మిన్స్క్ ఒప్పందాన్ని ఖాతరు చేయని ఉక్రెయిన్ -3


In February 2015, the Minsk II agreements were signed by Belarus’ Alexander Lukashenko, Russia’s Vladimir Putin, Germany’s Angela Merkel, France’s Francois Hollande and Ukraine’s Petro Poroshenko.

ఫిబ్రవరి 13 తేదికల్లా మరొవార్త. అమెరికా, రష్యా అధ్యక్షులు గంట పాటు ఫోన్ లో మాట్లాడుకున్నారని ఆ వార్త సారాంశం. బైడెన్ మళ్ళీ అదే పాట. “ఉక్రెయిన్ పై రష్యా దాడి చేస్తే అమెరికా మరిన్ని అధునాతన ఆయుధాలు ఉక్రెయిన్ కి సరఫరా చేస్తుంది” అని. “రష్యా దాడి చేస్తే పశ్చిమ రాజ్యాలు నిర్ణయాత్మకంగా స్పందిస్తాయి” అనీను. పుతిన్ సమాధానం “రష్యా ఆందోళనలను పరిగణించడంలో అమెరికా విఫలం అవుతోంది” అని. “నాటో విస్తరణ పైనా, ఉక్రెయిన్ లో అఫెన్సిఫ్ బలగాలు మోహరించడం విషయంలోనూ అమెరికా/నాటో నుండి ఎలాంటి సమగ్ర సమాధానం మాకింకా అందలేదు” అని. మరో వార్త పసిఫిక్ సముద్రంలో రష్యాకు చెందిన కుర్లీ ద్వీపాలను సమీపిస్తున్న అమెరికా సబ్ మెరైన్ ను రష్యా నౌకా సేనలు వెంట తరిమాయని మరో వార్త కూడా వెలువడింది. దానితో వాతావరణం మళ్ళీ వేడెక్కింది. ఉక్రెయిన్ ప్రభుత్వం రెచ్చగొట్టే చర్యలు తీసుకోవచ్చన్న అనుమానంతో రష్యా, ఉక్రెయిన్ నుండి దౌత్య సిబ్బందిని వెనక్కి పిలిపించుకుంది. అమెరికా, రష్యాల చర్చల్లోకి వెళ్ళే ముందు నాటో దుందుడుకు వైఖరి గురించి చూడాల్సి ఉంది.

నాటో విస్తరణ – రష్యా భద్రత

రష్యా డిమాండ్లలో ముఖ్యమైనది నాటో యుద్ధ కూటమిని తూర్పు వైపుగా విస్తరించడం నిలిపివేయడం. 1991లో సోవియట్ రష్యా విచ్ఛిన్నమై వివిధ దేశాలుగా విడిపోతున్న దశలో యెల్టిసిన్-గోర్బచేవ్ లు అమెరికా నుండి ఒక హామీ తీసుకున్నాయి. దాని ప్రకారం నాటో యుద్ధ కూటమిని తూర్పు వైపు లేదా రష్యా వైపు విస్తరించకూడదు. అయితే అమెరికా ఆ హామీకి కట్టుబడలేదు. తూర్పు ఐరోపా రాజ్యాలను ఒక్కటోక్కటిగా నాటో లో చేర్చుకోవడం ప్రారంభించింది. 1990లో విలీనం అయిన తూర్పు, పశ్చిమ జర్మనీలతో మొదలుకుని  మార్చి 2020లో ఉత్తర మాసిడోనియాను నాటో సభ్య దేశంగా చేర్చుకోవడం వరకు నాటో విస్తరణ కొనసాగుతూ పోయింది.

