Bulli Bai ఆప్: నిర్ఘాంతపోయే నిజాలు!


Sulli Deals

ముంబై పోలీసుల పుణ్యమాని బుల్లి బాయ్ ఆప్ కేసులో నిర్ఘాంతపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. సల్లీ డీల్స్ ఆప్ కేసులో గత జులై నెలలో బాధితులు, ఢిల్లీ వుమెన్ కమిషన్, విలేఖరులు వెంటపడి వేడుకున్నా నిందితులను పట్టుకోవడంలో ఢిల్లీ పోలీసులు ఏ మాత్రం ఆసక్తి చూపలేదు. శివసేన నేత ప్రియాంక చతుర్వేది చొరవతో ముంబై పోలీసులు కేసును వేగంగా ఛేదిస్తున్నారు.

ముంబై పోలీస్ కమిషనర్ హేమంత్ నగరాలే కేసు వివరాలు కొన్నింటిని విలేఖరులకు వెల్లడించారు. ఇప్పటివరకు ముగ్గురు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకోగా ప్రధాన ముద్దాయి నేపాల్ లో ఉన్నట్లు తెలుస్తోందని ఆయన చెప్పారు.

బుల్లి బాయ్ అప్లికేషన్ ని తయారు చేయడం వెనుక ప్రధాన ఉద్దేశం “ఆప్ ని పెద్ద మొత్తంలో సర్క్యులేట్ చేసి నిర్దిష్ట మతానికి చెందిన భావోద్వేగాలను గాయపరచడం” అని హేమంత్ నగరాలే వెల్లడించారు. నిర్దిష్ట మతం అంటే ముస్లిం మతం అని వేరే చెప్పనవసరం లేదు. పోలీసు ఉన్నత అధికారి కనుక పోలీస్ కమిషనర్ ఆ సంగతి చెప్పలేదు.

మైక్రో సాఫ్ట్ కంపెనీ యాజమాన్యంలో ఉన్న గిట్ హబ్ వెబ్ సైట్ లో బుల్లి బాయ్ ఆప్ ని సృష్టించిన సంగతి తెలిసిందే. గిట్ హబ్, కంప్యూటర్ కోడింగ్ ని పరీక్షించుకునే వెసులుబాటును ప్రోగ్రామర్ లకు కల్పిస్తుంది. వందలాది ముస్లిం మహిళల ఫోటోలను దుర్వినియోగం చేస్తూ వారిని వేలంలో పెడుతున్నట్లు చూపడం ద్వారా బాధితులను అవమానించడం, వారిని తమ వివిధ నిరసన కార్యకలాపాల్లో పాల్గొనకుండా నిరుత్సాహానికి గురి చేయడం లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది.

గిట్ హబ్ వేదిక పైనే ‘సల్లీ డీల్స్’ అప్లికేషన్ ని కూడా సృష్టించారు. ముస్లిం విద్వేషం పెంచి పోషించడం పైన ఆధారపడి రాజకీయాలు సాగించే బి‌జే‌పి నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ పోలీసులను నియంత్రిస్తుంది. అందుకే సల్లీ డీల్స్ వ్యవహారంలో ఢిల్లీ పోలీసులు పరిశోధన చేయలేదని బాధితులు ఆరోపిస్తున్నారు.

ట్విట్టర్ హ్యాండిల్, బుల్లి బాయ్ అప్లికేషన్ కి రెండింటికి ఒకటే పేరు, బుల్లి బాయ్, పెట్టడంతో అనుమానితులను పట్టుకోవడం కాస్త తేలిక అయిందని ముంబై పోలీస్ కమిషనర్ చెప్పారు. 18 యేళ్ళ శ్వేతా సింగ్, 21 యేళ్ళ బెంగుళూరు ఇంజనీరింగ్ విద్యార్ధి విశాల్ కుమార్ ఝా లతో పాటు మూడో నిందితుడు మయాంక్ రావత్ ని కూడా అరెస్ట్ చేశారు. రావత్ కూడా 21 యేళ్ళ ఇంజనీరింగ్ విద్యార్ధి. ఉత్తర ఖండ్ లోని కొత్వార్ కు చెందిన వాడు.

