రష్యా సేనలు వెనక్కి! అమెరికా జోస్యం తుస్సు?


ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడి చేయబోతోందంటూ దాదాపు రెండు నెలల నుండి కాకి గోల చేస్తున్న అమెరికా జోస్యం చివరికి తుస్సుమంటోందా? ఈ ప్రశ్నకు సమాధానం ‘అవును’ అని తాజా పరిణామం స్పష్టం చేస్తోంది.

ఉక్రెయిన్ సరిహద్దులోని రష్యన్ మిలట్రీ డిస్ట్రిక్ట్ లలో ఉన్న రష్యన్ సైన్యాలు తమ తమ స్థావరాలకు తిరిగి వెళుతున్నాయి. ఈ వార్తను బ్రిటిష్ వార్తా సంస్థ రాయిటర్స్ ప్రకటించింది.

వార్షిక మిలట్రీ డ్రిల్ కోసం అక్కడికి వచ్చిన సైన్యాలు డ్రిల్లు పూర్తి కావటంతో స్థావరాలకు తిరుగు ముఖం పట్టాయి. ఈ మేరకు రష్యన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి కూడా పత్రికలకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.

“ఈ రష్యన్ సైనికుల కదలికలు ‘ఏ క్షణంలోనైనా రష్యా సేనలు ఉక్రెయిన్ పై దాడి చెయ్యొచ్చు’ అంటూ అమెరికా, బ్రిటన్ దేశాలు ఇన్నాళ్లూ చేస్తూ వచ్చిన హెచ్చరికలకు విరుద్ధంగా ఉన్నది”

అని రాయిటర్స్ వార్తా సంస్ధ వ్యాఖ్యానించడం విశేషం.

రష్యా వార్తా సంస్ధ టాస్ ఈ వార్తను ధృవీకరించింది. “క్రిమియాలో అనుకున్నట్లుగా డ్రిల్లు పూర్తి చేశాక దక్షిణ మిలట్రీ డిస్ట్రిక్ట్ లోని సైన్యాలు తమ శాశ్వత స్థావరాలకు తిరిగి వెళ్ళడం ప్రారంభించాయి” అని జిల్లా ప్రెస్ ఆఫీసు ప్రకటించింది. (టాస్, 15 ఫిబ్రవరి, 2022).

అయితే బ్రిటన్ మంత్రులు మాత్రం బింకం వీడలేదు. కింద పడ్డా పై చేయి నాదే అన్నట్లు కొత్త తరహా ప్రకటనలు గుప్పిస్తున్నారు. రష్యా సైన్యాలను ఉక్రెయిన్ సరిహద్దు నుండి పూర్తి స్ధాయిలో తొలగిస్తే తప్ప దాడి చేసే ఉద్దేశ్యం రష్యాకు లేదని తాము నమ్మలేమని బ్రిటన్ ఫారెన్ సెక్రటరీ లిజ్ ట్రస్ వ్యాఖ్యానించింది.

అమెరికా, బ్రిటన్ తదితర పశ్చిమ దేశాల ప్రకటనలు ఇలాగే అహంకారపూరితంగా ఉంటాయి. తామే ప్రపంచానికి రారాజులం అని తమకు తాము భావిస్తూ ఎక్కడో చంద్ర మండలం మీద కూర్చుని ప్రకటనలు జారీ చేస్తుంటారు. అరే బాబు మీ పెత్తనం ముగిసింది, ఇక మీ బడాయి కట్టి పెట్టండి అని ఎంతమంది ఎన్ని రకాలుగా మాటలతో, చేతలతో చెప్పినా సిగ్గు లేకుండా అదే బడాయి పోతుంటాయి.

అదిగో, రష్యా దాడి చేస్తోంది. ఉక్రెయిన్ ఒంటరి కాదు, మేము అండగా ఉన్నాం, జాగ్రత్త, ఖబడ్దార్ అంటూ సొల్లు మాటలు చెబుతూ ఆ వంకతో వేలాది సైన్యాలను తూర్పు యూరప్ దేశాలకు అమెరికా, బ్రిటన్ దేశాలు తరలించాయి. అలాగే పెద్ద మొత్తంలో ఆయుధాలను, మిసైళ్లను, ట్యాంకులను తరలించారు. అమెరికా, బ్రిటన్ లతో పాటు స్వీడన్, నార్వే, డెన్మార్క్, పోలండ్, చెక్ మొదలైన దేశాలు ఇలా ఆయుధాలు సరఫరా చేసిన దేశాల్లో ఉన్నాయి. అమెరికా అనుమతితో అమెరికా తనకు ఇచ్చిన స్టింగర్ మిసైల్స్ ని లిధుయేనియా సరఫరా చేసింది.

