరేకం అని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ప్రతినిధి ప్రకటించాడు.

చైనా ఏ పక్షమూ వహించలేదు. ఉద్రిక్తతలు పెంచే వైపుగా ఎవరూ వ్యవహరించరాదు అని ప్రకటించింది. అనేక సంక్లిష్ట కారణాలు ఉక్రెయిన్ లో ప్రస్తుత పరిస్థితికి దారి తీసాయి అని ప్రకటించి ఊరుకుంది.

విడిపోయిన రిపబ్లిక్ లను స్వతంత్ర దేశాలుగా గుర్తిస్తున్నామని సిరియా ప్రకటించింది. ఇరు పక్షాలు చర్చలతో సమస్య పరిష్కరించుకోవాలని ఇరాన్ కోరింది. “దురదృష్టవశాత్తూ నాటో జోక్యం, రెచ్చగొట్టే చర్యలు ఈ ప్రాంతంలో పరిస్థితులను మరింత సంక్లిష్టంగా మార్చాయి” అని ఇరాన్ విదేశీ శాఖ ప్రతినిధి పేర్కొన్నాడు.

బ్రిటన్ (యూ‌కే) ప్రధాని పుతిన్ చర్యను ఖండించాడు. మరిన్ని బాధాకరమైన ఆంక్షలు అమలు చేస్తామని హెచ్చరించాడు. మిన్స్క్ ఒప్పందాలను ఉల్లంఘించడమే అన్నాడు. ఉక్రెయిన్ సమగ్రతను రష్యా ఉల్లంఘింది అన్నాడు. ఫ్రెంచి అధ్యక్షుడు కూడా ఖండించాడు. ఐరాస భద్రతా సమితి ఎమర్జెన్సీ సమావేశానికి పిలుపు ఇచ్చాడు. యూరోపియన్ ఆంక్షలు విధించాలని కోరాడు.

“ఇది ఉక్రెయిన్ పై దూకుడు చర్య. అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన. తక్షణ ఆంక్షలతో స్పందించాలి” అని పోలండ్ ప్రధాని ప్రకటించాడు. “తాజా పరిణామాల నేపధ్యంలో ఉక్రెయిన్ తూర్పు ప్రాంతాల నుండి విడిచి వెళ్లాలని మా పౌరులను కోరుతున్నాం. కీవ్ లోని మా ఎంబసీని కాంటాక్ట్ చేయాలని వారిని కోరుతున్నాం” అని టర్కీ ప్రకటించింది.

“దాడి జరిగితే ఆంక్షలతో సహా కఠిన చర్యలు ఎదుర్కోవలసి ఉంటుంది.” అని జపాన్ హెచ్చరించింది.

“అన్ని పక్షాలు సంయమనం పాటించాలి. ఉద్రిక్తతల తగ్గుదలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. అన్ని దేశాల భద్రతా ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని దీర్ఘకాలిక శాంతి, స్థిరత్వాలు నెలకొనడానికి కృషి చేయాలి” అని ఐరాస ఇండియా ప్రతినిధి/రాయబారి కోరాడు.

పుతిన్ ప్రకటనను ‘నాన్సెన్స్’ అని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ కొట్టి పారేశాడు.

అయోమయం

ఈ స్పందనలు అన్నింటిలో ఒకటి స్పష్టంగా కనిపిస్తోంది. అది ‘అయోమయం’. అమెరికా ప్రకటనల మేరకు ఉక్రెయిన్ పైన రష్యా దాడి చేస్తుందని అందరూ భావించారు. జార్జియాలో జరిగింది అదే గనుక ఉక్రెయిన్ లోనూ అదే జరుగుతుందని ఊహించారు.

అందుకు భిన్నంగా రష్యా వాస్తవ పరిస్ధితిని మార్చే విధంగా ఒక్క చర్యా తీసుకోలేదు. ఉక్రెయిన్ పై దండెత్తలేదు. సైన్యాన్ని తూర్పు ఉక్రెయిన్ లేదా డాన్ బాస్ నుండి ఒక్క అడుగు కదల్చలేదు. దాడి చేస్తే అందుకు అనుగుణంగా ప్రకటనలు, చర్యలు సిద్ధం చేసుకున్న దేశాలు పుతిన్ ప్రకటనతో ఒక్కసారిగా అయోమయానికి గురైనట్లు కనిపిస్తోంది.

అయితే పుతిన్ ప్రకటన వెలువడిన వెంటనే డాన్ బాస్ పై గత వారం రోజులుగా ఉక్రెయిన్ సైన్యాలు చేస్తున్న కాల్పులు, షెల్లింగ్ ఆగిపోయాయి. ఆ విధంగా డాన్ బాస్ ప్రజలకు మేలు జరిగింది. ఎందుకంటే ఉక్రెయిన్ సైన్యాలు ఉధృతంగా కాల్పులు జరుపుతుండడంతో అక్కడి నుండి ప్రజలు పెద్ద ఎత్తున రష్యాలోకి వలస వెళ్ళడం ప్రారంభించారు.

నిజానికి కాల్పుల నుండి తప్పించడానికి డాన్ బాస్ ప్రభుత్వాలే జనాన్ని రష్యాకు తరలించాయి. పత్రికల ప్రకారం 70,000 మంది వరకు డాన్ బాస్ ప్రజలు రష్యా సరిహద్దు దాటి వెళ్లారు. పుతిన్ ప్రకటనతో ఉక్రెయిన్ నుండి దాడి ఆగిపోయింది. ఫలితంగా మరింత మంది రష్యాకు వలస వెళ్ళే అవసరం తప్పింది.

మునుముందు పరిణామాలు ఆసక్తికరంగా ఉండబోతున్నాయి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s