మునవర్ ఫరూకి ఒక స్టాండప్ కమెడియన్. జనాన్ని నవ్వించడం ఈ యువ కళాకారుడి వృత్తి, ప్రవృత్తి. జనవరి 1, 2021 తేదీ ఇండోర్ (మధ్య ప్రదేశ్) పట్టణంలో అతను ప్రదర్శన ఇవ్వబోతుండగా పోలీసులు అరెస్టు చేశారు. సెక్షన్ 295 ఏ కింద కేసు పెట్టారు. నేరం ఏమిటని విలేఖరులు అడిగితే “తన కామెడీ షోలో ఇతరుల మత భావాలను నమ్మకాలను అవమానపరిచాడు” జిల్లా ఎస్‌పి అని చెప్పాడు. “మునవర్ ఆరోజు అసలు షో మొదలు పెట్టకుండానే అరెస్ట్ చేశారు కదా? ఇక నేరం చేసిందెప్పుడు?” అని విలేఖరులు నిలదీశారు. “అతను ఇవ్వబోయే షోలో నేరం చేసే ఉద్దేశంతో ఉన్నాడు. అందుకే అరెస్ట్” అని ఎస్‌పి బదులిచ్చాడు.
సో ఒక ముస్లిం స్టాండప్ కమెడియన్ తలలోని ఉద్దేశ్యాన్ని పోలీసులు ముందే పసిగట్టి అతన్ని అరెస్ట్ చేశారు. తర్వాత సెషన్స్ కోర్టు బెయిల్ ఇవ్వలేదు. (మామూలుగా తేలికగా బెయిల్ లభించే కేసు అది). హై కోర్టు కూడా బెయిల్ ఇవ్వలేదు. చివరికి 37 రోజుల తర్వాత ఫిబ్రవరి 5 తేదీన సుప్రీం కోర్టు బెయిల్ ఇచ్చింది. అతనిపై ఆరోపణలు స్పష్టంగా లేవని, పోలీసులు అరెస్టు సమయంలో అనుసరించాల్సిన చట్టబద్ధ ప్రక్రియ పాటించలేదని సుప్రీం కోర్టు ఎత్తి చూపింది.
సుప్రీం కోర్టు బెయిల్ ఇచ్చినా జైలు అధికారులు విడుదల చేసేందుకు నిరాకరించారు. కోర్టు ఆదేశాలు తమకు అందలేదని వాళ్ళు సాకు చెప్పారు. మరో రోజున్నర తర్వాత ఫిబ్రవరి 6 తేదీ రాత్రి గాని అతన్ని విడుదల చేయలేదు.
***** ***** *****
జితేంద్ర నారాయణ్ సింగ్ త్యాగి ఉరఫ్ వాసిం రిజ్వీ, యతి నరసింగానంద్ సరస్వతి, ధరం దాస్ మహారాజ్, ఆనంద్ స్వరూప్ మహరాజ్… వీళ్ళంతా హిందూ మత గురువులు. హరిద్వార్ లో ‘ధర్మ సంసద్’ పేరుతో ఒక సదస్సు జరిపి ఒకరేమో “ముస్లింలపై యుద్ధం చేయండి” ఆని పిలుపిచ్చాడు. మరొకడు “ముస్లిం వ్యక్తి ప్రధాని కాకుండా చూసేందుకు హిందువులంతా ఆయుధాలు పట్టండి” అని పిలుపు ఇచ్చాడు. ఇంకొకడు “ఆయుధాలే విజయం సాధిస్తాయి. మన ధర్మం కోసం చంపడానికి, చావడానికి సిద్ధం కండి” అని పిలుపిచ్చాడు. మరో పెద్ద “క్రిస్మస్ జరపడానికి వీల్లేదు. హోటళ్లు, హాల్స్ ఓనర్లు క్రిస్మస్ సెలబ్రేషన్స్ కి అద్దెకు ఇస్తే తీవ్ర పరిణామాలు తప్పవు” అని హెచ్చరించాడు.
