భారత దేశ మార్కెట్ ఆర్ధిక వ్యవస్ధ పండితులు ప్రధాని మన్మోహన్, ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షుడు మాంటెక్ అహ్లూవాలియా (ఈయన రేప్ ప్రయత్నం నేరానికి అరెస్టయిన ఐ.ఎం.ఎఫ్ ఎం.డి స్ట్రాస్ కాన్ స్ధానంలో నియమితులయ్యే అవకాశం ఉన్నవారిలో ఒకటిగా పరిగణింపబడుతున్నాడు. యూరప్ ఒప్పుకోదనుకోండి!), ప్రధానికి ఆర్ధిక సలహాదారుల ముఠాకి నాయకుడైన కౌశిక బసు లు (హోం మంత్రి చిదంబరంను కూడా వీళ్ళలో కలపవచ్చు. ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ నెహ్రూవియన్ ఆర్ధిక విధానాలని కొంతవరకు ఇంకా అంటిపెట్టుకుని ఉన్నందున ఆయన్ని వీళ్ళల్లో కలపలేం.) అప్పుడప్పుడూ భారతదేశ ఆర్ధిక వ్యవస్ధ ఫండమెంటల్స్ బలంగా ఉన్నాయి, మరేం ఫర్వాలేదు అంటుంటారు. 2008 ఆర్ధిక సంక్షోభం దెబ్బకు భారతదేశం ఏమవుతుందోనని చర్చలు జరుగుతున్నపుడు వీళ్ళు “మరేం ఫర్లేదు. మన ఎకానమీ ఫండమెంటల్స్ బలంగా ఉన్నాయి” అని భయపడుతున్న వారికి ధైర్యం చేప్పారు.
ఇంతకీ ఫండమెంటల్స్ ఆఫ్ ఎకానమీ బలంగా ఉండడం అంటే ఏమిటి? బడ్జెట్ లోటు లేదా కోశాగార లోటు అదుపులో అంటే జిడిపిలో 2 నుండి 3 శాతం లోపు ఉండటం, రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లు అందుబాటులో ఉండటం (రిజర్వు బ్యాంకు తన వడ్డీ రేటు పెంచితే వాణిజ్య బ్యాంకులు కూడా తాము వసూలు చేసే వడ్డీ రేట్లు పెంచుతాయి. ఫలితంగా ప్రజలకు, కంపెనీలకు, పరిశ్రమలకు అందుబాటులో ఉండే డబ్బు తగ్గిపోతుంది), వాణిజ్య లోటు/మిగులు (ఎగుమతుల కంటే దిగుమతులు తక్కువగా ఉంటే వాణిజ్య మిగులు లేదంటే లోటు. మిగులుంటే సానుకూలంగా ఉన్నట్లు), చెల్లింపుల సమతూకం (Balance of Payments) సున్నకి అటు ఇటుగా కొనసాగాలి (దేశానికీ మిగతా ప్రపంచానికీ మధ్య జరిగే ద్రవ్య లావాదేవీల్లో మిగులు లేదా లోటును బట్టి ఆ దేశ చెల్లింపుల సమతూకాన్ని నిర్ణయిస్తారు. ఎగుమతుల ఆదాయం, విదేశీ అప్పులు, ప్రపంచ బ్యాంకు ఐ.ఎం.ఎఫ్ లాంటివి ఇచ్చే సహాయ అప్పులు, దేశంలోకి వచ్చే ఎఫ్.డి.ఐ మరియు ఎఫ్.ఐ.ఐ లాంటి పెట్టుబడులు… ఇవన్నీ సమతూకంలో మిగులుకు తోడ్పడతాయి. మనవాళ్ళు విదేశాల్లో పెట్టే పెట్టుబడులు, దిగుమతుల చెల్లింపులు, కరెంటు ఖాతా లోటు… ఇవన్నీ సమతూకంలో లోటుకు దోహదపడతాయి. ఈ మిగులు, లోటు కలిపి సున్నకు దగ్గరగా ఉంటే ఆ దేశానికి చెల్లింపుల సమతూకం మంచిగా ఉన్నట్లు లెఖ్ఖ), బిజినెస్ కాన్ఫిడెన్సు సంతృప్తికరంగా ఉండాలి (విదేశీ, స్వదేశీ ప్రవేటు పెట్టుబడిదారులు ధైర్యంగా ఇండియా స్టాక్ మార్కెట్లలో మదుపు చేయడానికి ముందుకు రావాలి, ఇండియాతో వ్యాపారం చేస్తే లాభాలొస్తాయని నమ్మకం ఉండాలి, ఇండియాకి అప్పు ఇస్తే తగిన రాబడికి గ్యారంటీ ఉండాలి మొదలైన విశ్వాసాలు ఈ కోవలోకి వస్తాయి. ద్రవ్యోల్బణం అదుపులో (జిడిపిలో మూడు నాలుగు శాతం మధ్య) ఉండాలి. కన్సూమర్ కాన్ఫిడెన్సు కూడా ఉండాలి (వినియోగదారుల దగ్గర సరుకులు, సేవలు కొనడానికి తగిన డబ్బు అందుబాటులో ఉండాలి. మరీ ఎక్కువ పొదుపు చేసుకోకుండా సరుకుల కోసం ఖర్చు పెట్టోచ్చు అనే నమ్మకం ఉండాలి). నిరుద్యోగం వీలైనంత తక్కువగా ఉండాలి. ఉద్యోగులు, కార్మికుల వేతనాలు సరుకులు, సేవలు కొనుగోలు చేయడానికి తగిన స్ధాయిలో ఉండాలి. ద్రవ్య రంగం ఆరోగ్యకరంగా ఉండాలి (బ్యాంకింగ్, ఇన్సూరెన్సు తదితర రంగాల్లోకి డబ్బు ప్రవహించి ఆ డబ్బు వ్యాపారస్ధులు, స్టాక్ మార్కెట్లు మొదలైనవాటికి అందుబాటులో ఉండాలి. జిడిపి వృద్ధి రేటు వేగంగా పెరుగుతూ ఉండాలి. ప్రస్తుతం చైనా తర్వాత వేగంగా వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్ధ ఇండియాదే. పారిశ్రామిక వృద్ధి తగినంతగా ఉండాలి. ఇది ఇండియాకి తగినంతగా లేదు. కరెన్సీ విలువ సంతృప్తికరంగా ఉండాలి. రూపాయి ఎక్కువగాఉంటే ఎగుమతులకి దెబ్బ. మరీ తక్కువగా ఉంటే దిగుమతులకి దెబ్బ. సమపాళ్ళలో ఉండాలన్న మాట.
