‘బ్లాగింగ్’ మరియు ‘హ్యూమన్ సివిలైజేషన్’!


Human Civilization

బ్లాగింగ్ అన్నది అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సామాన్యులకు అందుబాటులోకి వచ్చిన ఒక సాధనం. పత్రికలు, ఛానెళ్లు కొద్ది మంది వ్యక్తిగత, వృత్తిగత జర్నలిస్టులకి మాత్రమే అందుబాటులో ఉంటాయి. అందులో ఉద్యోగం సంపాదించి అభిప్రాయాలు అనేకమందితో పంచుకోవడం, చెప్పడం అందరికీ సాధ్యం కాదు. జర్నలిజంలో ప్రవేశం లేకుండానే, జర్నలిజం చదవకుండానే అనేకమంది వివిధ అంశాలను చర్చించగల సామర్ధ్యం కలిగి ఉంటారు. అలాంటివారికి తమ అభిప్రాయాలు చెప్పుకోవడానికి బ్లాగింగ్ మంచి సాధనం.

బ్లాగింగ్ అయినా, మరే సామాజిక సాధనమయినా సామాజిక భావాలు మరింత అభివృద్ధి చెందటానికి దోహదపడాలి. అభిప్రాయాలు మరింతగా సంఘర్షించి మెరుగైన భావాలు జనించడానికి సాయపడాలి. ప్రగతి వ్యతిరేక భావాలు నశించి ప్రగతి శీల భావాలు పురోగమించడానికి ఉపకరించాలి. సమాజంలో అనేక చారిత్రక కారణాల వల్ల వెనుకబడ్డవారికీ, అణచివేతకి గురయినవారికీ చేయూతనివ్వడానికి పని చేయాలి. కాని దీనికి కొంతమంది బ్లాగర్లు ఆటంకంగా పరిణమించారు. ప్రతిభ కొన్ని వర్గాల సొత్తన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అజ్ఞానాన్ని ‘విజ్ఞాన సర్వస్వం’ గా భావించాలని అహంకరిస్తున్నారు. ఆరోగ్యకరమైన చర్చల ద్వారా తెలుసుకోవాల్సిన అంశాలను, తేలాల్సిన అంశాలనూ ఎగతాళి చేస్తూ, చులకన చేస్తూ ఆధిపత్యంతో రుద్దాలని చూస్తున్నారు.

ఈ బ్లాగ్ లో పెట్టుబడిదారీ వ్యవస్ధలోని అనేక చెడుగులను నేను ఉదహరిస్తున్నాను. లాభార్జనే ధ్యేయంగా పెట్టుకునే పెట్టుబడి, లాభాల కోసం సామాజిక విలువలను పతనం చేస్తున్న సంగతిని చెబుతున్నాను. కేవలం స్టేట్ మెంట్ల ద్వారా చెప్పడం కాకుండా వివిధ ఉదాహరణలు రాస్తున్నాను. అనేక సంఘటనలు, నేరాలు, దోపిడీలు ఉదహరిస్తూ విశ్లేషిస్తున్నాను. సమాజంలోని జరుగుతున్న వివిధ సంఘనలను ఉదహరిస్తూ వాటి మధ్య పరస్పర సంబంధాన్ని వివరిస్తున్నాను. వ్యక్తులు సర్వ స్వతంత్రులు కారనీ ప్రతి ఒక్కరూ ఆయా సమాజాల్లోని విలువల ప్రాతిపదికనే వ్యవహరిస్తారని సోదాహరణంగా వివరిస్తున్నాను. సంఘటనలు చెప్పి ఊరుకోకుండా విశ్లేషణ ద్వారా ఆయా సంఘటనల కార్య కారణ సంబంధాలను వివరిస్తున్నాను.

ఐ.ఎం.ఎఫ్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ స్ట్రాస్ కాన్ రేప్, వ్యభిచారం లకు సంబంధించిన కేసులు, టెన్త్ క్లాస్ విద్యార్ధి ఒకరిని క్లాస్ మేటే విలాసాల కోసం కిడ్నాప్ చేసి హత్య చేసిన ఘటన, శారీరకంగా పసి పిల్లలనైన పన్నెండేళ్ల అమ్మాయిలను సైతం వ్యభిచారులుగా మారుస్తున్న నీచ మైన వ్యాపారంలో సైతం ‘గోల్డ్ మేన్ సాచ్’ లాంటి వాల్ స్ట్రీట్ దిగ్గజ బ్యాంకు పెట్టుబడులు వెల్లడి అయిన ఘటన అందులో కొన్ని.