జర్మనీల విలీనానికి, జర్మనీ నాటో చేరికకు రష్యా ఆమోదం తెలిపినప్పటికి తూర్పు జర్మనీలో అమెరికా సైన్యాలు, అణ్వాయుధాలు ఉంచకూడదన్న షరతు విధించింది. 1997లో మాడ్రిడ్ లో సదస్సు జరిపిన నాటో, వైస్ గ్రాడ్ గ్రూపుగా పేరు పొందిన పోలండ్, హంగేరీ, చెకోస్లొవేకియా లను సభ్య దేశాలుగా ఆహ్వానించింది. 1999 లో వాషింగ్టన్ సదస్సుతో హంగేరీ, పోలండ్, చెక్ రిపబ్లిక్ లు అధికారికంగా నాటోలో చేరాయి. ఆ సభలోనే బల్గేరియా, ఎస్టొనియా, లాట్వియా, లిధుయేనియా, రొమేనియా, స్లొవేకియా, స్లొవేనియా (వీటిని విల్నియస్ గ్రూప్ అని పిలిచారు) లు నాటో లో చేరేందుకు వీలుగా యాక్షన్ ప్లాన్ రూపొందించారు. మే 2000 లో క్రొయేషియా ఈ గ్రూపుతో జత కలిసింది. 2002 నాటి ఫ్రాగ్ సదస్సులో వీటిని ఆహ్వానించి 2004లో జరిగిన ఇస్తాంబుల్ సదస్సులో సభ్యులుగా చేర్చుకున్నారు.

ఈ విస్తరణకు రష్యా తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఇస్తాంబుల్ సదస్సులో మొదటిసారి పాత సోవియట్ యూనియన్ సభ్య దేశాలైన లాట్వియా, లిధుయేనియా, ఎస్టోనియాలు నాటోలో చేరడంతో రష్యా ప్రమాదం సమీపిస్తోందని పసిగట్టింది. ఒకప్పటి సోవియట్ ఉపగ్రహ రాజ్యాలైన తూర్పు యూరప్ దేశాలు నాటో చేరుతున్నప్పటికీ అప్పటి అధ్యక్షుడు యెల్టిసిన్ పూర్తిగా పశ్చిమ రాజ్యాలకు అమ్ముడుపోవడం వలన రష్యా నుండి గొణుగుడే తప్ప గట్టి అభ్యంతరం వ్యక్తం కాలేదు. పుతిన్ అధ్యక్షరికంలో స్వతంత్ర విధానాన్ని అవలంబించడం ప్రారంభించిన రష్యా నాటో విస్తరణ ప్రమాదం గుర్తించి గట్టిగా అభ్యంతరం చెప్పడం మొదలు పెట్టింది. రష్యా అభ్యంతరాలను అమెరికా లెక్క చేయలేదు. 2009లో స్ట్రాస్ బర్గ్ సదస్సులో అల్బేనియా, క్రొయేషియాలను నాటో సభ్య దేశాలుగా చేర్చుకున్నారు. అనంతరం 2017లో మాంటినీగ్రో, 2020లో ఉత్తర మాసిడోనియా లు నాటో లో చేరిపోయాయి.

నాటో విస్తరణ సాఫీగా జరగలేదు. వివిధ దేశాల చేరిక సందర్భంలో నాటో సభ్య దేశాలతో పాటు, అమెరికా చట్ట సభల్లో కూడా అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. రష్యా నుండి దాడి జరిగే ప్రమాదం లేనందున నాటో విస్తరణ అవసరం లేదని ఖర్చుతో కూడిన పని అనీ పలువురు సెనేటర్లు, కాంగ్రెస్ సభ్యులు వాదించారు. ఐరోపా దేశాల మధ్య తగాదాలను బట్టి ఒక్కో దేశం చేరికను ప్రత్యర్ధి దేశం వ్యతిరేకించడం చేశాయి. ఈ అభ్యంతరాలన్నీ అమెరికా వ్యూహాత్మక లక్ష్యం ముందు తేలిపోయాయి. ఐరోపా అంతా తన ప్రభావంలో ఉంచుకోవడం అమెరికా లక్ష్యం. నాటో ఆవల ఉంటే ప్రత్యర్ధి శిబిరం ఆకర్షించవచ్చని అమెరికా భయం. అది కాక ఐరోపా దేశాలు స్వతంత్రంగా వ్యవహరించడం అమెరికాకు సుతారాము ఇష్టం లేదు. యూరోపియన్ యూనియన్ పేరుతో రాజకీయంగాను, నాటో పేరుతో సైనికంగాను ఐరోపా మొత్తం తన కనుసన్నల్లో ఉంచుకోవడం అవసరంగా అమెరికా భావించింది.

