
Army vehicle in Kohima, Nagaland capital
నాగాలాండ్ ప్రజలు ఏమి కోరుకున్నా తాము మాత్రం తాము అనుకున్నదే అమలు చేస్తామని మోడి ప్రభుత్వం చాటి చెప్పింది. రాష్ట్ర ప్రజలతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం కూడా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నప్పటికీ పట్టించుకోకుండా ‘సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని’ మరో 6 నెలల పాటు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ చర్యతో కేంద్ర ప్రభుత్వ విచక్షణపై నాగాలాండ్ ప్రజలు పెట్టుకున్న నమ్మకం పటాపంచలైంది. నాగాలాండ్ రాష్ట్రంలో AFSPA చట్టం అమలు చేయాల్సిన అవసరం ఉన్నదా లేదా అన్న సంగతి తేల్చేందుకు కమిటీ నియమిస్తున్నామని కేంద్రం చెప్పినప్పుడు త్వరలో చట్టం ఎత్తివేస్తారని లేదా చట్టం పొడిగించ కుండా ఉంటారని రాష్ట్ర ప్రజలు ఆశించారు. తమకు ఆ ఉద్దేశ్యం ఏమీ లేదని AFSPA అమలు పొడిగింపు ద్వారా మోడి ప్రభుత్వం స్పష్టం చేసింది.
చట్టం అమలు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వ హోమ్ మంత్రిత్వ శాఖ ఈ రోజు నోటిఫికేషన్ జారీ చేసింది. “నాగాలాండ్ రాష్ట్రం మొత్తం ప్రాంతం ఎలాంటి కల్లోల పరిస్ధితుల్లో మరియు ప్రమాదకర పరిస్ధితుల్లో ఉన్నదంటే, పౌర ప్రభుత్వానికి సహాయంగా సాయుధ బలగాల అవసరం తప్పనిసరిగా ఉన్నదని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది” అని నోటిఫికేషన్ లో కేంద్రం తెలిపింది.
AFSPA చట్టం సెక్షన్ 4 కింద సంక్రమించబడిన అధికారాల ప్రకారం డిసెంబర్ 30 తేదీ నుండి మరో 6 నెలల పాటు నాగాలాండ్ రాష్ట్రం అంతా కల్లోల ప్రాంతంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తోందని నోటిఫికేషన్ పేర్కొంది.
చివరిసారిగా చట్టాన్ని జూన్ 30 తేదీన 6 నెలల పాటు పొడిగించారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఈ చట్టం 1958 నుండి అమలులో ఉంది. ఈ చట్టం సాయుధ బలగాలకు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు అపరిమిత అధికారాలను కట్టబెడుతుంది.
కల్లోల ప్రాంతాలుగా ప్రకటించిన ఏరియాలో ఎవరైనా చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నట్లు భావిస్తున్నట్లయితే వారిని ఎలాంటి వారంటూ లేకుండా అరెస్ట్ చెయ్యొచ్చు, వారి నివాసాలను సోదా చెయ్యొచ్చు, అరెస్ట్ అయిన వారికి ప్రాసిక్యూషన్ నుండి రక్షణ లభించదు, కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా న్యాయపరమైన కేసులు పెట్టడానికి వీలు లేదు.
AFSPA చట్టం సెక్షన్ 3 ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఈ చట్టాన్ని అమలులోకి తేవచ్చు. నాగాలాండ్ ను ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం మాత్రమే కల్లోలిత ప్రాంతంగా ప్రకటిస్తూ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ ప్రకటించలేదు. నాగాలాండ్ తో పాటు అరుణాచల్ ప్రదేశ్ ను కూడా కేంద్రం కల్లోలితంగా ప్రకటించి ఏఎఫ్‌ఎస్‌పిఏ చట్టాన్ని రుద్దుతోంది.
