ప్రధాని భద్రత: కేంద్రానికి సుప్రీం కోర్టు తలంటు


ప్రధాన మంత్రి  నరేంద్ర మోడి జనవరి 5 తేదీన పంజాబ్ పర్యటనకు వెళ్ళిన సందర్భంగా ఆయనకు భద్రత కల్పించడంలో పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా విఫలం అయిందని కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాన మంత్రి సైతం నాటకీయమైన వ్యాఖ్యలతో రాజకీయ డ్రామాకు తెరలేపారు. డ్రామాను రక్తి కట్టించడం కోసం ఎస్‌పి‌జి భద్రతా ప్రోటోకాల్స్ అనీ, బ్లూ బుక్ ఉల్లంఘన అనీ చెబుతూ పంజాబ్ అధికారులకు కేంద్రం ఏకపక్షంగా దోషిత్వాన్ని నిర్ధారించి నోటీసులు జారీ చేసేసింది.

కాగా ఈ పద్ధతిని సుప్రీం కోర్టు ధర్మాసనం తీవ్రంగా తప్పు పట్టింది. విచారణ లేకుండా నిజా నిజాలు పరిశీలించకుండా ఫలానా వాళ్ళు తప్పు చేసినట్లు ఎలా నిర్ణయించారని ప్రశ్నించింది. మీరు ముందే దొషులను నిర్ధారించేపనైతే విచారణ కోసం సుప్రీం కోర్టుకు రావడం ఎందుకని ప్రశ్నించింది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ తమ విచారణ కమిటీల పనిని తాత్కాలికంగా పక్కన పెట్టాలని తాము జనవరి 7 తేదీన ఆదేశించినప్పటికీ షో కాజ్ నోటీసులు ఎలా జారీ చేశారని నిలదీసింది.

చీఫ్ జస్టిస్ ఎన్‌వి రమణ, జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ హిమ కోహ్లీ లతో కూడిన ధర్మాసనం ప్రధాన మంత్రి పంజాబ్ పర్యటనలో జరిగిన భద్రతా లోపాల అంశంపై విచారణ చేపట్టింది. స్వచ్ఛంద సంస్ధ ‘లాయర్స్ వాయిస్’ దాఖలు చేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం జనవరి 10 తేదీ వరకు కేంద్రం, రాష్ట్రం నియమించిన కమీటీల విచారణను తాత్కాలికంగా ఆపాలని జనవరి 7 తేదీన ఆదేశించింది. ఆ మేరకు ఈ రోజు (జనవరి 10) విచారణ ప్రారంభించింది.

విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ధర్మాసనం రాష్ట్ర అధికారులకు కేంద్ర ప్రభుత్వం షో కాజ్ నోటీసులు జారీ చేయడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రధాన మంత్రి భద్రతా లోపంలో రాష్ట్ర అధికారులు ప్రాధమికంగా తప్పిదానికి పాల్పడినట్లుగా నిర్ధారించినట్లయితే విషయాన్ని సుప్రీం కోర్టుకు ఎందుకు తెచ్చారని ప్రశ్నించింది. దానికి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ కేంద్రం నియమించిన కమిటీ మొదట విచారణ చేసి నివేదిక ఇస్తుందని ఆ తర్వాత సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకోవచ్చని సూచించాడు.

సొలిసిటర్ జనరల్ సూచనను పంజాబ్ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ గట్టిగా వ్యతిరేకించాడు. కేంద్రం విచారణపై తమకు నమ్మకం లేదని స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తు జరపాలని కోరాడు. పిటిషనర్-ఎన్‌జి‌ఓ తరపున హాజరైన సీనియర్ అడ్వకేట్ మనీందర్ సింగ్ వాదిస్తూ పంజాబ్ సంఘటనకు సంబంధించి ఉపా (UAPA -Unlawful Activities (Prevention) Act) చట్టాన్ని ప్రయోగించే అవకాశాలు పరిశీలించాలని కోరాడు. అందుకు చీఫ్ జస్టిస్ నిరాకరించారు. “ఇప్పుడే సమస్యను జఠిలం చేయొద్దు” అని వ్యాఖ్యానించారు.

కోర్టులో ఏం జరిగింది?

పంజాబ్ అడ్వకేట్ జనరల్ మొదట వాదన వినిపిస్తూ కేంద్ర ప్రభుత్వం 7గురు రాష్ట్ర అధికారులకు షో కాజ్ నోటీసులు జారీ చేసిందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. చీఫ్ సెక్రటరీ, డి‌జి‌పి లు కూడా నోటీసులు అందుకున్నారని, వారిపై క్రమశిక్షణా చర్య తీసుకోబోతున్నట్లు పేర్కొన్నారని, నోటీసుకు సమాధానం ఇచ్చేందుకు 24 గంటలు సమయం మాత్రమే ఇచ్చారని తెలియజేశారు. “ఇందులో కొన్ని రాజకీయాలు పని చేస్తున్నాయి” అని చెబుతూ కేంద్రం విచారణ జరిపితే తమకు న్యాయబద్ధమైన విచారణ లభించదని స్పష్టం చేశారు.

“కేంద్ర ప్రభుత్వం నుండి మాకు న్యాయబద్ధమైన హియరింగ్ లభించదు. దయచేసి స్వతంత్ర కమిటీని నియమించి మాకు న్యాయమైన హియరింగ్ అవకాశం ఇప్పించండి… (పంజాబ్ & హర్యానా హై కోర్టు) రిజిస్ట్రార్ జనరల్ రికార్డులు అన్నీ స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి సాక్ష్యం ఎక్కడుంది? దేని ఆధారంగా కేంద్రం దోషిత్వాన్ని నిర్ధారించింది? జనవరి 8 సాయంత్రం 5 గంటల వరకు 24 గంటల సమయమే మాకు ఇచ్చారు. షో-కాజ్ నోటీసులు మాకు వ్యతిరేకంగా ముందే పధకం ప్రకారం అంతా నిర్ధారించేశాయి. మాకు న్యాయమైన హియరింగ్ లభిస్తుందని మేము భావించడం లేదు” అని పంజాబ్ అద్వెకెట్ జనరల్ డి‌ఎస్ పట్వాలియా విన్నవించారు.

ఇది తీవ్రమైన విషయమే అని ఏ‌జి అంగీకరించారు. భద్రతా లోపానికి రాష్ట్ర అధికారులదే బాధ్యత అయితే వారిని శిక్షించవలసిందే. “కానీ మా వాదన వినకుండానే మమ్మల్ని నెట్టివేయొద్దు. మా అధికారుల తప్పు ఉంటే ఉరి తీయండి. కానీ న్యాయమైన విచారణ తర్వాతే ఆ పని చేయండి” అని ఏ‌జి వాదించారు.

దానితో సి‌జే‌ఐ ఎన్‌వి రమణ కోర్టు జనవరి 7 తేదీన ఆదేశాలు జారీ చేసిన తర్వాత షో-కాజ్ నోటీసులు ఇచ్చారా అని ఎస్‌జి (సొలిసిటర్ జనరల్) తుషార్ మెహతాను ప్రశ్నించారు. నోటీసులు కోర్టు ఆదేశాలకు ముందే జారీ చేశామని మెహతా బదులిచ్చారు. ఎస్‌పి‌జి చట్టం ప్రకారం ఏయే చర్యలు తీసుకోవాలో కోర్టుకు ఎస్‌జి వివరించారు. పి‌ఎం భద్రత చర్యలు వివరించే “బ్లూ బుక్” రూల్స్ గురించి చెప్పారు. విషయాన్ని సరైన దృక్పధంలో విశ్లేషించాలంటే మొదట వీటిని సరిగా అర్ధం చేసుకోవాలని నమ్మ బలికారు.

“పి‌ఎం కాన్వాయ్ నిరసన స్థలానికి 100 మీటర్లు ఇవతలి వరకు వచ్చింది. రూల్స్ ని ఖచ్చితంగా పాటించేలా అధికారులు చూడాలి. అక్కడ వీలైనంత తక్కువ అసౌకర్యం ఉండేలా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అలాంటి అధికారులను నిర్దేశించాలి… ఉదయమే గుంపులు చేరడం మొదలయింది. కానీ డి‌జి‌పి నుండి ఎలాంటి సమాచారం లేదు. అది అతని బాధ్యత” అని ఎస్‌జి చెప్పారు.

ఇంటలిజెన్స్ పూర్తిగా విఫలం అయిందని ప్రోటోకాల్స్ ను ఉల్లంఘించారని ఎస్‌జి ఆరోపించారు. “స్పష్టమైన రోడ్డు మార్గం ఉన్నదీ లేనిదీ ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉండాలి. 4 కి.మీ లోపు ఆటంకాలు ఉంటే చెప్పాలి. రాష్ట్రానికి చెందిన హెచ్చరిక కారు కాన్వాయ్ తో పాటే ఉంది. ఇంటెలిజెన్స్ పూర్తిగా విఫలం చెందింది” అని ఎస్‌జి ఆరోపించాడు. “ఎస్‌పి‌జి చట్టం, బ్లూ-బుక్ ఉల్లంఘనలు జరిగినప్పుడు సవివరంగా విచారణ చేసే అవకాశం లేదు. రాష్ట్ర అధికారులు కోర్టు ముందుకు రాలేదు. అసలు రాష్ట్ర ప్రభుత్వం వారిని డిఫెండ్ చేయడమే చాలా చాలా సీరియస్ విషయం” అని ఎస్‌జి వాదించాడు.

ఈ సందర్భంలో ధర్మాసనం జోక్యం చేసుకుంది. జస్టిస్ సూర్య కాంత్ ఎస్‌జి ని “మీ షో కాజ్ నోటీసు స్వయం వైరుధ్యాలతో కూడి ఉంది. కమిటీని నియమించడం ద్వారా నిబంధనల ఉల్లంఘన జరిగిందా లేదా అన్నది విచారించాలని మీరు భావించారు. కానీ అంతలోనే చీఫ్ సెక్రటరీ, డి‌జి‌పి లను దోషులుగా నిర్ధారించారు. వారిని దోషులుగా ఎవరు నిర్ధారించారు?” అని ప్రశ్నించారు. “రాష్ట్రం, పిటిషనర్ న్యాయమైన హియరింగ్ జరగాలని కోరుతున్నారు. మీరు కూడా దానిని వ్యతిరేకించలేరు. అలాంటప్పుడు మీరు ఈ పాలనాపరమైన నిజ నిర్ధారణ విచారణ ఎందుకు చేస్తున్నట్లు?” అని నిలదీశారు.

“మా ఆదేశాల తర్వాత కూడా వారిని 24 గంటల లోపు రిప్లై ఇవ్వాలని కోరడం….! మీ నుండి ఇలాంటివి ఆశించలేము” అని జస్టిస్ హిమా కోహ్లీ అన్నారు. ఈ పరిస్ధితుల్లో ‘మా నుండి ఇలాంటివి ఆశించలేము అనడం కాస్త కఠినంగా ఉన్నదని చెబుతూ ఎస్‌జి ప్రధాని రక్షణ అత్యంత ముఖ్యం అన్నారు. కేంద్రం లోపాలు ఎక్కడ జరిగింది చూడాలన్నారు. విచారణ ఎస్‌పి‌జి, బ్లూ బుక్ నిబంధనలకు బాధ్యులైన అధికారులకు వ్యతిరేకంగా జరుగుతుందని చెప్పారు.

“అవును భద్రత ఉల్లంఘన జరిగింది, రాష్ట్రం కూడా దానిని అంగీకరించింది. కానీ ఇతర అంశాలు వాస్తవాలకు సమంధించిన సమస్యలు. వాటిని స్వతంత్ర వ్యక్తులు పరిశీలించాలి” అని జస్టిస్ సూర్య కాంత్ అన్నారు.

“రాష్ట్ర అధికారులకు వ్యతిరేకంగా మీరు క్రమ శిక్షణా చర్యలు తీసుకునే పనైతే ఇక విచారించేందుకు మాకేమ్ ఉంటుంది?” అని సి‌జే‌ఐ ప్రశ్నించారు. దానికి ఎస్‌జి, అంతిమ ఫలితాన్ని షో-కాజ్ నోటీసులు ముందస్తుగా నిరోధిస్తున్నట్లు ధర్మాసనం భావిస్తే సెంట్రల్ కమిటీ తగు పరిశీలన జరిపి నివేదిక ఇచ్చేవరకు కోర్టు తన విచారణను నిలిపివేసి ఉంచవచ్చని ఎస్‌జి ప్రతిపాదించారు.

ఇందుకు పంజాబ్ అడ్వకేట్ జనరల్ అభ్యంతరం చెప్పారు. “ఎం‌హెచ్‌ఏ అధిపతే సెంట్రల్ కమిటీకి నేతృత్వం వహిస్తున్నారు. మేము దొషులమని ఎం‌హెచ్‌ఏ ఇప్పటికే నిర్ధారించేసింది. ఇక అది ఏం పరిశీలిస్తుంది? ఈ కమిటీ ఒక పనికిమాలిన మర్యాద మాత్రమే. ఈ కమిటీ నుండి నాకు ఎలాంటి నమ్మకమూ లేదు. దయచేసి స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయండి” అని ఏ‌జి కోరారు.

