
Nord Stream 2
పైప్ లైన్ రాజకీయాలు
ఐరోపాకు గ్యాస్ సరఫరా చేసేందుకు రష్యా బాల్టిక్ సముద్రం గుండా పైపు లైన్ ను రష్యా నిర్మించింది. ఈ పైపు లైన్ నిర్మాణ దశలోనే అమెరికా అనేక ఆటంకాలు కల్పించినప్పటికి నిర్మాణాన్ని రష్యా విజయవంతంగా పూర్తి చేసింది. ఈ పైపు లైన్ పేరు నార్డ్ స్ట్రీమ్ – 2. నార్డ్ స్ట్రీమ్ 1 పైప్ లైన్ ను 2011లోనే రష్యా పూర్తి చేసింది. ఇది కూడా బాల్టిక్ సముద్రం గుండా రష్యా నుండి నేరుగా జర్మనీకి గ్యాస్ సరఫరా చేస్తుంది. నార్డ్ స్ట్రీమ్ 1 కింద రెండు పైప్ లైన్ లను రష్యా నిర్మించింది. ఒకటి 2011లో మరొకటి 2012లో పూర్తి చేసి వాటి ద్వారా గ్యాస్ కూడా సరఫరా చేస్తోంది. ఉక్రెయిన్, పోలండ్ ల మీదుగా నిర్మించిన పైప్ లైన్ ద్వారా కూడా రష్యా ఐరోపాకు గ్యాస్ సరఫరా చేస్తూ వచ్చింది. ఈ పైప్ లైన్ కు భూమి ఇచ్చినందుకు ఉక్రెయిన్, పోలండ్ లకు రష్యా పెద్ద మొత్తంలో అద్దె చెల్లిస్తుంది. ఉక్రెయిన్ కు ఏడాదికి 2 బిలియన్ డాలర్ల వరకు రష్యా చెల్లిస్తుంది.
రష్యాకు వ్యతిరేకంగా అమెరికా సాగించే ఆధిపత్య ఘర్షణలో గ్యాస్ పైప్ లైన్లు ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. ఐరోపాకు రష్యా గ్యాస్ అందడం అమెరికాకు ఇష్టం లేదు. ఇందుకు రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి: నార్డ్ స్ట్రీమ్ కూడా గ్యాస్ సరఫరా మొదలు పెడితే ఇక గ్యాస్ కోసం ఐరోపా దేశాలు ముఖ్యంగా జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీలు రష్యాపై పూర్తిగా ఆధారపడతాయి. అది జరిగితే రష్యా-ఐరోపాల బంధాన్ని విడదీయడం కష్టం అవుతుంది. నాటో ఉనికి ప్రశ్నార్ధకం అవుతుంది. రెండు: అమెరికా గత కొన్నేళ్లుగా ఫ్రాకింగ్ ప్రక్రియలో గ్యాస్ ఉత్పత్తి చేస్తూ భారీ గ్యాస్ ఉత్పత్తిదారుల్లో ఒకటిగా ముందుకు వచ్చింది. తన అవసరాలకు పోను మిగులు గ్యాస్ ఉత్పత్తి చేయగలుగుతోంది. ఈ మిగులును ఐరోపాకు అమ్మాలని అమెరికా ఆలోచన. ఫ్రాకింగ్ గ్యాస్ ఖరీదు ఎక్కువ. రష్యన్ గ్యాస్ కు రెండు మూడు రెట్లు ఎక్కువ. ఐనా తన గ్యాస్ ని అంటగట్టాలని, తద్వారా ఆర్ధిక సంక్షోభాన్ని కాస్త పూడ్చుకోవాలని అమెరికా ఆశిస్తోంది. అమెరికా ఆశలకు నార్డ్ స్ట్రీమ్ 2 పెద్ద ప్రతిబంధకం అయింది.