గత కొద్ది నెలల్లోనే రష్యా దాడి సాకు చెబుతూ పశ్చిమ దేశాలన్నీ కలిపి మొత్తం మీద 1.5 బిలియన్ డాలర్ల ఖరీదు చేసే ఆయుధాలు సరఫరా చేశాయి. (DW -Deutsche Welle-, 12 ఫిబ్రవరి 2022).

మామూలుగా అయితే ఇంత ఖరీదు చేసే ఆయుధాలు సరఫరా చేయాలంటే ఇరు దేశాల నేతలు చర్చించుకోవాలి. అంగీకారానికి రావాలి. ఈ క్రమంలో పొరుగు దేశాలు అభ్యంతరం చెబుతాయి. వారికి సమాధానం చెప్పుకోవాలి. ఇలాంటివి అనేకం ఉంటాయి. ఇప్పుడు రష్యా దాడి బూచి పుణ్యాన అవేమీ అవసరం లేకుండానే సరఫరా జరిగిపోయింది.

తమకు ఏయే దేశాలు ఏయే ఆయుధాలు సరఫరా చేసింది వివరాలు ఉక్రెయిన్ రక్షణ మంత్రి ఒలెక్సియ్ రెస్నికోవ్ క్రమం తప్ప కుండా ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ ఉంటాడు. వీటిని సహాయం కింద పంపారని రెస్నికోవ్ చెబుతున్నాడు గాని, ఇంతకు ఇంతా ముక్కు పిండి వసూలు చేస్తాయి అమెరికా తదితర పశ్చిమ దేశాలు!

ఉక్రెయిన్ పై దాడి పేరుతో ఇవన్నీ సరఫరా చేశారు గనక లెక్క ప్రకారం ఈ ఆయుధాలను ఆయా దేశాలు తిరిగి వెనక్కి తీసుకుంటాయా? రష్యా సేనలు వెనక్కి మళ్లుతున్నాయి కాబట్టి ఆయుధాలను కూడా క్రమంగా వెనక్కి వెళ్లిపోవాలి కదా! మందుగుండు వరకు ఉంచుకున్నా స్టింగర్, జావెలిన్ లాంటి ప్రధాన అఫెన్సివ్ ఆయుధాలన్నా వెనక్కి వెళ్తాయా?

చస్తే వెళ్లవు. ఎందుకంటే ఉక్రెయిన్ పై దాడి అంటూ బూటకపు అరుపులు అరవడం వెనుక ఉన్న లక్ష్యాల్లో ఒకటి ఉక్రెయిన్ కి ఆయుధాలు సరఫరా చెయ్యడం. దానితో పాటు అమెరికా సైన్యాలని రష్యా సరిహద్దుకి మరింత దగ్గరగా తరలించడం. ఆ విధంగా ఆయుధాలు సరఫరా చేసి, సైన్యాన్ని తరలించి ఉద్రిక్తతలు రెచ్చగొట్టి, యుద్ధం రగిల్చితే గ్యాస్ ప్రయోజనాలు నెరవేరతాయి. బోనస్ గా ఆయుధాల అమ్మకం జరిగిపోతుంది.

రష్యా సైన్యాలు వెనక్కి వెళుతున్న వీడియోలను కూడా రష్యా రక్షణ శాఖ వార్తా సంస్థలకు అందజేసింది. ఆర్‌ఐ‌ఏ న్యూస్ ఏజన్సీ ఈ విడియోలను పబ్లిష్ చేసింది. ట్యాంకులు, సాయుధ వాహనాలు వెళుతున్న దృశ్యాలు వీడియోలో ఉన్నట్లు పత్రికలు చెప్పాయి.

వార్షిక మిలట్రీ డ్రిల్ కోసమే తమ సైన్యాలు అక్కడికి వెళ్ళాయని రష్యా మొదటి నుండి చెబుతూనే ఉంది. అయితే ఈ సంగతిని పత్రికలు చెప్పలేదు. తమ నేరేటివ్ కు సరిపోయే అంశాలను మాత్రమే ప్రచురించి సరిపడని అంశాలను విస్మరించాయి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s