దళిత వంటను ఆ పిల్లలు ముట్టుకోలేదు, ఆమె ఉద్యోగం పోయింది!


భారత రాజ్యాంగం కుల వివక్షను రద్దు చేసింది. అలాగే అంటరానితనాన్ని కూడా రద్దు చేసింది. కానీ రాజ్యాంగం అమల్లోకి వచ్చి 70 యేళ్ళు గడిచినా కూడా భారత సమాజం రాజ్యాంగంలో పొందు పరిచిన సామాజిక విలువలను గౌరవించేందుకు సిద్ధంగా లేదు.

ఉత్తర ఖండ్ లోని ఒక స్కూల్ పిల్లలు దళిత మహిళ వంట చేసిందన్న కారణంతో ఆ స్కూల్ లో వడ్డించే మధ్యాహ్న భోజనాన్ని తినడం మానేశారు. స్కూల్ భోజనం తినడానికి బదులు తమ ఇళ్ల నుండి భోజనం కేరియర్ తెచ్చుకోవడం మొదలు పెట్టారు.

చంపావత్ జిల్లాలో సుఖిధంగ్ గ్రామంలోని పాఠశాలలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

స్కూల్ పిల్లలు భోజనం చేయడానికి నిరాకరిస్తుండడంతో జిల్లా విద్యాధికారులు దళిత మహిళను ఉద్యోగం నుంచి తొలగించారు. అసలు కారణం చెప్పకుండా ఆమె నియామకంలో పాటించవలసిన నియమాలను పాటించలేదని అందుకే ఉద్యోగం నుంచి తొలగించామని తప్పుడు కారణం చెప్పి తప్పించుకోజూస్తున్నారు.

భారత రాజ్యాంగం లోని ఆర్టికల్ 17 ఇలా చెబుతుంది:

ఆర్టికల్ 17: అంటరానితనం రద్దు -“అంటరానితనం” రద్దు చేయబడింది. అంటరానితనాన్ని ఏ రూపంలోనైనా ఆచరించడం నిషేధించబడింది. “అంతరానితనం” ద్వారా ఉత్పన్నమయ్యే ఎలాంటి ప్రతికూలతనైనా బలవంతంగా రుద్దడం నేరం. ఈ నేరానికి పాల్పడినవారు చట్టం ప్రకారం శిక్షింపబడతారు.

1955 యాక్ట్ నెంబర్ 22 గా ఆమోదించిన పౌరహక్కుల రక్షణ చట్టం కింద అంటరానితనం నేరంగా ప్రకటించబడింది. అంటరానితనాన్ని ఆచరించినా, బోధించినా వారు శిక్షార్హులు,

పౌరహక్కుల చట్టం సెక్షన్ 4 (iii) కింద ఆంటనారితనం ఆచరణలో భాగంగా ఏదైనా వృత్తిని అవలంబించడానికి గానీ, ఏదైనా ఉద్యోగం గానీ, వ్యాపారం గానీ, ఉపాధి గానీ పొందడానికి నిరాకరించడం నేరం.

అంటరానితనం పాటించినా బోధించినా వారికి కోర్టు తప్పనిసరిగా 1 నుండి 2 సం.ల జైలు శిక్ష మరియు జరిమానా విధించాలి.

రాజ్యాంగం ప్రసాదించిన ‘సంపూర్ణ హక్కు’లలో ఆర్టికల్ 17 ఒకటి. అంటే ఏ పరిస్ధితిలోనైనా ప్రభుత్వం ప్రాధమిక హక్కులను రద్దు చేయవచ్చు. అటువంటి పరిస్ధితుల్లో కూడా ఆర్టికల్ 17 కింద సమకూరిన హక్కు (అంటరానితనానికి గురికాకుండా రక్షించబడే హక్కు) రద్దు కాబోదు. ఇదే సంపూర్హ హక్కు.

ఇటువంటి సంపూర్ణ హక్కుని అమలు చేసేందుకు కూడా ప్రభుత్వాలు ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. మీటింగుల్లో నినాదాలు చేయడం, పోస్టు కార్డు, ఇన్^లాండ్ లెటర్ వంటి వాటిపై ‘అంటరానితనం నేరం’ అని ప్రచురించడం మొ.న ఉపయోగం లేని చర్యలు మినహా ఈ చట్టాన్ని లేదా ఈ హక్కుని వాస్తవంగా ఆచరణలో అమలు చేసేందుకు ప్రభుత్వాలు ఎటువంటి చర్యా తీసుకోలేదు.

