P5 అంటే ‘పర్మినెంట్ 5’ అని అర్ధం. ఐరాస భద్రతా సమితి (Security Council) లో 5 శాశ్వత సభ్య దేశాలను షార్ట్ కట్ లో P5 అని సంభోధిస్తారు.
రష్యా, బ్రిటన్, చైనా, అమెరికా, ఫ్రాన్స్… ఈ 5 దేశాలు భద్రతా సమితిలో శాశ్వత సభ్యత్వం కలిగి ఉన్న దేశాలు. ఈ దేశాలకు భద్రతా సమితిలో ఏ నిర్ణయాన్నైనా వీటో చేసే హక్కు ఉంటుంది. అనగా ఏ నిర్ణయమైనా ఈ 5 దేశాలు ఆమోదిస్తేనే జరుగుతుంది.
ఈ 5 వీటో దేశాలు సోమవారం (జనవర్ 3, 2022) ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. మరిన్ని అణ్వాయుధాల విస్తరణకు పూనుకోకూడదని, అణు యుద్ధానికి పాల్పడకూడదని నిర్ణయించినట్లు తమ ప్రకటనలో పేర్కొన్నాయి.
అణ్వస్త్ర దేశాల మధ్య యుద్ధం జరగకుండా నిరోధించాలని, తద్వారా వ్యూహాత్మక ప్రమాదాలను తగ్గించుకోవాలని ఈ ప్రకటనలో 5 దేశాలు ఆకాంక్షించాయి.
“అణు యుద్ధంలో ఎవరూ విజేతలు కాలేరనీ, అణు యుద్ధానికి ఎన్నటికీ పాల్పడ కూడదనీ మేము నొక్కి చెబుతున్నాము. అణు అస్త్రాల వినియోగం అత్యంత తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది కనుక, అణ్వస్త్రాలు ఉనికిలో ఉన్నంత వరకు, అవి కేవలం రక్షణ అవసరాలు తీర్చడానికి, దూకుడు దాడులను అరికట్టాలని, యుద్ధాన్ని నిరోధించాలనీ మేము ధృవీకరిస్తున్నాము” అని రష్యా ప్రభుత్వం విడుదల చేసిన ఉమ్మడి ప్రకటన పేర్కొంది (వరల్డ్ ఈజ్ వన్ న్యూస్, 4/1/2022).
ఉక్రెయిన్ కేంద్రంగా రష్యా, అమెరికాల మధ్య మాటల యుద్ధం తీవ్రం అవుతున్న నేపధ్యంలో తాజా ప్రకటన వెలువడింది.
గత కొన్ని వారాలుగా ఉక్రెయిన్ సరిహద్దు సమీపంలో రష్యా తన సైన్యాన్ని పెద్ద సంఖ్యలో తరలిస్తున్నదని, ఆయుధ సంపత్తిని కేంద్రీకరిస్తున్నదని పశ్చిమ దేశాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఆరోపణలను రష్యా వ్యతిరేకించడం లేదు. తమ సైన్యం, ఆయుధాలను తమ దేశ సరిహద్దుల లోపల మాత్రమే కదిలిస్తున్నామని స్పష్టం చేసింది. ఇది ఏ అంతర్జాతీయ చట్టానికి వ్యతిరేకం కాదని గుర్తు చేస్తోంది.
ఉక్రెయిన్ సరిహద్దుల వద్దకు తన సైన్యం మోహరింపుకు రష్యా తన కారణం తాను చెబుతోంది.
ఇటీవల కాలంలో ఉక్రెయిన్ ను నాటో సైనిక కూటమిలో సభ్య దేశంగా చేర్చుకునే అవకాశం ఉన్నదని నాటో అధికారులు, అమెరికా విదేశీ శాఖ అధికారులు వరుస ప్రకటనలు గుప్పిస్తున్నారు. జార్జియా కు కూడా నాటో సభ్యత్వం ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని ప్రకటించారు.
ఈ ప్రకటనలను రష్యా గట్టిగా నిరసిస్తోంది. ఉక్రెయిన్ ను నాటో సభ్య దేశంగా చేర్చుకోవడం అంటే రష్యాతో యుద్ధం ప్రకటించడమే అని స్పష్టం చేసింది. తమ దేశ సరిహద్దుల వరకు నాటో కూటమిని విస్తరించడానికి అనుమతించడం తమకు ఆత్మహత్యా సదృశమేనని దాన్ని నిరోధించేందుకు ఎలాంటి చర్యకైనా వెనుకాడేది లేదని ప్రకటించింది.
