
Ukraine and the Donbas
కొన్ని నెలలుగా ఉక్రెయిన్ కేంద్రంగా అమెరికా రకరకాల యుద్ధ ప్రకటనలు చేస్తున్నది. రష్యా త్వరలో ఉక్రెయిన్ పైన దాడి చేయబోతున్నట్లు గానూ, రష్యా దురాక్రమణ దాడి నుండి ఉక్రెయిన్ ను రక్షించడానికి తన నేతృత్వం లోని నాటో యుద్ధ కూటమి సిద్ధంగా ఉన్నట్లుగానూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటనలు గుప్పిస్తున్నాడు. ఆయనతో పాటు ఇతర అమెరికా అధికారులు కూడా అనుబంధ ప్రకటనలు గుప్పిస్తూ రష్యాను ఒక రాక్షస దేశంగా, ఉక్రెయిన్ ఆ రాక్షసిని చూసి గజ గజా వణికిపోతున్న పిల్ల దేశంగానూ, సదరు పిల్ల దేశాన్ని అమెరికా అనే ఒక అరివీర హీరో కాపాడబోతున్నట్లుగానూ తమ ప్రకటనల ద్వారా ప్రపంచానికి చెప్పే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు.
ఈ తరహా వార్తలను పశ్చిమ కార్పొరేట్ పత్రికలు ఒక పనిగా ప్రచురిస్తూ ప్రచారం చేస్తుండగా భారత దేశంలోని ఆంగ్ల పత్రికల నుండి ప్రాంతీయ భాషల పత్రికల వరకు వాటిని తాము కూడా శక్తి మేరకు ప్రచారం చేసి పెడుతున్నాయి. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హింది తదితర భాషల పత్రికల్లో ఉక్రెయిన్ పై రష్యా దాడి చేయబోతున్నదంటూ పతాక శీర్షికలు ప్రచురిస్తూ భారత ప్రజల్లో కూడా ఒక రకమైన జ్వరాన్ని రాజేస్తున్నాయి. ప్రపంచ పటంలో ఉక్రెయిన్ ఎక్కడ ఉన్నదో తెలియని వాళ్ళు సైతం ఆ దేశంపై రష్యా దాడి చేయనుండడం పట్ల ఆందోళన ప్రకటిస్తున్నారు. చర్చోపచర్చలు చేస్తున్నారు.
ఇరాక్, ఆఫ్ఘన్ లపై అమెరికా అమానుషంగా దాడి చేసినప్పుడు దాడి చేసిన అమెరికాని వదిలి ఇరాక్, ఆఫ్ఘనిస్థాన్ లను వీరు తిట్టిపోశారు. ఇప్పుడేమో అసలు దాడి చేస్తుందో లేదో తెలుసుకునే ప్రయత్నాలు చేయకుండా రష్యాను తిట్టి పోస్తున్నారు. “దాడి చేసే ఉద్దేశ్యమే మాకు లేదు” అని రష్యా అధ్యక్షుడు పుతిన్ మొత్తుకుంటున్నా పట్టించుకునే పరిస్థితిలో లేరు. పశ్చిమ పత్రికలు మసాలా దట్టించి వండి పెడుతున్న వార్తలే జనానికి రుచిస్తున్నాయి. ఇచ్చిన మాట ప్రకారం నాటో యుద్ధ కూటమిని తూర్పు దిశలో విస్తరించడం ఆపండి అని పుతిన్ డిమాండ్ చేస్తుంటే దానితో సంబంధం లేకుండా ‘మీరు ఉక్రెయిన్ పై దాడి చేస్తే చూస్తూ ఊరుకోము” అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటిస్తున్నాడు.
రష్యా నిజంగా ఉక్రెయిన్ పై దాడి చేయదలుచుకుంటే ఇన్ని నెలల పాటు పత్రికల్లో ఉదరగొట్టుకునే అవకాశం పశ్చిమ పత్రికలకు ఉండదు. దాడి చేస్తే తమ ప్రయోజనాలకు రక్షణ అని రష్యా తలపోస్తే ఆ దేశానికి ఉన్న ఆయుధ శక్తి ముందు ఉక్రెయిన్ సరికదా నాటోకు అక్కడ అందుబాటులో ఉన్న ఆయుధ శక్తి కూడా సరిపోదు. కొంతమంది విశ్లేషకుల ప్రకారం కొన్ని గంటల్లో లేదా మహా అయితే ఒకటి రెండు రోజుల్లో దాడిని ముగిసిపోతుంది. 2008లో జార్జియా సైన్యాలు సౌత్ ఒస్సేటియా, అబ్ఖాజియా లపై దాడి చేసినప్పుడు రష్యా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా జార్జియాపై దాడి చేసి ఆ ప్రాంతాలను విడిపించింది. నాటో సైన్యాలు అక్కడే ఉన్నా ఏమీ చేయలేకపోయాయి. కానీ ఉక్రెయిన్ పై దాడి చేస్తే ఆ తర్వాత జరిగే పరిణామాలు రష్యాకు అనుకూలంగా ఉండబోవు.
