ఆఫ్ఘన్ పై పట్టు: రేసులో అమెరికా ముందంజ (ఇప్పటికి!)


Afghan poor in despair waiting for help

తన భౌగోళిక రాజకీయ ప్రయోజనాల కోసం ఎలాంటి అడ్డదారి తొక్కడానికైనా అమెరికా ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. రొయ్యలు ఒంటికి మంచిది కాదని ఊరంతా నీతులు చెప్పి రొయ్యల బుట్ట తానే మాయం చేసేసి లొట్టలు వేస్తూ భుజిస్తుంది. ఈ సంగతి మరోసారి రుజువు చేసుకుంది అమెరికా. ఎవరికీ చెప్పా పెట్టకుండా, కనీసం సంకేతాలు కూడా ఇవ్వకుండా తాలిబాన్ కు నిధులు అందించే మార్గాన్ని అమెరికా తెరిచి పట్టుకుంది. తద్వారా ఆఫ్ఘనిస్తాన్ దేశం ఆర్ధిక మూలాలు తన చేతుల్లో ఉంచుకునేందుకు మార్గం సుగమం చేసుకుంది.

అమెరికా సేనలు ఆఫ్ఘన్ నేల నుండి పలాయనం చిత్తగించిన దరిమిలా ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ఏలుబడిలోకి వచ్చాక ఆ దేశం అత్యంత తీవ్రమైన ఆర్ధిక, సామాజిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ప్రపంచ దేశాల నుండి సహాయం అందుకోవాలంటే అక్కడి తాలిబాన్ ప్రభుత్వం ప్రతీకార చర్యలు మానుకోవాలని, స్త్రీవిద్యకు సహకరించాలని, మహిళా హక్కులను గ్యారంటీ చేయాలని, ఐసిస్, ఆల్ ఖైదా లాంటి టెర్రరిస్టు సంస్థలకు దేశంలో చోటు కల్పించరాదని… ఇత్యాది షరతులను వివిధ దేశాలు విధించాయి. ముఖ్యంగా అమెరికా ఈ షరతులను పదే పదే వల్లిస్తూ వచ్చింది. ఈ షరతులు అమలు చేయకుండా తమ ట్రెజరీలో ఉన్న ఆఫ్ఘన్ నిధులను విడుదల చేసేది లేదని ఆ దేశం తెగేసి చెప్పింది. లేదా తెగేసి చెప్పినట్లు లోకానికి చూపింది.

షరతులకు దాదాపు అన్ని దేశాలు తరతమ స్థాయిలో మద్దతు పలికాయి. ఆఫ్ఘన్ పొరుగునే ఉన్న చైనా, రష్యా లాంటి ప్రధాన దేశాలు కూడా షరతులకు ఆమోదం పలికాయి. ఆఫ్ఘన్ లో ఐసిస్, ఆల్-ఖైదా టెర్రరిస్టుల వల్ల చైనా లోని ముస్లిం మెజారిటీ రాష్ట్రం షిన్^జంగ్ (Xinjiang) లో ముస్లిం ఉగ్రవాద సమస్య తీవ్రం అయ్యే ప్రమాదం ఉందని చైనా భయపడుతున్నట్లుగా పశ్చిమ పత్రికలు అదే పనిగా చెబుతుంటాయి. అయితే ఆఫ్ఘనిస్తాన్, చైనాలను కలిపే వాఖన్ కారిడార్ చాలా ఇరుకైనది. వాఖన్ కారిడార్ తో చైనాకున్న సరిహద్దు కేవలం 90 కిలో మీటర్లు మాత్రమే. ఈ మాత్రం సరిహద్దును మూసివేయడం లేదా కాపలా కాయడం చైనాకు పెద్ద పని కాదు. కానీ వాఖన్ కారిడార్ కు పైనా, కిందా ఉన్న మధ్య ఆసియా దేశాల ద్వారా ఆఫ్ఘనిస్తాన్ నుండి ఐసిస్, ఆల్-ఖైదా టెర్రరిజం వీగర్హ్ లు నివసించే షిన్^జంగ్ రాష్ట్రంలో ప్రవేశించే అవకాశం ఉందని చైనా భావిస్తోంది.

