స్వతంత్రం రెచ్చగొడితే తీవ్ర చర్యలు తప్పవు! -తైవాన్ తో చైనా


China and Taiwan

చైనా మరోసారి తైవాన్ ను తీవ్రంగా హెచ్చరించింది. ‘స్వతంత్రం’ పేరుతో జనాన్ని రెచ్చగొడుతూ ఉంటే తీవ్ర చర్యలు తప్పవు, అని చైనా ప్రభుత్వం తైవాన్ ను హెచ్చరించింది.

“స్వతంత్రం ప్రకటించుకునే వైపుగా ఏ మాత్రం అడుగు వేసినా చర్యలు తప్పవు” అని తైవాన్ అఫైర్స్ ఆఫీస్ ప్రతినిధి మా చియావో గువాంగ్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ హెచ్చరించాడు.

తైవాన్ తో శాంతియుతంగా ఐక్యం కావడానికి కృషి చేసేందుకు చైనా దేశం సిద్ధంగా ఉందనీ అయితే స్వతంత్రత ప్రకటించుకునే విషయంలో ఎర్ర గీతలను దాటినట్లయితే చైనా తప్పనిసరిగా చర్యలు తీసుకుంటుందని మా చియావో గువాంగ్ పత్రికలతో అన్నాడు.

“తైవాన్ లోని వేర్పాటువాద శక్తులు స్వతంత్రం పేరుతో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా, బలవంతపు చర్యలకు పాల్పడినా లేదా కనీసం రెడ్ లైన్ దాటినా సరే… మేము తీవ్ర చర్యలు తీసుకోవలసి ఉంటుంది” అని మా హెచ్చరించాడు.

తైవాన్ ను తమ దేశంలో భాగంగా చైనా పరిగణిస్తుంది. 1949 వరకు చైనాలో జరిగిన సివిల్ వార్ లో కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలో విప్లవం విజయవంతం కావడంతో చాంకై షేక్ నేతృత్వం లోని పెట్టుబడిదారీ శక్తులు, వారి కుటుంబాలు తైవాన్ కు పారిపోయి అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాయి.

అమెరికా, ఐరోపాలు మొదట తైవాన్ ను అసలు చైనాగా గుర్తించారు. తైవాన్ ను రిపబ్లిక్ ఆఫ్ చైనా (ఆర్‌ఓ‌సి) గానూ మెయిన్ ల్యాండ్ ను పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా (పి‌ఆర్‌సి) గానూ వ్యవహరించారు. ఐరాస లో కూడా ఆర్‌ఓ‌సి కే సభ్యత్వం కల్పించారు.

ఆ తర్వాత అమెరికా తన విధానం మార్చుకోవడంతో తైవాన్ స్ధానంలో పి‌ఆర్‌సి ఐరాస లో సభ్య దేశంగా అవతరించింది. వీటో సభ్య దేశంగా కూడా తైవాన్ హక్కులను వశం చేసుకుంది. అప్పటి నుండి అమెరికా, తైవాన్ ను ప్రత్యేక దేశంగా గుర్తించడం లేదు. దౌత్య సంబంధాలను కూడా రద్దు చేసుకుంది. కానీ ఆయుధ సరఫరాలు కొనసాగించింది.

డెంగ్ చియావో పింగ్ నేతృత్వం లోని చైనా ‘ఒక దేశం రెండు వ్యవస్ధలు’ పేరుతో తైవాన్, హాంకాంగ్, మకావ్ లలోని పెట్టుబడిదారీ వ్యవస్ధలను కొనసాగింపజేశాడు. కానీ అప్పటికే చైనాలో కూడా పెట్టుబడిదారీ విధానాలను డెంగ్ తిరగదోడడం ప్రారంభించాడు.

ఇప్పుడు ఇక చైనాలో సోషలిజం తాలూకు అవశేషాలు కూడా లేవు. కానీ సి‌పి‌ఎం లాంటి పార్టీలు ఇప్పటికీ చైనాను సోషలిస్టు దేశంగా కీర్తించడం మానుకోలేదు. ఇది వేరే వ్యవహారం.

