హిందూ దేశంగా మార్చుతామని ప్రతిజ్ఞ, పోలీసులకు ఫిర్యాదు


Suresh Chavhanke

హిందూత్వ గణాలు దేశంలో, ముఖ్యంగా ఉత్తర భారతంలో చెలరేగిపోతున్నాయి. ఢిల్లీ లోని గోవింద్ పురి మెట్రో స్టేషన్ సమీపంలో ‘హిందూ యువ వాహిని’ అనే సంస్ధ ఆద్వర్యంలో జరిగిన సదస్సు మరో విడత పరమత విద్వేష ప్రసంగాలకు, ప్రతిజ్ఞలకు వేదికగా నిలిచింది. ఈసారి భారత దేశం మొత్తాన్ని హిందూ దేశంగా మార్చేందుకు చంపడానికి, చావడానికి కూడా సిద్ధమంటూ సభికుల చేత నిర్వాహకులు ప్రతిజ్ఞ చేయించారు.

ముస్లింలు, క్రైస్తవులపై జీనోసైడ్ (సామూహిక హత్యాకాండ) జరపాలని, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను తుపాకితో కాల్చి చంపేవాడిననీ ఓ పక్క హరిద్వార్ (ఉత్తర ఖండ్) లో జరిగిన ధర్మ సంసద్ లో హిందూ మత పెద్దలు విద్వేష ప్రసంగాలు చేస్తుండగా మరో పక్క ఢిల్లీలో సుదర్శన్ టి‌వి ఛైర్మన్ మరియు ఎం‌డి సురేశ్ చవ్ హంకే హిందూ యువ వాహిని నిర్వహించిన సదస్సులో అదే తరహా ప్రసంగాలు చేశాడు. అంతటితో ఆగకుండా సభికుల చేత హింసాయుత ప్రతిజ్ఞ చేయించాడు.

డిసెంబర్ 19 తేదీన జరిగిన సదస్సులో సురేశ్ చవ్ హంకే తో పాటు రాజేశ్వర్ సింగ్, రాజీవ్ కుమార్, ఉదయ్ భాన్ సింగ్, ప్రేమ్ పాల్ గుప్తా తదితర హిందూ సంస్ధల నేతలు పాల్గొన్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఫిర్యాదుదారులు అవని బన్సాల్, ప్రశాంత్ దూబే, ప్రఖర్ దీక్షిత్ లు పేర్కొన్నారు.

“సభలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రజల చేత నిందితులు మత హింస, మత విద్వేషం ప్రేరేపించే విధంగా ప్రతిజ్ఞ చేయించారు. మతం ఆధారంగా వివిధ గ్రూపుల మధ్య శతృత్వాన్ని ప్రేరేపించే ప్రయత్నాలు చేశారు. సభలో ప్రసంగీకులు తమ ప్రసంగాల్లో రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు. ప్రతిజ్ఞలో భాగంగా ద్వేష పూరిత భావోద్వేగాలు రెచ్చగొట్టారు. మతం పేరుతో జనాన్ని చంపాలని పిలుపు ఇచ్చారు” అని ఫిర్యాదులో పేర్కొన్నారు. (లైవ్ లా, 28/12/2021)

ప్రతిజ్ఞలోని కొన్ని భాగాలు ఇలా ఉన్నాయి:

  • ఇండియాను హిందూ దేశంగా తయారు చేస్తామనీ, ఇండియాను హిందూ దేశంగానే ఉంచుతామనీ తీర్మానం చేస్తూ మా చివరి శ్వాస వరకు అందుకు కృషి చేస్తామని మాట ఇస్తున్నాం, ప్రతిజ్ఞ చేస్తున్నాం.
  • “మేము మా పోరాటంలో ప్రాణాళిస్తాం. అవసరమైతే చంపడానికైనా సిద్ధమే. ఎలాంటి త్యాగానికైనా, ఎంతకు తెగించడానికైనా మేము సంకోచించము”

అని ఫిర్యాదు పేర్కొంది. ఐ‌పి‌సి సెక్షన్లు 124ఏ, 153ఏ, 153బి, 295ఏ, 298, 505(1), 505(2), 120బి కిందా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000 రూల్ 3(2)(i) కిందా, ఉపా చట్టం 1967 సెక్షన్ 2(f), 10, 11, 12 కిందా, కేబుల్ తెలివిజన్ నెట్ వర్క్స్ (రెగ్యులేషన్) చట్టం 1995 సెక్షన్ 5, 6, 11, 12, 16, 17, 19, 20 కిందా నిందితులను విచారించి శిక్షించాలని ఫిర్యాదులో కోరారు. అంటే కాకుండా నిందితులు డిల్లీ డిసాస్టర్ మేనేజ్^మెంట్ ఆధారిటీ జారీ చేసిన ఆదేశాలను ఉల్లంఘించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

సుదర్శన్ టి‌వి ఛైర్మన్ సురేశ్ చవ్ హంకే ఆర్‌ఎస్‌ఎస్ లో శిక్షణ పొందిన హిందూత్వ వాది. ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ విద్యార్ధి సంఘం ఏ‌బి‌వి‌పి లోనూ ఆయన పని చేశాడు. సుదర్శన్ టి‌వి ని స్ధాపించింది ఆయనే. తాను హిందూత్వ భావజాలాన్ని ప్రమోట్ చేసేందుకే జర్నలిజం చేస్తున్నానని ఆయన స్పష్టంగా ప్రకటించుకున్నాడు. తన చానల్ లోని వార్తాంశాలు తన అభిప్రాయాలను ప్రచారం చేసే లక్ష్యంతోనే ఉంటాయని ప్రకటించాడు.