రష్యా మిత్ర దేశాలు త\జకిస్థాన్, తుర్క్^మెనిస్థాన్, ఉజ్బెకిస్థాన్ కూడా ఆఫ్ఘనిస్థాన్ పొరుగునే ఉన్నాయి. ఈ దేశాల్లో ఐసిస్ టెర్రరిజం ప్రవేశించే ప్రమాదం నిజంగానే పొంచి ఉంది. ఐసిస్, ఆల్-ఖైదా లాంటి టెర్రరిస్టు సంస్థలు అమెరికా సామ్రాజ్యవాద ప్రయోజనాల తరపున ప్రాక్సీ యుద్ధాలు నడిపే ప్రైవేటు ముఠాలన్న సంగతి గుర్తు చేసుకుంటే తజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్, తుర్క్^మెనిస్థాన్ లాంటి మధ్య ఆసియా దేశాల ద్వారా  చైనా, రష్యాలను ఉగ్రవాద ముప్పు తాకే ప్రమాదం ఉన్నమాట నిజం. కనుక ఆఫ్ఘనిస్థాన్ పై విధించిన షరతులు అమలు చేయడం చైనా, రష్యాలకు కూడా అవసరం.

హక్కానీపై ఆంక్షల సడలింపు

ఈ పరిస్ధితుల్లో అమెరికా ట్రెజరీ డిపార్టుమెంట్ ఆఫ్ఘనిస్థాన్ పై విధించిన షరతులను అమెరికా ప్రయోజనాలకు తగిన విధంగా సర్దుబాటు చేయడానికి పూనుకుంది. షరతులను కొన్ని భాషా ప్రయోగాల ద్వారా బలహీనపరిచి నీరు గార్చడం ద్వారా తాలిబాన్ ప్రభుత్వానికి నిధులు అందజేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఇలా షరతులను బలహీనపరిచేందుకు అమెరికా పెద్దగా ఇబ్బంది పడలేదు. తాలిబాన్ ప్రభుత్వంలో ప్రధాన భాగస్వామ్యం వహిస్తున్న హక్కాని నెట్ వర్క్ కు వ్యతిరేకంగా విధించిన ఆర్ధిక షరతుల చివర “తరచుగా అడిగే ప్రశ్నలు – కొత్తగా చేర్చినవి”  (Frequently Asked Questions – Newly Added) పేరుతో కొత్త పాఠ్యాన్ని (text) చేర్చడం ద్వారా  పని కానిచ్చేసింది.

ఎఫ్‌ఏ‌క్యూలలో ఈ చేర్పు ద్వారా కొన్ని వివరణలను అమెరికా ట్రెజరీ కొత్తగా ఇచ్చింది. తద్వారా ఆఫ్ఘనిస్థాన్ కు అందజేసే మానవతా సాయం పైన గత సెప్టెంబరు మరియు డిసెంబరు నెలల్లో ప్రకటించిన ఆంక్షలలో సడలింపు ఇచ్చింది. ఈ సడలింపు మేరకు “ప్రైవేటు యాజమాన్యంలోని లేదా ప్రభుత్వ యాజమాన్యం లోని ఆఫ్ఘన్ డిపాజిటరీ సంస్థలకు (బ్యాంకులు, ఫండ్ లు మొ.వి) మానవతా సాయానికి సంబంధించిన నిధులను బదిలీ చెయ్యొచ్చు, సెటిల్ చేయొచ్చు మరియు అనుమతించవచ్చు.”