ఈ ఘటనలను చెప్పి వాటికి పెట్టుబడిదారీ వ్యవస్దే కారణమని స్టేట్ మెంట్ ఇచ్చి నేను ఊరుకోలేదు. ఆ ఘటనలని విశ్లేషించాను. లాభార్జన ధ్యేయంగా పని చేసే పెట్టుబడి ఇన్ని దుర్మార్గాలకు ఎలా కారణమయిందీ విశ్లెషించాను. వివిధ ఘటనలు వేటికవే ఒంటరిగా ఉండజాలవనీ, ఆ ఘటనల చుట్టూ విస్తరించి ఉండే సామాజిక వ్యవస్ధలే వాటికి ప్రేరేపితాలుగా ఉంటాయనీ వివరించాను. వ్యక్తుల మధ్య సంబంధాలతో అల్లుకుపోయి ఉండే అనేకానేక ఘటనల సమాహారమే వ్యవస్ధ అని వివరించాను. వ్యక్తులు, సమూహాలు, వారి వ్యక్తిగత ఉమ్మడి భావాలు, వ్యక్తిగత ప్రాంతీయ జాతీయ అంతర్జాతీయ ఆకాంక్షలు… అన్నీ అప్పటికి ఉనికిలో ఉన్న సామాజిక వ్యవస్ధల నియమాలకు లోబడి ఉంటాయని వివరించాను.

సామాజిక వ్యవస్ధలో ప్రజలంతా భాగస్వాములే అయినప్పటికీ అందలి ఘటనలు, భావాలు మాత్రం ఆదిపత్య వర్గాలు శాసించగలుగుతున్నాయని విశ్లేషించి వివరించాను. ఆర్ధికంగా ఉన్నత స్ధితిలో ఉన్న వర్గాలు వనరులను ఆధీనంలో ఉంచుకుని తమ ఆధిపత్యం చెక్కుచెదర కుండా ఉండడానికి సామాజిక నియమాలను శాసిస్తున్నాయని వివరించాను. పెట్టుబడిదారీ వ్యవస్ధలో పెట్టుబడిదారీ వర్గాలే ఆధిపత్య శక్తులు గనక వారే వ్యవస్ధలను శాసిస్తున్నారని వివరించాను.

ఈ భావాలు నేను ఒక్కనాటితో సంపాదించుకున్నవి కావు. పుట్టిన దగ్గర్నుండి నేను బతికిన సమాజమే నాకు ప్రధాన పాఠశాల. సమాజం గురించి తెలుసుకోవడానికి నా అనుభవం, పుస్తకాలు దోహదం చేశాయి. సమాజాన్ని శోధించిన మహనీయులు గ్రంధస్తం చేసిన సిద్ధాంతాలు నేను సమాజాన్ని అర్ధం చేసుకోవడానికి దోహదం చేశాయి. నా తల్లిదండ్రులు, సోదరులు, బడి, కాలేజి, యూనివర్సిటీ, స్నేహితులు, హితులు, పెద్దలు, ఆఫీసు, ఇంటర్నెట్, బ్లాగర్లు… వీరంతా నా సామాజిక చైతన్యానికి దోహదపడ్డవారే. వీరు లేకుండా నేను లేను. నా భావాలూ లేవు.

నా చుట్టూ ఉన్న సామాజిక పరిస్ధితులు నన్ను రూపొందించినట్లే ఇతరులను కూడా వారి చుట్టూ ఉన్న సమాజమే రూపొందిస్తుంది.

సమాజం అంతా సమాన స్ధాయిలో అభివృద్ధి చెందలేదు. అందరికీ విద్య అందుబాటులో లేదు. అందరూ ఆర్ధిక ఉన్నతులు కారు. అందరూ విజ్ఞాన సంపన్నులు కారు. వివిధ అభివృద్ధి దశలలో ఉన్న సమాజాలు వివిధ స్ధాయిల్లో వ్యక్తులను సమూహాలనూ తీర్చి దిద్దుతాయి. అన్ని అంతరాలతో కూడిన సమాజంలో వ్యక్తుల మధ్య, సమూహాల మధ్య కూడా అన్ని అంతరాలే ఉంటాయి. ఈ అంతరాలను తొలగించి సమాన అభివృద్ధిని కాంక్షిస్తున్నవారు కొందరైతే, అంతరాలను సొమ్ము చేసుకుంటూ తమ ఉన్నతికీ సంపదల స్వాయత్తానికీ అంతరాలనే సాధనాలుగా చేసుకుంటున్నవారు మరి కొందరు.

నా ఆలోచనలు, భావాలు, అభిప్రాయాలు అందరూ అంగీకరించాల్సిన పని లేదు. భావాలు, చైతన్యం మరింత అభివృద్ధి చెందటానికి సంఘర్షణ అవసరం. ఆ సంఘర్షణ బ్లాగుల్లో చర్చల రూపంలో ఉండాలి. పరస్పరం ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో కొనసాగాలి.

