
Ukraine President Volodymyr Zelenskiy
ఓ పక్క అమెరికా యుద్ధం గ్యారంటీ అని అరుస్తూనే ఉంది. రష్యా దాడికి తేదీలు కూడా ప్రకటిస్తోంది. కానీ ఉక్రెయిన్ ప్రభుత్వం మాత్రం అమెరికా హెచ్చరికలను, జోస్యాన్ని నమ్ముతున్న సూచనలు ఏమీ లేవు.
“ఫిబ్రవరి 16 తేదీన దాడి జరుగుతుందని వాళ్ళు చెబుతున్నారు. ఆ రోజుని మేము ‘ఐక్యతా దినం’గా సెలబ్రేట్ చేసుకుంటాం” అని ఉక్రెయిన్ అధ్యక్షుడు ప్రకటించాడు. సోమవారం వీడియోలో దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్ స్కీ ఈ మాటలన్నాడు. (రాయిటర్స్, 14 ఫిబ్రవరి, 2022).
అధ్యక్షుడు జెలెన్ స్కీ చాలా రోజుల నుండి ఒకటే మాట చెబుతున్నాడు. రష్యా ఏదో రూపంలో దాడి చేస్తానని బెదిరిస్తున్నప్పటికి పశ్చిమ దేశాలు చెబుతున్నట్లు పూర్తి స్ధాయి దాడి చేస్తుందని తాను భావించడం లేదని ఆయన వాదన.
ఇవ్వాళో రేపో దాడి జరుగుతుందంటూ పశ్చిమ దేశాలు ఉన్న పరిస్థినిని గోరంతలు కొండంతలు చేసి చెపుతున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మొత్తుకుంటున్నాడు.
“దాడి జరిగే తేదీ కూడా ప్రకటించి ఇక మిలట్రీ చర్య మొదలవుతుంది అని చెబుతూ మనల్ని భయపెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ రోజు మనం మాత్రం జాతీయ జెండాలు ఎగురవేద్దాం. పసుపు, నీలం రంగుల (ఉక్రెయిన్ జాతీయ జెండా రంగులు) బ్యానర్లు ధరిద్దాం. ప్రపంచం మొత్తానికి మన ఐక్యత ఏమిటో చాటుదాం” అని జెలెన్ స్కీ ప్రజలకు పిలుపు ఇచ్చాడు.
బుధవారం (16 ఫిబ్రవరి 2022) దాడి జరుగుతుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు భావించడం లేదని ఉక్రెయిన్ ప్రభుత్వ అధికారులు కూడా పత్రికలతో చెబుతున్నారు. అమెరికా సెక్రటరీలు, ప్రతినిధులు మాత్రం “ఇదిగో దాడి, అదిగో దాడి” అంటూ ఓటి మాటలు చెబుతూనే ఉన్నారు.
“దాడి మొదలవుతుందని చెబుతూ వివిధ రకాలుగా ప్రకటిస్తున్న నిర్దిష్ట తేదీల పట్ల ఉక్రెయినియన్లు అనుమానాలు వ్యక్తం చేయడం అర్ధం చేసుకోదగ్గ సంగతే. ‘దాడి మొదలయ్యే తేదీ’ అన్నది ఇలా మారుతూ పోతుంటే అలాంటి మీడియా ప్రకటనలని కేవలం వ్యంగ్యంగానే జనం తీసుకుంటారు” అని ఉక్రెయిన్ మిలట్రీ చీఫ్ ప్రతినిధి మిఖైలో పోడోల్యక్ వ్యాఖ్యానించాడు.
చిత్రం ఏమిటంటే వైట్ హౌస్ ప్రతినిధి, అమెరికా విదేశీ శాఖ ప్రతినిధి రష్యా దాడికి తేదీలు ప్రకటిస్తుంటే అమెరికా డిఫెన్స్ మినిస్ట్రీ ప్రతినిధి మాత్రం అలా తేదీలు ప్రకటించడం తెలివైన పని కాదని చెబుతున్నాడు.
“నిర్దిష్ట తేదీ అని నేను చెప్పను. అలా తేదీ చెప్పడం తెలివైన్ పని కాదు. అయితే పుతిన్ ఎలాంటి హెచ్చరిక లేకుండా దాడి నిర్ణయం తీసుకునే అవకాశం మాత్రం పుష్కలంగా ఉంది” అని రక్షణ శాఖ ప్రతినిధి జాన్ కిర్బీ చెప్పాడు.
మరో పక్క అమెరికా తన దౌత్య కార్యాలయాలు, సిబ్బందిని రాజధాని కీవ్ నుండి పశ్చిమాన ఉన్న లివ్ (Lviv) పట్టణానికి తరలిస్తున్నారు. “రష్యా బలగాల మోహరింపు పెరుగుతూ పోతున్నందున ఇలా చేయాల్సి వస్తోంది” అని అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ (విదేశీ మంత్రి) ఆంటోని బ్లింకెన్ చెప్పాడు.
ఉక్రెయిన్ పొరుగున ఉన్న బెలారస్ నుండి కూడా ఖాళీ చేయాలని బ్లింకెన్ సోమవారం బెలారస్ లో ఉన్న అమెరికా పౌరుల్ని కోరాడు. బెలారస్ ఉక్రెయిన్ వివాదంలో రష్యాకు మద్దతుగా నిలబడింది. అది రష్యా మిత్ర దేశం. బెలారస్ కి తూర్పున రష్యా, దక్షిణాన ఉక్రెయిన్ ఉన్నాయి.
ఉక్రెయిన్ సరిహద్దులో లక్ష మేర అమెరికా సైన్యం ఉన్నదని అమెరికా కొన్ని రోజుల క్రితం ప్రకటించింది. ఆ తర్వాత సంఖ్యను లక్ష పదివేలకు పెంచింది. అనంతరం 1,20,000 సైన్యం ఉక్రెయిన్ బోర్డర్ లో ఉన్నదని చెప్పారు. ఇప్పుడేమో ఇప్పుడేమో 1,30,000 రష్యా సైన్యం ఉక్రెయిన్ సరిహద్దులో మోహరించారని అమెరికా చెబుతోంది.