ఇక్కడ గమనించవలసిన ముఖ్య విషయం ఏమిటంటే ఆంక్షల సడలింపు హక్కానీ నెట్ వర్క్ కి కూడా వర్తిస్తుంది అని అమెరికా ట్రెజరీ ప్రత్యేకంగా చెప్పడం! దీని ప్రకారం విదేశీ సంస్థలు ఇక ఎలాంటి ఆటంకం లేకుండా తాలిబాన్ తో గానీ, హక్కాని నెట్ వర్క్ తో గానీ సహాయ ఒప్పందాలు చేసుకోవచ్చు; సాధారణ సహాయం అందించవచ్చు; సహాయ పంపిణీలో తాలిబాన్, హక్కానీ నెట్ వర్క్ లతో సమన్వయం చేసుకోవచ్చు; వారితో కలిసి కార్యాలయాలు నెలకొల్పవచ్చు. ఇవన్నీ ఇప్పటివరకు నిషిద్ధం కావడంతో ఐరాస తప్ప మరే ఇతర ప్రైవేటు, ప్రభుత్వ సంస్ధలు ఆఫ్ఘన్ ప్రజలకు సహాయం అందించలేకపోయారు. ఐరాస సహాయ పంపిణీ కూడా అక్కడి ప్రభుత్వం ద్వారా కాకుండా ఐరాస సిబ్బంది ద్వారానే చేయాల్సి వచ్చేది. దానితో ప్రజలకు ఆ కొద్ది సహాయం అందడం కూడా చాలా గగనంగా ఉండేది. ముఖ్యంగా రాజధాని నుండి దూరంగా ఉన్న ప్రాంతాలు ఆకలికి మల మల మాడిపోయారు. సరుకులు లేక అల్లాడిపోయారు.

Sirajuddin Haqqani -Eurasia Review

ఆఫ్ఘన్ యుద్ధం కొనసాగినంత కాలం హక్కానీ నెట్ వర్క్ ని అమెరికా తీవ్రంగా ద్వేషించింది. ఆఫ్ఘనిస్థాన్ లో అమెరికా సేనలను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది హక్కానీ సేనలే. పాక్ భూభాగంలోని నార్త్ వజీరిస్థాన్ లో స్థావరాలు ఏర్పరచుకుని గెరిల్లా దాడుల ద్వారా ఆఫ్ఘన్ లో అమెరికా సేనలపై దాడులు చేసి తీవ్ర ప్రాణ నష్టం కలిగించాయి. కేవలం హక్కానీ నెట్ వర్క్ ను నిర్మూలించేందుకే అమెరికా తీవ్రంగా శ్రమించి విఫలం అయింది. హక్కాని నెట్ వర్క్ పాకిస్తాన్ సైన్యం నియంత్రణలో ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్, సోవియట్ ఆక్రమణలో ఉన్నప్పుడు సి‌ఐ‌ఏ, ఐ‌ఎస్‌ఐలు జలాలుద్దీన్ హక్కాని నేతృత్వం లోని ఈ గ్రూపును పెంచి పోషించాయి. అమెరికా ఆక్రమించాక అమెరికా, నాటో సేనలపై హక్కాని గ్రూపు యుద్ధానికి దిగింది. ఇప్పుడు అదే హక్కాని నెట్ వర్క్ అమెరికాకు మిత్రపక్షం కాబోతోంది.

(హక్కాని నెట్ వర్క్, ఇండియాకు వ్యతిరేకంగా పని చేసే లష్కర్-ఏ-తొయిబా, జైష్-ఏ-మహమ్మద్ గ్రూపులతో స్నేహ సంబంధాలు కలిగి ఉంది. FATF (Financial Action Task Force) కు చెందిన ‘గ్రే లిస్ట్’ నుండి తన పేరు తొలగింపజేసుకునేందుకు హక్కాని నెట్ వర్క్ పైన పాకిస్తాన్ నిషేధం విధించింది. అయితే, తాలిబాన్ ప్రభుత్వంలో హక్కాని నెట్ వర్క్ కు ప్రముఖ బాధ్యతలు అప్పగించేలా ఐ‌ఎస్‌ఐ అధిపతి స్వయంగా ఆఫ్ఘనిస్థాన్ వెళ్ళి బేరసారాలు జరిపిన నేపధ్యంలో హక్కానీ గ్రూపుతో పాకిస్థాన్ సంబంధాలు కొనసాగుతున్నాయని స్పష్టం అయింది. గ్రే లిస్ట్ లో ఉన్న దేశాలకు అంతర్జాతీయ రుణాలు, సహాయం అందడం కష్టం. LeT, JeM లపై చర్యలు తీసుకోనందున FATF గ్రే లిస్టు లో పాక్ పేరు కొనసాగుతోంది.)