ఉక్రెయిన్ పై దాడి చేస్తే ఐరోపాలోని గ్యాస్ మార్కెట్ ను రష్యా శాశ్వతంగా పోగొట్టుకున్నట్లే. మూడేళ్లుగా అనేక ఆటంకాలు ఎదుర్కొన్ని నిర్మించిన నార్డ్ స్ట్రీమ్ – 2 గ్యాస్ పైప్ లైన్ పై పెట్టిన ఖర్చంతా వృధా అవుతుంది. జర్మనీ నేతృత్వం లోని యూరోపియన్ యూనియన్ అమెరికా ఒత్తిడిని తట్టుకుంటూ రష్యన్ గ్యాస్ దిగుమతి చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. ఉక్రెయిన్ పై దాడి చేస్తే రాయబారాలు, చర్చల ద్వారా ఈయూతో సాధించిన స్నేహ సంబంధాలు ఒక్క పెట్టున చెదిరిపోతాయి. ఈయూ తప్పనిసరిగా పూర్తిగా అమెరికా ఉక్కు కౌగిలిలోకి వెళ్లిపోయే తల తిక్క పనికి రష్యా పూనుకున్నట్లే అవుతుంది. ఇవేవీ గమనించకుండా అమెరికా చేసే తప్పుడు ప్రచారాన్ని మరో ఆలోచన లేకుండా నమ్మడం అవివేకం.
ఉక్రెయిన్ పై దాడి చేసే ఆలోచన లేనప్పుడు అమెరికా అధ్యక్షుడే స్వయంగా ‘దాడి చేస్తారంటూ’ బూటకపు ప్రకటనలు ఎలా చేస్తాడన్న ప్రశ్న సాధారణ పాఠకుల్లో రావడం సహజమే. కానీ జార్జి బుష్ సీనియర్ నుండి, జార్జి బుష్ జూనియర్, బారక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్ ల వరకు అమెరికా అధ్యక్షులుగా ఇటీవల కాలంలో పని చేసిన వారంతా గతంలో చెప్పిన అబద్ధాలు, బూటకపు ప్రకటనలు జ్ఞప్తికి తెచ్చుకునే అదేమంత ఆశ్చర్యకరం కాదని అర్ధం అవుతుంది. ప్రపంచాధిపత్యం చేజారిపోయి బహుళ ధృవ ప్రపంచం ఆవిష్కృతం అయిన నేపధ్యంలో అమెరికా మరింత నిస్పృహతో పోయిన ప్రతిష్ట తిరిగి సమకూర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. ఆ నిస్పృహలో వివిధ చర్యలకు దిగుతోంది. ప్రస్తుత ఉక్రెయిన్ పరిణామాల్ని చూసే ముందు పూర్వ రంగాన్ని ఓసారి పరిశీలించాలి.
2014 ఉక్రెయిన్ కుట్ర
ఉక్రెయిన్ సంక్షోభానికి మూల కారణం నిజానికి అమెరికాయే. కొంతవరకు ఈయూ కూడా. ఈ వ్యవహారం ఇప్పుడు కాదు, 2014 లో ఉక్రెయిన్ లో ప్రజాస్వామిక ఎన్నికల్లో నెగ్గిన విక్టర్ యనుకొవిచ్ ప్రభుత్వాన్ని కుట్రతో కూల్చినప్పుడే మొదలయింది. ఈ కూల్చివేత పూర్తిగా అమెరికా పనే.