మరోవైపు నాటో విస్తరణ తన భద్రతకు ప్రమాదం అని గుర్తించిన రష్యా సందర్భం వచ్చినప్పుడల్లా అమెరికా ఇచ్చిన హామీ ని గుర్తు చేస్తూ వచ్చింది. అమెరికా, ఈ‌యూ అధికార్లు ఏయే సందర్భాల్లో ఏయే హామీలు ఇచ్చారో బలంగా వాదిస్తూండేది. నాటో విస్తరణతో పాటు అమెరికా సైనిక స్ధావరాలను కూడా తూర్పు యూరప్ రాజ్యాలలో అమెరికా ఏర్పాటు చేసుకుంది. చెక్ రిపబ్లిక్, పోలండ్ లలో మిసైల్ డిఫెన్స్ వ్యవస్ధలను నలకొల్పింది. నాటోతో పోల్చితే రష్యా వద్ద సాంప్రదాయ అణ్వస్త్ర సామర్ధ్యం తక్కువ. దీనికి పరిహారంగా రష్యా ఫస్ట్-స్ట్రైక్ విధానాన్ని అది రూపొందించుకుంది. దాని ప్రకారం అమెరికా, నాటోలు సాంప్రదాయ లేదా అణు దాడి చేసినట్లయితే ఫస్ట్-స్ట్రైక్ కెపాసిటీ ద్వారా ఆ దాడిని రష్యా తిప్పి కొడుతుంది. ఈ తరహా రష్యా రక్షణ సామర్ధ్యాన్ని బలహీనపరిచేందుకే తూర్పు యూరప్ లో మిసైల్ డిఫెన్స్ వ్యవస్ధ ఏర్పరించిందని రష్యా ఆరోపిస్తోంది. మరో విడత యాంటీ మిసైల్ డిఫెన్స్ వ్యవస్ధ ను నెలకొల్పినట్లు 2018లో అమెరికా ప్రకటించడంతో రష్యా ఆరోపణలు, భయాలు ఆధార రహితం కాదని స్పష్టం అయింది. మధ్య తూర్పు ఐరోపాలను మిసైల్ డిఫెన్స్ వ్యవస్థలతో నింపేందుకు అమెరికా పెద్ద కార్యక్రమం రూపొందించిందని రష్యా ఎప్పటి నుండో చేస్తున్న ఆరోపణకు 2018 నాటి చర్య బలం చేకూర్చింది. నాటో విస్తరణ, మిసైల్ డిఫెన్స్ వ్యవస్ధల వల్ల వ్యూహాత్మక ఆయుధ, రక్షణ సమతుల్యత అమెరికా వైపు మొగ్గిందన్నది రష్యా ఆరోపణ. రక్షణ సమతుల్యత నెలకొనడం ఇరు పక్షాల భద్రతకు, శాంతికి అవసరం అన్నది అన్ని పక్షాలు అంగీకరించే సార్వత్రిక సూత్రం. ఈ సూత్రానికి ఎవరు మంగళం పాడినా అది ఖండనార్హమే.