చొరబాటు తధ్యం

ఈ దెబ్బతో తాలిబాన్ నేతృత్వంలోని ఆఫ్ఘన్ ప్రభుత్వం ఆర్ధిక విధానాల్లో అమెరికాకు, పాక్షికంగానైనా సరే, అదుపు లభిస్తుంది. అమెరికా ప్రతిపాదనలకు ప్రభుత్వ ఆర్ధిక విధానాల్లో, నిర్ణయాల్లో చోటు ఇస్తేనే ఆఫ్ఘనిస్థాన్ కు రావలసిన నిధులు విడతల వారీగా విడుదల అవుతాయి మరి! ఒక్క ఆర్ధిక విధానాలే కాదు. కోశాగార నిర్వహణ (fiscal management), చైనాకు చెందిన బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ లో భాగంగా నిర్మించతలపెట్టిన TAPI (తుర్క్^మెనిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్-పాకిస్థాన్-ఇండియా) గ్యాస్ పైప్ లైను నిర్మాణం మొదలైన పశ్చిమేతర దేశాలతో సంబంధాల విషయంలో కూడా అమెరికా మాటకు ప్రాధాన్యం లభించవచ్చు.

ఈ మేరకు అప్పుడే ఆచరణలో సంకేతాలు కూడా వెలువడుతున్నాయి. ఆఫ్ఘనిస్థాన్ ఆదాయ, వ్యయాలను సమీక్షించి, వస్తున్న ఆదాయాన్ని సరైన రీతిలో ఖర్చు చేస్తున్నారో లేదో మదింపు చేయాలని అమెరికా సంస్ధలు ప్రపంచ బ్యాంకుకు సూచన చేస్తున్నాయి. ఆఫ్ఘన్ ప్రభుత్వం నుండి అవసరమైన డేటా సేకరించి ప్రభుత్వ ఆదాయ, వ్యయాలను బట్టి అభివృద్ధి సహాయం ఏ మేరకు ఆశించిన రీతిలో పంపిణీ అవుతుందో మదింపు వేయాలని ఒక సంస్థ (USIP US Institute for Peace) అమెరికా ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ సిఫారసు, సూచనల అర్ధం స్పష్టమే. అమెరికా చెప్పినట్లు చేస్తేనే సిఫారసులు అనుకూలంగా చేస్తారు. సిఫారసు అనుకూలంగా చేస్తేనే సహాయం (అది నిజంగా రావలసిన సొమ్ము ఐనా సరే) అందుతుంది.

Taliban meet the U.S. & EU reps in Oslo meet -AlJajeera

అమెరికా నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తోడనే పరిణామాలు వేగంగా జరిగిపోతున్నాయి. తాలిబాన్, అమెరికా ప్రతినిధులు జనవరి 23-25 తేదీల్లో ఓస్లో నగరంలో సమావేశాలు జరిపారు. సమావేశాల్లో బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, ఈ‌యూ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. అమెరికా ట్రెజరీల్లోని ఆఫ్ఘన్ సొమ్ము విడుదల, ఇతర సహాయం తదితర అంశాలపై చర్చలు జరిపారు. ఈ సమావేశాలు ముగిసిన వెంటనే జనవరి 26 తేదీన ఓస్లో చర్చల ఫలితాలను ఐరాస భద్రతా సమితి చర్చల్లో ఎజెండాలో చేర్చారు. ఆఫ్ఘన్ లోని ప్రస్తుత ప్రభుత్వంతో చర్చలు జరపవలసిన అగత్యం గురించి భద్రతా సమితి చర్చల్లో అమెరికా ప్రతినిధులు గట్టిగా వాదించారు కూడా (ఆసియా టైమ్స్, ఫిబ్రవరి 4, 2022). ఐరాస అధికారులు కూడా అమెరికాకు వంత పాడుతున్నారు. “ప్రస్తుత ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం కూలిపోవడం ఎవరికీ ప్రయోజనం కాదు. ఈ విషయంలో అందరికీ ఏకాభిప్రాయం ఉందని భావిస్తున్నాం. తాలిబాన్ తో చర్చలు జరిపినట్లయితే ఆఫ్ఘన్ ప్రజలకు, ఈ ప్రాంతానికి, ఇతర ప్రపంచానికి కూడా ప్రయోజనకారి అవుతుంది” అని వాళ్ళు ఎలాంటి శష భిషలు లేకుండా చెబుతున్నారు.

ఇండియా కూడా!

