యేడాదిలో అణు విద్యుత్ కు జర్మనీ ముగింపు! మరి ఇండియా!?


Grohnde nuclear power plant near Grohnde, Germany

జర్మనీ సాంకేతికంగా అత్యంత అభివృద్ధి చెందిన దేశం. యూరోపియన్ యూనియన్ కు నాయక దేశం. ఐరోపాలో జర్మనీ తర్వాతే ఏ దేశమైనా. ఫ్రాన్స్, ఇంగ్లండ్ లు జర్మనీ తర్వాతే. జర్మనీని ఐరోపా ఆర్ధిక వ్యవస్ధకు ఇంజన్ లాంటిది అని కూడా అంటారు. అలాంటి జర్మనీ మరో యేడాదిలో తన దేశంలో ఉన్న అణు విద్యుత్ ని ఉత్పత్తి చేసే కేంద్రాలు అన్నింటినీ మూసివేయబోతోంది.

జర్మనీలో ప్రస్తుతం ఆరు మాత్రమే అటు విద్యుత్ ప్లాంట్ లు మిగిలి ఉన్నాయి. 2011 వరకు జర్మనీలో 17 అణు విద్యుత్ కర్మాగారాలు ఉండేవి. వాటిని క్రమంగా మూసివేస్తూ వచ్చింది. ప్రస్తుతం మిగిలి ఉన్న ఆరింటిలో మూడింటిని ఈ రోజు అనగా డిసెంబర్ 31, 2021 తేదీన మూసివేస్తోంది. మిగిలిన మూడింటిని వచ్చే సంవత్సరాంతం లోపు అనగా డిసెంబర్ 31, 2022 తేదీ లోపు మూసివేయబోతోంది. ఆ తర్వాత జర్మనీలో అణు విద్యుత్ కర్మాగారం అనేదే ఉండదు.

ఇంతకీ అణు విద్యుత్ కర్మాగారాలను జర్మనీ ఎందుకు మూసివేస్తున్నట్లు?

ఎందుకంటే అణు విద్యుత్ కర్మాగారాన్ని ఉంచుకోవడం అంటే అనేక అణు బాంబులను మన పక్కన ఉంచుకున్నట్లే గనక. అణు విద్యుత్ ఉత్పత్తికి అయ్యే ఖర్చు మామూలు ఖర్చు కాదు. తడిసి మోపెడు అవుతుంది. ఒక్క జర్మనీ యే కాదు అమెరికాతో సహా దాదాపు పశ్చిమ దేశాలన్నీ అణు విద్యుత్ కి మంగళం పాడుతున్నాయి.

భారత పాలకులే మతి లేకుండా, విచక్షణ లేకుండా, కనీసం బాధ్యత కూడా లేకుండా అణు విద్యుత్ వెంట పడుతున్నారు. కొత్త అణు విద్యుత్ కర్మాగారాల నిర్మాణాల కోసం రష్యా, అమెరికా, ఫ్రాన్స్ లతో ఒప్పందాలు చేసుకుంటూ దేశ ప్రజల ఆరోగ్యాలను, వారి జీవితాలను ఫణంగా ఒడ్డుతున్నారు. ఇందులో ఎవరూ మినహాయింపు కాదు, కాంగ్రెస్ పార్టీ అంతే చచ్చింది, బి‌జే‌పి కూడా అంతే చచ్చింది.

ఫుకుషిమా ప్రమాదం

2011 మార్చి 11 తేదీన జపాన్ లోని ఫుకుషిమా దాయిచి అణు విద్యుత్ కర్మాగారం ఘోర ప్రమాదానికి గురయింది. సముద్రంలో తీవ్ర స్ధాయిలో భూకంపం రావడం, ఆ తర్వాత పెద్ద ఎత్తున సునామీ అలలు విరుచుకుపడడంతో సముద్రం ఒడ్డునే ఉన్న ఫుకుషిమా అణు కర్మాగారం భారీ ప్రమాదానికి గురయింది. ఈ ప్రమాద తీవ్రత లెవల్ 7 గా నిర్ధారించారు. (లెవల్ 1 నుండి లెవల్ 7 వరకు ఉండే స్కేల్ పైన) లెవల్ 7 కంటే తీవ్ర ప్రమాదం ఇక లేదు. అంత పెద్ద భారీ ప్రమాదం అది.