చైనా క్రమంగా ప్రధాన ఆర్ధిక శక్తిగా అవతరించడం, మిలట్రీ శక్తి పెంపొందించుకోవడంతో ఆ దేశాన్ని తొక్కి పెట్టేందుకు, మిలట్రీ చుట్టివేత ద్వారా బెదిరించేందుకు అమెరికా చర్యలు తీవ్రం చేసింది. అందులో భాగంగా తైవాన్ కు ఆయుధ సరఫరా బాగా పెంచేసింది.

ఇటీవల జో బైడెన్ నేతృత్వంలో అమెరికా, తైవాన్ తో దౌత్య సంబంధాలు పెంచుకోబోతున్నట్లుగా సూచనలు చేసింది. తైవాన్ తో దౌత్య సంబంధాలు పెట్టుకునేందుకు లిధుయేనియా లాంటి దేశాలను ప్రోత్సహించింది.

ఈ ధోరణిని చైనా తీవ్రంగా తప్పు పట్టింది. తైవాన్ తో దౌత్య సంబంధాలు పెట్టుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని అమెరికాను హెచ్చరించింది. తీరా విధాన ప్రకటనకు వచ్చేసరికి తైవాన్ పట్ల తన విధానంలో మార్పు లేదని అమెరికా అధ్యక్షుడు బైడేన్ ప్రకటించి వెనక్కి తగ్గాడు. త్వరలో చైనా, అమెరికా లు ముఖ్య అంశాలపై చర్చలు కూడా జరపనున్నాయి.

అయితే తైవాన్ ను గోకడం మాత్రం అమెరికా మానుకోలేదు. అదే సమయంలో చైనా కూడా తైవాన్ ను వివిధ ప్రత్యక్ష, పరోక్ష చర్యలతో హెచ్చరిస్తోంది. గత రెండు, మూడు నెలల కాలంలో చైనా అనేకసార్లు యుద్ధ విమానాలను తైవాన్ మీదికి పంపి విన్యాసాలు చేయించింది. అందుకు ప్రతిగా అమెరికా మరిన్ని యుద్ధ పరికరాలను తైవాన్ కు అమ్మజూపుతోంది.

ఈ నేపధ్యంలో చైనా చేసిన తాజా హెచ్చరిక ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికా ఇప్పటికీ ఒక్క చైనానే గుర్తిస్తుంది. కానీ తైవాన్ విషయంలో “వ్యూహాత్మక సంశయాత్మకత” ను పాటిస్తుంది. తద్వారా తైవాన్ కు మద్దతుగా స్పందించేందుకు అవకాశాన్ని అట్టి పెట్టుకుంది.

“వచ్చే సంవత్సరం తైవాన్ ద్వీప కల్పం పరిస్ధితి మరింత సంక్లిష్టం కానున్నది. విదేశీ జోక్యాలు మరింత తీవ్రం అవనున్నాయి” అని తైవాన్ వ్యవహారాల ప్రతినిధి మా చియావో వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్య అమెరికాను ఉద్దేశించే అన్నది స్పష్టం. పరిస్ధితి కూడా అలాగే ఉన్నది.

తైవాన్ ను ఒక తురుపు ముక్కగా ఉపయోగిస్తూ చైనాను ఇబ్బంది పెట్టడం, చైనా ప్రయోజనాలకు హాని కలిగించడం అమెరికా అనుసరిస్తున్న విధానం. చైనా వాణిజ్యం పెరిగే కొద్దీ తన ప్రయోజనాలను కొనసాగించేందుకు, కనీసం చైనా ప్రయోజనాలను అడ్డుకునేందుకు అమెరికా ఈ విధంగా ఘర్షణ విధానాన్ని అవలంబిస్తోంది. దీని వలన ఆగ్నేయాసియా దేశాలతో పాటు దూరాన ఉన్న ఇండియా లాంటి దేశాలు కూడా వివిధ రంగాల్లో తత్ప్రభావాన్ని ఎదుర్కోవలసి వస్తోంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s