రిలయన్స్ మొబైల్ వైర్ లెస్ ఖాతాదారుల సంఖ్య తగ్గిపోయింది. ఇలా తగ్గుదల నమోదు కావడం రిలయన్స్ జియో కంపెనీకి ఇది మొదటిదారిగా తెలుస్తున్నది. డిసెంబర్ 2021 నెలలో మొత్తం మొబైల్ ఫోన్ వినియోగదారుల సంఖ్యలోనే తగ్గుదల నమోదు కాగా అందులో ప్రధాన భాగం రిలయన్స్ కంపెనీ దే కావటం గమనార్హం.
టెలికాం రంగం నియంత్రణ సంస్థ ‘టెలికాం రెగ్యులేటరీ ఆధారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) వెల్లడి చేసిన గణాంకాల ప్రకారం ఇండియాలో వైర్ లెస్ ఖాతాదారుల సంఖ్య నవంబర్ 2021 చివరికి 116 కోట్లు ఉండగా అది డిసెంబరు చివరికి 115 కోట్లకు తగ్గింది.
మొబైల్ ఇంటర్నెట్ సేవలలో రిలయన్స్ కంపెనీది ప్రధాన వాటా. ఈ కంపెనీ డిసెంబర్ నెలలో 12.9 మిలియన్లు లేదా 1.29 కోట్ల సబ్^స్క్రైబర్లను కోల్పోయింది. ఈ కంపెనీకి ఇప్పుడు మొత్తం 415.71 మిలియన్లు లేదా 41.57 కోట్ల మంది ఖాతాదారులు ఉన్నారు.
ఆ తర్వాత ఎక్కువ మందిని నష్టపోయిన కంపెనీ వొడాఫోన్ ఐడియా. అది 1.61 మిలియన్లు లేదా 16.1 లక్షల మందిని నష్టపోయింది. డిసెంబర్ చివరికి వొడాఫోన్ ఖాతాదారుల సంఖ్య 26.55 కోట్లు.
భారతి ఎయిర్ టెల్ కంపెనీ నష్టపోవటానికి బదులు 4.75 లక్షల మంది మేర ఖాతాదారులను పెంచుకుంది.
మార్కెట్ వాటా పరంగా చూస్తే ఇంకా రిలయన్స్ దే పై చేయి. ఆ కంపెనీ చేతిలో 36 శాతం మార్కెట్ ఉండగా తరువాతి స్ధానం 30.81 శాతం మార్కెట్ తో ఎయిర్ టెల్ ఆక్రమించింది. వొడాఫోన్ ఐడియా కంపెనీ వాటా 23 శాతం.
అయితే రిలయన్స్, వొడాఫోన్ కంపెనీల ఖాతాదారులు ఎందుకు తగ్గారు? మార్కెట్ విశ్లేషకుల ప్రకారం ధరలు పెంచడం వల్ల రిలయన్స్ సిమ్ లను వాడటం 1.29 కోట్ల మంది మానేశారు. అలాగే వొడాఫోన్ కూడా ధరలు పెంచి ఖాతాదారుల్ని కోల్పోయింది.
విశ్లేషకుల ప్రకారం ఒకటి కంటే ఎక్కువ సిమ్ లు వాడే వాళ్ళు తమ సిమ్ లలో ఒక దాన్ని (లేదా రెండు అంతకంటే ఎక్కువ కావచ్చు) వాడటం ఆపేసి కంపెనీకి సరెండర్ చేసి ఉండొచ్చు. అనగా మార్కెట్ మరింత స్థిరీకరణ చెందినది అని చెప్పవచ్చు.
తక్కువ మొత్తానికి అందజేస్తున్న సేవలను రిలయన్స్ కంపెనీ పూర్తిగా ఆపివేయడం వల్ల ఆ కంపెనీ ఎక్కువ మందిని ఖాతాదారులుగా నష్టపోయిందని భావిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రిలయన్స్ కంపెనీ 60 లక్షల మందిని కోల్పోయినట్లు ట్రాయ్ నివేదిక వెల్లడించింది.