పేద విద్యార్ధిని

ద క్వింట్ న్యూస్ వెబ్ సైట్ ప్రకారం బుల్లి బాయ్ అప్లికేషన్ తయారీలో ప్రధాన పాత్ర పోషించిన శ్వేతా సింగ్ ఒక పేద విద్యార్ధిని. ఇంటర్ పాసయింది. ఇంజనీరింగ్ చదవాలని ఆశిస్తోంది. ఇంజనీరింగ్ ఎంట్రన్స్ కోసం ప్రిపేర్ అవుతోంది. ఆమెకు ఒక చెల్లి, తమ్ముడు ఉన్నారు. ఇద్దరు స్కూల్ విద్యార్ధులే.

శ్వేతా సింగ్ గత సవత్సరమే తన తండ్రిని పోగొట్టుకుంది. కరోనా బారిన పడి ఆయన చనిపోయాడు. అంతకు ముందే ఆమె తల్లి క్యాన్సర్ బారిన పడి చనిపోయింది. తమ్ముడ్ని చెల్లెలిని తానే పోషించాలి. ఈ నేపధ్యంలో డబ్బు కోసం ఆప్ ని క్రియేట్ చేశానని శ్వేతా సింగ్ పోలీసుల ప్రాధమిక విచారణలో చెప్పింది.

“బుల్లి బాయ్ కేసులో ఉత్తరాఖండ్ రుద్రాపూర్ నుండి అరెస్ట్ చేసిన యువతి ఒక పేద కుటుంబానికి చెందినది. ఆమె తండ్రి జీవించి లేడు. ఆమె తల్లి ముందే చనిపోయింది. డబ్బు కోసం ఇలాంటి కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు కనిపిస్తోంది” అని ఉత్తర ఖండ్ పోలీస్ చీఫ్ అశోక్ కుమార్ చెప్పాడు (ఎన్‌డి‌టి‌వి, 05/01/2022).

అప్లికేషన్ తయారు చేయడంలో శ్వేతా సింగ్ దే ప్రధాన కృషి అయినా అందులో ఆమెకు వ్యక్తిగత ఆసక్తి ఏమీ లేదు. ఆమె ఆసక్తి డబ్బు మాత్రమే.

మరి ఆమె ఎవరు ఆదేశిస్తే ఆప్ తయారు చేసింది? ఆమెకు డబ్బు ఇవ్వజూపింది ఎవరు?

పోలీసుల ప్రకారం నేపాల్ కు చెందిన ఒక వ్యక్తి ఆదేశాల మేరకు ఆమె ఈ పనికి సిద్ధపడింది. అతని పేరు ఇంకా వెల్లడి కాలేదు. గియోయు (Giyou) అని మాత్రమే ఇప్పటివరకు గుర్తించారు. గియోయు సోషల్ మీడియా ద్వారా శ్వేతా సింగ్ తో పరిచయం అయ్యాడు.

కుమార్ ఝా, మయాంక్ లు కూడా శ్వేతా సింగ్ కు సోషల్ మీడియా మిత్రులే. రావత్ ఢిల్లీ లో ఓ కాలేజ్ లో చదివాడు. ఇతన్ని పోలీసులు ప్రస్తుతం ఇంటరాగేట్ చేస్తున్నారు. ఐ‌పి‌సి సెక్షన్ 153A, 153B, 295A, 509, 500, 354D, 354A కిందా, ఐ‌టి చట్టం సెక్షన్ 67 కిందా ఎఫ్‌ఐ‌ఆర్ నమోదు చేశారు.

“బుల్లి బాయ్ ఆప్ ద్వారా నిర్దిష్ట మతాలకు చెందిన మహిళలను టార్గెట్ చేయడం, వారిని అప్రతిష్ట పాలు చేయడం… నిందితులు అనుసరించిన మోడుస్ ఆపరాండి (Modus Operandi). 31 డిసెంబర్ తేదీన దాన్ని తయారు చేశారు. దాని గురించిన సమాచారం అందిన వెంటనే మేము కేసు పెట్టాం” అని ముంబై పోలీసులు చెప్పారు.