వీళ్ళ ప్రసంగాల్ని పోలీసులు అసలు పట్టించుకోలేదు. దేశవ్యాపితంగా నిరసనలు పెల్లుబుకాయి. ప్రతిపక్షాలు తిట్టి పోశాయి. చివరికి హరిద్వార్ పోలీసులు ఓ కేసు నమోదు చేశారు. అందులో ముందు ఒకే ఒక్క పేరు, జితేంద్ర నారాయణ్, పేర్కొన్నారు. ఇంకో రెండు రోజులు ఆగి ఇంకో రెండు పేర్లు మహా మండలేశ్వర్ ఆఖరా నేత అన్నపూర్ణ మా, హిందూ మహా సభ జనరల్ సెక్రటరీ ధర్మ దాస్ మహా రాజ్ లను ఎఫ్‌ఐఆర్ లో చేర్చారు.
కానీ ఇంతవరకు వారిని అరెస్ట్ చేయలేదు. కారణం అడిగితే సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన డైరెక్టివ్ ని కారణంగా చెప్పారు. కోవిడ్ రోజులు గనక జైళ్ళు అన్నీ సామర్ధ్యానికి మించి నిండాయి గనక అవసరం అయితే తప్ప శిక్ష 7 సంవత్సరాలు లేదా అంతకు మించి పడే అవకాశం ఉంటే తప్ప అరెస్టు చేయకండి అన్నది ఆ డైరెక్టివ్.
కానీ మునవర్ ఫరూకి కి ఈ డైరెక్టివ్ వర్తింప జేయలేదు. ఆ సమయంలో డెల్టా వైరస్ దేశంలో విజృంభిస్తోంది. మునవర్ పైన పెట్టిన కేసులో శిక్ష పడితే అది 3 సం.ల జైలుకి మించదు. పైగా అతను అప్పటికి ఏ జోకూ వెయ్యనేలేదు. వేస్తాడని ఊహించి అరెస్ట్ చేశారు. అయినా అతన్ని అరెస్టు చేసేదాకా పోలీసులు నిద్రపోలేదు. అరెస్టు చేశాక కింది కోర్టు నుండి హై కోర్టు దాకా బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించాయి. వీళ్ళు ఎవ్వరికీ సుప్రీం కోర్టు డైరెక్టివ్ గుర్తుకు రాలేదు. పైగా హై కోర్టు జడ్జి “ఇలాంటి వాళ్ళని ఊరికే వదల కూడదు” అంటూ విచారణ చేయకుండానే నేరం చేసినట్లు నిర్ధారించినట్లు వ్యాఖ్యానించాడు.
***** ***** *****
2014లో మోడి అధికారంలోకి వచ్చినప్పటి నుండి భావ ప్రకటనా స్వేచ్ఛకు సంకెళ్లు పడిపోయాయి. కొందరు న్యాయమూర్తులు మెజారిటీ న్యాయాన్ని అమలు చేయడంలో అధికార పార్టీని అనుసరిస్తున్నారు. ఆర్టికల్ 14 వెబ్ సైట్ ప్రకారం రాజకీయ నాయకులను, ప్రభుత్వాలను విమర్శించినందుకు గాను గత పదేళ్ళలో 405 కేసులు నమోదు చేశారు. అందులో 96 శాతం 2014 తర్వాత అనగా మోడి అధికారం లోకి వచ్చిన తర్వాత నమోదు చేసినవే. ప్రధాన మంత్రిని విమర్శించారని, ఆయన్ని అవమానకరంగా మాట్లాడారని 149 మంది పైన కేసులు పెట్టారు.
మైనారిటీ మతం వాళ్ళు నేరం చేస్తే ఒక తరహా కాపలా, మెజారిటీ మతం వాళ్ళు నేరం చేస్తే మరొక తరహా కాపలా భారత దేశంలో అమలవుతోంది. దేశంలో నామమాత్రం ప్రజాస్వామ్యం కూడా రద్దవుతోంది. కానీ “ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం” అంటూ జబ్బలు చరుచుకోవడం మాత్రం మానడం లేదు.

Munawar Faruqui, Standup Comedian