అమ్మాయి 18, అబ్బాయి 21 బుల్లి బాయ్ ఆప్ ముద్దాయిలు!


Bully, Bye! -3 suspects arrested! -The Quint

యువత ఎటు ప్రయాణిస్తోంది? ఇప్పుడే ఇంటర్ దాటిన ఓ టీనేజి అమ్మాయి, ఇంజనీరింగ్ చదువుతున్న ఓ నూనూగు యువకుడు ఇంతటి ద్వేషాన్ని తమ మెదళ్లలోకి ఎలా ఎక్కించుకున్నారు?

ఎలాంటి వ్యక్తిగత కారణం లేకుండా, ఎలాంటి సంఘటన జరగకుండా, ఏ విధంగానూ సంబంధం లేకుండా అంత చిన్న వయసులో ముస్లిం స్త్రీలను ఆన్ లైన్ లో వేలానికి పెట్టే టంతటి విద్వేషం వారికి ఎందుకు పుట్టింది? ఇది ఆట అనుకున్నారా?

ఫేస్ బుక్, ట్విటర్ ఖాతాల నుండి ఆయా మహిళలు యువతుల అనుమతి లేకుండా వారి ఫోటోలను తస్కరించి, వాటిని మార్ఫింగ్ చేసి వారిని వేలం వేస్తున్నట్లుగా ఆన్ లైన్ యాప్ లో పబ్లిష్ చేసేటంత నీచ స్థాయికి వారి ఆలోచనలు ఎందుకు దిగజారాయి.

ఒక తల్లికి పుట్టిన యువకుడు, తానే అమ్మాయి అయిన అమ్మాయి… వీరికి ఫిమేల్ స్నేహితులు, సోదరీ మణులు, మహిళా టీచర్, ఇష్టమైన ఆంటీ, ప్రాణప్రదమైన చెల్లెలు… ఇలాంటి ఆరోగ్యకరమయిన సంబంధాలు ఏమీ లేవని అనుకోవాలా?

ఇంత డిప్రేవిటీ, ఇంత దిగజారుడుతనం, ఇంత అనైతికత, ఇంత నెగిటివిటీ, ఇంత అసభ్యత, ఇంతటి నీతి బాహ్యత 18 సం.ల టీనేజి అమ్మాయికి ఎలా సాధ్యం? ఇంత ఘోరమైన చర్యలో టీనేజీ అమ్మాయి ప్రధాన పాత్ర పోషించడం ఏ తప్పించుకోలేని కారణాలవల్ల సంభవించింది?

6 నెలల క్రితమే సల్లి డీల్స్ పేరుతో ఇదే మానసిక తుప్పు ని ‘సల్లి డీల్ ఆఫ్ ద డే’ పేరుతో ‘సల్లీ డీల్స్’ అనే యాప్ లో ప్రదర్శించ బడింది. అప్పుడు ఇవే హాహాకారాలు అందరు చేసారు. ఢిల్లీ పోలీసులు ఇదిగో కేసు పెట్టాం అన్నారు. ఆ తర్వాత పరిశోధన చేస్తున్నాం అన్నారు. అందులో ఏమి తేల్చారో తెలియదు. ఎవరు నేరస్థులో చెప్పలేదు. ఉత్తుత్తి హడావుడి చేసి సద్దు మణిగేలా చేసారు.

ఇప్పుడు అదే యాప్ పేరు మార్చుకుని, రూపం మార్చుకుని ‘బుల్లి బాయ్స్ (Bulli Bais)’ పేరుతొ అదే గిట్ హబ్ వేదిక గా మళ్ళీ ప్రత్యక్షం అయింది. ‘బుల్లి బాయ్ ఆఫ్ ద డే’ పేరుతొ ముస్లిం అమ్మాయిలూ, ఆడవాళ్ళ ఫోటోల్ని వేలం పేరుతో ప్రదర్శిస్తున్నారు. ఈ యాప్ వెనుక 18 ఏళ్ళ శ్వేతా సింగ్ (ఉత్తరాఖండ్), 21 యేళ్ళ విశాల్ కుమార్ (బెంగుళూరు) ఉన్నారని ముంబై పోలీసులు వెల్లడి చేసారు. ఇద్దరినీ అరెస్ట్ చేసినట్లు చెబుతున్నారు.

