బుల్లి బాయ్: ఢిల్లీ పోలీసుల చేతుల్లో ప్రధాన కుట్రదారు


బుల్లి బాయ్ ఆప్ వెనుక ఉన్న ప్రధాన కుట్రదారు ఎవరో తెలిసిందని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. అస్సాంలో అతని జాడ కనుగొన్నామని వారు చెప్పారు. ఢిల్లీ పోలీసు బృందం అస్సాం వెల్లిందని ఈ రోజు సాయంత్రం 3 లేదా 4 గంటల సమయానికి నిందితుడిని ఢిల్లీకి తెస్తారని ఢిల్లీ సైబర్ సెల్ డి‌సి‌పి కే‌పి‌ఎస్ మల్హోత్రా చెప్పారు (ఇండియన్ ఎక్స్^ప్రెస్, 06/01/2022).

“ప్రధాన కుట్రదారుని మేము అరెస్ట్ చేశాము. అతనే వెబ్ సైట్ తయారీలో ప్రధాన ముద్దాయి. ప్రధాన ట్విటర్ ఖాతాను కూడా అతనే నిర్వహిస్తున్నాడు. మా బృందం అతన్ని అస్సాంలో అరెస్ట్ చేసింది. 3:30 ప్రాంతంలో అతన్ని తీసుకొని మా బృందం ఢిల్లీ చేరుకుంటుంది” అని డి‌సి‌పి (సైబర్ సెల్) మల్హోత్రా చెప్పారు.

ప్రధాన కుట్రదారు పేరు నీరజ్ బిష్ణోయ్. అస్సాంలోని జోర్హాట్ నివాసి. భోపాల్ లోని వెల్లూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బి టెక్ రెండో సం. చదువుతున్నాడు.

పరిశోధనలో భాగంగా బిష్ణోయ్ ఐ‌పి అడ్రస్ ను ట్రాక్ చేశామని ఢిల్లీ పోలీసులు చెప్పారు. “ఇతర ముగ్గురు వ్యక్తులు (ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన ముగ్గురు) బిష్ణోయ్ ఆదేశాలను అనుసరిస్తున్నారని మా విచారణలో తేలింది” అని ఢిల్లీ పోలీసులు చెప్పారు.

ఢిల్లీ పోలీసులు ఈ పని ముందే ఎందుకు చేయలేదు అన్నది ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్న. గత జులై నెలలో సల్లీ డీల్స్ అప్లికేషన్ పైన పలు ఫిర్యాదులు బాధితులు చేసినా వారు పట్టించుకోలేదు. కనీసం ఎఫ్‌ఐ‌ఆర్ కూడా నమోదు చేయలేదు. ఎఫ్‌ఐ‌ఆర్ వివరాలు కోరినప్పుడల్లా విచారణ జరుగుతోందని చెప్పారు. గిట్ హబ్ నుండి సమాచారం రాలేదు అన్నారు. ప్రోటోకాల్స్ పాటించాలి అన్నారు.

ఇప్పుడేమో జనవరి 3 తేదీన ఒక మహిళా జర్నలిస్టు ఫిర్యాదుతో బుల్లీ బాయ్ విషయంలో ఎఫ్‌ఐ‌ఆర్ నమోదు చేయడమే కాకుండా ట్విటర్ నుండి ఐ‌పి నెంబర్ వివరాలు సేకరించి, ఒక వ్యక్తిని అరెస్ట్ కూడా చేశారు. అతనే ప్రధాన ముద్దాయి అని చెబుతున్నారు. అతని ఆదేశాలనే ఇతర ముగ్గురు నిందితులు పాటిస్తున్నారని వివరిస్తున్నారు. ఈ పని సల్లీ డీల్స్ ఆప్ విషయంలో చేసి ఉంటే బుల్లీ బాయ్ ఆప్ పుట్టి ఉండేది కాదు కదా! మరిన్ని వందల మంది బాధితులకు వేదన తప్పేది కదా!