ఏప్రిల్ 2014లో పోలండ్ కి చెందిన వామ పక్ష పత్రిక నై (Nie) ఒక ప్రత్యక్ష సాక్షి కధనాన్ని ప్రచురించింది. దాని ప్రకారం ఉక్రెయిన్ కి చెందిన నయా నాజీ గ్రూపు రైట్ సెక్టార్ మిలిటెంట్లకు పోలండ్ లో శిక్షణ ఇచ్చారు. ఉక్రెయిన్ ఆందోళనలకు రెండు నెలల ముందు ఇచ్చిన ఈ శిక్షణ పోలిష్ విదేశీ మంత్రి రాడోస్లా సికోర్స్కీ ఆహ్వానం మేరకు జరిగింది. “గుంపులను నియంత్రించడం, వ్యక్తులను గుర్తించడం, పౌర యుద్ధ ఎత్తుగడలు, కమాండ్ నైపుణ్యం, సంక్షోభ సమయాల్లో ప్రవర్తనా పద్ధతులు, పోలీసులు ప్రయోగించే గ్యాస్ లకు వ్యతిరేకంగా రక్షణ చర్యలు తీసుకోవడం, అప్పటికప్పుడు బారికేడ్లు నిర్మించుకోవడం, తుపాకి పేల్చడం, స్నైపర్ పోలీసుల షూటింగ్ నుండి రక్షణ పొందడం… ఇవన్నీ పోలండ్ శిక్షణ శిబిరంలో నేర్పించారు (ఆయిల్ అండ్ వరల్డ్ పాలిటిక్స్: ద రియల్ స్టోరీ ఆఫ్ టుడేస్ కాన్^ఫ్లిక్ట్ జోన్స్: ఇరాక్, ఆఫ్ఘనిస్థాన్, వెనిజులా, ఉక్రెయిన్…. పుస్తకం నుండి. జాన్ ఫాస్టర్ ఈ పుస్తక రచయిత.)
ఇలా శిక్షణ పొందిన నయా నాజీ గ్రూపులు ‘మైదాన్ ప్రొటెస్ట్’ పేరుతో ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో ఆందోళనలు ప్రారంభించాయి. విక్టర్ యనుకోవిచ్ ప్రభుత్వం యూరోపియన్ యూనియన్ లో ఉక్రెయిన్ ను చేర్చేందుకు నిరాకరించడానికి నిరసనగా ఈ ఆందోళనలు ప్రారంభం అయినట్లు లోకానికి చాటారు. కొద్ది రోజుల్లోనే ఈ సో-కాల్డ్ నిరసనలు హింసాత్మక రూపం ధరించాయి. డిసెంబర్ 2013లో ప్రారంభం అయిన నిరసనలు 2014లో అధ్యక్షుడు యనుకోవిచ్ రష్యా పారిపోవడం వరకు కొనసాగాయి.

Victor Yanukovich
2013-14 నాటికి ఈయూలో పలు దేశాలు ఋణ సంక్షోభంలో ఉన్నాయి. ఉక్రెయిన్ ఈయూలో చేరితే ఉక్రెయిన్ మార్కెట్ ని ఆక్రమించడంతో పాటు, అక్కడి సహజ వనరులపై అదుపు సాధించవచ్చని ఈయూ ఆశించింది. ఇది జరిగితే రష్యాకు జరిగే 16 బిలియన్ డాలర్ల ఉక్రెయిన్ ఎగుమతులు ప్రమాదంలో పడతాయి. ఉక్రెయిన్ సూపర్ ధనికవర్గాలు తీవ్రంగా నష్టపోతారు. యనుకోవిచ్ వారి ప్రతినిధి. నష్ట పరిహారంగా కేవలం 1 బిలియన్ డాలర్లు ఈయూ ఇవ్వజూపింది. దానితో ఉక్రెయిన్ ఈయూ చేరికని వాయిదా వేసింది. దీనికి రష్యాయే కారణమని ఈయూ ఆరోపించింది. కక్షతో 2014, జనవరి 28, 29 తేదీల్లో జరగవలసిన ఈయూ-రష్యా శిఖరాగ్ర సమావేశాన్ని 3 గంటలకు కుదించేసింది. అత్యంత ఘోరం ఏమిటంటే అమెరికా ఉప మంత్రి విక్టోరియా నూలంద్, సెనేటర్ మెక్ కెయిన్ లాంటి వాళ్ళు ఉక్రెయిన్ వచ్చి ఆందోళన కారులకు మద్దతుగా ప్రసంగాలు చేయడం. అప్పటి అమెరికా ఉపాధ్యక్షుడు జో-బైడెన్ అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడికి ఫోన్ చేసి ఫలానా చోట నుండి పోలీసుల్ని వెనక్కి పిలిపించండి అంటూ ఆదేశాలు ఇవ్వడానికి సైతం వెనుదీయలేదు.