స్ధూలంగా ఒక దేశ ఆర్ధిక వ్యవస్ధ ఫండమెంటల్స్ బలంగా ఉండడమంటే ఇదే. ఇవి బలంగా ఉండాలంటే దేశం యొక్క ఆదాయమార్గాలు విశాలంగా ఆటంకాలు లేకుండా అటూ, ఇటూ పరుగెట్టడానికి వీలుగా ఉండాలి. భారత దేశానికి ప్రధాన ఆదాయ వనరు వ్యవసాయం. నూటికి 65 శాతం మంది వ్యవసాయం మీదే ఆధారపడి ఉన్నారు. జిడిపిలో 20 పైనే శాతం వ్యవసాయం నుండే వస్తుంది. ప్రస్తుతం సర్వీసు రంగం (బ్యాంకులు, ఇన్సూరెన్సు, ఐ.టి, హోటళ్ళు ఇత్యాదులు) నుండి వచ్చే ఆదాయం కూడా జీడిపిలొ అధిక భాగం ఉంటోంది. అయితే తమాషా ఏంటంటే సర్వీసు రంగ జిడిపి మళ్ళీ వ్యవసాయ రంగ ఆదాయం పైనే ఆధారపడి ఉండడం. పారిశ్రామికంగా ఇండియా అంతగా అభివృద్ధి చెందలేదు కనక దాన్నుండి అంతగా ఆదాయం రాదు. ఇక్కడ సహజ వనరులని తవ్వి, ప్రాసెసింగ్ చేసి వేరే సరుకులు తయారు చేసేవిగా మార్చి ఎగుమతి చేసే పరిశ్రమలు ఎక్కువా ఉన్నాయి. భారత దేశ ప్రజల వినియోగం కంటే ఎగుమతుల కోసమే ఇక్కడి పారిశ్రామిక ఉత్పత్తులు ఉత్పత్తి చేయబడుతున్నాయన్నమాట. అలా ఎగుమతుల కోసం ఉత్పత్తి అయ్యే సరుకులు విదేశాలకు వెళ్ళి అక్కడ అంతిమ ఉత్పత్తుల తయారు చేస్తే వాటిని ఇండియా దిగుమతి చేసుకుంటోంది. చెప్పొచ్చేదేమిటంటే భారతదేశానికి వ్యవసాయం, సర్వీసు రంగాలు అత్యధిక ఆదాయ వనరులుగా ఉంటే వీటిలో సర్వీసు రంగానికి కూడా వ్యవసాయమే ఆధారంగా ఉంది. మొత్తం మీద వ్యవసాయమే ఇండియా ప్రధాన ఆదాయ వనరన్నమాట!
2 thoughts on “ఋతుపవన వర్షాలపైనే ప్రధానంగా ఆధారపడ్డ భారతదేశ ఆర్ధిక వ్యవస్ధ ఫండమెంటల్స్”
ఇటు వంటిదే 3-4 టపాలలో ఉన్నాయి. అందులో నాకు గుర్తున్నవరకు 12/06/2011 న ఒకటి ప్రచురించారు! ఆ టపా లోని సమాచారం బాగుంటుంది.
అవునా. అయితే మొదట ఇది రాసి, బాగో లేదని అది రాసి ఉంటానయితే. అది గుర్తు లేక దీన్ని ఇప్పుడు ప్రచురించాను. బహుశా మిగిలినవీ అందుకే ఆపి ఉంటాను.
Thanks for the information.
ఇటు వంటిదే 3-4 టపాలలో ఉన్నాయి. అందులో నాకు గుర్తున్నవరకు 12/06/2011 న ఒకటి ప్రచురించారు! ఆ టపా లోని సమాచారం బాగుంటుంది.
అవునా. అయితే మొదట ఇది రాసి, బాగో లేదని అది రాసి ఉంటానయితే. అది గుర్తు లేక దీన్ని ఇప్పుడు ప్రచురించాను. బహుశా మిగిలినవీ అందుకే ఆపి ఉంటాను.
Thanks for the information.