1986లో సోవియట్ రష్యాలో భాగంగా ఉన్న ఉక్రెయిన్ లో చెర్నోబిల్ అణు కర్మాగారంలో జరిగిన భారీ ప్రమాదం తర్వాత మళ్ళీ ఆ స్ధాయి ప్రమాదం ఫుకుషిమా వద్ద జరిగినదే. భూకంపాన్ని గుర్తించిన ఆటోమేటిక్ వ్యవస్ధ ఫుకుషిమా అణు కర్మాగారాన్ని షట్ డౌన్ చేసింది. (అలా జరగాలి). కానీ భూకంపం వల్ల ఇతర ఎలక్ట్రిసిటీ గ్రిడ్ కూడా విఫలం కావడంతో అక్కడి డీజెల్ జనరేటర్లు స్టార్ట్ అయ్యాయి.

కానీ సునామీ వల్ల వచ్చిన భారీ అలలు డీజెల్ జనరేటర్లను ముంచేసి పని చేయకుండా చేశాయి. దానితో కర్మాగారంలో అణు విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగిస్తున్న ఇంధన రాడ్లను చల్లార్చేందుకు మెకానిజం లేకుండా పోయింది. ఈ మెకానిజాన్ని పునరుద్ధరించలేక నెలల తరబడి జపాన్ నానా కష్టాలు పడింది. సముద్రపు నీళ్ళు హెలికాప్టర్లలో, విమానాలలో తెచ్చి కుమ్మరించారు. రేడియేషన్ తో నిండిన నీటిని భారీ మొత్తంలో సముద్రం లోకి వదిలారు. దానివల్ల సముద్ర జీవులు రేడియేషన్ కు గురై చనిపోయాయి.

ఆ రేడియేషన్ చివరకు పసిఫిక్ సముద్రంలో ప్రయాణించి అమెరికా తీరం వరకూ వెళ్లింది. ఇటు ఐరోపాలో లిధుయేనియా వరకు చేరింది. ప్రమాదం వల్ల చాలా నెలల వరకు జపాన్ నుంచి చేపలు, కూరగాయల దిగుమతులు ఇతర దేశాలు నిషేదించాల్సి వచ్చింది. ఫుకుషిమా ప్రమాదం ఫలితాలు ఎంతవరకు విస్తరించాయో, ఎంతమంది చనిపోయారో, ఇంకెంత కాలం ఈ ప్రమాదం ప్రభావం ఉంటుందో… ఇలాంటి వార్తలు ఏవీ బైటికి రాకుండా అడ్డుకోవడంతో జపాన్ తో సహా ఇతర దేశాల ప్రజలకు ఈ వివరాలు ఏవీ తెలియవు.

(ఫుకుషిమా అణు ప్రమాదం గురించి ఈ బ్లాగ్ లో అనేక ఆర్టికల్స్ ఉన్నాయి. ఆసక్తి ఉన్నవారు ‘ఫుకుషిమా అణు ప్రమాదం’ అని వెతికి చూడొచ్చు.)

పాఠం నేర్చుకున్న జర్మనీ

ఫుకుషిమా ప్రమాదం నేపధ్యంలో జర్మనీ పాలకులు కళ్ళు తెరిచారు. నిజానికి 2002 లోనే అప్పటి సెంటర్-లెఫ్ట్ ప్రభుత్వ నేత గెరార్డ్ ష్రోడర్ అణు విద్యుత్ కి క్రమంగా నీళ్లొదలాలని నిర్ణయించాడు. దానితో పాటు శిలాజ ఇంధనాలకు (చమురు, గ్యాస్) కూడా క్రమంగా తగ్గించి రెన్యువబుల్ వనరులతో (గాలి, సూర్యరశ్మి) విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించాడు.

అయితే ష్రోడర్ తర్వాత ఛాన్సలర్ పదవి చేపట్టిన ఏంజెలా మెర్కెల్ ఆ నిర్ణయాన్ని తిరగదోడింది. అణు విద్యుత్ కర్మాగారాల జీవిత కాలాల్ని పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఈ లోపు ఫుకుషిమా ప్రమాదం జరిగింది. దాంతో ఏంజెలా మెర్కెల్ బుద్ధి తెచ్చుకుని తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది ష్రోడర్ నిర్ణయాలను అమలు చేయడం వేగవంతం చేసింది. ఫుకుషిమా దరిమిలా జర్మనీ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం కూడా ఏంజెలా మెర్కెల్ యు టర్న్ కు దోహదం చేసింది.