ఈసారి ముంబై పోలీసులు కూడా కేసు నమోదు చేశారు కనుక పరిశోధన ముద్దాయిలను గుర్తించేవరకు వెళ్ళినట్లు కనిపిస్తోంది. మళ్ళీ అదే ఘనత వహించిన ఢిల్లీ పోలీసులే పరిశోధన చేస్తే ఈ మాత్రం ముందడుగు పడేదో లేదో అనుమానమే. అనుమానం ఎందుకంటే ఢిల్లీ పోలీసులు పని చేసేది కేంద్ర ప్రభుత్వం క్రింద. హోమ్ మంత్రిత్వ శాఖ అధిపతి అమిత్ షా నేతృత్వంలో ఢిల్లీ పోలీసులు పని చేస్తారు.

సి‌ఏ‌ఏ తాలూకు ఢిల్లీ అల్లర్లలో ఉదాసీనంగా, పక్షపాతంతో, అనాసక్తితో పరిశోధన చేసినందుకు ఢిల్లీ పోలీసులు అనేకసార్లు మేజిస్ట్రేట్, సెషన్స్ కోర్టుల్లో మొట్టి కాయలు తినడం ఈ సందర్భంగా ప్రస్తావనార్హం. అదే ముస్లింలపై కేసులు పెట్టడంలో, వారిని అరెస్ట్ చేయడంలో వచ్చేసరికి ఢిల్లీ పోలీసులు ఆఘమేఘాల మీద స్పందిస్తారు. అసలు నేరం జరిగిందో లేదో కూడా చూసే పరిస్ధితి కనపడదు.

సల్లీ డీల్స్, బుల్లి బాయ్ యాప్ లలో ప్రదర్శించిన మహిళలు దాదాపు అందరూ ఎదో ఒక రంగం లో ప్రముఖ కృషి జరుపుతున్న ముస్లిం మహిళలే. జర్నలిస్టులు, హక్కుల కార్య కర్తలు, సోషల్ మీడియా ప్రముఖులు… ఇలా ఎంతో కొంత ఫాలోయింగ్ ఉన్నవారు. ఇలాంటి దుశ్చర్య ద్వారా ముస్లిం మహిళలను టెర్రరైజ్ చేయాలనీ కుట్ర పన్నారా? ఒక పెద్ద విస్తృతమైన మత విద్వేష కుట్రలో ఈ టీనేజీ అమ్మాయి ఇంజనీరింగ్ కుర్రాడు కేవలం నిమిత్తమాత్రులా? 6 నెలల వ్యవధి లోనే ఇదే తరహా దాడి మళ్ళీ మళ్ళీ జరగడం మామూలు విషయం అయితే ఖఛ్చితంగా కాదు.

NDTV చర్చలో పాల్గొంటూ చరిత్ర కారిణి రాణా సఫ్వి ఈ టీనేజీ అమ్మాయి, బి టెక్ విద్యార్థి ఇద్దరు నిజానికి గత కొన్ని ఏళ్లుగా దేశంలో జరుగుతున్న హిందుత్వ విష ప్రచారం, ముస్లిం వ్యతిరేక దాడులు, పర మతాలకు వ్యతిరేంగా రెచ్చగొట్ట బడుతున్న దుష్ప్రవర్తనలు మున్నగు వాటి బాధితులు (Victims of hate campaign) అని అభివర్ణించారు. విలేఖరి సిద్రా పటేల్ కూడా ఈ అభిప్రాయంతో ఏకీభవించారు. వీరు ఇద్దరి ఫోటోలను బుల్లి బాయ్ ఆప్ లో ప్రదర్శించారు.

రాణా సఫ్వే, సిద్రా పటేల్ అభిప్రాయాల్లో నిజం లేకపోలేదు. అభం శుభం ఎరుగని యువత, గత ఆరు ఏడు సంవత్సరాలుగా దేశంలో అలుపు లేకుండా జరుగుతున్న మత విద్వేష ప్రచారాలకు, తప్పుడు వార్తలకు, సోషల్ మీడియా కేంపెయిన్ లకు ప్రభావితులు అయి ఉండవచ్చు. తద్వారా వారే ఒక కోణంలో బాధితులు కావచ్చు. కానీ యువతి యువకుల్లో సహజంగా ఉండే శాస్త్రీయ ఉత్సుకత, హేతుబద్ధత, ప్రశ్నించే మనస్తత్వం, స్టేటస్ కో ని నిలదీసే తిరుగుబాటు తత్వం… ఇవన్నీ మంత్రించినట్లు ఎందుకు మాయం అవుతున్నాయి?