దానికి విరుద్ధంగా కొందరు బ్లాగర్లు వ్యవహరిస్తున్నారు. తమకు నచ్చని భావాలను ఎగతాళీ చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఏక పక్ష స్టేట్ మెంట్లతో ఎదుటివారి గౌరవాన్ని కించపరుస్తున్నారు. బూతులతో స్ధైర్యాన్ని దెబ్బతీయడానికి కంకణం కట్టుకున్నారు. తాము దిగజారుతూ బ్లాగర్లను దిగజార్చడానికి ప్రయత్నిస్తున్నారు. తమ దిగజారుడుతనమే ‘హ్యూమన్ సివిలైజేషన్’ గా నిర్ధారిస్తున్నారు.

‘టెన్త్ క్లాస్ విద్యార్ధి హత్య’ పై రాసిన పోస్టు కింద ‘గోల్ద్ మేన్’ ఆర్టికల్ కింద కొందరు రాసిన కామెంట్లు అందుకు తాజా ఉదాహరణ. వీరికి పూర్వం కూడా చాలా మంది బూతులు రాసారు. ఎగతాళి చేసారు. తమను తామే సింహాసనంపై కూర్చుండబెట్టుకుని నాపై జాలి ప్రదర్శించారు. నా పరిజ్ఞానాన్ని హేళన చేసారు. వ్యక్తిగతంగా దూషించడానికి ఏకంగా బ్లాగే పెట్టి పరమ నాసిరకంగా వ్యవహరించారు.

ప్రజాస్వామ్యం, నేటి నాగరికత. పరస్పర గౌరవం, పాటించవలసిన విలువ. భావాల మార్పిడి, మానవ సంబంధాల అభివృద్ధి సాధనం. భావ స్వామ్యం, ప్రజాస్వామిక హక్కు. హెల్దీ బ్లాగింగ్ సాంకేతిక విలువ. వీటిని గుర్తించకుండా హేళన చెయ్యడం, అహంభావం ప్రదర్శించడం, బూతులు రాయడం సంస్కార హీనం.

హ్యుమన్ సివిలైజేషన్ సాధించిన ఉన్నత విలువలను ఏ మాత్రం పాటించకుండా దాని గురించి పాఠాలు చెప్పబూనుకోవడం సివిలైజ్డ్ మనుషులు చేసే పని కాదు.

పెట్టుబడిదారీ విధానాన్ని గొప్పగా భావిస్తే అది వారి ఇష్టం. కాని ఆ విధానంలో తలెత్తిన కోటిన్నొక్క చెడుగులకు కారణాలు వారు వివరించగలగాలి. కారణాలు చెప్పడమే కాక పరిష్కారాలను, కనీసం సైద్ధాంతికంగానైనా, చూపగలగాలి. చెప్పకపోయినా, చెప్పలేకపోయినా ఫర్వాలేదు. నమ్మడం, తిరస్కరించడం ఒకరి ప్రజాస్వామిక హక్కు. కాని ఆ హక్కు ఇతరుల ప్రజాస్వామిక హక్కులను సైతం గౌరవించేదిగా ఉండాలి. స్వేచ్చగా బ్లాగింగ్ చేసుకునే హక్కుని హరించేదిగా ఉండరాదు.

ఈ సూత్రాలను పాటిస్తూ తోటి బ్లాగర్ల హక్కులను గౌరవించడం హ్యూమన్ సివిలైజేషన్ లో భాగంగా గుర్తించిననాడు బ్లాగింగ్ అహ్లాదకరంగా మారుతుంది.

రచనా కాలం: 5 ఏప్రిల్ 2012

2 thoughts on “‘బ్లాగింగ్’ మరియు ‘హ్యూమన్ సివిలైజేషన్’!

  1. ప్రస్తుత సందర్భానికి తగినంత సమాచారాన్ని ఇచ్చే అంశాలు మీ పాత టపాలలో చాలానే ఉన్నాయి! అయితే ప్రస్తుతం ఈ పాత టపాలను ఎందుకు మరలా ప్రచురిస్తున్నారు?

  2. మళ్ళీ కాదు. ఇదే మొదటిసారి ప్రచురించడం. బ్లాగ్ డ్రాఫ్ట్ లలో చాలా ఉండిపోయాయి. వాటిని తీసేయ్యాలని చూస్తుంటే ఇవి ఉపయోగంగా కనిపించాయి. పాఠకులకు కాకపోయినా నాకైనా ఉంటాయని పబ్లిష్ చేశాను.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s