17 అణు కర్మాగారాల్లో అప్పటికప్పుడు (మే 2011లో) 8 కర్మాగారాలను మూసివేయడానికి ఆమె నిర్ణయం తీసుకుంది. జర్మనీలో సీమెన్స్ కంపెనీ అణు విద్యుత్ పరికరాలు, రియాక్టర్లు తయారు చేసే అతి పెద్ద ఇంజనీరింగ్ కంపెనీ. ఆ కంపెనీ కూడా ఫుకుషిమా తర్వాత స్వయంగా పాఠం నేర్చుకుంది. తానిక అణు విద్యుత్ పరిశ్రమ జోలికి వెళ్ళేది లేదని సెప్టెంబర్ 2011లో ప్రకటించింది. ప్రపంచంలో ఇతర దేశాల్లో కూడా అణు విద్యుత్ తయారీ జోలికి పోనని ప్రకటించింది. రష్యాలో మరో 20 యేళ్లలో పలు అణు కర్మాగారాలు నిర్మించాలన్న ఒప్పందం నుండి వైదొలిగింది. రష్యన్ అణు కంపెనీ రొసాటోమ్ తో ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. 

2016లో మరో మూడు అణు విద్యుత్ కర్మాగారాలను జర్మనీ మూసివేసింది. అణు విద్యుత్ కర్మాగారాల మూసివేత వల్ల జర్మనీ విద్యుత్ భద్రత తీవ్రంగా దెబ్బ తింటుందని అణు విద్యుత్ సమర్ధకులు పలు వాదనలు చేశారు. వారి వాదనలలో నిజం లేదని 2016లో జరిపిన అధ్యయనం తేల్చింది. అణు విద్యుత్ మూసివేసి రెన్యువబుల్ ఎనర్జీ వనరులు పెంచుకోవడం వలన విద్యుత్ భద్రత ఏ మాత్రం తగ్గకపోగా ఇంకా పెరిగిందని ఆ అధ్యయనంలో తేలింది.

ఇతర దేశాలు కూడా…

జర్మనీ తో పాటు ఐరోపాలోని ఇతర అభివృద్ధి చెందిన దేశాలు కూడా అను విద్యుత్ వినియోగాన్ని మానుకున్నాయి లేదా బాగా తగ్గించుకున్నాయి. ఇటలీ అయితే అణు విద్యుత్ పైన పూర్తి నిషేధం విధించుకుంది. చెర్నోబిల్ ప్రమాదం తర్వాత నుండే అను విద్యుత్ నుండి వెనక్కి మళ్లడం ఇటలీ ప్రారంభించింది. చెర్నోబిల్ ప్రమాదం దరిమిలా అణు విద్యుత్ వినియోగం పైన రిఫరెండం జరిపింది. ప్రజలు అను విద్యుత్ వద్దే వద్దని తీర్పు చెప్పడంతో దేశంలోని 4 అణు విద్యుత్ కర్మాగారాలను మూసివేసింది.

1993 వరకు కొత్తవి నిర్మించరాదని ఇటలీ మారిటోరియమ్ విధించుకుంది. ఆ తర్వాత మారిటోరియం ను శాశ్వతం చేశారు. అయితే 2005 నుండి అణు విద్యుత్ లాబీ ఒత్తిడితో మళ్ళీ అణు రియాక్టర్లు నిర్మించడానికి ప్రభుత్వాలు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ఆ ప్రయత్నాలు జరుగుతుండగానే ఫుకుషిమా ప్రమాదం జరిగింది. 2011 జూన్ లో మరోసారి రిఫరెండం జరిపారు. జనం మళ్ళీ వద్దన్నారు. ఆ తర్వాత అణు విద్యుత్ మాట ఎవరూ ఎత్తలేదు.

ఫుకుషిమా అణు ప్రమాదం దర్మిలా స్విట్జర్లాండ్, స్పెయిన్ దేశాలు కొత్త అణు రియాక్టర్లు నిర్మించడాన్ని నిషేధించాయి. అణు విద్యుత్ పైన ఆధారపడడం మానుకోవాలని తైవాన్ నిర్ణయించింది. అణు విద్యుత్ ని క్రమంగా తగ్గిస్తామని జపాన్ ప్రధాని ప్రకటించాడు.