వ్లాదిమిర్ పుతిన్ ఈ చర్యలకు తీవ్ర అభ్యంతరం చెబుతూ ““మా విదేశీ మంత్రి గ్రీసు లోనూ, సైప్రస్ లోనూ జరిగిన ఇ.యు-వ్యతిరేక ఆందోళనలను ఉద్దేశించి ప్రసంగించి ఉంటే మా యూరోపియన్ భాగస్వాములు ఎలా స్పందించి ఉండేవారో నేను ఊహించగలను” అని దెప్పి పొడిచినా అమెరికా పాలకులు పట్టించుకోలేదు. నయా నాజీ సంస్థలు రైట్ సెక్టార్, స్కొబోవా, యూపిఏ మొ.వి ఆందోళనలను క్రమంగా హింసాత్మకంగా మార్చేశాయి. పోలీసుల్ని కాల్చి చంపడం, భవనాలని తగలబెట్టడం, భారీ పేలుళ్ళు జరపడం… మొ.న చర్యలకు తెగబడ్డారు. కీవ్ వీధుల్లో రక్తం ఏరులై పారింది అంటే తప్పు కాబోదు. హింసాత్మక ఆందోళనకారులను అరికట్టడానికి పోలీసులకు అవసరమైన పరికరాలను ఉక్రెయిన్ కు సరఫరా కాకుండా ఈయూ అడ్డుకుంది. అమెరికా ఒత్తిడి తోనే ఈయూ ఈ ఘోరకలికి సిద్ధపడిందని ద అట్లాంటిక్ పత్రిక వెల్లడి చేసింది. ఆందోళనకారులతో చర్చలకు అధ్యక్షుడు సిద్ధపడినా వాళ్ళు ఒక్కో డిమాండ్ పెంచుకుంటూ పోయారు. చివరికి అధ్యక్షుడు దిగిపోవాలన్నారు. చివరికి ప్రతిపక్షాలు కూడా ఆందోళనలపై పట్టు కోల్పోయారు. అసలు ఆందోళనకారులను నడిపించింది సిఐఏ లాంటి అమెరికన్ గూఢచార సంస్థలు కావడమే దానికి కారణం. అమెరికన్ ఎన్‌జిఓ CANVAS అనే సంస్ధ ఆందోళనల వెనుక ప్రధాన పాత్ర పోషించింది. పరిస్ధితి అదుపు తప్పడంతో అధ్యక్షుడు మొదట తూర్పు ఉక్రెయిన్ కీ, తర్వాత రష్యాకూ వెళ్లిపోయాడు.
అనంతరం ఇ.యు, అమెరికా అనుకూల శక్తులు, నాజీ తరహా జాతీయ విద్వేష పార్టీలు ప్రభుత్వ కార్యాలయాలను, పార్లమెంటును స్వాధీనం చేసుకున్నాయి. ప్రజాస్వామ్య ఎన్నికల ద్వారా అధికారం చేపట్టిన అధ్యక్షుడిని తప్పించి సొంత తాత్కాలిక అధ్యక్షుడిని నియమించుకున్నాయి. ఐరోపా దేశాల నుండి, అమెరికా నుండి వివిధ నాయకులు, మంత్రులు, అధికారులు ఉక్రెయిన్ వచ్చి సంప్రదింపులు జరుపుతూ, సలహాలు ఇస్తూ తామే ప్రభుత్వాన్ని నడపడం ప్రారంభించారు. ఫలితంగా రష్యా తన ప్రయోజనాలను కాపాడుకోవడానికి చర్యలు చేపట్టింది. అమెరికా అధ్యక్షుడు ఒబామా, బ్రిటన్ ప్రధాని కామెరాన్, జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, ఫ్రాన్స్ ప్రధాని ఫ్రాంషా ఒలాండే లు సైనిక చర్యకు దిగరాదంటూ రష్యాకు హెచ్చరికలు చేస్తుండగానే ఉక్రెయిన్ లో సైనిక జోక్యానికి రష్యా పార్లమెంటు నుండి పుతిన్ అనుమతి పొందాడు.
