
Srilanka FM with Indian FM
శ్రీలంక ఇటీవల కాలంలో ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకుంది. సంక్షోభం నుండి గట్టెక్కేందుకు శ్రీలంక బహిరంగంగానే ఇండియా సహాయం కోరింది. ఆ మేరకు ఇండియా కూడా గత నవంబరులో కొన్ని హామీలు ఇచ్చింది.
ప్రమాదం గ్రహించిన చైనా తానూ సహాయం చేస్తానంటూ ముందుకు వస్తోంది. జనవరి మొదటి వారంలో చైనా విదేశీ మంత్రి శ్రీలంక పర్యటించనున్నారు. జనవరి 7 తేదీ గానీ లేదా 9 తేదీ గానీ ఈ పర్యటన జరగనున్నట్లు తెలుస్తున్నది. ఈ పర్యటనలో శ్రీలంకకు నోరూరించే తాయిలాలను చైనా ఇవ్వజూపవచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
సంక్షోభం
విదేశీ మారక ద్రవ్య నిల్వలు అత్యంత తక్కువ స్ధాయికి పడిపోవడంతో శ్రీలంక చెల్లింపుల సంక్షోభం ఎదుర్కొంటోంది. విదేశీ మారక ద్రవ్యం కొరత కారణంగా పలు దిగుమతులను రద్దు చేసుకోవలసిన పరిస్ధితి ఏర్పడింది. వాణిజ్య విధానాలు, వ్యవసాయ విధానాల్లో కూడా మార్పులు చేసుకునే పరిస్ధితి ఏర్పడింది. అయితే విదేశీ మారకద్రవ్యం కొరత అని చెప్పకుండా ఆకర్షణీయ నినాదాలతో పరిస్ధితిని దాచి ఉంచేందుకు శ్రీలంక ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
నవంబరు చివరి నాటికి శ్రీలంక విదేశీ మారక ద్రవ్య నిల్వలు అత్యంత కనిష్ట స్ధాయికి అనగా 1.6 బిలియన్ డాలర్లకు పడిపోయింది. దానితో ఆహార దిగుమతులు పడిపోయాయి. నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయాయి. కానీ ఐఎంఎఫ్ బెయిలౌట్ పధకాన్ని ఆశ్రయించకుండా ఇండియా సాయాన్ని కోరింది.
అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలలో ఒకటయిన ఫిచ్ సంస్ధ డిసెంబర్ నెల ఆరంభంలో శ్రీలంక క్రెడిట్ రేటింగును సిసిసి నుండి సిసి కి తగ్గించింది. అంతర్జాతీయ సార్వభౌమ ఋణ పత్రాలకు చేయవలసిన చెల్లింపులను శ్రీలంక చేయలేకపోవచ్చని హెచ్చరించింది. జనవరి 2022 లో 500 మిలియన్ డాలర్లు, జులై 2022 లో 1 బిలియన్ డాలర్ల చెల్లింపుల్లో డీఫాల్ట్ (వైఫల్యం) కావచ్చని అంచనా వేసింది.
రేటింగు కంపెనీలు ఇలా తగ్గింపులు మొదలు పెడితే ఆ దేశాలకు ఇంటర్నేషనల్ మార్కెట్ లో అప్పు దొరకటం దుర్లభం అవుతుంది. దొరికినా అధిక వడ్డీని ఋణ దాతలు డిమాండ్ చేస్తారు. ఈ నేపధ్యంలో ఫిచ్ తమ రేటింగ్ తగ్గించడం పట్ల శ్రీలంక ఆగ్రహం ప్రకటించింది.
ఫిచ్ రేటింగ్ చర్య ‘తొందరపాటుతనం’ అని శ్రీలంక సెంట్రల్ బ్యాంకు అభివర్ణించింది. ఆర్ధిక సహాయం కోసం శ్రీలంక స్నేహిత దేశాలను అడిగిన సంగతిని ఫిచ్ విస్మరించిందని, డిసెంబర్ 2021, మార్చి 2022 మాసాంతాల నాటికి డబ్బు శ్రీలంకకు చేరుతుందన్న అంశాన్ని కూడా విస్మరించిందని సెంట్రల్ బ్యాంకు నిరసించింది.