ఉక్రెయిన్ పై దాడి చేసేలా రష్యాను రెచ్చగొడితే నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ ను ఉపయోగం లోకి రాకుండా చెయ్యొచ్చని అమెరికా పథకం రచించింది. మరోవైపు నార్డ్ స్ట్రీమ్ వల్ల పోలండ్, ఉక్రెయిన్ ల మీదుగా నడిచే పైప్ లైన్ అవసరం రష్యాకు ఉండదు. అంటే నార్డ్ స్ట్రీమ్ వల్ల పోలండ్, ఉక్రెయిన్ లు అద్దె ఆదాయాన్ని కోల్పోతాయి. దానితో ఉక్రెయిన్, పోలండ్ లు కూడా అమెరికా కుట్రలకు మద్దతు పలుకుతున్నాయి. గత జనవరి 27 తేదీన అమెరికా ఉప మంత్రి (రాజకీయ వ్యవహారాల అండర్ సెక్రటరీ) విక్టోరియా నూలంద్ పత్రికలతో మాట్లాడుతూ “ఏదో ఒక విధంగా రష్యా ఉక్రెయిన్ పై దాడి చేస్తే… ఈ పైప్ లైన్ పని ముందుకు సాగకుండా జర్మనీని ఒప్పించవచ్చు” అని అదాటున వ్యాఖ్యానించడం ఈ సందర్భంగా గమనించవచ్చు.
1960లలోనే ఐరోపా రష్యా గ్యాస్ దిగుమతి చేసుకోవడం ప్రారంభించింది. అప్పటి నుండే రష్యా ఇంధనం ఎప్పటికైనా తన నాయకత్వానికి, ఐరోపా ఎనర్జీ భద్రతకు ప్రమాదం అని అమెరికా గ్రహించింది. ఫ్రాకింగ్ టెక్నాలజీతో అతి పెద్ద గ్యాస్ ఉత్పత్తిదారుల్లో ఒకటి అవడం, గ్యాస్ ని ఐరోపాకు సరఫరా చేయాలని భావించడంతో రష్యన్ గ్యాస్ అమెరికాకు మరింత ప్రమాదంగా కనిపిస్తోంది. ఘౌకగా దొరికే రష్యన్ గ్యాస్ ని మార్కెట్ నుండి తప్పిస్తే తప్ప ఖరీదైన అమెరికన్ గ్యాస్ కు అతి పెద్ద ఐరోపా మార్కెట్ తన చేతికి చిక్కదు. జర్మనీ రెగ్యులేటర్ అనుమతి కోసం ఎదురు చూస్తున్న నార్డ్ స్ట్రీమ్ 2 ను అర్జెంటుగా నిలిపివేయాల్సిన అవసరం అమెరికాకు ఆ విధంగా ముందుకు వచ్చింది. నిర్మాణ దశ నుండే ఆటంకాలు కల్పించడం మొదలు పెట్టింది.
నార్డ్ స్ట్రీమ్ 2 పైప్ లైన్ నిర్మాణం 2018లో మొదలయింది. నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ వేస్తున్న స్విట్జర్లాండ్ నౌక పైన ఆంక్షలు విధిస్తూ చట్టం చేసింది. దానితో నిర్మాణం నుండి స్విస్ కంపెనీ పక్కకు తప్పుకుంది. ఆంక్షలను పట్టించుకోకుండా రష్యాకు చెందిన రెండు నౌకలు నిర్మాణం పూర్తి చేశాయి. ఇందులో జర్మనీ కాంట్రాక్టర్లు కూడా పాల్గొన్నారు. ఆంక్షలతో వారిని కూడా అమెరికా బెదిరించింది. కానీ జర్మనీ కంపెనీలు గట్టిగా నిలబడ్డాయి. 2021లో పైప్ లైన్ నిర్మాణం పూర్తవుతుండగా జర్మనీ ఛాన్సలర్ వైట్ హౌస్ లో అమెరికా అధ్యక్షుడితో సమావేశమై నార్డ్ స్ట్రీమ్ 2 కు ఆటంకాలు కల్పించవద్దని గట్టిగా కోరింది. జర్మనితో ఒప్పందం చేసుకోవడం ద్వారా అమెరికా దిగి వచ్చింది. ఒప్పందం ప్రకారం ఉక్రెయిన్ కి నష్టపరిహారం ఇవ్వాలి; ఉక్రెయిన్ లో ప్రత్యామ్న్యాయ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించాలి; ఉక్రెయిన్ తో గ్యాస్ సరఫరా కాంట్రాక్టు పొడిగించేలా రష్యాను ఒప్పించాలి; తన గ్యాస్ ని ఉక్రెయిన్ పై రాజకీయ ఒత్తిడికి ఉపయోగిస్తే రష్యాపై ఆంక్షలకు జర్మనీ మద్దతు ఇవ్వాలి. ఈ ఒప్పందం అమెరికా విజయంగా పశ్చిమ పత్రికలు కీర్తించాయి.