ముంబై పోలీసులు ఆలస్యం చేయకుండా ఎఫ్‌ఐ‌ఆర్ నమోదు చేసి మూడో రోజుకే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయడం ద్వారా వేగంగా ఫలితాలు రాబట్టడం వల్లనే ఢిల్లీ పోలీసులు కూడా స్పందించవలసి వచ్చినట్లు కనిపిస్తోంది. ఇప్పుడు ప్రధాన నిందితుడు లేదా ప్రధాన కుట్రదారు ముంబై పోలీసుల చేతుల్లో కాకుండా ఢిల్లీ పోలీసుల చేతుల్లో ఉన్నాడు. ఢిల్లీ పోలీసులు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా కు జవాబుదారీ వహిస్తారు. కనుక వాళ్ళు ముంబై పోలీసులతో సహకరిస్తారా లేదా అన్నది చూడాల్సి ఉన్నది.

నిన్న ప్రధాన మంత్రి పంజాబ్ పర్యటన సందర్భంగా అక్కడి పోలీసులు ప్రధానికి సరైన భద్రత కల్పించడంలో విఫలం అయ్యారని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఆరోపిస్తోంది. పంజాబ్ పోలీసులను తీవ్రంగా తప్పు పడుతోంది. ప్రధాన మంత్రి మోడి పైన ద్వేషంతో ఆయన ప్రాణాలకు ప్రమాదం తెచ్చారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపిస్తున్నారు. ఈ విధంగా దేశ ప్రధాన మంత్రి భద్రతను ఒక సామాన్య సంఘటన ఆధారంగా ఒక రాజకీయ సమస్యగా మార్చివేశారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సమస్యగా మార్చేశారు. పంజాబ్ ప్రభుత్వం కావాలనే సరైన భద్రత కల్పించలేదని ఆరోపిస్తున్నారు.

ప్రధాన మంత్రి అకస్మాత్తుగా రూట్ మార్చడం, ప్రధాని పర్యటన ఖరారు కాక ముందే ఆ రూట్ లో రైతులు రాస్తా రోకో చేస్తున్నారని చెప్పినా వినిపించుకునే పరిస్ధితిలో బి‌జే‌పి నేతలు లేరు. “నేను ప్రాణాలతో తిరిగి వెళ్తున్నందుకు మీ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెప్పండి” అంటూ ప్రధాన మంత్రి పంజాబ్ పోలీసులతో వ్యంగ్యంగా వ్యాఖ్యానించడం ద్వారా ఆయనే స్వయంగా రాజకీయ ఘర్షణకు తెర లేపారు.

ఈ నేపధ్యంలో ఢిల్లీ పోలీసుల విచారణ ఎక్కడికి వెళ్ళి ఎక్కడ ముగుస్తుందో చూడాల్సి ఉన్నది. ఇది భవిష్యత్తులో మరోసారి మహా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య యుద్ధంగా పరిణమించకుండా ఉంటే అది గొప్ప విషయమే కాగలదు. షారూఖ్ ఖాన్ కొడుకు విషయంలో ఈ‌డి (ఎన్ఫోర్శ్^మెంట్ డైరెక్టరేట్), పంజాబ్ పోలీసులు ఘర్షణ పడ్డారు. అంబానీ ఇంటి వద్ద బాంబు కనుగొన్న విషయంలో సి‌బి‌ఐ, పంజాబ్ పోలీసులు ఘర్షణ పడి కోర్టు దాకా వెళ్లారు. రాష్ట్ర హోమ్ మంత్రి రాజీనామా, ముంబై కమిషనర్ తాత్కాలిక అదృశ్యం వరకు ఘర్షణ వెళ్లింది.

కనుక ఇప్పుడు బుల్లి బాయ్ విషయంలో ఘర్షణ జరగబోదన్న గ్యారంటీ లేదు. అందునా బుల్లీ బాయ్ అప్లికేషన్ వల్ల ముస్లిం మహిళలే బాధితులుగా తేలడం అన్నది బి‌జే‌పి రాజకీయ ప్రయోజనాలలో భాగంగా జరిగిందన్న ఆరోపణ ఎలాగూ ఉన్నది. ఇదే నిజమైతే, ప్రధాన కుట్రదారుకు రైట్ వింగ్ సంస్ధల మద్దతు ఉన్నట్లయితే, విచారణ పక్కదారి పట్టే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. లేదా ఇరు ప్రభుత్వాల ఘర్షణలో అసలు ముద్దాయిల నేరం రుజువయ్యే అవకాశాలు తగ్గిపోతాయి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s