
Satyapal Malik with PM Narendra Modi
ప్రధాన మంత్రి నరేంద్ర మోడి అహంకారి అని మేఘాలయ గవర్నర్ సత్య పాల్ మాలిక్ అభివర్ణించారు. రైతుల సమస్య గురించి చర్చించడానికి వెళితే ఇద్దరం వాదులాడుకోవలసిన పరిస్ధితి ఏర్పడిందని ఆయన చెప్పుకొచ్చారు. (ఇండియన్ ఎక్స్^ప్రెస్, జనవరి 3, 2022)
బిజేపి నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని అదురు బెదురు లేకుండా విమర్శించే బిజేపి నేతల్లో సత్య పాల్ మాలిక్ ఒకరు. రెండు అధికార కేంద్రాలు (నరేంద్ర మోడి, ఆర్‌ఎస్‌ఎస్) ఉన్న చోట ఇలా ఒక పార్టీలోని వారే విమర్శించుకోవడం పరిపాటే అయినా మోడి లాంటి ప్రధాన మంత్రికి వ్యతిరేకంగా లేదా ఆయన విధానాలకి వ్యతిరేకంగా… విమర్శిస్తూ మాట్లాడడం అంటే అది చెప్పుకోదగ్గ సంగతే.
మోడి ప్రభుత్వం అంతిమంగా రైతుల డిమాండ్లకు తల ఒగ్గక తప్పదని ముందుగా చెప్పినవారిలో సత్య పాల్ మాలిక్ ఒకరు. గత నవంబర్ నెలలో జైపూర్ లో మాట్లాడుతూ ఆయన ఎప్పటికైనా రైతుల పోరాటం ముందు కేంద్రం తల వంచాల్సిందే అని స్పష్టం చేశారు.
రైతుల డిమాండ్లను ఆలస్యం చేయకుండా అంగీకరించాలని మేఘాలయ గవర్నర్ పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు. రైతుల ఆందోళనకు మద్దతుగా, మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆయన అనేకసార్లు కేంద్ర ప్రభుత్వం పైన దాడి చేశారు కూడా.
నా కోసం చనిపోయారా?
హర్యానాలోని దాద్రి లో జరిగిన ఒక సామాజిక ఉత్సవంలో పాల్గొని మాలిక్ ప్రసంగించారు. తాను ప్రధాని మోడిని కలిసి మాట్లాడిన సంగతిని ఆయన ఆ సమావేశంలో చెప్పారు.
“రైతుల సమస్య పైన చర్చించేందుకు ప్రధాన మంత్రిని కలవడానికి వెళ్లినప్పుడు 5 నిమిషాల్లోనే మేమిద్దరం పోట్లాటలోకి దిగవలసి వచ్చింది. మన సొంత రైతులే 500 మంది చనిపోయారు అని నేను చెప్పినప్పుడు, ఆయన ‘వాళ్ళు నా కోసం చనిపోయారా?’ అని ప్రశ్నించారు.
“నేను ‘అవును, మీరు రాజు గారు గనక మీ కోసమే చనిపోయారు’ అని చెప్పాను. కొద్ది సేపటికే ఆయనతో వాదన చేయాల్సి వచ్చింది. అమిత్ షా ని కలవమని ఆయన చెప్పారు. నేను కలిశాను” అని మేఘాలయ గవర్నర్ సత్య పాల్ మాలిక్ వివరించారు.
“రైతులు నా కోసం చనిపోయారా?” అని ప్రజలను పాలించే ఏ నేత అయినా, అదీ ఒక ప్రధాన మంత్రి అనడం వింతల్లోకెల్లా వింత. వింత కూడా కాదు, చాలా దారుణమైన విషయం.
వారణాసి ప్రజలు ఓట్లు వేసి తమ ఎంపి గా మోడిని గెలిపించారు. ఆ తర్వాత బిజేపి పార్టీ ఎంపి లు తమ పార్లమెంటరీ పార్టీ నాయకుడుగా నరేంద్ర మోడిని ఎన్నుకున్నారు. ఆ విధంగా మాత్రమే ప్రజా ప్రతినిధిగా ఆయన ప్రధాన మంత్రి పదవిని అధిష్టించారు.
అంతే తప్ప ఆయన చంద్ర గుప్త మౌర్య వారసుడు అనో లేదా భరతుడి వంశాంకురం అనో ఎవరూ ఆయనకి ఆ పదవిని కట్టపెట్టలేదు. ఆ సంగతి మోడి ఎరుకలో ఉన్నదా అన్న అనుమానం కలుగుతోంది.
