
Test firing of Zircon hyper-sonic missile from Gorshkov frigate
రష్యా తన ఆయుధ సంపత్తిని అమెరికాకు కూడా అందనంత ఎత్తుకు చేర్చుకుంటోంది. నాటో కూటమిని తూర్పు దిశలో రష్యా పొరుగు సరిహద్దు వరకూ విస్తరించడానికి అమెరికా కంకణం కట్టుకుంటున్న కొద్దీ రష్యా తన ఆయుధ సంపత్తిని మరింత ఆధునిక స్ధాయికి అభివృద్ధి చేస్తోంది.
తాజాగా అత్యంత వేగంగా, శత్రు దేశాల రాడార్లకు దొరకని విధంగా అత్యంత రహస్యంగా ప్రయాణించి లక్ష్యాన్ని ఛేదించగల మిసైల్ ని ‘జిర్కాన్’ పేరుతో రష్యా అభివృద్ధి చేసింది.
సుదీర్ఘ దూరాల వరకు ఏరో డైనమిక్ ఫ్లైట్ లను చేపట్టగల మొట్ట మొదటి హైపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ అయిన జిర్కాన్ ను శుక్రవారం తెల్లవారు ఝామున విజయవంతంగా పరీక్షించామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించాడు.
ఈ తరహా హైపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ ప్రపంచంలో ఇదే మొట్ట మొదటిది. అమెరికా ఈ తరహా మిసైళ్ళ ను అభివృద్ధి చేసుకోవడంలో ఇంకా ప్రయోగ దశలోనే ఉన్నది.
“నిన్న రాత్రి, ఖచ్చితంగా చెప్పాలంటే ఈ రోజు తెల్లవారు ఝాము జిర్కాన్ హైపర్ సోనిక్ వ్యవస్ధను ప్రయోగించాము. ఇది మా సరికొత్త మిసైల్” అని పుతిన్ ప్రకటించాడు.
జిర్కాన్ మిసల్ అటు నీటి పైనా, ఇటు భూమి పైనా కూడా ప్రయోగించవచ్చు. అనగా సముద్రంలోని టార్గెట్ తో పాటు భూమిపై ఉన్న టార్గెట్ కూడా ఛేదించగలదు. పరీక్షా ప్రయోగాన్ని విజయవంతంగా, ఎటువంటి లోపం లేకుండా ముగించినట్లు తెలుస్తోంది.
రష్యా రక్షణ సామర్ధ్యాన్ని పెంచుకోవడంలో ఇది అత్యంత ముఖ్యమైన ముందడుగు అని రష్యా రక్షణ అధికారులు అభివర్ణించారు.
వాతావరణంలోని అత్యంత చిక్కనైన పొరలను కూడా ఛేదించుకుంటూ ప్రయాణించగల సామర్ధ్యం జిర్కాన్ సొంతం అని రష్యా తెలిపింది. అది కూడా తన సొంత ప్రోపల్షన్ శక్తితోనే ప్రయాణించగలదు.
జిర్కాన్ గరిష్ణ వేగం మ్యాచ్ 9. అనగా శబ్ద వేగం కంటే 9 రెట్లు వేగంగా అది ప్రయాణించగలదు. అనగా గంటకు 11,025 కి.మీ వరకు ప్రయాణించగలదు. మిసైల్ గరిష్ట రేంజి 1000 కి.మీ. దీనర్ధం జిర్కాన్ మిసైల్ సెకనుకు 3.087 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తూ 1000 కిలో మీటర్ల లోపు లక్ష్యాన్ని ఛేదించగలదు.
ఇప్పటికే ఎస్-400 మిసైల్ రక్షణ వ్యవస్ధ అమ్మకాలతో నాటో దేశాల ముఖ్యంగా అమెరికా ఆయుధ సంపత్తిని వెలతెలా పోయేలా చేస్తున్న రష్యా, జిర్కాన్ మిసైల్ తయారీతో ఆయుధాల కొనుగోలుదారులకు మరింత ఆకర్షణీయం అయింది. అలాగే అమెరికా ఆయుధ సంపత్తికి గట్టి సవాలు విసిరింది.