
New variant IHU
ఇండియాలో ‘ఒమిక్రాన్’ వేరియంట్ విజృంభణ ఇంకా అందుకోనే లేదు, మరో కొత్త రకం కోవిడ్ వైరస్ ని ఫ్రాన్స్ పరిశోధకులు కనుగొన్నారు. ఆఫ్రికా దేశం కామెరూన్ నుండి తిరిగి వచ్చిన వ్యక్తిలో ఇండెక్స్ కేసు (మొదటి కేసు) కనుగొన్నట్లు ‘ఐహెచ్‌యూ మేడిటెరనీ’ అనే పరిశోధనా సంస్థ ప్రకటించింది.
దక్షిణ ఫ్రాన్స్ ఫ్రాన్స్ లో కనుగొన్న కొత్త రకం కోవిడ్ వైరస్ ను ఇప్పటికే 12 మందిలో కనుగొన్నారు. మ్యుటేషన్ పరిభాషలో ఈ రకాన్ని B.1.640.2 వేరియంట్ గా పిలుస్తున్నారు. ఒమిక్రాన్ కంటే అధిక సంఖ్యలో ఇందులో ఉత్పరివర్తనాలు (Mutations) జరిగినట్లు పరిశోధకులు చెప్పారు.
తాజా అధ్యయనాన్ని ఇతర శాస్త్రవేత్తలు/పరిశోధకులు రివ్యూ చేయవలసి ఉన్నది. ప్రీ ప్రింట్ రిపాజిటరీ అయిన MedRxiv లో పరిశోధనా వివరాలను పొందుపరిచారు.
IHU రకం కోవిడ్ వైరస్ లో 46 ఉత్పరివర్తనాలు, 37 తొలగింపులు (డిలిషన్స్) చోటు చేసుకున్నాయి. ఫలితంగా 30 అమినో యాసిడ్ ప్రతిక్షేపణలు (substitutions), 12 తొలగింపులు చోటు చేసుకున్నాయి.
అమినో యాసిడ్స్ అంటే అవి కూడా పరమాణువులే (Molecules). ప్రోటీన్లు ఏర్పడేందుకు ఇవి దోహదం చేస్తాయి. ప్రోటీన్లు, అమినో యాసిడ్లు… ఈ రెండే జీవం లోని ప్రధాన అంశాలు.
ఒమిక్రాన్ వలెనే ఐహెచ్‌యూ రకంలో కూడా స్పైక్ ప్రోటీన్ లోనే ఎక్కువగా మ్యుటేషన్లు జరిగాయని పరిశోధకులు తేల్చారు. స్పైక్ ప్రోటీన్ లోనే 14 అమినో యాసిడ్ ప్రతిక్షేపణలు, 9 తొలగింపులు చోటు చేసుకున్నాయి.
నూతన రకం కోవిడ్ వైరస్ విషయాన్ని అమెరికన్ ఎపిడమాలజిస్టు ఎరిక్ ఫీగల్-డింగ్ ప్రకటించాడు. “కొత్త రకం సార్స్-కోవ్-2 రకాల ఆవిర్భావం యొక్క అనూహ్యతలను ఈ పరిశీలనలు మరోసారి నిరూపిస్తున్నాయి. ఎప్పుడు ఏ దేశం నుండి ఇవి వ్యాపిస్తాయో చెప్పలేము. ఈ తరహా (విదేశాల నుండి) ప్రవేశాలను, వ్యాప్తిని అంచనా వేయడంలో ఉన్న కష్ట నష్టాలను ఇవి సోదాహరిస్తున్నాయి” అని ఎరిక్ ట్విట్టర్ లో పేర్కొన్నాడు.
అయితే కొంతలో కొంత నయం ఏమిటంటే ఐహెచ్‌యూ వేరియంట్ ను షార్ట్ కట్ పరీక్షల ద్వారా గుర్తించవచ్చు. మొత్తం జీనోమ్ ను విశ్లేషించి చూడవలసిన అవసరం లేదు. అనగా IHU వేరియంట్ ను గుర్తించడానికి అధికంగా శ్రమించనవసరం లేదు.
కొత్త రకం వేరియంట్లను నిరంతరం కనుక్కుంటూనే ఉంటారనీ అయితే అవన్నీ ప్రమాదకరం కానవసరం లేదని ఎరిక్ తెలిపాడు. సరికొత్త మ్యుటేషన్ల కారణంగా తనను తాను వేగంగా మల్టిప్లై చేసుకోగల, మరియు వేగంగా విస్తరించగల సామర్ధ్యాన్ని బట్టే ఒక వేరియంట్ ని ప్రమాదకరామా కాదా అన్నది నిర్ణయించబడుతుంది.

Patients in Paris waiting to be tested -WION
ఫ్రాన్స్ లో ఇప్పటికే ఒమిక్రాన్ రకం కోవిడ్ వైరస్ కేసులు ప్రతి రోజూ లక్షల సంఖ్యలో నమోదవుతున్నాయి. ప్రస్తుతం రికార్డు స్ధాయిలో రోజుకు 2 లక్షల కేసులు పైగా నమోదు అవుతున్నాయి. కాగా ఈ సంఖ్య 3 లక్షల నుండి 4 లక్షల వరకు పెరగవచ్చని ఫ్రాన్స్ ఆరోగ్య మంత్రి ఆలివర్ వీరన్ ప్రకటించాడు.
ఫ్రాన్స్ ఆరోగ్య మంత్రి బహుశా చివరి కోవిడ్ వైరస్ వేవ్ కావొచ్చని అంచనా వేస్తున్నాడు. వ్యాక్సిన్ వేసిన వారి సంఖ్య బాగా ఎక్కువగా ఉండడం, ఇప్పటికే అత్యధిక సంఖ్యలో వైరస్ సోకడం ఇందుకు కారణం అని ఆయన అంచనా వేస్తున్నాడు.
అయితే ఓ పక్క డెల్టా రకం సోకినప్పటికీ మరో పక్క ఒమిక్రాన్ రకం సోకిన రొగులు గూడా ఉంటున్నారు. అనగా ఒక సారి వైరస్ సోకి వ్యాధి తగ్గినంత మాత్రాన మరో కొత్త రకం వైరస్ మరోసారి ఆ వ్యక్తికి సోకబోదు అన్న గ్యారంటీ ఏమీ ఉండడం లేదు. ఒరిజినల్ సార్స్-కోవ్-2 వైరస్ సోకి తగ్గిన వారికి మళ్ళీ డెల్టా రకం సోకడం ఇండియాలో కూడా చాలా మంది విషయంలో జరిగింది.
కనుక ఫ్రాన్స్ ఆరోగ్య మంత్రి వ్యక్తం చేస్తున్న ఆశాభావంలో పెద్దగా ఆశ కనిపించడం లేదు.
IHU రకం వైరస్ ని ఫ్రాన్స్ తప్ప ఇతర దేశాల్లో కనుగొన లేదు. WHO కూడా ఈ రకాన్ని “పరిశోధన చేయవలసిన వేరియంట్” (Variant under investigation) గా ప్రకటించలేదు. ఈ లేబుల్ ప్రకటించాక “ఆందోళన కరమైన వేరియంట్” (Variant of concern) గా మరో లేబుల్ ను WHO తగిలించాకనే దాని గురించి ఆలోచించాల్సి ఉంటుంది. అది జరగక పోతే అదృశ్యం అయిపోయిన వేరియంట్ల జాబితాలో అది చేరిపోతుంది.