“మేము మొదట గిట్ హబ్ లో ఉన్న బుల్లి బాయ్ అప్లికేషన్ ను విశ్లేషించాం. దానికి 5 గురు ఫాలోయర్లు మాత్రమే ఉన్నారు. మొత్తం విచారణ అంతా ఆన్ లైన్ లోనే సాగింది. కొన్ని ఈ-మెయిల్ ఐ‌డి లను ట్రేస్ చేశాం. ఈ ఖాతాల గురించి ఎవరికైనా సమాచారం తెలిస్తే తెలియజేయాలని ప్రజల్ని కోరుతున్నాం” అని ముంబై కమిషనర్ విలేఖరుల సమావేశంలో కోరారు. (ద క్వింట్, జనవరి 5)

నిందితులు తమను గుర్తించకుండా ఉండడం కోసం ట్విట్టర్ లో సిక్కుల పేర్లు పెట్టుకున్నారు. శ్వేతా సింగ్ @jattkhalsa07 అనే హ్యాండిల్ తో ట్విట్టర్ లో ఖాతా నిర్వహిస్తోంది. ఆమె స్వయంగా మూడు ఖాతాలను నిర్వహిస్తోంది.

“గిట్ హబ్ ని విశ్లేషించడంతో మాకు విశాల్ కుమార్ ఝా సమాచారం లభించింది. అతను బెంగుళూరులో రెండో సం. ఇంజనీరింగ్ విద్యార్ధి. ఉత్తరా ఖండ్ నుండి శ్వేతా సింగ్ ఆచూకీ దొరికింది. మేము ప్రతి ట్విటర్ హ్యాండిల్ ని విశ్లేషించాము. ఇప్పటివరకు ముగ్గురిని పట్టుకున్నాం అని పోలీస్ కమిషనర్ చెప్పారు.

ప్రధాని మౌనం ఎందుకు?

శివసేన ఎం‌పి ప్రియాంక చతుర్వేది ప్రధాని ఇంతవరకు స్పందించకుండా ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. “తమ చుట్టూ భద్రతా వలయం ఉన్నదని ముస్లిం మహిళలు భావించడం ముఖ్యం. ఈ దేశ అత్యున్నత అధికారి వారితో సంఘీభావంతో ఉండాలి. ఖండించడం మొదటి అడుగు, తర్వాత చర్యలు తీసుకోవాలి. తప్పుకి వ్యతిరేకంగా కేంద్రం నిలబడాలి” అని ఆమె కోరారు.

“తప్పుని తప్పు అని చెప్పడంలో ఏమిటి తప్పు? ఇందులో పక్షపాతానికి తావు లేదు. మహిళల పట్ల సెక్సిస్టు ధోరణితో, పురుషాధిక్య ధోరణితో చూసే నేర స్వభావులను రక్షించుకునే అవకాశం ఎంత మాత్రం లేదు. మతం పట్ల దయనీయమైన విద్వేషంతో నిండిన దృక్పధం ఉన్నవారిని శిక్షించాలి” అని ఆమె కోరారు.

అయితే ప్రధాన మంత్రి మౌనం ఎందుకు అన్నది స్పష్టమే. ఏ విద్వేష భావజాలాన్ని తలకు ఎక్కించుకుని సల్లీ డీల్స్, బుల్లి బాయ్ ఆప్ లను అభివృద్ధి చేశారో ఆ భావజాలాన్ని పెంచి పోషించడంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి యే చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఛత్తీస్ ఘడ్ ఎన్నికల ప్రచారంలో ఆయన మత వ్యతిరేక వ్యాఖ్యానాలు చేశారని ఆరోపిస్తూ ప్రతిపక్షాలు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశాయి. యూ‌పి ముజఫర్ నగర్ అల్లర్ల నేపధ్యంలో జాట్ లు ముస్లింలపై ప్రతీకారం తీర్చుకోవాలని హోమ్ మంత్రి అమిత్ షా పిలుపు ఇవ్వగా ఎన్నికల కమిషన్ తప్పు పట్టింది కూడా. ఇంకా ఎన్నికల కమిషన్ దృష్టికి తెచ్చినా చర్యలు తీసుకోని అనేక వ్యాఖ్యలు బి‌జే‌పి ప్రధాన నేతలు చేశారు.

ఇప్పుడు దాదాపు అలాంటి భావజాలాన్నే బుల్లి బాయ్ ఆప్ సృష్టికర్తలు, ఫాలోయర్లు ప్రదర్శిస్తున్నారు. వారిని ప్రధాని ఎలా తప్పు పట్టగలరు? తప్పు పట్టడమే జరిగితే ఇన్నాళ్ళు బి‌జే‌పి నిర్మించుకున్న మత విద్వేష కోట ఫెళ ఫెళ మని కూలిపోదా? అది కూలిపోతే బి‌జే‌పి ఓటు బ్యాంకు చెదిరిపోదా?

ప్రియాంక చతుర్వేది ఈ విషయాన్ని గుర్తించారు కూడా. “ఇది ఒక తెగించిన సంస్కృతిలో భాగం. ఈ సంస్కృతిలో దేశ ప్రధాన మంత్రి ఎలక్షన్ ర్యాలీలకు వెళ్ళి మతం గురించే మాట్లాడతారు. హోమ్ మంత్రి పరిపాలనా నమూనా గురించి మతం ప్రాతిపదికనే మాట్లాడుతారు… ముఖ్యమంత్రి తన ఎన్నికల ప్రచారాన్ని ఒక నిర్దిష్ట నేరేటివ్ స్ధాయికి దిగజార్చుతారు. ఈ పరిస్ధితుల్లో పౌరులు ఎంతకైనా తెగించడం మనం చూడాల్సి వస్తుంది” అని ఆమె సరిగ్గా పరిస్ధితిని వివరించారు.

హరిద్వార్ విద్వేష ప్రసంగాల పర్యవసానం

హైద్రాబాద్ కు చెందిన 67 యేళ్ళ ఖలీదా పర్వీన్ ఫోటో కూడా బుల్లి బాయ్ ఆప్ లో ప్రత్యక్షం అయింది. ఆమె ట్విట్టర్ హ్యాండిల్ ని కూడా ఆప్ లో ఇవ్వడం గమనార్హం. ఆమె చురుకైన సామాజిక కార్యకర్త. సి‌ఏ‌ఏ వ్యతిరేక ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఆమె మానవ హక్కుల కార్యకర్త కూడా. దశాబ్దాలుగా మానవ హక్కుల రంగంలో కృషి చేస్తున్నారు. ఆమె అపా (అక్క) గా సుపరిచితురాలు.

హరిద్వార్ ధర్మ సంసద్ లో ముస్లింలను చంపాలని పిలుపు ఇచ్చిన నరసింగానంద్ సరస్వతి కి వ్యతిరేకంగా ఆమె సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేపట్టారు. “చురుగ్గా ఉండే ముస్లిం మహిళలను వాళ్ళు టార్గెట్ చేశారు. ఇందులో నా పేరు ఉండడం యాదృచ్ఛికం కాదు. నరసింగానంద్ ను అరెస్ట్ చేయాలని ట్విటర్ లో చురుగ్గా ప్రచారం చేశాను” అని ఖలీదా పర్వీన్ చెప్పారు.

“షాహీన్ బాగ్ ముస్లిం మహిళలు తమ ఇంటిని వదిలి నెలల తరబడి ధర్నాలో కూర్చొన్నారు. ముస్లిం మహిళలు ఒక శక్తి అని దేశానికి చూపారు. రైట్ వింగ్ పార్టీలకు వారు ఆన్ లైన్ లో గానీ బైట గానీ ప్రమాదకరం అయ్యారు. విజయం సాధించే దాకా ఇంటికి వెళ్లబోరని వారికి తెలిసి వచ్చింది. అందుకే అలాంటి ముస్లిం మహిళల నోరు మూయించాలని వారు భావించారు” అని ఖలీదా బుల్లి బాయ్ మర్మం వివరించారు.