ఈ ప్రక్రియలో మోడి నేతృత్వంలోని భారత ప్రభుత్వం కూడా తన వంతు పాత్ర పోషించడం విశేషం. తాలిబాన్ పై విధించిన షరతుల అమలును పర్యవేక్షించడానికి ఐరాస తీర్మానం 1988 ప్రకారం ఏర్పాటు చేసిన కమిటీకి ఐరాసలో ఇండియా శాశ్వత ప్రతినిధి టి‌ఎస్ త్రిమూర్తి ఛైర్మన్ గా వ్యహరిస్తున్నాడు. హక్కానీ నెట్ వర్క్ అధినేత సిరాజుద్దీన్ హక్కాని పై విధించిన ఆంక్షల అమలును కూడా ఈ కమిటీయే పర్యవేక్షిస్తుంది. తాలిబాన్-హక్కానీ పై ఆంక్షల సడలింపు వివరాలను ఐరాస భద్రతా సమితికి (అమెరికా తరపున) వివరించింది భారత ప్రతినిధి త్రిమూర్తే కావడం పరమ విశేషం. అయితే ఇండియా తరపున ఆయన కొన్ని హెచ్చరికలు కూడా చేశాడు. తాలిబాన్ మరియు ఆల్-ఖైదాల మధ్య హక్కానీ నెట్ వర్క్ ద్వారా ఇప్పటికీ సంబంధాలు కొనసాగుతున్నాయని, ఆఫ్ఘనిస్థాన్ లో ఐసిస్ ఉనికి ప్రమాదకరకంగానే ఉన్నదని ఆయన హెచ్చరించాడు.

అయితే ఈ హెచ్చరికలు అమెరికా కాంగ్రెస్ లో కూడా ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ కి చెందిన సభ్యులు చేశారు. అమెరికా విదేశీ మంత్రి ఆంటోని బ్లింకెన్, డిఫెన్స్ మంత్రి లాయిడ్ ఆస్టిన్ లు సెనేట్ విదేశీ సంబంధాల కమిటీ, సెనేట్ సాయుధ సేవల కమిటీలకు ఫిబ్రవరి 2 తేదీన తాలిబాన్ తో ఓస్లో చర్చల వివరాలను తెలియజేశారు. ఇది రహస్యంగానే జరిగినప్పటికీ బ్రీఫింగ్ అనంతరం రిపబ్లికన్ సెనేటర్లు వ్యాఖ్యలు చేయకుండా ఆగలేదు. “ఆఫ్ఘనిస్థాన్ లో మనకు ఇంకా అనేక సవాళ్ళు ఎదురవుతున్నాయి. మన ఉనికి అక్కడ సున్నా. కనుక మరిన్ని వివరాలు ఇస్తే బాగుండేది. అక్కడ ఉగ్రవాద భయం ఎంత ఉన్నది, ఉగ్రవాద వ్యతిరేక పధకాలు అమలు చేస్తున్నారా లేదా, అమెరికాకు చెందిన వివిధ ఏజన్సీలు అక్కడ ఎలా పని చేస్తున్నాయి… ఈ వివరాలు కావాలి. యూరప్ లో రష్యా నేత పుతిన్ దూకుడు ఎదుర్కోవాలన్నా, చైనా ఆర్ధిక, సైనిక దూకుడుకు సమాధానం ఇవ్వాలన్నా మన తప్పుల నుండి పాఠాలు నేర్చుకోవాలి” అని రిపబ్లికన్ సెనేటర్ జిమ్ ఇన్-హోఫే వ్యాఖ్యానించాడు (సెనేటర్ వెబ్ సైట్, ఫిబ్రవరి 2, 2022).

కాబట్టి ఇండియా హెచ్చరికలకు ప్రాధాన్యత ఏమీ లేదు. మొదట చెప్పుకున్నట్లుగా ఆల్-ఖైదా, ఐసిస్ టెర్రరిస్టు చర్యలు అమెరికాకు వ్యూహాత్మక మిత్రులు తప్ప మరొకటి కాదు. ఒకవేళ ఆల్-ఖైదా, ఐసిస్ నేతల్లో ఎవరైనా అమెరికా మాట వినకుంటే వారి స్థావరంపై వెంటనే డ్రోన్ దాడి జరుగుతుంది. ఆ దాడి అమెరికా సాధించిన టెర్రరిస్టు నిర్మూలనలో ఓ మైలు రాయిగా పత్రికల్లో కీర్తించబడుతుంది. ఇండియా ప్రతినిధులు చివరికి అమెరికా ప్రయోజనాలకు వంత పాడటంతో తమ పాత్ర ముగించుకుంటారు.

