మాకూ హక్కుంది విశేఖర్ / ఫిబ్రవరి 17, 2022 ——రచన: రమాసుందరి 10/12/2013. వరండాలో, వాలు కుర్చీలో… శూన్యానికి చూపులు వేలాడదీసి అంతర్ముఖులైన మీ ఆలోచనల ఆనవాళ్లను మమ్మల్ని స్పృజించనివ్వండి యౌవనాశ్వానికి ముకుతాడు బిగించి విముక్తి బాటపై దౌడు తీయించిన ఉద్విగ్న జ్నాపకాలా? కష్టకాలంలో కంటికి రెప్పలైన ప్రేమమూర్తుల కారుణ్య రూపాలా? ఉద్యమాల అలజడులే జీవితం ఐనందుకు దరిచేరని వ్యష్టితత్వం ఆస్తుల్ని పెంచనందుకు విస్మృత కుటుంబాన్ని శిధిల గతంలో ఏరుకుంటున్నారా? మసకబారిన కంటిచూపు తొట్రుపడుతున్న గంభీర స్వరం మీ మెదడు పదును తగ్గించలేదు సుమా! శిశిర వృక్షాలకు నిత్య వసంతాలు పూయించబూనిన వయో వృద్ధ విప్లవ తేజో యౌవనులు మీరు మీ భుజాలెక్కించి చూపిన మరో ప్రపంచపు అద్భుతాల్ని మీ అనుభవాల దోసిళ్లనుండి ఒడిసి పట్టేందుకు మేం ప్రయత్నిన్నాం అపాత్ర దానాలు కావవి భవితకు దారి చూపే పాద ముద్రలు ఏటికి ఎదురీత నేర్పిన గజ ఈతగాళ్లు మీరు ప్రాపంచిక సుఖాల్ని గడ్డిపరకలుగా త్యజించిన అపర భీష్ములు మీరు కన్న పేగులే దూరం నెట్టిన ఆపత్సమయాన మమ్మల్ని గుండెలకు హత్తుకున్న కన్న తండ్రులు మీరు వారసులం అని చెప్పుకునే సాహసం మాకు లేదు గానీ మీ పాద ముద్రలను పదిలపరుచుకున్న గర్వం మాది పేగు బంధం పెనవేసుకున్నదే అయినా ఆత్మ బంధం తెంచుకోలేనిది మీ సమక్షానికీ, సంరక్షణకూ మాకూ హక్కుంది దీన్ని పంచుకోండి:Click to share on Facebook (కొత్త విండోలో తెరుచుకుంటుంది)Click to share on Twitter (కొత్త విండోలో తెరుచుకుంటుంది)Click to print (కొత్త విండోలో తెరుచుకుంటుంది)Click to email a link to a friend (కొత్త విండోలో తెరుచుకుంటుంది)దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది…