సల్లీ డీల్స్ కేసులో మొదటి అరెస్టు


Aumkareshwar Thakur

బాధితులు ఫిర్యాదు చేసిన 6 నెలల తర్వాత ‘సల్లీ డీల్స్’ అప్లికేషన్ కేసులో మొదటి అరెస్టు జరిగింది. ఈ అరెస్టును ఆదివారం ఢిల్లీ పోలీసులు చేశారు. మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ పట్టణం నుండి ‘ఓంకారేశ్వర్ ఠాకూర్’ ని అరెస్ట్ చేశామనీ, అతనే సల్లీ డీల్స్ ఆప్ సృష్టికర్త అనీ ఢిల్లీ పోలీసులు ప్రకటించారు.

ముంబై పోలీసులు ‘బుల్లీ బాయ్’ కేసులో వరుసగా ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయడంతో ఢిల్లీ పోలీసులు కూడా స్పందించక తప్పలేదు. జులై 2021 లోనే పలువురు బాధితులు ‘సల్లీ డీల్స్’ ఆప్ లో తమ ఫోటోలను అప్ లోడ్ చేసి దుర్వినియోగం చేస్తున్నారని ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు కేసు విచారణలో ఏ మాత్రం ఆసక్తి చూపలేదు.

బాధితులు అనేకసార్లు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు గురించి గుర్తు చేశారు. తాము ముస్లిం మహిళలం అయినందునే పోలీసులు స్పందించడం లేదని ట్విట్టర్, ఎఫ్‌బి వేదికగా, వారు పోలీసులను నిలదీశారు. వారు అడిగినప్పుడల్లా ఏదో ఒక కారణం చెప్పి తమ క్రియశూన్యతను సమర్ధించుకున్నారు.

కొన్నాళ్లు గిట్ హబ్ కు లేఖ రాశాం, సమాధానం రావాలి అన్నారు. మరి కొన్నాళు గిట్ హబ్ సమాధానం ఇవ్వడం లేదు అన్నారు. ఇంకొన్నాళ్లు సమాధానం ఇవ్వడానికి గిట్ హబ్ నిరాకరిస్తోంది అంటూ నెపాన్ని గిట్ హబ్ మీదికి నెట్టారు. ఆ తర్వాత ‘ప్రోటో కాల్స్ పాటించాలి’ అన్నారు. కానీ ఆ ప్రోటో కాల్ ఎంతవరకు సాగుతూ పోతుందో తెలియకుండా పోయింది.

జనవరి 1 తేదీన మరో అప్లికేషన్ బుల్లి బాయ్ ప్రత్యక్షం కావడంతో ఢిల్లీ పోలీసులపై ఒత్తిడి పెరిగింది. ఐ‌టి మంత్రి ‘చర్యలు తీసుకుంటున్నాం’ అని ప్రకటించారు. ఈ లోపు ముంబై పోలీసులు కుమార్ ఝా, శ్వేతా సింగ్ ల అరెస్టు ప్రకటించారు.

దానితో ఢిల్లీ పోలీసులు అర్జెంట్ గా ఒక ప్రకటన చేశారు. గిట్ హబ్ కు సమాచారం ఇవ్వమని కోరామనీ కానీ ఈ కేసు ‘జాతీయ భద్రత’ గురించి కాదు కాబట్టి వెంటనే స్పందించడం కుదరదని చెప్పారని అమెరికా-ఇండియా ఒప్పందం ప్రకారం నిర్దేశించబడిన ప్రభుత్వ ప్రోటోకాల్ పాటించాలని చెప్పారని వారు ప్రకటించారు. ఈ సమాధానం ఎప్పుడు వచ్చింది మాత్రం వెల్లడి చేయలేదు.

గిట్ హబ్ కి లేఖ రాసిన తేదీ, పై విధంగా వారి నుండి సమాధానం వచ్చిన తేదీ లను ఢిల్లీ పోలీసులు వెల్లడి చేయలేదు కాబట్టి ఇది జరిగింది జనవరి 2022 లోనే అని పలువురు విశ్లేషకులు ఆరోపించారు. ఈ ఆరోపణ నిజమే అయితే ఢిల్లీ పోలీసులు ఇన్నాళ్ళు సల్లీ డీల్స్ ఆప్ కేసులో విచారణ ప్రారంభించలేదని బావించవచ్చు. కానీ పోలీసులు నిర్దిష్ట తేదీలు వెల్లడి చేయనంత వరకు ఎటూ నిర్ధారించలేము.

ఆదివారం అరెస్టు చేసిన ఓంకారేశ్వర్ ఠాకూర్ వయసు 25 సం. అని కొన్ని పత్రికలు, 26 సం. అని కొన్ని పత్రికలు చెప్పాయి. ఇతని అరెస్టును ఢిల్లీ డి‌సి‌పి (సైబర్ సెల్) కే‌పి‌ఎస్ మల్హోత్రా ప్రకటించారు. “ఇండోర్ లో ఓంకారేశ్వర్ ని పట్టుకున్నాం. తాను ట్రాడ్ గ్రూపు (ట్రాడ్ మహా సభ) జనవరి 2020 లో చేరానని మా విచారణలో అంగీకరించాడు. ముస్లిం మహిళలను అప్రతిష్టపాలు చేయడం, ఆన్ లైన్ లో ట్రోలింగ్ చేయడమే ఆప్ సృష్టి వెనుక ఉన్న ప్రధాన ఐడియా అని చెప్పాడు” అని మల్హోత్రా చెప్పారు.

ట్రాడ్ అన్నది ట్రెడిషనలిస్టులు (Traditionalists) అన్న పదానికి పొట్టి పేరు. హిందూ సంప్రదాయాలకు తాము ప్రతినిధులమని, సదరు సాంప్రదాయాలను పరిరక్షించడమే తమ కర్తవ్యమని ఈ పేరు ద్వారా చెప్పదలిచారు. కుల వ్యవస్ధ దేశానికి మంచిది, అవసరం అని వారి అభిప్రాయం. ముస్లింలు, క్రైస్తవులు, దళితుల పట్ల ద్వేషభావం వారి ట్వీట్లలో వ్యక్తం చేస్తారు.

“గ్రూపులో చేరాక గిట్ హబ్ లో సల్లీ డీల్స్ ఆప్ కోడ్ ను అభివృద్ధి చేశాడు. గ్రూపు సభ్యులు అందరికీ ఆప్ ను ఉపయోగించే సౌలభ్యం ఉంది. ఆప్ వివరాలను అతను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశాడు. ఇతర గ్రూపు సభ్యులు ముస్లిం మహిళల ఫోటోలను అప్ లోడ్ చేశారు” అని డి‌సి‌పి మల్హోత్రా వివర్మ్చారు.

జులై 2021లో సల్లీ డీల్ ఆప్ దాదాపు 50 నుండి 80 వరకు ముస్లిం మహిళలను టార్గెట్ చేసిందని, కానీ అనేక మండి మహిళలు ఢిల్లీ, నోయిడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గిట్ హబ్ సదరు అప్లికేషన్ ను తొలగించిందని మల్హోత్రా చెప్పారు.

ఇండియన్ ఎక్స్^ప్రెస్ ప్రకారం ఓంకారేశ్వర్ ఠాకూర్ ను పోలీసులు శనివారమే పట్టుకున్నారు. అతను ఇండోర్ లోని ఐ‌పి‌ఎస్ అకాడమీలో బి‌సి‌ఏ విద్యార్ధి. ఢిల్లీ సైబర్ సెల్ పోలీసులు అతన్ని ఆదివారం స్వాధీనం చేసుకుని అరెస్టు ప్రకటించారు.

ఓంకారేశ్వర్ తండ్రి ఓ ప్రైవేటు కంపెనీ ఉద్యోగి. తన కొడుకు అరెస్టు సమయంలో ఆయన ఇంట్లో లేడు. “నేను ఇంటికి వెళ్ళాక మా చిన్న కొడుకు అరెస్టు సంగతి చెప్పాడు. ఏదో అప్లికేషన్ విషయం అని చెప్పాడు. ఈ రోజు ఓంకారేశ్వర్ తో మాట్లాడాను. తాను బాగానే ఉన్నట్లు చెప్పాడు. అతన్ని ఎవరో ఈ కేసులో ఇరికించారు” అని తండ్రి అఖిలేశ్వర్ కుమార్ ఠాకూర్ చెప్పాడు. (ఐ‌ఈ, 09/01/2022).

తమ్ముడు మండలేశ్వర్ ఠాకూర్ కూడా తన అన్న ఏ తప్పూ చేయలేదని చెప్పాడు. “ఇలాంటి ఆప్ ని సృష్టించటానికి ఏ కారణమూ అవసరం మా అన్నకు లేదు. మాది బాగా స్థిరపడిన కుటుంబం. మా నాన్న ప్రైవేటు కంపెనీ ఉద్యోగి. మేమిద్దరం కూడా ఉద్యోగం చేస్తున్నాం” అని మండలేశ్వర్ చెప్పాడు. ఇతను ఓ ఐ‌టి కంపెనీలు ఉద్యోగి అని తెలుస్తోంది.

మధ్య ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నేత దిగ్విజయ్ సింగ్ ప్రకారం ఈ కుర్రకారు అంతా కేవలం పావులు మాత్రమే. అసలు దోషులు ఇంకా బైటికి రాలేదు. “వీరంతా కేవలం సైనికులు మాత్రమే. పెద్ద షార్క్ లు వారి మెదళ్ళను విషపూరితం చేస్తున్నాయి. కుర్రవాళ్ళకు వాళ్ళు డబ్బు కూడా చెల్లిస్తున్నారు. ముందు ఆ పెద్ద చేపలను పట్టండి” అని పోలీసులకు సలహా ఇచ్చారు.

“మా ఇద్దరికీ గత కొన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియాలో అసలు లేనే లేము” అని తమ్ముడు మండలేశ్వర్ చెబుతున్నాడు. బహుశా మారు పేర్లతో వారి కార్యకలాపాలు సాగిస్తూ ఉండవచ్చు.

అరెస్ట్ అయిన 5 గురు నిందితుల్లో (విశాల్ కుమార్ ఝా, శ్వేతా సింగ్, మయాంక్ రావల్, నీరజ్ బిష్ణోయ్, ఓంకారేశ్వర్ ఠాకూర్) ఒక్క నీరజ్ బిష్ణోయ్ మాత్రమే బహిరంగంగా హిందూత్వ భావజాలాన్ని, సల్లీ డీల్స్, బుల్లి బాయ్ ఆప్ ల సృష్టిని సమర్ధించుకున్నాడు. ఇతరులు మీడియాతో గాని, సోషల్ మీడియాలో గానీ తమ చర్యలకు సమర్ధనగా ఏమీ రాసినట్లు సమాచారం లేదు.

ఒక్క నీరజ్ మాత్రమే “నేను ఏమీ తప్పు చేయలేదు. నేను చేసిందాంట్లో తప్పేమీ లేదు” అని అన్నట్లు పత్రికలు చెప్పాయి. మొదటి ముగ్గురిని అరెస్ట్ చేశాక నీరజ్ స్వయంగా తన ట్విటర్ టైమ్ లైన్ లో “అమాయకులను అరెస్ట్ చేశారు. బుల్లీ బాయ్ ఆప్ ని తయారు చేసింది నేనే. నేను అస్సాం లో ఉన్నాను. వచ్చి నన్ను అరెస్ట్ చేయండి” అని ప్రకటించాడు.

నీరజ్ ప్రకటించుకునేవరకు అతని గురించి ముంబై, ఢిల్లీ పోలీసులకు తెలిసినట్లు లేదు. ట్విటర్ లో ప్రకటించడంతోనే ముంబై, ఢిల్లీ లనుండి పోలీసులు బయలు దేరి వెళ్లారు. కానీ ముంబై పోలీసుల కంటే ఒక గంట ముందుగా ఢిల్లీ పోలీసులు వెళ్లడంతో నీరజ్ బిష్ణోయ్ ఢిల్లీ పోలీసులకు చిక్కాడు. ముంబై పోలీసులు బంగారం లాంటి అవకాశం మిస్ అయింది. అతను ముంబై పోలీసులకు గనక దొరికి ఉంటే కాంగ్రెస్, శివసేన లకు రాజకీయంగా ఒక పెద్ద సానుకూలత లభించి ఉండేది. దేశ ప్రజలకు కూడా అసలు కుట్రదారులు ఎవరో తెలిసే అవకాశం తప్పినట్లే కనిపిస్తోంది.