1990ల్లో యెల్టిసిన్ హయాంలో నాటో కూటమి రష్యాకు ఒక మాట ఇచ్చింది. నాటో కూటమిని ఎట్టి పరిస్ధితుల్లోనూ తూర్పు దిశలో విస్తరించబోమన్నదే ఆ మాట సారాంశం. దీని అర్ధం తూర్పు యూరప్ దేశాలను నాటో కూటమిలో చేర్చుకోబోమని చెప్పడం. ఇది మాట వరకే పరిమితం. చట్టబద్ధ ఒప్పందం ఏమీ జరగలేదు.
కానీ తన మాటను అమెరికా/నాటో పాటించలేదు. మాట ఇచ్చిన మరోసటి రోజు నుండే దాన్ని ఉల్లంఘించడం మొదలు పెట్టింది. ఒకప్పటి సోవియట్ రష్యా లో భాగంగా ఉన్న తూర్పు యూరప్ రాజ్యాలను, మధ్య ఆసియా రాజ్యాలను వరుస పెట్టి నాటో కూటమిలో చేర్చుకోవడం ప్రారంభించింది.
పోలండ్ తో మొదలు కొని బాల్కన్ రిపబ్లిక్ లు చివరికి బాల్టిక్ రిపబ్లిక్ లను కూడా నాటో లో చేర్చుకుంది. అమెరికా ఆయా దేశాలతో తరచుగా రష్యాకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రకటనలు ఇప్పిస్తూ వచ్చింది. ఎన్ని చేసినప్పటికీ ఇప్పటివరకు రష్యా మౌనం వహించింది.
ఉక్రెయిన్, జార్జియా లకు కూడా నాటో సభ్యత్వం ఇస్తామని చెప్పడంతో రష్యా మౌనం వీడింది. ఈ చర్య తన భద్రతా ప్రయోజనాలకు తీవ్ర విఘాతం అని అది భావిస్తోంది.

Mi17 V5 Helicopter
ఈ సంగతిని అమెరికా గానీ, నాటో అధికారులు గానీ ప్రస్తావించడం లేదు. ఉక్రెయిన్ పైన దాడికి రష్యా ఏర్పాట్లు చేస్తోందని ఆరోపిస్తున్నారు. రష్యా దాడికి పూనుకుంటే దాన్ని అడ్డుకుని తీరతామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రోజుకోసారి ప్రకటిస్తున్నాడు.
పశ్చిమ పత్రికలు ఈ అంశంపై కావలసినంత రచ్చ చేస్తున్నాయి. రష్యాను అమెరికా హెచ్చరించిందని, బైడెన్, పుతిన్ కు ఫోన్ చేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడనీ వార్తలు గుప్పిస్తున్నాయి. ఈ వార్తల్ని భారత పత్రికలు యధావిధిగా ప్రచురిస్తూ రష్యా వ్యతిరేక ప్రచారానికి యధాశక్తి సహకరిస్తున్నాయి.
రష్యా ఇటీవలే ఎస్-400 లాంటి అత్యాధునిక మిసైల్ రక్షణ వ్యవస్ధను సమకూర్చిన సంగతిని విస్మరిస్తున్నాయి. ఎస్-400 ను కొన్నందుకు అమెరికా త్వరలో ఇండియాపై ఆంక్షలు విధించబోతున్న సంగతిని విస్మరిస్తున్నాయి.
అమెరికా బెదిరించడం వల్లనే ఇండియా-రష్యాల మధ్య కుదిరిన 150 వరకూ మిలట్రీ హెలికాప్టర్ల (Mi-17V5) అమ్మకం ఒప్పందం ఫైనల్ కాకుండా వెనక్కి పోయే ప్రమాదం ముంచుకొచ్చిన సంగతిని విస్మరిస్తున్నాయి. ఈ హెలికాప్టర్లకు శక్తివంతమైన ఫ్రాన్స్ తయారీ ఇంజన్లను బిగించాల్సి ఉన్నది. కానీ అలా చేస్తే ఫ్రాన్స్, ఇండియాలపై వాణిజ్య, ఆర్ధిక ఆంక్షలు విధించే కాట్సా చట్టాన్ని (Countering America’s Adversaries Through Sanctions Act) అమెరికా ఇప్పటికే తయారు చేసి పెట్టుకున్న సంగతిని భారత పత్రికలు, విశ్లేషకులు విస్మరిస్తున్నారు.