2019 ఆగస్టులో అమెరికా ఏకపక్షంగా ఐ‌ఎన్‌ఎఫ్ ఒప్పందం నుండి తప్పుకుంది. ఐ‌ఎన్‌ఎఫ్ (ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ ట్రీటీ) 1987లో కుదిరింది. దీని కింద అమెరికా, రష్యాలు సంయుక్తంగా 2,692  సాంప్రదాయక మరియు అణు భూ ఉపరితల బాలిస్టిక్ మరియు క్రూయిజ్ మిసైళ్లను నిర్మూలించాయి. 500 నుండి 5,500 కి.మీ దూరం వరకు లక్ష్యాలను ఇవి ఛేదించగలవు. అయితే రష్యా ఐ‌ఎన్‌ఎఫ్ ట్రీటీని ఉల్లంఘించి పరీక్షలు జరుపుతోందని అమెరికా ఆరోపిస్తూ వచ్చింది. ఆరోపణలను తిరస్కరించిన రష్యా సాక్ష్యాలు చూపాలని డిమాండ్ చేసింది. అమెరికాను చర్చలకు ఆహ్వానించింది. కానీ ట్రంప్ హయాంలో చర్చలు ఏమీ లేకుండా ‘రష్యాదే పూర్తి బాధ్యత’ అని ఆరోపిస్తూ ఐ‌ఎన్‌ఎఫ్ ఒప్పందం నుండి అమెరికా తప్పుకుంది. తప్పుకోవడమే కాక త్వరలో మిసైళ్ళు అభివృద్ధి చేసి ఐరోపాలో నెలకొల్పుతామని అప్పటి డిఫెన్స్ సెక్రటరీ ప్రకటించాడు.ఆ మేరకు బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. అణ్వాయుధ నిర్మూలనకు దోహదం చేసే  న్యూ START ఒప్పందం గడువు ఫిబ్రవరి 2021లో ముగియడంతో ఇక అమెరికా ఇతర అణ్వస్త్ర దేశాలకు కట్టడి అనేది లేకుండా పోయింది. ప్రపంచంలో మరిన్ని అణ్వాయుధాలు పోగు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఐ‌ఎన్‌ఎఫ్ ఒప్పందం అమెరికా రద్దు చేసి తూర్పు ఐరోపాలో మరిన్ని మిసైళ్ళు ఏర్పాటు చేయడంతో రష్యా ఆరోపణలు వాస్తవరూపం దాల్చాయి. రష్యాను ప్రధాన శత్రువుగా ట్రంప్ ప్రభుత్వం ప్రకటించడం అనుమానాలు లేకుండా చేసింది.

రష్యా, అమెరికా చర్చలు

ఈ పరిస్ధితుల్లో ఉక్రెయిన్ సంక్షోభం నేపధ్యంలో డిసెంబర్ మొదటి వారంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వీడియో లింక్ ద్వారా ముఖాముఖీ చర్చలు జరిపారు. ఈ చర్చలు సంక్షోభం పరిష్కారానికి దారి తీస్తాయని పలు దేశాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. సంక్షోభం పరిష్కారం అంటే ఇక్కడ అమెరికా తన ప్రచారాన్ని ఆపడమే. రష్యా త్వరలో ఉక్రెయిన్ పై దాడి చేస్తుందని రెండు నెలల నుండి ఒకటే పనిగా ఊదరగొట్టడం, దానిని అన్నీ దేశాల్లో పత్రికలు ప్రచురించడం, అవి చదివి జనం నిజమేనని నమ్మడం… ఇదే సంక్షోభం. సంక్షోభం ఏదన్నా ఉంటే అది 2014లో ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని నయానాజీ గ్రూపుల సాయంతో అమెరికా కూల్చడంతో మొదలయింది. టెర్రరిస్టు గ్రూపుల మద్దతుతో ఏర్పడిన ప్రభుత్వాన్ని తాము గుర్తించబోమని డాన్ బాస్ రిపబ్లిక్ లు ప్రకటించి సాయుధ ఘర్షణకు దిగడంతో సంక్షోభం చేయి దాటి పోయింది. దీనికి పరిష్కారం ఘర్షణ పడుతున్న ఉక్రెయిన్, తూర్పు ఉక్రెయిన్ (డాన్ బాస్ ఏరియా) లు మిన్స్క్ ఒప్పందాలు అమలు చేయడం.

2018 జూన్ లో జెనీవాలో రష్యా-అమెరికాల శిఖరాగ్ర సభ జరిగాక ఇరు దేశాధ్యక్షులు 2021 డిసెంబర్ లోనే ముఖాముఖీ చర్చలు జరిపారు. ప్రపంచ జనం ఏ క్షణంలోనైనా ఉక్రెయిన్ పై రష్యా దాడి చెయ్యొచ్చని నమ్ముతున్న నేపధ్యంలో ఈ చర్చలు జరిగాయి.