అనంతరం ధర్మాసనం సభ్యులు తమలో తాము చర్చించుకున్నారు. రిటైర్డ్ సుప్రీం కోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో స్వతంత్ర కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అప్పటివరకూ ఇరు ప్రభుత్వాలు తమ కమిటీల పనిని నిలిపివేయాలని ఆదేశించారు. పూర్తి వివరాలతో కూడిన ఆదేశాలను తర్వాత ఇస్తామని స్పష్టం చేశారు.

ఇంత రాద్ధాంతమా?

పంజాబ్ రాష్ట్రం, భారత దేశంలో భాగం. అక్కడి ప్రజలు భారతీయులు. పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్ రైతులు ఏడాది పాటు రోడ్డుపై కూర్చొని నరేంద్ర మోడి తెచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. ఆ సందర్భంగా 700 కు పైగా రైతులు ప్రాణాలు కోల్పోయారు. కానీ ప్రధాని వారికి సానుభూతిగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వారికి కనీసం నష్టపరిహారం ఇవ్వడానికి కూడా రైతు సంఘాలు మరిన్ని రోజులు ఆందోళన చేయాల్సి వచ్చింది.

పైగా మేఘాలయ గవర్నర్ రైతుల మరణాల గురించి ప్రస్తావిస్తే “వాళ్ళు నా కోసం చనిపోయారా?” అని ప్రధాని ప్రశ్నించారు. ఈ ప్రధాన మంత్రి ప్రమాదం అటుంచి ఎలాంటి ప్రమాద సూచన కూడా ఎదుర్కొనప్పటికీ తన కాన్వాయ్ ఆగిపోవడమే ఒక పెద్ద సమస్యగా మార్చివేశారు. దానిని తన ప్రాణాలకు వచ్చిన ముప్పుగా మార్చి పంజాబ్ రాష్ట్ర ఐ‌ఏ‌ఎస్, ఐ‌పి‌ఎస్ అధికారులపై చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించారు. ఇది సామాన్యుడి బుర్రకు బొత్తిగా అర్ధం కానీ సంగతి!

కానీ త్వరలో (ఫిబ్రవరి 10 నుండి) పంజాబ్, ఉత్తర ప్రదేశ్, మణిపూర్, ఉత్తర ఖండ్, గోవా రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న సంగతి గుర్తు చేసుకుంటే ‘ప్రధాని భద్రతా సూత్రాల ఉల్లంఘన’ అనే ప్రహసనానికి లక్ష్యం ఏమిటో అర్ధం అవుతుంది.

కేంద్ర ప్రభుత్వం లోని బి‌జే‌పి ప్రయోజనాలకు విరుద్ధంగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాల కింద పని చేస్తున్న ఐ‌ఏ‌ఎస్, ఐ‌పి‌ఎస్ అధికారులు వ్యవహరిస్తున్నట్లు భావిస్తే కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ వారిపై వెంటనే ప్రతీకార చర్యలకు దిగడం మోడి ప్రభుత్వం హయాంలో కొత్తగా తెర పైకి వచ్చిన వ్యవహారం. రాజకీయ ఒత్తిడులకు అతీతంగా ప్రజల ప్రయోజనాలే పరమార్ధంగా పని చేయవలసిన ఉన్నత అధికారులను ఈ విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణల్లో పావులుగా మార్చడం, అది కూడా బి‌జే‌పి యేతర పార్టీల ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలలో తరచుగా జరగడం కేంద్ర ప్రభుత్వానికి తగని వ్యవహారం. ఇది అంతిమంగా రాజకీయ పార్టీల మధ్య ఘర్షణల్లో ఉన్నత స్ధాయి అధికారులను బలి పశువులు కావటానికి దారి తీస్తోంది.

రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకునే ప్రయత్నాల్లో భాగంగా బి‌జే‌పి పెద్దలు ప్రభుత్వ పరంగానే ఎలాంటి పనికైనా తెగించడం అత్యంత ఆందోళనకరమైన పరిణామం. ప్రజలు, అధికారులు, రాష్ట్ర ప్రభుత్వాలు, ఆర్‌బి‌ఐ, సి‌బి‌ఐ, మానవ హక్కుల కమిషన్, సి‌వి‌సి, ఎన్నికల కమిషన్… ఇలా ఎవరిని చూసినా తమ ప్రతీకార రాజకీయాలకు, అది కూడా తీవ్రమైన చర్యలకు సైతం వెనుదీయకుండా, బలి చేయడం బి‌జే‌పి నాయకులకు తగని పని. విద్వేష రాజకీయాలతో భారతీయ సమాజాన్ని కుళ్ళ బొడుస్తున్నది చాలక వ్యవస్థలోని సమస్త అంగాలను, సమస్త అధికార విభాగాలు తమకు పాదాక్రాంతం కావలసిందే అన్నట్లుగా వ్యవహరించడం ఏ విధంగానూ సమర్థించలేము.