సహాయం
“క్రెడిట్ ఇన్-ఫ్లో మెరుగుపడుతుందని సెంట్రల్ బ్యాంకు, ప్రభుత్వం నమ్మకంతో ఉన్నాయి. 2021 చివరికల్లా విదేశీ మారక నిల్వలు 3 బిలియన్లకు చేరుతాయని భావిస్తున్నాం. పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనాతో శ్రీలంకకు 1.5 బిలియన్ డాలర్ల మేర SWAP సౌకర్యం ఉన్న సంగతిని కూడా ఫిచ్ విస్మరించింది” అని సెంట్రల్ బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది.
ఇవి కాకుండా చైనాతో శ్రీలంక ‘ఫారెన్ కరెన్సీ టర్మ్ ఫైనాన్సింగ్’ ఒప్పందాన్ని మార్చి 2021లో చేసుకుంది. ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవడం ద్వారా శ్రీలంక చైనాకు చెల్లింపులు చేయవచ్చు.
ఇందుకు అదనంగా శ్రీలంక ఇండియా సహాయాన్ని కోరింది. నవంబర్ లో ఇండియా వచ్చిన శ్రీలంక ఆర్ధిక మంత్రి బాసిల్ రాజపక్షకు ఇండియా ‘చతుర్ముఖ ప్యాకేజీ’ ని ఇవ్వజూపింది. ఈ ప్యాకేజీ ప్రకారం:
-
ఇండియా నుండి ఇంధనం దిగుమతులకు రుణం మంజూరు
-
ట్రింకోమలై ఆయిల్ ఫార్మ్ ని ఇండియా-శ్రీలంకలు ఉమ్మడిగా అభివృద్ధి చేసే పధకాన్ని అనుకున్నదాని కంటే ముందే కుదుర్చుకోవటం
-
శ్రీలంక తన విదేశీ అప్పు చెల్లించేందుకు వీలుగా కరెన్సీ స్వాప్ పధకం
-
వివిధ రంగాల్లో భారతీయ పెట్టుబడులకు సావకాశం కల్పించడం
ఈ పధకంలో భాగంగా శ్రీలంక ఇంధన శాఖ మంత్రి తమ ఇంధన కంపెనీ సైలాన్ పెట్రోలియం కార్పొరేషన్ కు అనుబంధ కంపెనీ ఒకటి ఏర్పాటు చేయమని ఆదేశాలు ఇచ్చినట్లు శ్రీలంక పత్రికలు చెప్పాయి. ‘ట్రింకో పెట్రోలియం టెర్మినల్ లిమిటెడ్’ పేరుతో ఏర్పడే ఈ అనుబంధ కంపెనీ, ఇండియా-శ్రీలంక లు ఉమ్మడిగా అభివృద్ధి చేయనున్న ట్రింకోమాలీ ఆయిల్ ట్యాంక్ ఫార్మ్ కోసం స్పెషల్ పర్పస్ వెహికల్ గా ఉపయోగ పడనుంది.
ఈ అనుబంధ కంపెనీకి శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్ష ఇప్పటికే అనుమతి ఇచ్చాడు. శ్రీలంక కేబినెట్ త్వరలో ఆమోదం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
నిజానికి ట్రింకోమలి ఆయిల్ ఫార్మ్ ప్రాజెక్టు ఇప్పటిది కాదు. 1987 లోనే రాజీవ్ గాంధీ హయాంలో ఇండియా, శ్రీలంకలు ఈ ఒప్పందం పై సంతకాలు చేశాయి. ట్రింకోమాలీ లోని ఆయిల్ ట్యాంక్ ఫార్మ్ (చమురు లాంటి కెమికల్స్ ను నిల్వ చేసే స్టోరేజీ ట్యాంకులు నెలకొని ఉండే ప్రాంతం) ఆధునీకరణకు ఇరు దేశాలు ఉమ్మడిగా కృషి చేయాలని తలపెట్టాయి.
దరిమిలా ఇండియా నుండి వెళ్ళిన ఐపికేఎఫ్ (ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్) ఎల్‌టిటిఈ తో యుద్ధంలో మునిగిపోయింది. ఆ తర్వాత శ్రీలంక ఎల్‌టిటిఈ తో తలపడింది. ఫలితంగా ప్రాజెక్టు మూలన పడింది. 2003లో ప్రాజెక్టును పునరుద్ధరించడానికి చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు.