మణిపూర్ కూడా ఏఎఫ్‌ఎస్‌పిఏ చట్టం కింద ఉన్నప్పటికీ అక్కడి రాష్ట్ర ప్రభుత్వమే ఆ చట్టాన్ని అమలు చేస్తోంది. కేంద్రం ఎప్పుడూ మణిపూర్ లో ఏఎఫ్‌ఎస్‌పిఏ ని ప్రకటించలేదు. అస్సాం విషయానికి వస్తే కేంద్ర హోమ్ శాఖ 2017 వరకు రాష్ట్రాన్ని కల్లోలిత ప్రాంతంగా ప్రకటించగా ఆ తర్వాత నుండి రాష్ట్ర ప్రభుత్వమే ఆ బాధ్యత తీసుకుని అమలు చేస్తోంది. అప్పటి నుండి ఈ చట్టం అమలును రాష్ట్ర ప్రభుత్వం రెన్యూవల్ చేస్తూ వస్తోంది. చివరిసారి సెప్టెంబర్ 10 తేదీన ఈ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది.
ఇటీవల మొన్ జిల్లాలోని ఓటింగ్ గ్రామంలో బొగ్గు గనిలో పని చేసి ఇంటికి వస్తున్న కూలీలపై సిఏపిఎఫ్ పోలీసులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి 14 మందిని చంపేశారు. అప్పటి నుండి రాష్ట్ర ప్రజలు AFSPA చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. దానితో చట్టం అమలును సమీక్షించడానికీ, దాని అవసరం నిర్ధారించడానికి కేంద్రం కమిటీ నియమించిందని రాష్ట్ర ముఖ్యమంత్రి నిఫూ రియో ప్రకటించాడు.
ఇంతలోనే ఏఎఫ్‌ఎస్‌పిఏ ని పొడిగిస్తూ హోమ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలో సదరు చట్టాన్ని ఎత్తివేసే ఉద్దేశం తనకు లేదని ఈ నోటిఫికేషన్ ద్వారా కేంద్రం స్పష్టం చేసినట్లయింది.
ఈ చట్టం మొత్తంగా ప్రజల శాంతియుత జీవనానికి వ్యతిరేకమైనది. ఈ చట్టాన్ని అడ్డం పెట్టుకుని పోలీసులు, ఆ పోలీసుల అండతో ఆధిపత్య వర్గాలు సాగిస్తున్న అరాచకం అంతా ఇంతా కాదు. సాయుధ బలగాల ఉన్నతాధికారుల అక్రమ సంపాదనకు ఈ చట్టం వీలు కల్పిస్తోందని అందుకే చట్టం ఎత్తివేసేందుకు వారు సుముఖంగా లేరని పలు ఆరోపణలు కూడా ఉన్నాయి.
జమ్ము కాశ్మీర్ రాష్ట్రం లోనూ ఓ వైపు ఎన్నికల్లో నెగ్గిన ప్రభుత్వాలు కొనసాగుతున్నప్పటికీ అక్కడ AFSPA చట్టం దశాబ్దాలుగా అమలవుతోంది. ఈ చట్టాన్ని ఎత్తివేసేందుకు సైన్యం సిద్ధంగా లేదని యూపిఏ హయాంలో హోమ్ మంత్రిగా పని చేస్తున్నప్పుడు పి.చిదంబరం తెలియజేశారు.
కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలను ఓట్లు వేసి గెలిపిస్తున్నది అక్కడి ప్రజలే గానీ సైన్యమో లేదా సాయుధ పోలీసు బలగాలో కాదు. తిరుగుబాటు గ్రూపులు లేదా సాయుధ పోరాట గ్రూపులు జన్మించడానికి వారికి ప్రజల్లో మద్దతు లభించడానికి ఉన్న కారణాలు ఏమిటో పరిశీలించి వాటిని పరిష్కరించడం ద్వారా మాత్రమే ప్రభుత్వాలు ప్రజల నమ్మకాన్ని చూరగొనగలవు. దాని బదులు సాయుధ బలగాలకు విస్తృత అధికారాలు కట్టబట్టడాన్నే ప్రభుత్వాలు నమ్ముకుంటున్నాయి. ఇది ఎంత మాత్రం సమర్ధనీయం కాదు. తమను తాము ప్రజాస్వామిక ప్రభుత్వాలుగా చెప్పుకునే ప్రభుత్వాలకు అసలే సమర్ధనీయం కాదు.