ఇందుకు ముఖ్య కారణం ప్రత్యామ్నాయ భావజాలం దాదాపు లేకుండా పోవడం. అత్యంత మూఢత్వంలో భారత సమాజం మగ్గిన కాలంలో కూడా చార్వాకులు లాంటి హేతువాదులు అనేక నిర్బంధాల మధ్య తమ హేతుబద్ధ భావజాలాన్ని మత మౌఢ్య వ్యతిరేకతను ప్రచారం చేశారు. హిందూ మతంలో సైతం అనేక చోట్ల మత సంస్కర్తలు తయారై అంటరానితనం, స్త్రీల అణచివేత, బాల్య వివాహం లాంటి దురాచారాలకు వ్యతిరేకంగా పరిమిత పరిధిలోనే అయినా, హిందూ మత సంస్కరణకు ప్రయత్నాలు చేశారు. శంకరాచార్యుల దగ్గర నుండి వివేకానంద స్వామి, రాజారామ మోహన్ రాయ్, వీరేశలింగంల వరకు ఇలాంటి సంస్కరణలకు పూనుకున్నారు.

ప్రస్తుతం ఆ పరిస్ధితి కనపడడం లేదు. లిబరల్ బూర్జువా పార్టీ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా బి‌జే‌పి-ఆర్‌ఎస్‌ఎస్ ల హిందూత్వ దూకుడుకు ప్రతిఘటనగా కనీసం తమ పార్టీ ప్రభోదించే లిబరల్ డెమోక్రసీ రాజకీయాలను కాపాడుకునేందుకైనా ప్రత్యామ్నాయ నినాదాలను, ఉద్యమాలను నిర్మించలేని భావ దరిద్రంలో మగ్గుతున్నారు. పైగా వాళ్ళు కూడా హిందూత్వ రాజకీయాల ఒరవడిలో కొట్టుకుపోతూ సాఫ్ట్ హిందూత్వను అనుసరించే ప్రయత్నం చేస్తున్నారు.

నిజమైన హిందూయిజం, హిందూత్వ వేరు వేరు అంటున్నారే గానీ జవహర్ లాల్ నెహ్రూ ప్రభోధించిన సైంటిఫిక్ టెంపర్, హేతుబద్ధత, శాస్త్ర బద్ధ భావజాలాలను ధైర్యంగా ముందుకు తేలేకపోతున్నారు. అలా చేస్తే ఎక్కడ ఓట్లు కోల్పోతామో అన్న భయంలో ఉండిపోతున్నారు. ఇది నిజానికి బి‌జే‌పి-ఆర్‌ఎస్‌ఎస్ ల హిందూత్వ రాజకీయాల విజయం.

మరీ ముఖ్యంగా కమ్యూనిస్టు ఉద్యమం ఎదుర్కొంటున్న దీన పరిస్ధితి హిందూత్వ రాజకీయాలకు వర ప్రదాయని అయింది. కమ్యూనిస్టు మౌలిక సిద్ధాంతాన్ని త్యజించిన రివిజనిస్టు పార్టీలు ఒక పక్కా, ముక్కలుగా చీలిపోయిన విప్లవ కమ్యూనిస్టు పార్టీలు మరొక పక్కా కొనసాగుతున్న ఫలితంగా కమ్యూనిస్టు ఉద్యమం బలహీనం అయిపోయింది. దళిత, ఫెమినిజం, ఎం‌ఆర్‌పి‌ఎస్ లాంటి ఐడెంటిటీ ఉద్యమాలు విప్లవ రాజకీయాల్లోకి చొరబడడం వల్ల కలిగిన అయోమయం నుండి విప్లవ కార్యకర్తలు పూర్తిగా తేరుకోనేలేదు.

విద్యా సంస్ధల నిర్వహణలో ప్రైవేటు లాభార్జనా కంపెనీలు ప్రవేశించడంతో ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల నిర్వహణ నుండి ప్రభుత్వాలు వైదొలిగాయి. దానితో విద్యార్ధులను చైతన్యవంతులను కావించే విద్యార్ధి రాజకీయాలకు క్యాంపస్ లలో చోటు కరువయింది. సమాజం విద్యార్ధులను డాలర్లు ఆర్జించే యంత్రాలుగా పరిగణిస్తోంది. ఈ పరిస్ధితి ఎలాంటి చైతన్యం విద్యార్థుల దారి చేరకుండా నిరోధిస్తోంది.

ఈ పరిస్ధితిని లిబరల్ బూర్జువా కాంగ్రెస్ పార్టీ, రివిజనిస్టు కమ్యూనిస్టు పార్టీలు, విప్లవ కమ్యూనిస్టు పార్టీలూ అందరూ అధిగమించాల్సి ఉన్నది. అధిగమిస్తే తప్ప భారత దేశం/భారత ప్రజలు ఈ దీన పరిస్ధితి నుండి బైటపడలేదు/బైటపడలేరు.

అప్ డేట్: బెంగుళూరు నుండి మరో నిందితుడు మయాంక్ రావల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s