శ్రామిక ప్రజలు వేల యేళ్లుగా వివిధ శారీరక శ్రమల్లో పాల్గొంటూ కష్టపడితేనే మానవ సమాజం నేడు అందుబాటులో ఉన్న శాస్త్ర జ్ఞానాన్ని సంపాదించింది. శారీరక శ్రమలు చేసింది ప్రధానంగా ఓ‌బి‌సి, దళిత కులాల వారే తప్ప అగ్ర కులాల వాళ్ళు కాదు. అగ్ర కులాల్లోని భూములు, ఆస్తులు లేని పేద ప్రజలు కూడా శారీరక శ్రమల్లో పాల్గొన్నారు.

శారీరక శ్రమల్లో పాల్గొనకుండా కేవలం యుద్ధాలలోనూ, మంత్రాలు చదవడం లోనూ ప్రావీణ్యం సంపాదించిన కొద్ది మంది అగ్ర కులజులు భూములు, పొలాలు, కోటలు, అగ్రహారాలు అదుపులో ఉంచుకుని శ్రామికుల్ని పాలించారు. శ్రామికులకు విజ్ఞానాన్ని నిషేధిస్తూ వచ్చారు. ఈ ఆధిపత్యాన్ని, అణచివేతను సమర్ధించుకునేందుకు మత గ్రంధాలు రాశారు. పురాణ గాధలు సృష్టించారు. అణచివేతల వాస్తవ గాధలకు దైవత్వం ఆపాదించి పురాణాలుగా మార్చారు.

అణచివేతను దైవ కార్యంగా మార్చారు. కులాల ద్వారా శ్రామికులను విభజించి అణచివేతను, విభజనను సంప్రదాయాలుగా మార్చి శాశ్వతం చేశారు. ఇదే మతం అన్నారు. మతం దైవ శాసనం అన్నారు. వేల యేళ్లుగా ఈ సంప్రదాయాల మకిలితో అణచివేత సాగించారు. దైవత్వం ఆపాదించబడిన సంప్రదాయాలను శ్రామికులు కూడా ఒంటబట్టించుకునే స్థాయిలో వాటిని కట్టుదిట్టం చేశారు.

శ్రామికుల శ్రమ ద్వారా సమకూడుతూ వచ్చిన విజ్ఞానం ‘ఇంతై, ఇంతింతై, వటుడింతింతై’ అన్నట్లుగా నేడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వరకూ ఎదిగింది. ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో పిసరంత జ్ఞానాన్ని ఆర్జించిన కుక్కమూతి పిందెలు ఆ టెక్నాలజీ సాయంతోనే వెలయేళ్ల నాటి అణచివేత సాంప్రదాయాలను సంపూర్ణంగా పునరుద్ధరించడానికీ, పరిరక్షించడానికి పూనుకోవడం అత్యంత విషాదకర పరిణామం.

ఏ శ్రామికులైతే ఐ‌టి విజ్ఞానాభివృద్ధికి పునాది వేశారో, మరింత విజ్ఞాభివృద్ధికి ఇంకా శ్రమిస్తున్నారో ఆ శ్రామికులను కులం పేరుతో, మతం పేరుతో, సంప్రదాయాల పేరుతో విభజించి అణచివేయడానికి శాస్త్ర పరిజ్ఞానం ఉపయోగపెట్టడం ఒక్క హిందూత్వ సంప్రదాయ సమర్థకులకే సాధ్యపడుతుంది. దేశంలోని అధికారం, వ్యవస్ధలపై నియంత్రణ వారు సాధించినందు వల్లనే ఇది చేయగలుగుతున్నారు. దీనిని శ్రామిక ప్రజలు గుర్తించాలి. కులాతీత మతాతీత ఐక్యతకు నడుం బిగించాలి. లేనట్లయితే ఈ tyranny (దౌర్జన్యం) కొనసాగుతుంది. ఈ oppersion (అణచివేత) తిరుగులేనిదిగా మారుతుంది. ఈ spree of revivalism (పునరుద్ధరణ వాద దూకుడు) మరింత పట్టు సంపాదిస్తుంది.

అంతిమంగా ప్రజలు నష్టపోతారు. సమాజం భరించలేనంతగా కుళ్లిపోతుంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s