రష్యా సేనలు చురుకుగా కదిలి రష్యన్లు మెజారిటీ సంఖ్యలో నివసించే స్వయంప్రతిపత్తి ప్రాంతం క్రిమియాలో రక్షణ చర్యలు చేపట్టింది. నల్ల సముద్రంలో మూడువైపులా సముద్రంతో చుట్టి ఉండే క్రిమియా, ఉక్రెయిన్ లో భాగమే అయినప్పటికీ సొంత పార్లమెంటు, రక్షణ బలగాలు కలిగి ఉన్న ప్రాంతం. ఇక్కడ నివసించేవారిలో ఎక్కువమంది రష్యన్లు కాగా టాటార్ ముస్లింలు మైనారిటీలుగా ఉన్నారు. ఉక్రెయిన్ జాతీయుల (ethnic Ukrainians) సంఖ్య చాలా తక్కువ. ఆ మాటకు వస్తే మొత్తం ఉక్రెయిన్ లో కూడా Ethnic Russian లనూ, Ethnic Ukrainian లను విడదీసి చూడడం కష్టం. చివరికి రష్యా భాష, ఉక్రెయిన్ భాష కూడా దాదాపు ఒకే విధంగా ఉంటాయి. క్రిమియాలో రష్యాకు సైనిక స్ధావరం ఉన్నది. అక్కడ మొదట ఫ్లెబిసైట్ నిర్వహించారు. 90 శాతం పైగా రష్యాలో కలవడానికి ఆమోదం తెలిపారు. అనంతరం క్రిమియా రష్యా అంతర్గత భాగంగా రష్యా ప్రకటించింది. క్రిమియా చేరిన రష్యన్ సైన్యం ప్రభుత్వ భవనాలను స్వాధీనం చేసుకుంది. ఉక్రెయిన్ కొత్త ప్రభుత్వం క్రిమియాపైకి సైన్యాన్ని పంపగా వాళ్ళు రష్యా సైన్యంతో కలిసిపోయాయి. నల్ల సముద్రంలో ఉన్న ఉక్రెయిన్ నౌకల్లో అనేకం రష్యాకు విధేయత ప్రకటించాయి. ఆ విధంగా ఒకప్పుడు రష్యాలో భాగంగా ఉన్న క్రిమియా మళ్ళీ రష్యాలో కలిసిపోయింది. (1954లో కృశ్చెవ్ క్రిమియను ఉక్రెయిన్ కు అప్పగించాడు.) క్రిమియాను కలుపుకోవడం ద్వారా నల్ల సముద్రం గుండా అమెరికా, నాటో సేనల నుండి రానున్న భద్రతా ప్రమాదాన్ని పుతిన్ నివారించుకున్నాడు.
తూర్పు ఉక్రెయిన్ లోనూ మెజారిటీ రష్యన్లే. ముఖ్యంగా డొనెట్స్క్, లుహాన్స్క్ రిపబ్లిక్కులు రష్యా సాయంతో పారిశ్రామికంగా అభివృద్ధి చెందాయి. ఈ రెండింటినీ కలిపి డాన్బాస్ ప్రాంతం (Donbas Area) అంటారు. ఈ రిప్బలిక్కులు కూడా ఫ్లెబిసైట్ నిర్వహించి తమనూ రష్యాలో కలుపుకోవాలని అభ్యర్ధించాయి. కానీ అందుకు పుతిన్ అంగీకరించలేదు. అయితే తూర్పు ఉక్రెయిన్ లో రష్యన్ల ప్రయోజనాలు కాపాడ్డం తమ హక్కు అని ప్రకటించాడు. ఈ లోపు డోనెట్స్క్, లుహాన్స్క్ లు స్వతంత్రం ప్రకటించుకున్నాయి. అమెరికా, ఈయూ లు నిలబెట్టిన కొత్త ప్రభుత్వం పాలన అంగీకరించడం లేదని తెగేసి చెప్పాయి. ఈ రెండు రిపబ్లిక్కులను విలీనం చేసుకునేందుకు నిరాకరించినప్పటికీ అమెరికా, ఈయూలతో జరిగిన సంప్రదింపుల్లో తూర్పు ఉక్రెయిన్ ను స్వయం పాలిత ప్రాంతంగా ప్రకటించాలని కోరాడు. ఓ పక్క అమెరికా, ఈయూ, రష్యా నేతలు ప్రకటనలు చేస్తుండగానే ఉక్రెయిన్ సైన్యాలు డాన్బాస్ ప్రాంతంపై దాడికి దిగాయి. తూర్పు రిపబ్లిక్కులు ప్రతిఘటనకు దిగాయి. వారికి మద్దతుగా రష్యన్ ప్రైవేటు మిలట్రీ కంపెనీలు తమ బలగాల్ని దింపాయి. ఉక్రెయిన్ తరపున అమెరికా, ఈయూ మిలట్రీ కాంట్రాక్టర్లు దిగారు. అప్పటి నుండి నేటివరకు ఘర్షణ సాగుతూనే ఉన్నది. ఆరంభంలో కొన్ని నెలలపాటు తీవ్ర స్థాయిలో జరిగిన యుద్ధం అనంతరం మంద్ర స్థాయిలో (low intensity warfare) కొనసాగుతోంది.