ఉత్తర ప్రదేశ్ పర్యటనలో వారణాసిలో వివిధ నిర్మాణాలను ప్రారంభించడానికి వెళ్లినప్పుడు ప్రధాన మంత్రి కాన్వాయ్ కు దాదాపు ఇలాంటి పరిస్ధితే ఎదురయింది. ప్రధాని కాన్వాయ్ ఓ ఇరుకు రోడ్డులో వెళుతుండగా ఒక మోడి అభిమాని కాన్వాయ్ కు ఆటంకం కలిగించాడు. తల పాగా, శాలువా లను ప్రధానికి బహుమతిగా ఇవ్వాలని ఆతృత ప్రదర్శించాడు. ఎస్‌పి‌జి అధికారులు అతన్ని దూరంగా నెట్టివేస్తే ప్రధాని వారించి అతన్ని తన కారు దగ్గరికి అనుమతించి ముకుళిత హస్తాలతో అతని బహుమానాలు స్వీకరించాడు. ఇక్కడ కాన్వాయ్ దగ్గరికి వచ్చింది మోడి అభిమానే అయినా ఎస్‌పి‌జి చట్టం, బ్లూ బుక్ ల నియమ నిబంధనల రీత్యా తీవ్ర ఉల్లంఘన కిందికే వస్తుంది. కానీ అదేమీ పెద్ద సమస్య కాలేదు.

నిజానికి ఫ్లై ఓవర్ పై నిరసన తెలుపుతున్న రైతులకు ప్రధాని కాన్వాయ్ ఆ రూట్ లో వస్తున్నట్లు తెలియదు. ప్రధాని కాన్వాయ్ వస్తోంది తప్పుకోవాలి అని రాష్ట్ర పోలీసులు చెప్పినప్పుడు వారు దానిని నమ్మలేదు కూడా. వారు జోక్ చేస్తున్నట్లు భావించారు. పైగా తుషార్ మెహతా చెప్పినట్లు 100 మీటర్లు కాదు, కనీసం 1 కి.మీ అవతల రైతుల నిరసన సాగుతోంది. కానీ కాన్వాయ్ కి అత్యంత సమీపంలో బి‌జే‌పి ఊరేగింపు జరిగినట్లు ఇండియా టుడే చానెల్ ప్రసారంలో చూపించారు. వారి వల్ల రాని ప్రమాదం కి.మీ దూరంలో ఉన్న రైతుల వలన వస్తుందని చెప్పడం బొత్తిగా అతకని విషయం.

పంజాబ్ ముఖ్యమంత్రి “ప్రధాన మంత్రికి ప్రమాదం ఏ విధంగా వచ్చింది? ఎవరి వల్ల వచ్చింది? కాస్త వివరంగా చెప్పండి” అని కేంద్రాన్ని పదే పదే ప్రశ్నిస్తున్నారు. కానీ కేంద్ర హోమ్ శాఖ గానీ ఇతర బి‌జే‌పి మంత్రులు గానీ ఆయనకు సమాధానం ఇవ్వలేదు. ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నారు తప్ప ఆ ఆరోపణల్లో వాస్తవం ఏమిటో వివరించడం లేదు.

ఓ పక్క సుప్రీం కోర్టు కేంద్రం, రాష్ట్రం రెండూ తమ విచారణలు ఆపాలని ఆదేశించినప్పటికీ కేంద్రం తమ నోటీసులకు 24 గంటల్లో సమాధానం ఇవ్వాలని చెప్పడంలోనే వారి ఉద్దేశం స్పష్టం అవుతోంది. సుప్రీం కోర్టు విచారణ లోపే రాష్ట్ర అధికారులకు దోషిత్వాన్ని అంటగట్టి ఒక పెద్ద నేరం జరిగినట్లు ఎస్టాబ్లిష్ చేయాలన్న ప్రయత్నం ఇక్కడ కనిపిస్తోంది.

సుప్రీం కోర్టు విచారణ సాగే క్రమంలో అసలు విషయాలు వెల్లడి కావాలని ఆశిద్దాం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s