అవున్నిజమే. హిందూత్వ భక్తులు నరేంద్ర మోడీకి వీరాభిమానులు. కానీ వాళ్ళు కూడా ప్రజలే. భారత రాజ్యాంగం వారికి ఇచ్చిన ఓటు హక్కును వినియోగించుకుని తమ తమ నియోజకవర్గాల్లో బిజేపి ఎంపి లను గెలిపించారు. ప్రజల సొమ్ముని ప్రజల కోసం వినియోగించమని, పదవి ద్వారా సంక్రమించిన అధికారాన్ని ప్రజల సంక్షేమం, అభివృద్ధి ల కోసం వినియోగించమని వారు తమ ఓట్లని ఆయనకి, ఆయన పార్టీకి ఇచ్చారు.
అనేక సార్లు, అనేక మంది, నరేంద్ర మోడి తో సహా రైతులు దేశానికి వెన్నెముక అని ఉపన్యాసాలు దంచుతారు. తీరా అధికారం వచ్చాక కొద్ది మంది కార్పొరేట్ కంపెనీలకు దేశ వ్యవసాయ రంగాన్ని ధారాదత్తం చేస్తూ చట్టాలు చేస్తే రైతులు ఎలా బ్రతకాలి? ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సక్రమంగా వినియోగించాలని రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని ఆందోళన చేయవలసిన పరిస్ధితి రైతులకు ఎవరు కల్పించారు? మోడి నాయకత్వం లోని ప్రభుత్వమే కదా?
తప్పు సవరించుకోవడం మాని అనేక రకాలుగా రైతుల పైన నిర్బంధం ప్రయోగించారు. తీవ్రవాదులు అనీ ఇంకోటి అనీ దుష్ప్రచారం చేశారు. హిందూత్వ మూకల చేత దాడులు చేయించి హింస రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. తద్వారా ఉద్యమాన్ని హింసాత్మకంగా అణచివేసేందుకు ఎత్తులు వేశారు. అయినా ఓపిక వహించి చలిలో, ఎండలో, వానలో ఏడాది పాటు ఆందోళన చేశారు.
ప్రతికూల వాతావరణం వల్ల అయితేనేమీ, అన్నన్ని రోజులు రోడ్డుపై గడపవలసి రావడం వల్ల అయితేనేమీ గవర్నర్ మాలిక్ చెప్పినట్లు వందల మంది రైతులు ఆందోళన చేస్తూ చనిపోయారు. అటువంటి కఠిన పరిస్ధితుల్లో రైతులు చనిపోతే దేశ ప్రధాన మంత్రి “వాళ్ళు నాకోసం చనిపోయారా?” అని ప్రశ్నిస్తారా? అసలు ఇదేం లాజిక్?
ఇంతకీ దేశ ప్రజలు ప్రధాన మంత్రి కోసం ఎందుకు చనిపోతారు? అయితే గియితే కుటుంబం కోసం త్యాగాలు చేస్తారు. లేదా తమ గ్రామం కోసం త్యాగమో ప్రాంతం కోసమో త్యాగాలు చేస్తారు. లేదా రాష్ట్రం కోసమో, దేశం కోసమో ప్రాణ త్యాగం చేస్తారు. ఒక వ్యక్తి కోసం అది కూడా సకల బలగాల రక్షణలో ఉన్న ప్రధాన మంత్రి కోసం ఎందుకు చనిపోతారు?
ప్రధాన మంత్రి ప్రజల్లోకి వస్తే ఆ సందర్భంలో సంఘ విద్రోహ శక్తులు ప్రమాదం తలపడితే ఆ సందర్భంలో ప్రజలు ప్రధాన మంత్రి రక్షణకు తమ ప్రాణాలు అడ్డు వేసి కాపాడవలసిన పరిస్ధితి ఏర్పడవచ్చు. ఆ పరిస్ధితి వస్తే ప్రాణ త్యాగానికి అనేక మంది సిద్ధంగా ఉంటారు కూడా.