మత విద్వేషాన్ని రెచ్చగొడుతున్న ఆరోపణలతో సురేశ్ ని ఏప్రిల్ 2017లో ఓ సారి అరెస్టు చేశారు. కానీ రెండు రోజులకే బెయిల్ పై విడుదల అయ్యాడు. 2020లో విద్వేష ప్రసంగం చేసినందుకు ఆయనపై చర్య తీసుకోవాలని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ తన రాష్ట్ర పోలీసులకు ఆదేశాలిచ్చాడు.

మత విద్వేషంతో కూడిన బూటకపు వార్తలు, తప్పుడు వార్తలు ప్రసారం చెయ్యడంలో ఆయన దిట్ట. వీడియోలను ఆర్‌ఎస్‌ఎస్ కి అనుకూలంగా మార్ఫింగ్ చేసి ప్రసారం చేయటం, బి‌జే‌పికి లొంగని వ్యాపార సంస్ధలకు వ్యతిరేకంగా తప్పుడు వార్తలు సృష్టించడం… ఇలాంటి కార్యకలాపాల వల్ల అనేకసార్లు కోర్టు ఆయనకు జరిమానాలు వేసింది. మొట్టికాయలు మొట్టింది. అయినా ఆయన విద్వేష ప్రయాణం కొనసాగుతూనే ఉంది.

మార్చి 2019లో కోజి కోడ్ జిల్లా కోర్టు ఆయనకి 50 లక్షల రూపాయల జరిమానా విధించింది. కేరళకు చెందిన మలబార్ గోల్డ్ కంపెనీ పాకిస్తానీ స్వాతంత్ర దినాన్ని జరుపుకుందని ఆరోపిస్తూ సుదర్శన్ టి‌వి చానల్ ఆయన వార్త ప్రసారం చేశాడు. దానికి మద్దతుగా మార్ఫింగ్ చేసిన విజువల్స్ ని చూపించాడు. ఇది రుజువు కావడంతో కోర్టు జరిమానా విధించింది.

సెప్టెంబర్ 2020లో సుదర్శన్ టి‌వి లో బిందాస్ బోల్ పేరుతో అత్యంత వివాదాస్పద కార్యక్రమాన్ని ప్రసారం చేశాడు. దానికి సురేశ్ చవ్హంకే తానే యాంకర్ గా వ్యవహరించాడు. ముస్లింలు ఇండియన్ సివిల్ సర్వీసెస్ లో చొరబడేందుకు కుట్ర రూపొందించి అమలు చేస్తున్నారన్నది ఆ కార్యక్రమం సారాంశం. యూ‌పి‌ఎస్‌సి జీహాద్ అంటూ ఒక హ్యాష్ ట్యాగ్ ను కూడా ఈ సందర్భంగా ట్విట్టర్ లో ప్రచారం చేయడం ప్రారంభించాడు.

కార్యక్రమం ట్రైలర్ విడుదల అయ్యాక ఇది మత విద్వేషంతో కూడుకున్నదని ఆరోపిస్తూ ఢిల్లీ హై కోర్టులో కేసు వేశారు. ఢిల్లీ హై కోర్టు కార్యక్రమం ప్రసారం పై నిర్ణయం తీసుకోవాలని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖను ఆదేశించింది. అది వార్తా చానెల్ కార్యక్రమం కనుక ప్రసారం కాక మునుపే నిలిపివేసే అధికారం తనకు లేదని చెబుతూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కార్యక్రమం ప్రసారానికి అనుమతి ఇచ్చేశారు.

కేసు సుప్రీం కోర్టులో అప్పీలుకు వెళ్లింది. ఈ లోపు 10 ఎపిసోడ్లలో 4 ఎపిసోడ్లు ప్రసారం అయ్యాయి. వాటిని చూసిన జస్టిస్ చంద్ర చూడ్ వెంటనే స్టే విధించారు. తదుపరి ఎపిసోడ్లు ప్రసారం చెయ్యొద్దని ఆదేశించారు. ఈ కార్యక్రమం ముస్లింలను దూషించే (vilify) విధంగా ఉందని, కార్యక్రమం ఉద్దేశం, లక్ష్యం, ప్రయోజనం ముస్లింలను కించపరచడమే అని స్పష్టం చేశారు. ముస్లిం కమ్యూనిటీ సివిల్ సర్వీసెస్ లో చొరబడేందుకు కుట్ర చేసారంటూ వారిని నేరంలో ఇరికించేందుకు మాయోపాయ ప్రయత్నం జరిగిందని చెప్పారు. “ఎపిసోడ్లలో చెప్పిన పలు స్టేట్^మెంట్లు తప్పుడువి, నిజాలను ఉద్ద్య్స్యపూర్వకంగా విస్మరించి చేసినవి” అని సుప్రీం కోర్టు న్యాయమూర్తి తలంటు పోశారు.

ఎంతగా తలంటు పోసినా సుదర్శన్ టి‌వి చీఫ్ ఎడిటర్ కు కళ్ళు తెరుచుకోలేదు. నిజానికి స్పష్టమైన లక్ష్యంతో పని చేస్తున్న సురేశ్ చవహంకే కళ్ళు తెరిచే అవకాశం లేదు. బి‌జే‌పి రూపంలో రాజకీయ అండదండలు, బి‌జే‌పి కేంద్ర ప్రభుత్వం రూపంలో ప్రభుత్వ పరోక్ష సహకారం లభిస్తున్నంత వరకు ప్రజల్ని విభజించి విద్వేషాలు రెచ్చగొట్టే పని సాగిస్తూనే ఉంటాడు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s