2016 నాటికి ఆస్ట్రేలియా, డెన్మార్క్, ఇటలీ, ఐర్లాండ్, పోర్చుగల్, నార్వే, న్యూజిలాండ్, సెర్బియా, గ్రీసు, ఆస్ట్రియా, ఎస్టొనియా, లాట్వియా, లగ్జెంబర్గ్, మలేషియా, దేశాలు అణు విద్యుత్ కర్మాగారాలు లేకుండా చేసుకున్నాయి. అణు విద్యుత్ కి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నాయి. బెల్జియం, స్పెయిన్, స్విట్జర్లాండ్ దేశాలు 2030 నాటికి పూర్తిగా అణు విద్యుత్ ని నిర్మూలించాలని నిర్ణయించి ఆ వైపు అడుగులు వేస్తున్నాయి. జర్మనీ మొదట 2030 గడువు పెట్టుకుని తర్వాత ఆ గడువుని 2022 సంవత్సరానికి, ముందుకు, జరుపుకుంది.

మరికొన్ని దేశాలు అణు కర్మాగారాలు నిర్మించాలనుకుని కూడా ఫుకుషిమా ప్రమాదాన్ని చూసి విరమించుకున్నాయి.

మరి ఇండియా!?

భారత దేశం మాత్రం రష్యా సహాయంతో కూడంకుళం (తమిళనాడు) అణు కర్మాగారాన్ని నిర్మించింది. దానికి వ్యతిరేకంగా తమిళ ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేశారు. నెలల తరబడి ఆందోళన చేశారు. ప్రజల మాట వినే బదులు కేంద్ర ప్రభుత్వం వారిపైన కుట్ర కేసులు బనాయించింది. వేల మంది పైన దేశ ద్రోహం కేసులు బనాయించింది. గ్రామాల్లో అడుగడుగునా పోలీసులను దింపి ప్రజలను నానా హింసలకు గురి చేసింది. ప్రతి రోజూ గ్రామాలపై రాత్రిళ్ళు దాడులు చేసి అరెస్టులు సాగించింది. కోర్టులు యధాశక్తి సహకరించాయి. కూడంకుళం కర్మాగారం మూడో దశకు (5, 6 యూనిట్ల ప్రారంభానికి) కూడా మోడి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది.

2024 నాటికల్లా దేశంలో 9 అణు రియాక్టర్లు నిర్మిస్తామని ఇటీవలే (డిసెంబర్ 2 తేదీన) కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ రాజ్య సభలో ప్రకటించాడు. అదనంగా మరో 12 రియాక్టర్లు కూడా నిర్మిస్తామని ఆయన ప్రకటించాడు. గతంలో అణు కర్మాగారాలు తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ లాంటి డఖిణ రాష్ట్రాలకే అణు విద్యుత్ పరిమితం అయిందని తామయితే ఉత్తరాదిన కూడా నిర్మిస్తామని ఆయన గొప్పలు చెప్పుకున్నాడు.

Union Minister Jitendra Singh

దేశ రాజధాని ఢిల్లీకి 150 కి.మీ దూరంలో హర్యానాలో గొప్ప అణు విద్యుత్ కర్మాగారం నిర్మిస్తామని ఆయన గర్వంగా చాటాడు. అణు విద్యుత్ వల్ల కలిగే భద్రతా ప్రమాదాల దృష్ట్యా అభివృద్ధి చెందిన దేశాలు దానిని క్రమంగా తగ్గించుకుంటున్నాయి కదా, అలాంటి ఆలోచన భారత ప్రభుత్వానికి ఉన్నదా అని ప్రశ్నించగా ఆయన “మనం అణు కర్మాగారాల సంఖ్యను పెంచడమే కాదు. అణు విద్యుత్ ఉత్పత్తిని దేశ వ్యాపిత ప్రాజెక్టుగా మార్చేసాం” అని సమాధానం ఇచ్చాడు.