2017లో మరోసారి చర్చలు జరిపి ప్రాజెక్టును క్రియాశీలకం చేయాలని ఇరు దేశాలు అంగీకరించాయి. కానీ సైలాన్ పెట్రోలియం కార్పొరేషన్ లోని కార్మిక సంఘాలు ఒప్పందాన్ని గట్టిగా వ్యతిరేకించడంతో అడుగులు ముందుకు పడలేదు. ఇప్పుడు శ్రీలంక ఆర్ధిక సంక్షోభం ఇండియాకు కలిసి వచ్చింది.
చైనాతో పేచీ
నిజానికి శ్రీలంకకు ఇండియాతో ఒప్పందాన్ని పునరుద్ధరించవలసిన పరిస్ధితి లేదు లేదా తక్కువ. శ్రీలంకలో చైనాయే అతి పెద్ద మదుపుదారు (investor). శ్రీలంక మౌలిక నిర్మాణాల (రేవులు, రోడ్లు, రైల్వేలు, టెలికాం) అభివృద్ధిలో చైనా ప్రధాన పాత్ర పోషించింది. అదీకాక ఐరాస వేదికలపై శ్రీలంక సమస్య ఎదుర్కొన్నప్పుడల్లా చైనా వీటో చేసి శ్రీలంకను వెనకేసుకొచ్చింది.
ముఖ్యంగా ఎల్‌టిటిఈ తో జరిగిన యుద్ధంలో శ్రీలంక సైన్యం అత్యంత క్రూరంగా వ్యవహరించింది. తమిళ పౌరులను వేల మందిపై సామూహిక హత్యాకాండకు పాల్పడింది. యుద్ధానంతర ఉపశమన చర్యల్లో తమిళ పౌరులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంది. వారికి కనీస సాయం అందకుండా చేసింది. ఎల్‌టిటిఈ కి సహకరించారన్న సాకుతో శరణార్ధి శిబిరాలకు కనీస సౌకర్యాలు కల్పించలేదు.
విచారణకు వచ్చిన ఐరాస మానవ హక్కుల సంస్ధకు ఏ మాత్రం సహకరించకపోగా వారిపై దాడులకు సైతం తెగబడింది. ఈ చర్యలకు గాను అంతర్జాతీయ వేదికలపై శ్రీలంక సమాధానం చెప్పుకోవలసి వచ్చినప్పుడు చైనా సహకారం అందజేసింది. అవసరం అయినప్పుడు వీటో చక్రం అడ్డు వేసింది. ఓ వైపు రాజకీయంగా మరోవైపు ఆర్ధికంగా చైనా, శ్రీలంకను ఆదుకుంది. ఈ క్రమంలో శ్రీలంక చైనా విసిరిన అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్న విమర్శలు కూడా వచ్చాయి.
అయితే కొన్ని నెలల క్రితం చైనా ఎగుమతి చేసిన ఎరువులను శ్రీలంక నిరాకరించడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలలో ఉద్రిక్తత ఏర్పడింది.
ఏప్రిల్ 29, 2021 తేదీన అధ్యక్షుడు గొటబాయ శ్రీలంకను సంపూర్ణ సేంద్రీయ వ్యవసాయ దేశంగా మార్చానున్నట్లు ప్రకటించాడు. రసాయన ఎరువులపై నిషేధం ప్రకటించాడు. సేంద్రీయ ఎరువులు శ్రీలంకలో తయారు కానందున ఆ దేశం అంతర్జాతీయ టెండర్లు జారీ చేసింది. టెండర్లలో చైనా కంపెనీ క్వింగ్-డావో సీవిన్, 99,000 టన్నుల సేంద్రియ ఎరువుల సరఫరాకు కాంట్రాక్టు సంపాదించింది.
సెప్టెంబర్ 2021లో హిప్పో స్పిరిట్ అనే ఒడలో మొదటి విడతగా 20,000 టన్నుల ఎరువు కొలంబో రేవుకు బయలుదేరింది. కానీ శ్రీలంక సాయిల్ సైంటిస్టులు ఈ కన్సైన్మెంట్ శాంపిల్ లో మట్టికి హాని చేసే బాక్టీరియా ఉందనీ, దీనివల్ల శ్రీలంక బయో సెక్యూరిటీకి హాని కలుగుతుందని అభ్యంతరం చెప్పారు. దానితో ఒడను రేవు లో ప్రవేశానికి అనుమతి నిరాకరించారు.