Gas pipelines through Ukraine
నార్డ్ స్ట్రీమ్ 2 జాయింట్ వెంచర్ గా మొదలయింది. (51% రష్యా కంపెనీ గాజ్ ప్రోమ్ నియంత్రిస్తే 49% వాటా రాయల్ డచ్ షెల్ కంపెనీ, ఆస్ట్రియా, ఫ్రెంచ్, జర్మన్ కంపెనీలు సంయుక్తంగా నియంత్రించే విధంగా) అమెరికా ఇంకో గేమ్ మొదలు పెట్టింది. ఈయూ లో గుత్తస్వామ్యం నియంత్రణ పోలండ్ ప్రభుత్వం చేతిలో ఉంది. ఆ సంస్ధ జాయింట్ వెంచర్ లో తన వాటా వదులుకోవాలని ఐరోపా దేశాలపై ఒత్తిడి తెచ్చింది. జర్మనీ, ఆస్ట్రియా, ఫ్రాన్స్, హాలండ్ కంపెనీలు తమ ఫైనాన్స్ పెట్టుబడిని కొనసాగిస్తూనే నార్డ్ స్ట్రీమ్ 2 లో షేర్లు వదులుకున్నాయి. ఫలితంగా రష్యన్ కంపెనీ గాజ్ ప్రోమ్ ఒకే ఒక్క ఓనర్ అయింది. గాజ్ ప్రోమ్ గ్యాస్ ఉత్పత్తిదారు కూడా. అది తన గ్యాస్ నే పైప్ లైన్ ద్వారా ఐరోపాకు సరఫరా చేయాలి. కానీ యూరోపియన్ యూనియన్ 2009లో విధించిన నిబంధన ప్రకారం పైప్ లైన్ నిర్వహించే వాళ్ళే అందులో సరఫరా అయ్యే గ్యాస్ కు సొంతదారు కాకూడదు. మార్కెట్ పోటీని ప్రోత్సహించడం ఈ నిబంధన లక్ష్యం.