ఒకవేళ ఎవరైనా దళితులు ధైర్యం చేసి కేసు పెట్టినా పోలీసులు ఎఫ్‌ఐ‌ఆర్ నమోదు చెయ్యరు. పెద్ద మనుషులకు కబురు చేసి రాజీ ప్రయత్నాలు చేయిస్తారు. లేదా దళితులను బెదిరిస్తారు. ఏవీ పని చేయకపోతే దొంగ కేసులు బనాయిస్తారు. కేసు ఉపసంహరించుకునే పరిస్ధితులు కల్పిస్తారు.

ఫలితంగా అంటరానితనం నేటికీ నిర్లజ్జగా కొనసాగుతోంది. కుల వివక్ష, అంటరానితనం ఎప్పుడో పోయాయి. ఇంకా ఎక్కడున్నాయి? అని ప్రశ్నించేవారి కళ్ళు తెరిపించేలా ప్రతి రోజూ ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. పత్రికలకు ఎక్కేవి కొన్ని. ఎక్కనివి వేనవేలు.

ఆఫీసుల్లో, ఫ్యాక్టరీల్లో, బ్యాంకుల్లో, ఇంకా అనేకానేక పని స్ధలాల్లో అంటరానితనం, కుల వివక్ష కొనసాగుతున్నాయి. కాకుంటే పచ్చిగా ఆచరించడం మానేసి ఆధునిక రూపాల్లో అమలు చేస్తున్నారంతే.

పక్క కుర్చీలో కూర్చుంటే లేచిపోవడం, అద్దెకు ఇల్లు ఇవ్వకపోవడం, కొలీగ్ ఇంటికి వెళితే బైటే నిలబెట్టి మాట్లాడడం, ఇంటికి వస్తే వాకిలి దగ్గరే మాటలు ముగించి వెళ్లిపోవడం, వేరు లేదా ప్రత్యేక శ్మశానాలు, ఊరికి బయట దళిత కాలనీలు… ఇలా వేలు పెట్టి చూపే అవకాశం లేకుండా నేర్పుగా అంటరానితనం పాటించడం కొనసాగుతూనే ఉంది.

అనేక చోట్ల గ్రామాల్లో అయితే పచ్చిగానే అంటరానితనం అమలవుతోంది.

ఉత్తర ఖండ్ పాఠశాల అందుకు ఒక ఉదాహరణ.

సదరు దళిత మహిళను ఈ నెల లోనే ఉద్యోగంలో నియమించారు. ఆమెతో పాటు అగ్రకుల మహిళను కూడా ఇంటర్వ్యూ చేశారు. ఉద్యోగం దళిత మహిళను వరించింది.

ఆ తర్వాత రోజు నుండి పిల్లలు కేరియర్లలో భోజనం తెచ్చుకోవడం ప్రారంభించారు. మొత్తం 66 మండి విద్యార్ధులు స్కూల్ ఉంటే వారిలో 40 మంది పిల్లలు దళిత మహిళ చేసిన భోజనాన్ని తినడానికి నిరాకరించారు.

అక్కడ స్కూల్ లో మధ్యాహ్న భోజనం తయారు చేసే వంట మనిషిని ‘భోజన్ మాత’ అని పిలుస్తారు. అది ఆ ఉద్యోగం పేరు. భోజన్ మాత కులం కారణంగా తాము భోజనం చేయట్లేదని పిల్లలు చెప్పారు. ఆ పిల్లల తల్లి దండ్రులు కూడా దళిత మహిళను భోజన్ మాత గా నియమించడాన్ని తప్పు బట్టారు.

ఈ నేపధ్యంలో దళిత మహిళ నియామకాన్ని రద్దు చేశామని చంపావత్ జిల్లా చీఫ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఆర్ సి పురోహిత్ చెప్పారు. “ఆమె నియామకంలో నిబంధనలు పాటించనందున తొలగించాము” అని ఆయన నియామకం రద్దు నిర్ణయాన్ని సమర్ధించుకున్నారు. నేర్పుగా అంటరానితనాన్ని కవర్ చేయడం అంటే ఇదే.

“ఆమె నియామకాన్ని ఉన్నత అధికారులు ధృవీకరించలేదు. అయినా ఆమెకు ఉద్యోగం ఇచ్చారు” అని చీఫ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సెలవిచ్చారు. ఉన్నత అధికారులు ధృవీకరించకపోతే ఇప్పుడు ఆ పని చేయవచ్చు. దానికి ఎవరు అడ్డు వచ్చారు?

అసలు విషయాన్ని దాచిపెట్టదలిస్తే ఎన్ని సాకులు అందుబాటులో ఉండవు గనక?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s