బైడెన్ అనుకున్నట్లుగానే ఉక్రెయిన్ పై రష్యా మిలట్రీ చర్య తీసుకుంటే అమెరికా, మిత్ర దేశాలు నిర్ణయాత్మకంగా స్పదించాయని హెచ్చరించాడు. ఉక్రెయిన్ చుట్టుపక్కల మోహరించిన సైన్యాలను ఉపసంహరించి దౌత్య మార్గంలోకి రష్యా రావాలని డిమాండ్ చేశాడు. బదులుగా పుతిన్ దౌత్య కార్యాలయాలపై విధించిన నిబంధనలను ఉపసంహరిస్తానని ఆఫర్ ఇచ్చాడు. రష్యా-అమెరికాల మధ్య సహకారం హామీ ఇచ్చిన మేరకు లేదని ఎత్తి చూపాడు. ఉక్రెయిన్ కేంద్రంగా పరిస్ధితి క్షీణించడానికి కారణాన్ని అనవసరంగా రష్యాపై మోపడం మానుకోవాలని హితవు పలికాడు. ఉక్రెయిన్ కి వ్యతిరేకంగా చర్యలు తీసుకునే ఆ దేశానికి మిలట్రీ సహాయం పెంచుతానని బైడెన్ బదులిచ్చాడు. రష్యా అధ్యక్షుడు అమెరికా నుండి తాను కోరిన అంశాలలో చట్టబద్ధమైన గ్యారంటీలు కావాలని డిమాండ్ చేశాడు. ఒకటి: నాటో తూర్పు విస్తరణ నిలిపివేయాలి. రెండు: రష్యా పొరుగు దేశాలలో దాడికి ఉద్దేశించిన ఆయుధ వ్యవస్ధలను (అఫెన్సివ్ స్ట్రైక్ సిస్టమ్స్) వెంటనే తొలగించాలి. ఈ రెండు అంశాలపై చట్టబద్ధ లిఖితపూర్వక గ్యారంటీ ఇవ్వాలని పుతిన్ డిమాండ్ చేశాడు. కానీ ఈ అంశాలపై బైడెన్ ఏ ఒక్క హామీ ఇవ్వలేదు. ఉక్రెయిన్ ని నాటోలో చేర్చుకోవడం లేదని గాని, ఆయుధ వ్యవస్ధలు తొలగిస్తామని గాని మాట పూర్వక హామీ కూడా ఇవ్వలేదు. అమెరికా ఉద్దేశం ఏమిటో ఇంతకంటే స్పష్టత అనవసరం.

రష్యా డిమాండ్ కూడా స్పష్టమే. అమెరికా సృష్టించిన కృత్రిమ సంక్షోభాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవడానికి రష్యా సిద్ధపడిందని పుతిన్ డిమాండ్లు స్పష్టం చేస్తున్నాయి. నాటోలో ఉక్రెయిన్ చేరిక, ఉక్రెయిన్ భూభాగం అమెరికా సైనిక స్ధావరాలకు, మిసైళ్ళకు కేంద్రంగా మారడం… ఇవి తమకు ఉల్లంఘించడానికి వీలు లేని రెడ్ లైన్స్ అని పుతిన్ స్పష్టం చేశాడు. అమెరికాకు ఇష్టం ఉన్నా లేకున్నా, ఉక్రెయిన్ దేశం రష్యా ప్రభావ ప్రాంతం. ఆ దేశంలో రష్యన్లు పెద్ద మొత్తంలో ఉన్నారు. రష్యన్ సంస్కృతి విస్తరించి ఉన్నది. మిన్స్క్ ఒప్పందానికి ఉక్రెయిన్ కట్టుబడి ఉండాలని రష్యా గట్టిగా కోరుతోంది. అది మాత్రమే ఉక్రెయిన్ లో పూర్వ స్ధితి రావడానికి దోహదం చేస్తుంది. కనుక సంక్షోభం మూలకారణం 2015 మిన్స్క్ ఒప్పందానికి ఉక్రెయిన్ కట్టుబడకపోవడం. రాజ్యాంగ సవరణ ద్వారా డాన్ బాస్ ఏరియాకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించటం, సార్వత్రిక క్షమాభిక్ష ప్రకటించటం, డాన్ బాస్ రిపబ్లిక్ లతో చర్చలు ప్రారంభిస్తే సంక్షోభం సమసిపోవడానికి అట్టే సమయం పట్టదు. కానీ ఒప్పందం జరిగినప్పటి నుండి దానిని అమలు చేసేందుకు ఉక్రెయిన్ ఒక్క చర్యా తీసుకోలేదు. డాన్ బాస్ పై యుద్ధానికే శక్తులు ఒడ్డింది. డాన్ బాస్ ఉక్రెయిన్ లో అంతర్భాగంగా గుర్తించేందుకు రష్యాకు అభ్యంతరం లేదు. ఉక్రెయిన్ లో ప్రభుత్వం మార్చడానికి తనకు ఎలాంటి ఆసక్తి లేదని రష్యా పదే చెప్పినా అమెరికా విననట్లు నటిస్తోంది.