నార్డ్ స్ట్రీమ్ 2 నిర్మాణం మొదలయ్యాక ఈ నిబంధనను విదేశీ కంపెనీలకు గూడా వర్తింపజేశారు. మే 2019 లోపు పూర్తయిన పైప్ లైన్ లను నిబంధన నుండి మినహాయించారు. కానీ అమెరికా పెట్టిన ఆటంకాల వల్ల నిర్మాణం ఆలస్యం అయి గడువు దాటిపోయింది. ఇది వివక్ష అని ఆరోపిస్తూ గాజ్ ప్రోమ్ కంపెనీ ఆగస్టు 2021లో జర్మనీ కోర్టులో అప్పీలు చేసింది. అప్పీలును కొట్టివేయడంతో జర్మనీ సుప్రీం కోర్టుకు గాజ్ ప్రోమ్ అప్పీలు చేసుకుంది. సుప్రీం కోర్టు కూడా అప్పీలును నిరాకరిస్తే గాజ్ ప్రోమ్ కంపెనీ పైప్ లైన్ ఆపరేషన్ లో కనీసం సగం అయినా మరో కంపెనీకి అప్పగించవలసి ఉంటుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ విషయంలో పెద్దగా ఆందోళన చెందడం లేదని ఆయన ప్రకటనల ద్వారా తెలుస్తోంది. పైప్ లైన్ లో సగం వరకు ఫైనాన్స్ చేసిన ఐరోపా దేశాల కంపెనీలు ఈ సమస్య పరిష్కరించుకుంటాయని పుతిన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
గ్యాస్, పరస్పర ప్రయోజనకారి
జర్మనీ పార్శ్రామికవేత్తలు రష్యన్ గ్యాస్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. జర్మనీలో గ్యాస్ నిల్వలు ఫిబ్రవరి 20 వరకే వస్తాయని ఒక అంచనా. ప్రస్తుతానికి స్పాట్ అమ్మకాలపై వాళ్ళు ఆధారపడుతున్నారు. 2020లో గాజ్ ప్రోమ్ గ్యాస్ ధరలో సగం ఉన్న స్పాట్ అమ్మకాల ధర 2021లో 7 రెట్లు పెరగడంతో జర్మనీ పారిశ్రామికవేత్తలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా అనంతర వృద్ధిలో భాగంగా ఆసియా, ఐరోపాల నుండి డిమాండ్ పెరగడం, మధ్య యూరప్ మేఘాలతో నిండి గాలి ప్రవాహం కూడా తగ్గడం వల్ల గాలి, సౌర విద్యుత్ ఉత్పత్తి పడిపోవడం వల్ల గ్యాస్ డిమాండ్ పెరిగిపోయింది.
రష్యా ఒక పెట్రో రాజ్యం. అతి పెద్ద సహజవాయువు సరఫరాదారు. సౌదీ అరేబియా తర్వాత అతి పెద్ద చమురు సరఫరాదారు కూడా. కాబట్టి పైప్ లైన్లు, సముద్ర మార్గాలు దాని ఆర్ధిక వ్యవస్ధకు కీలకం. రష్యా తన గ్యాస్ అమ్ముకోవాలి. ఐరోపా దేశాలకు కూడా రష్యా గ్యాస్ కావాలి. కాబట్టి నార్డ్ స్ట్రీమ్ 2 పైప్ లైన్ వాణిజ్యపరంగా అత్యుత్తమమైనది. దీనికి రవాణా ఛార్జీలు ఉండవు కనుక ధర తగ్గుతుంది. దూరం కూడా ఉక్రెయిన్, పోలండ్ ల మీదుగా వెళ్ళే పైప్ లైన్ కంటే బాగా తక్కువ. ట్రాన్సిట్ ఫీజు పోతుందన్న దుగ్ధతో పోలండ్, ఉక్రెయిన్ దాన్ని వ్యతిరేకిస్తున్నాయి గాని మిగతా ఈయూ దేశాలకు నార్డ్ స్ట్రీమ్ 2 అవసరం.
ఈ పరిస్ధితి అమెరికాకు ససేమిరా మింగుడు పడడం లేదు. చైనా ఆర్ధిక శక్తి ఇప్పటికే ఐరోపా దేశాలకు ఆకర్షణీయంగా మారింది. మరోపక్క ఎనర్జీ/ఇంధనం కోసం ఐరోపా రష్యా పైన ఆధారపడితే అమెరికా పెత్తనానికి అవకాశం బాగా తగ్గిపోతుంది. ఇప్పటికే వివిధ యూరోపియన్ రాజ్యాలు అమెరికా విధిస్తున్న షరతులు, ఆటంకాల పట్ల విసిగిపోయి ఉన్నాయి. ఐరోపా తన రక్షణ కోసం అమెరికాపై ఆధారపడడం మానుకుని సొంత సైన్యాలు అభివృద్ధి చేసుకోవాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్ సూచించాడు. నార్డ్ స్ట్రీమ్ విషయంలో అమెరికా మాటని జర్మనీ లెక్క చేయడం లేదు. గ్యాస్, జర్మనీ చేరాక జర్మనీ నుండి అది మధ్య యూరప్, తూర్పు యూరప్ రాజ్యాలకు కూడా సరఫరా అవుతుంది. కనుక దాదాపు ఐరోపాలో మెజారిటీ రాజ్యాలు నార్డ్ స్ట్రీమ్ 2 వల్ల లబ్ది పొందనున్నాయి.