ఉక్రెయిన్, తూర్పు ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం విరమింపజేసేందుకు రష్యా చర్చలను ప్రతిపాదించింది. బెలారస్ రాజధాని మిన్స్క్ లో సెప్టెంబరు 2014 లో మొదటిసారి చర్చలు జరిగాయి. ఇందులో ఉక్రెయిన్, రష్యన్ ఫెడరేషన్, ఓఎస్‌సిఈ (ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ అండ్ కోఆపరేషన్ ఇన్ యూరప్ – ఐరోపా భద్రతా మరియు సహకార సంస్థ).. ఈ మూడు పక్షాలు చర్చల్లో పాల్గొన్నాయి. ఇందులో 12 సూత్రాల కాల్పుల విరమణ ఒప్పందానికి (5 సెప్టెంబర్ 2014 తేదీన) వచ్చాయి. ఇది మిన్స్క్ I ఒప్పందంగా ప్రాచుర్యం లోకి వచ్చింది. అప్పటికి ఇరు వైపులా 2,600 మంది వరకు చనిపోయారు. ఒప్పందం అయితే కుదిరింది గాని దానిని ఉక్రెయిన్ పాటించలేదు. ఒప్పందం ఉల్లంఘించారని పరస్పరం ఆరోపించుకున్నారు. ఇరు పక్షాల మధ్య యుద్ధం కొనసాగింది. కందకాలు తవ్వుకుని మరీ యుద్ధం కొనసాగించాయి.
ఫిబ్రవరి 2015లో మరోసారి అదే మిన్స్క్ లో చర్చలు జరిగాయి. చర్చల్లో రష్యా, ఉక్రెయిన్, డాన్బాస్, ఓఎస్‌సిఈ ప్రతినిధులు పాల్గొన్నారు. ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, ఉక్రెయిన్ ల నేతలు కూడా అక్కడే సమావేశమై ఒప్పందానికి మద్దతు ప్రకటించారు. ఈసారి 13 సూత్రాల ఒప్పందం (12 ఫిబ్రవరి 2015 తేదీన) కుదిరింది. మిన్స్క్ I ఒప్పందం అంశాలే దాదాపు మిన్స్క్ II లోనూ కొనసాగాయి. ఇందులో ప్రధాన అంశాలు: ఉక్రెయిన్ రాజ్యాంగాన్ని సవరించి డాన్బాస్ రిపబ్లిక్కులకు స్వయం ప్రతిపత్తి ఇవ్వడం, అధికార వికేంద్రీకరణ, ఇరు పక్షాల సేనల ఉపసంహరణ, అంతర్జాతీయ సేనల (ఎవరైనా ఉంటే) ఉపసంహరణ, భారీ యుద్ధ పరికరాల ఉపసంహరణ, యుద్ధంలో పాల్గూన్నవారికి సార్వత్రిక క్షమాభిక్ష, ఖైదీలు శరణార్ధుల మార్పిడి. మిన్స్క్ II ఒప్పందం కూడా యుద్ధాన్ని నివారించలేదు. అయితే భవిష్యత్తులో ఏ ఒప్పందం జరిగినా మిన్స్క్ ఒప్పందం పునాదిగా ఉండాలని ఒక అంగీకారానికి వచ్చారు. మిన్స్క్ ఒప్పందాలను మిన్స్క్ ప్రోటోకాల్ అని కూడా పిలుస్తున్నారు.
ఒప్పందాన్ని రష్యా ఉల్లంఘించిందని అమెరికా, ఉక్రెయిన్ లు ఆరోపిస్తాయి. కానీ మిన్స్క్ ఒప్పందంలో రష్యా ప్రస్తావనే లేదు. కాబట్టి ఒప్పందాన్ని తాను ఉల్లంఘించే పరిస్థితి ఉత్పన్నం కాదని రష్యా వాదన. అది నిజం కూడా.
…………….. తరువాత రెండో భాగంలో)