చిత్రంగా మిన్స్క్ ఒప్పందం గురించి అమెరికా కూడా మాట్లాడదు. ఎందుకంటే ఉక్రెయిన్ సంక్షోభం పరిష్కారంలో అమెరికాకు ఆసక్తి లేదు. దాని ఆసక్తి రష్యా ఇంధనం ఐరోపాకు చేరకూడదు. ఏదో విధంగా ఉద్రిక్తత రెచ్చగొట్టాలి. రష్యా, ఉక్రెయిన్ పై దాడి చెయ్యాలి. ఆ వంకతో నార్డ్ స్ట్రీమ్ 2 ఆమోదించకుండా జర్మనీపై ఒత్తిడి తేవాలి. అమెరికా గ్యాస్ ఐరోపాకు అమ్ముకోవాలి. అంతిమగా ఐరోపా అమెరికా ఆధిపత్యం నీడలో కొనసాగాలి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ప్రబోధిస్తున్నట్లుగా నాటోకు అతీతంగా స్వంత సైన్యాన్ని ఈ‌యూ ఏర్పాటు చేసుకోకూడదు. ఇందుకు అనువుగా మరింత ఉద్రిక్తతలు ఎగదోస్తోన్నది. మరిన్ని సైన్యాలు తూర్పు యూరప్ కు తరలిస్తోంది. రెండు రోజుల క్రితం మరో 3,000 మండి సైన్యాలు పోలండ్ తరలిస్తున్నట్లు ప్రకటిస్తోంది. అడపా దడపా విమాన వాహక యుద్ధ నౌకలను నల్ల సముద్రం లో తిప్పుతోంది. బాంబర్ విమానాలను కూడా పంపింది. ఎగదోసుడు యజ్ఞంలో గుంట నక్క బ్రిటన్ తన వంతు కృషి చేస్తోంది. యుద్ధ నౌకలు, సబ్ మెరైన్ లను నల్ల సముద్రంలోకి పంపింది. “మా ప్రతిపాదనలను పరిగణించటానికి నాటో నిరాకరిస్తోంది. ఉద్రిక్తతలు సడలించే చర్యలకు నిరాకరిస్తోంది. దానికి బదులు మిలట్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని రష్యా సరిహద్దులకు తరలిస్తోంది. మిలట్రీ ఘర్షణకు దారి తీసేలా ప్రవర్తిస్తున్నది” అని రష్యా విదేశీ మంత్రి సెర్గి లావరోవ్ ఆందోళన వ్యక్తం చేయడం బట్టి పరిస్ధితి అర్ధం చేసుకోవచ్చు.