అభివృద్ధి చెందిన దేశాలు అణు విద్యుత్ ని రద్దు చేసుకుని గాలి, సూర్య రశ్మి నుండి విద్యుత్ తయారు చేసుకుంటూ పూర్తిగా వాటిపైనే ఆధారపడుతున్నాయి. త్వర త్వరగా అభివృద్ధి చెందాలి, వీటో హక్కు సంపాదించాలి అంటూ గాలి మేడలు కడుతున్న భారత ప్రభుత్వం మాత్రం అదే అణు విద్యుత్ ను ఇంకా పెంచుకోవటానికి అర్రులు చాస్తున్నది. అమెరికా, రష్యా, ఫ్రాన్స్ లు వాడి వద్దునుకున్న టెక్నాలజీని తెస్తున్నారు.

పైగా అణు విద్యుత్ స్వచ్చమైన శక్తి, క్లీన్ ఎనర్జీ అని మన నేతలు తమకు తామే సర్టిఫికేట్ ఇస్తున్నారు. కానీ ఒక్క చిన్న ప్రమాదం జరిగితే అణు విద్యుత్ ఎంత స్వచ్ఛమైనదో తెలుస్తుంది. ఫుకుషిమా నుండి శాశ్వతంగా తరలించిన లక్ష్యా యాభై వేల మంది జపాన్ ప్రజల వద్దకి వెళ్ళి అణు విద్యుత్ స్వచ్ఛమైనది అని ఒక్క మాట చెప్పి చూస్తే తెలుస్తుంది. చెర్నోబిల్ నుండి ఖాళీ చేయబడ్డ ప్రజల్ని గానీ అమెరికాలో త్రీ మైల్ ఐలాండ్ వాసుల్ని గానీ అడిగినా అణు విద్యుత్ స్వచ్ఛత గురించి మన ఎం‌పి లకు, మంత్రులకు విసుగు వచ్చే దాకా పాఠాలు చెబుతారు.

అణు విద్యుత్ కర్మాగారాల్లో కేవలం విద్యుత్ మాత్రమే ఉత్పత్తి చేస్తారనుకుంటే పొరపాటు. అణ్వస్త్రాలు కలిగి ఉన్న దేశాలు అణు బాంబుల తయారీకి కావలసిన ఇంధనాన్ని కూడా ఈ కర్మాగారాల్లో తయారు చేస్తాయి. ఈ పనిలో ఉన్న అణు కర్మాగారాలు భద్రత రీత్యా అత్యంత సున్నితమైనవి. శత్రు దేశాలు ఈ కర్మాగారాల్లో విద్రోహ చర్యలు చేపట్టేందుకు ఎప్పుడూ కాచుకుని ఉంటాయి. కంప్యూటర్ యుగంలో ఇలాంటి విద్రోహ చర్యలు (sabotage) చేపట్టేందుకు కర్మాగారం లోపలికి అడుగు పెట్టే అవసరం కూడా ఉండదు. ఏ మాత్రం భద్రతలో అలసత్వం వహించినా అణు కాలుష్యంతో తరాల తరబడి దుష్ఫలితాలు అనుభవించవలసి ఉంటుంది.

కాబట్టి అణు విద్యుత్ వినియోగం గురించి పునరాలోచన చేయాలి. అణు ప్రమాదం వల్ల ప్రజలు ఎదుర్కొనే తీవ్రమైన పరిస్ధితిని పరిగణించి అణు విద్యుత్ నుండి దూరం జరగాలి. జర్మనీ, ఇటలీ లాంటి దేశాలను అనుసరించి ప్రజల భద్రతకు, వారి అభిప్రాయాలకు, ఆందోళనలకు విలువ ఇవ్వాలి.

One thought on “యేడాదిలో అణు విద్యుత్ కు జర్మనీ ముగింపు! మరి ఇండియా!?

  1. అదనంగా అంతర్జాతీయ అణునిఘా,నియంత్రణ సంస్థలను అడ్డుకుపెట్టుకొని ధనిక దేశాలు భారత్ ను నియంత్రించడానికి ప్రయత్నిస్తాయి.ఇంత కిక్కిరిసిన దేశంలో తేడా వస్తే జరిగే ప్రాణ,ధన,పర్యావరణ నష్టాలను అంచనావేయడం అసాధ్యం! అయినా సరే రాజకీయ దళారులకు తమ ప్రయోజనాలు,తమ బాసుల ప్రయోజనాలేగాని,ప్రజల ఈతిబాధలకు అతి తక్కువ విలువ ఇస్తారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s