“అనేక మంది ముస్లిం మహిళలు, పురుషులు ఇతర కార్యకర్తలు నరసింగానంద్ వ్యతిరేక ఆన్ లైన్ ప్రచారానికి నాయకత్వం వహించారు, పాల్గొన్నారు. ఈ ప్రచారం నుండి దృష్టి మళ్లించడం ఈ ఆప్ లక్ష్యాల్లో ఒకటి. నాలాంటి వయసు మళ్లిన ముస్లిం మహిళలను చూసినా వారు బెదిరిపోతున్నారు. నా ఫోటో పెట్టినందుకు నేను సిగ్గు పడడం లేడు. నిజానికి నా ఫోటో పెట్టినందుకు వాళ్ళే సిగ్గుపడాలి” అని ఆమె ధైర్య ప్రకటన చేశారు.

స్మృతి ఇరానీ మౌనం

స్మృతి ఇరానీ కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి. ఆమె ఇంతవరకు ఒక్క మాట కూడా బుల్లి బాయ్ వ్యవహారంలో మాట్లాడలేదు. ఒక్క ఖండన ప్రకటన కూడా జారీ చేయలేదు.

ఇప్పుడే కాదు. సుల్లీ డీల్స్ ఆప్ విషయంలోనూ ఆమె స్పందించలేదు. శివసేన ఎం‌పి అప్పుడు కూడా పదే పదే కేంద్ర మహిళా మంత్రికి సిల్లీ డీల్స్ విషయంలో లేఖలు రాశారు. కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు. ఎఫ్‌ఐ‌ఆర్ ఎందుకు దాఖలు చేయడం లేదని ప్రశ్నించారు. ఆమె ప్రశ్నలు, లేఖలు అన్నీ కొన్ని వెబ్ పత్రికలు కవర్ చేశాయి. ప్రధాన పత్రికలు, చానెళ్లు మాత్రం మౌనం పాటిస్తూ వచ్చాయి.

విచిత్రం ఏమిటంటే ఢిల్లీ పోలీసులు తాము గిట్ హబ్ కు సమాచారం కోసం లేఖలు రాశామని కానీ వారు సమాధానం ఇవ్వడం లేదని సాకు చెప్పడం. బాధితులు సమాచారం అడిగినా ఇదే సమాధానం ఇచ్చారు. ప్రియాంక చతుర్వేది అడిగినా ఇదే సమాధానం వచ్చింది.

త్వరగా స్పందించాలని కేంద్ర ప్రభుత్వం ట్విటర్ ని అధికారికంగా డిమాండ్ చేసినప్పుడు గిట్ హబ్ ని ఎందుకు అడగరు అని కూడా ప్రియాంక ప్రశ్నించారు. “కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. వాటిని పాటించాలి” అని వారు బదులిచ్చారు తప్ప వాస్తవ కృషి చేయనే లేదు.

కానీ ముంబై పోలీసులు కేవలం రెండు మూడు రోజుల్లో గిట్ హబ్ నుండీ, ట్విటర్ నుండి సమాచారం పొందారు. నిందితుల ఐ‌పి నెంబర్లు రాబట్టారు. ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేశారు. మరింత మంది నిందితుల్ని త్వరలో అరెస్ట్ చేయబోతున్నట్లు కూడా చెబుతున్నారు.

ప్రభుత్వాలు గానీ పోలీసులు గానీ  చిత్తశుద్ధితో తలచుకుంటే పాతాళాన్ని కూడా తిరగేయగలరనీ అందుకు తగిన అధికారం, శక్తి, వనరులు వారికి ఉన్నాయనీ ముంబై పోలీసుల స్పందన ద్వారా తెలియ వస్తోంది. ఢిల్లీ పోలీసులు సిగ్గు పడాలి. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రి, హోమ్ మంత్రి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఏ మాత్రం నిజాయితీ ఉన్నా తల దించుకోవాలి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s