కానీ ఇక్కడి పరిస్ధితి అది కాదు కదా. అది కాక పోగా ప్రభుత్వమే దేశ రైతాంగ జీవన భృతిని హరించి వేసే చట్టాలతో జనంపై దాడి చేసింది. కార్పొరేట్ కంపెనీల గాదెలు నింపడానికి చట్టాలు చేసింది. విదేశీ బహుళజాతి కంపెనీల వ్యాపార లాభ దాహాన్ని తీర్చడానికి, విదేశీ ద్రవ్య కంపెనీల పెట్టుబడుల ఫైనాన్స్ దాహాన్ని తీర్చడానికి సాగు చట్టాలను రైతుల నెత్తి పైకి తెచ్చారు. రైతుల పైకి మాత్రమే కాదు; దేశ ఆహార భద్రతను ప్రమాదంలో పడేయడం ద్వారా మొత్తం ప్రజలందరి నెత్తి పైకి తెచ్చారు.
రైతుల జీవనం పైన దాడి చేస్తూ ఆ రైతులు నా కోసం చనిపోయారా అని అడగడం ఏమిటి? ఏ లాజిక్ ప్రకారం ఈ ప్రశ్న ఉదయించిందో అంతుబట్టడం లేదు.
ఇదొక సంగతైతే ప్రధాని కోసం చనిపోతేనే వారి సమస్యల గురించి పట్టించుకుంటానని ఆయన చెప్పదలిచారా?
ప్రధాన మంత్రి గానీ, అధికార పార్టీ గానీ ఒకసారి అధికారం చేపట్టిన తర్వాత వాళ్ళు ఒక పార్టీగా పని చేయడం ఆగిపోవాలి. ప్రజలను పాలించే ప్రభుత్వంగా పని చేయడం ప్రారంభించాలి. అనగా దేశంలోని 140 కోట్ల ప్రజలందరి కోసం పని చేయాలి.
అలా కాకుండా కేవలం బిజేపికి ఓట్లు వేసినవారి కోసం పని చేసినా తప్పే అవుతుంది. బహుశా అధికారం చేపట్టిన తోడనే ముస్లింలు, క్రిస్టియన్ల పైన విద్వేష ప్రచారం చేసేందుకు, దాడులు చేసేందుకు, ఇళ్ళల్లో జొరబడి ప్రార్ధనలు చేసుకుంటున్న వారిపై దాడులు చేసేందుకు రౌడీ మూకలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసిన నేపధ్యంలో ఆ న్యాయమే తానూ పాటించాలని ప్రధాని భావిస్తున్నారా? ఆ న్యాయంలో భాగంగా తన కోసం ప్రాణాలు వదిలితేనే సమస్యలు పరిష్కరిస్తానని చెప్పదలిచారా?
ప్రధాన మంత్రి ఈ మాటలు బైటికి అనలేదు. ప్రైవేటు సమావేశంలో అన్న మాటలకి ఇలా అర్ధాలు తీయవచ్చా అన్న ప్రశ్న ఉదయించవచ్చు. కానీ ఆయన ఒక రాష్ట్ర గవర్నర్ తో ఈ మాటలు అన్నారు. రైతుల సమస్యల పైన చర్చించడానికి వచ్చిన ఒక రాష్ట్ర గవర్నర్, బిజేపి నేత, అనేక యేళ్ళు ప్రభుత్వాలలో పని చేసిన నాయకుడితో ఈ మాటలు అన్నారు. ఆయన ఆ మాటల్ని ప్రజలకి/దేశానికి చెప్పారు. కనుకనే ఈ ప్రశ్నలు.
ప్రధాన మంత్రి ధోరణి ప్రజాస్వామ్య విరుద్ధం. ఆయన కోసం జనం చావడానికి ఇది రాచరికం కాదు. పోప్ లాంటి వాళ్ళు ఏలుతున్న మత రాజ్యమూ కాదు. ఇది ప్రజా స్వామ్యంగా చెబుతున్న దేశం. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం అంటూ ఆయన అమెరికాలో చాటుకున్న దేశం. ప్రజాస్వామ్య దేశంలో నేతలే ప్రజల కోసం పని చేయాలి. నేతల కోసం ప్రజలు చనిపోవాలని కోరడం అప్రజాస్వామికం.
ప్రజలు ఎప్పుడూ నాయకుల కోసం చనిపోరు. దేశం కోసం చనిపోతారు. ఒక వేళ నాయకుడి కోసం చనిపోయినా అందులో దేశ ప్రయోజనాలు ఉన్నాయని నమ్మితేనే ప్రాణ త్యాగానికి సిద్ధపడతారు.