Hippo Spirit near Colombo port
దరిమిలా ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం నడిచింది. శ్రీలంక ఎంపిక చేసిన ధర్డ్ పార్టీ కంపెనీ తోనే ఎరువులను పరీక్ష చేయించామనీ, ఆ పరీక్షలో ఎటువంటి బాక్టీరియా ఉన్నట్లు చెప్పలేదని చైనా వాదించింది. శ్రీలంకకు చెందిన నేషనల్ ప్లాంట్ క్వారంటైన్ సర్వీస్’ సంస్ధ అశాస్త్రీయ పద్ధతులతో పరీక్ష చేసిందని, అంతర్జాతీయ ప్రమాణాలు పాటించలేదని ఆరోపించింది. మీడియాతో వివాదాస్పద వ్యాఖ్యలు “విషపూరితం, చెత్త, కాలుష్యం” లాంటివి చేసిందని అభ్యంతరం చెప్పింది. తద్వారా చైనా కంపెనీలపైన, చైనా ప్రభుత్వం పైన అపవాదు రుద్దే ప్రయత్నం చేసిందని ఆగ్రహించింది.
దానికి తోడు ఎరువుల లోడు రేవులోకి రానందున అందు నిమిత్తం చెల్లించవలసిన 9 మిలియన్ డాలర్ల చెల్లింపును నిలిపివేస్తూ కమర్షియల్ కోర్టు ఆదేశాలిచ్చింది. దానితో చెల్లింపులు చేయవలసిన శ్రీలంక ప్రభుత్వ బ్యాంకు ‘పీపుల్స్ బ్యాంక్’ ను కొలంబో లోని చైనా ఎంబసీ ‘బ్లాక్ లిస్ట్’ లో చేర్చింది. ఒప్పందం ప్రకారం చేయవలసిన చెల్లింపు పూర్తి చేయనందుకు చర్య తీసుకున్నామని ప్రకటించింది. పూర్తి సొమ్ము చెల్లించే వరకు నిషేదిత జాబితాలో బ్యాంకు ఉంటుందని స్పష్టం చేసింది.
అనంతరం వివాదం పరిష్కారానికి చర్చలు జరిగాయి. చర్చల్లో చైనా కంపెనీ అనేక షరతులు విధించింది.
-
నిలిపివేసిన 20,000 టన్నుల ఎరువుకు గాను అసలు ధరలో 70% చెల్లించాలి.
-
అదనంగా రవాణా ఛార్జీలు చెల్లించాలి.
-
ముందు చెప్పినట్లు ఎరువుల క్వాలిటీలో లోపం ఉందన్న ప్రకటనను ఉపసంహరించాలి.
-
దిగుమతి పర్మిట్ లో వివాదం వల్ల ఎరువుల లోడును తిరస్కరించామని సవరణ ప్రకటన చేయాలి.
ఈ షరతులకు శ్రీలంక తల ఒగ్గింది.
చైనా ఒత్తిడికి తల వంచడం శ్రీలంకకు ఇదే మొదటిసారి కాదు. శ్రీలంకలో హంబన్ తోట లో చైనా డీప్-సీ పోర్ట్ ను నిర్మించి ఇచ్చింది. కానీ అందుకోసం చెల్లించవలసిన 1.2 బిలియన్ డాలర్లను శ్రీలంక చెల్లించలేకపోయింది. ఫలితంగా చైనాకు చెందిన చైనా మర్చంట్స్ పోర్ట్ హోల్డింగ్స్ కంపెనీకి హంబన్ తోట పోర్టును 99 యేళ్ళ పాటు లీజు కు ఇవ్వాలని, పోర్టు చుట్టూ ఉన్న 15,000 ఎకరాల ల్యాండ్ ను కూడా చైనా కంపెనీకి అప్పజెప్పాలని చైనా ఒత్తిడి చేసింది. ఆ ఒత్తిడికి శ్రీలంక తల ఒగ్గింది.