ప్రయోజనాలే లక్ష్యం

స్థూలంగా చెప్పాలంటే తాలిబాన్, హక్కాని నెట్ వర్క్ నేతలపై విధించబడ్డ అంతర్జాతీయ ఆంక్షల ఎత్తివేతకు మార్గం వేయడం మొదలయింది. ఈ మార్గం వేయడం వేగంగా కొనసాగుతోంది. ఇంతకీ ఆంక్షల ఎత్తివేత ఎందుకు జరుగుతోంది? ఆఫ్ఘనిస్థాన్ లో స్త్రీ విద్యకు కట్టుబడి ఉన్నట్లు తాలిబాన్ ప్రకటించి ఆ మేరకు చట్టాలు చేసిందా? బాలికలకు బడుల్లో ప్రవేశం కల్పిస్తోందా? ఆల్-ఖైదా, ఐసిస్ లను దేశం నుండి తరిమి కొట్టిందా? షరియా చట్టాలను కఠినంగా అమలు చేయడం చాలించుకుని ప్రజాస్వామిక చట్టాలు చేసేందుకు అంగీకరించిందా? ప్రత్యర్ధులపై ప్రతీకారచర్యలు నిలిపివేసిందా? లేక ప్రజల నిరసనలకు అవకాశం కల్పిస్తున్నదా? ఈ ప్రశ్నలకు సమాధానం ఒక్కటే: లేదు అని. కొన్ని రాష్ట్రాలు మినహాయిస్తే మెజారిటీ రాష్ట్రాల్లో బాలికలను స్కూళ్లకు వెళ్లనివ్వడం లేదు. స్త్రీలను ఉద్యోగాలు చెయ్యనివ్వడం లేదు. ఆల్-ఖైదా, ఐసిస్ లు అక్కడే ఉన్నాయని భారత ప్రతినిధి చెప్పిన సంగతే. ప్రత్యర్ధులపై ప్రతీకార చర్యలు కొనసాగుతున్నాయని వార్తలు వెలువడుతూనే ఉన్నాయి. హక్కుల కోసం రోడ్డెక్కుతున్న కొద్ది మంది నిరసనకారులపై తాలిబాన్లు తుపాకి గురి పెడుతున్నారని, ఆడవాళ్ళను కొడుతున్నారని న్యూ యార్క్ టైమ్స్ లాంటి పత్రికలు ఇటీవల జనవరిలో కూడా వార్తలు ప్రచురించాయి. తమ అనుమతి లేకుండా నిరసన ప్రదర్శన లాంటివి చేయడం నిషేధిస్తున్నట్లు తాలిబాన్ ప్రకటించింది కూడా.

తాము విధించిన షరతులు తాలిబాన్ ఏమీ చేయకున్నప్పటికి ఆంక్షలు సడలించడానికి అమెరికా నిర్ణయించింది. దానికి కారణం ముందు చెప్పుకున్నట్లు ఆఫ్ఘనిస్తాన్ ఆర్ధిక విధానాల్లో, పాలనలో జోక్యం చేసుకునేందుకు అమెరికాకు అవకాశం లభించింది. అందుకు అనుగుణంగా తాలిబాన్ అమెరికాతో చర్చలు జరుపుతోంది. చర్చలు ముందుకు సాగే క్రమంలో ఆఫ్ఘన్ లో అమెరికా పరోక్ష చొరబాటు ఎంతవరకు ఉంటుంది అన్నది వెల్లడి అవుతుంది. అమెరికా విధించే ఆంక్షల ప్రధాన లక్ష్యం అమెరికా ఆధిపత్య ప్రయోజనాలను నెరవేర్చుకోవడమే తప్ప ఆఫ్ఘన్ ప్రజల సంక్షేమం పట్ల గాని, అక్కడి ప్రజాస్వామ్యం పట్ల గాని, లేదా అక్కడ మహిళలపై అణచివేత విషయంలో గాని అమెరికాకు ఎలాంటి మమకారం, నిబద్ధత లేవన్న విషయం స్పష్టంగా గ్రహించాలి.