ఈ నేపధ్యం లోనే ఉక్రెయిన్ కేంద్రంగా తాజా సంక్షోభాన్ని అమెరికా తన ప్రకటనలతో కృత్రిమంగా సృష్టించింది. అందుకు రష్యా, ఉక్రెయిన్ సరిహద్దుల్లో సైన్యాన్ని తరలించడాన్ని సాకుగా చూపుతోంది. ఉక్రెయిన్ పై రష్యా దాడి చేయనుందంటు అమెరికా నేతలు, అధికారులు ఎవరో ఒకరు ప్రకటన చేయకుండా ఒక్క రోజు కూడా గడవడం లేదు. కొన్ని రోజులు ఇక రష్యా దాడి చేయడమే తరువాయి అన్నట్లు ప్రకటనలు గుప్పించారు. ఆ తర్వాత కొన్ని రోజులు ఫేక్ వీడియో కధ ప్రచారం చేశారు. దీని ప్రకారం “ఉక్రెయిన్ రష్యాపై గానీ తూర్పు ఉక్రెయిన్ పైన గానీ మిలట్రీ దాడి చేసినట్లు ఒక ఫేక్ వీడియోని రష్యా తయారు చేస్తుంది, దానిని సాకుగా చూపిస్తూ రష్యా ఉక్రెయిన్ పై పెద్ద ఎత్తున దాడి చేస్తుంది.” రష్యా నుండి సేకరించిన గూఢచార సమాచారం బట్టి తాము ఈ అంచనాకు వచ్చామని అమెరికా ప్రకటించింది. అయితే ఇప్పటి వరకు ఇలాంటిది ఏమి జరగలేదు. రష్యా పధకాన్ని తాము బైటపెట్టాం కాబట్టి ఆ ప్రయత్నాలు జరగలేదని అమెరికా చెప్పుకుంటోంది.
తాజాగా ఫిబ్రవరి 12 తేదీన కూడా అమెరికా ప్రకటన విడుదల చేసింది. ఉక్రెయిన్ పై దాడికి రష్యా అంతా సిద్ధం చేసుకుందని నమ్మబలికాడు. బ్రిటన్ కూడా దీనికి మద్దతు తెలిపింది. అమెరికా ప్రకటన నిజమే అని బ్రిటన్ ప్రకటించింది. అమెరికా జాతీయ భద్రత సలహాదారు జెక్ సల్లివాన్ ఉక్రెయిన్ లో ఉన్న అమెరికన్లు వెంటనే ఉక్రెయిన్ ఖాళీ చేయాలని సలహా ఇచ్చాడు. రష్యా దాడి చేస్తే వారిని ఖాళీ చేయించడానికి అమెరికా సైన్యం వస్తుందని భావించవద్దు అని ఆయన హెచ్చరించాడు. బ్రిటన్ కూడా తన పౌరులకు అదే సలహా ఇచ్చింది. కొన్ని రోజుల క్రితం ఉక్రెయిన్ నుండి కొన్ని దేశాలు తమ రాయబార సిబ్బందిని వెనక్కి పిలిపించుకున్నాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇజ్రాయెల్, నెదర్లాండ్స్, లాట్వియా, నార్వే, బ్రిటన్ తదితర దేశాలు ఇలా ముఖ్యమైన రాయబార సిబ్బంది తప్ప మిగిలినవారిని వెనక్కి రప్పించుకున్నాయి.
(———————- తరువాత 3వ భాగంలో)