ఈ ఒప్పందంపై తిరిగి చర్చలు జరిపి మరింత మెరుగైన ఫలితాన్ని రాబట్టేందుకు శ్రీలంక ప్రభుత్వాలు పలు ప్రయత్నాలు చేసినా చైనా మోకాలడ్డింది. ఆ విధంగా వాణిజ్య ఒప్పందాలను బలహీన దేశాలపై రుద్దడంలోనూ, ఆ ఒప్పందాలను లేదా రుణాలను అడ్డం పెట్టుకుని అసమాన షరతులను రుద్దడం లోనూ తాను పశ్చిమ దేశాల కంటే ఏ మాత్రం తీసిపోనని చైనా రుజువు చేసుకుంది.
అసలు సేంద్రియ వ్యవసాయంగా దేశాన్ని పూర్తిగా మార్చుతామన్న నినాదం వాస్తవానికి శ్రీలంక ఆర్ధిక పరిస్ధితి వల్ల ఇచ్చినదేనని పరిశీలకుల అంచనా. రసాయన ఎరువుల దిగుమతికి సరిపడా విదేశీ ద్రవ్యం లేకపోవడంతోనే అధ్యక్షుడు సేంద్రియ వ్యవసాయం పల్లవి ఎత్తుకున్నాడని విమర్శలు వచ్చాయి. శ్రీలంకలోని వరి, టీ రైతులు కూడా ఈ పధకాన్ని గట్టిగా వ్యతిరేకించారు. దీనివల్ల ధాన్యం ఉత్పత్తి సగానికి పడిపోతుందని రైతులు హెచ్చరించారు. ఆందోళనలు చేశారు.
చైనాతో పేచీ పుణ్యమాని అధ్యక్షుడు రసాయన ఎరువులను పాక్షికంగా ఉపయోగించేందుకు అనుమతి ఇచ్చాడు. రసాయన ఎరువులపై నిషేధాన్ని పాక్షికంగా ఎత్తివేశాడు. రసాయన ఎరువుల దిగుమతికి ప్రైవేటు రంగానికి అనుమతి ఇచ్చాడు. కానీ ఓపెన్ మార్కెట్ లో వాటిని రైతులు కొనుక్కోవాలని ఆదేశించాడు.
ఆ విధంగా శ్రీలంకకు వ్రతము చెడింది. ఫలితమూ దక్కలేదు.
పిట్టల పోరు
ఈ నేపధ్యం లోనే శ్రీలంక ఇండియా సహాయాన్ని అర్ధించింది. శ్రీలంక అర్ధించిన తోడనే భారత ఆర్ధిక మంత్రి, శ్రీలంక ఆర్ధిక మంత్రితో చర్చలు జరిపి పైన చెప్పిన చతుర్ముఖ ప్యాకేజీని ఫైనల్ చేశారు. ఇందులో భాగంగా ఆయిల్ ట్యాంకర్ ఫార్మ్ అభివృద్ధి కోసం ఇరు దేశాల కంపెనీలు వేగంగా అడుగులు వేస్తున్నారు. పత్రికల్లో పెద్దగా హడావుడి లేకుండా పని జరుగుతోందని పత్రికలు చెబుతున్నాయి. కానీ హడావుడి చేయకుండా, దానిని ఎన్నికలకు సొమ్ము చేసుకోకుండా ప్రధాని మోడి ఉండగలరా అన్నది సందేహమే.
దరిమిలా చైనా కూడా శ్రీలంకతో సంబంధాలను యధావిధి స్ధానానికి చేర్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందులో భాగంగా చైనా విదేశీ మంత్రి శ్రీలంక పర్యటన తలపెట్టాడు. ఈ పర్యటన శ్రీలంక నేతలకు లాభం చేకూర్చనుండగా శ్రీలంక ప్రజలకు మాత్రం మరో విడత రుణాల భారం నెత్తి మీద పడే అవకాశం కనిపిస్తోంది.
అమెరికా-చైనాల మధ్య జరుగుతున్న ప్రపంచ ఆధిపత్య పోరు, ఇండియా-చైనాల మధ్య జరుగుతున్న ప్రాంతీయ ఆధిపత్య పోరు ఈ విధంగా శ్రీలంక ప్రజల నెత్తిపైన రుణాల భారం రూపంలో పిడుగుపాటు అవుతోంది.