ఆఫ్ఘన్ ఆర్ధిక విధానాల్లో జోక్యం చేసుకోవడంతో పాటు అమెరికా ఇంటలిజెన్స్ సంస్థల ఏజెంట్లు, కాంట్రాక్టర్లు కూడా అక్కడ అడుగు పెడతారు. టెర్రరిజం వ్యతిరేక పోరాటం పేరుతో వివిధ గూఢచార సంస్ధల సిబ్బంది ఆఫ్ఘన్ లో దిగిపోతారు. ఆల్-ఖైదా, ఐసిస్ లాంటి ముఠాలకు వ్యతిరేకంగా పని చేయడం మాట అటుంచి వాటికి దిశా నిర్దేశం చేస్తారు. వాటి ద్వారా రష్యా, చైనా వ్యతిరేక దేశాలలో ఉగ్రవాద చర్యలకు పూనుకుంటారు. అక్కడితో ఆగకుండా రష్యా, చైనాలతో స్నేహంగా ఉండే మధ్య ఆసియా దేశాల్లో అస్థిరత్వాన్ని సృష్టించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ప్రభుత్వాలను పడగొట్టేందుకు వ్యూహాలు రచిస్తారు. అలజడులకు ప్రేరేపిస్తారు. కజకిస్థాన్ లో ప్రభుత్వం కూల్చివేతకు కుట్ర జరగడం రోజుల కిందటి పరిణామమే. ఆఫ్ఘనిస్థాన్, మధ్య ప్రాచ్యం దేశాల నుండి వచ్చిన మిలిటెంట్లే అల్లర్లు సృష్టించారని కజకిస్థాన్ అధ్యక్షుడు ప్రకటించాడు కూడా (టాస్, 10 జనవరి, 2022) ఇవన్నీ ‘స్థిరత్వ కల్పన’, ‘కౌంటర్-టెర్రరిజం’ పేరుతోనే జరుగుతాయి.

తాలిబాన్ పై ఆంక్షల సడలింపు, ఓస్లో చర్చల నేపధ్యంలో మధ్య ఆసియా దేశాల ప్రభుత్వాల్లో అలజడి మొదలయినట్లు సూచనలు కనిపిస్తున్నాయి. ఆఫ్ఘనిస్థాన్ లో అమెరికా ఇంటలిజెన్స్ ప్రవేశిస్తే తమ దేశాల్లో ప్రతికూల పరిణామాలు తప్పవని వారికి తెలుసు గనకనే ఈ అలజడి. అమెరికా ఇంత చేస్తున్నా రష్యా, చైనా చూస్తూ ఉండబోవు. అవి కూడా తమ ప్రయత్నాలు తాము చేస్తాయి. తాలిబాన్ ప్రభుత్వం చైనా, రష్యాలను మిత్ర దేశాలుగా ప్రకటించింది కూడా. ఆ మేరకు చైనా, రష్యా ల నుండి కూడా సహాయం రాబట్టేందుకు తాలిబాన్ ప్రయత్నాలు తప్పకుండా చేస్తుంది. ముఖ్యంగా చైనా ‘బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్’ (బి‌ఆర్‌ఐ) ప్రాజెక్టు ద్వారా వివిధ ప్రాజెక్టులు చేపట్టి ఋణ వితరణ చేసే అవకాశాలు ఉన్నాయి. చమురు, గ్యాస్ అన్వేషణకు రష్యా సహాయం తీసుకునే అవకాశం ఉన్నది. ఇది ఎప్పుడు జరుగుతుంది అన్నదే ప్రశ్న. అమెరికా ఆర్ధిక శక్తి పడిపోయిన నేపధ్యంలో చైనాతో పోటీ పడి నెగ్గుకు రాగలదా అన్నది చూడాల్సి ఉంది. ఆర్ధిక ఋణ వితరణలో చైనా పై చేయి సాధిస్తే, అది రష్యా కు కూడా లాభకరంగా మారుతుంది.

అయితే ప్రస్తుతానికి ఆఫ్ఘనిస్థాన్ లో ప్రభావం సాధించడానికి జరుగుతున్న రేసులో అమెరికా ముందంజలో ఉన్నట్లే!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s