రష్యా దాడి అన్నది బూటకం. ఉక్రెయిన్ పై దాడిలో రష్యా ప్రయోజనాలు లేనేలేవు. “ఉక్రెయిన్ పై రష్యా దాడి చేస్తుంది అని చెప్పడానికి మా వద్ద ఎటువంటి గూఢచార సమాచారం లేదు” అని సి‌ఐ‌ఏ అధిపతి విలియం బర్న్స్ ‘ద హిల్’ పత్రికతో మాట్లాడుతూ అంగీకరించాడు కూడా. రష్యా అడుగుతున్న గ్యారంటీలు అమెరికా ఇవ్వబోదన్న సంగతి రష్యాకు కూడా తెలిసి ఉండవచ్చు. సంక్షోభం పేరుతో మరిన్ని సేనలను రష్యా సరిహద్దులోని తూర్పు యూరప్ దేశాలకు తరలించడం పధకం ప్రకారం జరుగుతున్న పరిణామం. ఇక్కడ “ఉక్రెయిన్ సంక్షోభం వలన అమెరికా బలగాల తరలింపు” అని కాదు చదవాల్సింది. “అమెరికా బలగాల తరలింపు కోసమే ఉక్రెయిన్ సంక్షోభం” అని చదువుకోవాలి. కొడిగడుతున్న ప్రాభవాన్ని నిలబెట్టుకునేందుకు అమెరికా చేస్తున్న చివరి ప్రయత్నాలివి. ముందు చెప్పుకున్నట్లు రష్యా-ఐరోపాల మధ్య గ్యాస్ బంధం బలపడితే నాటో అవసరం తగ్గిపోతుంది. నాటో అవసరం తగ్గిపోతే అమెరికా మాట ఐరోపాలో చెల్లుబాటు కాదు. అమెరికా చివరి రక్షణ దుర్గం ఐరోపా చేజారుతోంది. దీనిని నివారించేందుకు బలహీన, పేద, దాస్య ఉక్రెయిన్ ఒక సాధనంగా అమెరికాకు లభించింది. చివరకు ఉక్రెయిన్ పాలకులు కూడా నిజంగానే రష్యా దాడి చేస్తుందేమోనన్న భయంతో “అబ్బే అంత సంక్షోభం ఏమీ లేదు” అని ప్రకటించే స్ధాయికి ప్రచారాన్ని అమెరికా తీసుకెళ్లింది.

అమెరికా ఎత్తులు పారకుండా చేయడం ఇప్పుడు అందరి కంటే ఎక్కువగా ఐరోపా చేతుల్లో ఉన్న పని. ముఖ్యంగా జర్మనీ, ఫ్రాన్స్ లు అందుకు కృషి చేయాలి. ఫ్రాన్స్ అధ్యక్షుడు మేకరాన్ వరుసగా మాస్కో, బెర్లిన్ లు సందర్శించి చర్చలు జరపడం ద్వారా, బైడెన్ తో ఫోన్ చర్చలు చేయడం ద్వారా కొంత కృషి చేస్తున్నాడు. (ఇది కూడా అమెరికాకు నచ్చడం లేదు.) జర్మనీ కొత్త ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్ త్వరలో పుతిన్ తో చర్చలు జరపనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చర్చలపై పెద్దగా ఆశలు లేనప్పటికీ చర్చల కోసం అనేకమంది ఎదురు చూస్తున్నారు. జర్మనీ ఉద్రిక్తతలకు వ్యతిరేకంగా నార్డ్ స్ట్రీమ్ 2 అనుమతిస్తూ గట్టి నిర్ణయం ప్రకటిస్తే అమెరికా అవకాశాలు సన్నగిల్లుతాయి. రష్యన్ గ్యాస్ లేకుండా ఐరోపా మనజాలదు. ఆక్స్ ఫర్డ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎనర్జీ స్టడీస్ ప్రకారం 2021లో ఐరోపా (ఈ‌యూ + బ్రిటన్) గ్యాస్ అవసరాల్లో 35% రష్యాయే తీర్చింది. ఇందులో 31% పైప్ లైన్ ద్వారా సరఫరా అయింది. మిగిలిన 4% ఎల్‌ఎన్‌జి సరఫరా. కాబట్టి జర్మనీ నిర్ణయాత్కంగా వ్యవహరించాలి. అమెరికా పెత్తనం అంతరించి ప్రపంచం సాపేక్షికంగానైనా కాస్త ఊపిరి పీల్చుకోవాలంటే బహుళ ధృవ ప్రపంచం నిలదొక్కుకోవాలి. 

(……….. అయిపోయింది)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s