ఇది హిందూత్వ కాదు ‘చోర్ బజార్’! -శివ సేన


Proposed temple model

హిందూత్వను ఎవరు నిజాయితీగా ఆచరిస్తున్నారు అన్న అంశంలో బి‌జే‌పి, శివసేన పార్టీల మధ్య ఎప్పుడూ పోటీ నెలకొని ఉంటుంది. మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్‌సి‌పి లతో కలిసి శివసేన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఈ పోటీ మరింత తీవ్రం అయింది.

బి‌జే‌పి తో స్నేహం విడనాడి లిబరల్ బూర్జువా పార్టీలైన కాంగ్రెస్, ఎన్‌సి‌పి లతో జట్టు కట్టడమే హిందూత్వ సిద్ధాంతానికి ద్రోహం చెయ్యడంగా బి‌జే‌పి ఆరోపిస్తుంది. అసలు బి‌జే‌పి ఏనాడో హిందూత్వను వదిలి పెట్టి అవినీతికి, అన్యాయాలకు పాల్పడుతున్నదని శివసేన ఆరోపిస్తుంది.

శివసేన ఆరోపణలను నిజం చేస్తూ ఇండియన్ ఎక్స్^ప్రెస్ పత్రిక అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని అడ్డం పెట్టుకుని బి‌జే‌పి నేతలు, బి‌జే‌పికి సన్నిహితంగా మెలిగే ప్రభుత్వాధికారులు భారీ ఎత్తున భూ కుంభకోణానికి లేదా రియల్ ఎస్టేట్ కుంభకోణానికి పాల్పడిన విషయాన్ని వెల్లడి చేసింది.

బాబ్రీ మసీదు భూమిని హిందూ సంస్ధలకు రామాలయం నిర్మాణం నిమిత్తం అప్పగిస్తూ సుప్రీం కోర్టు నవంబర్ 9, 2019 తేదీన తీర్పు చెప్పింది. ఆ తీర్పు అనంతరం ఆలయం స్ధలానికి సమీపంలో చుట్టుపక్కల 5 కిలో మీటర్ల వరకు బి‌జే‌పి నేతలు, ప్రభుత్వ అధికారులు భూములు చౌకగా కొని పెట్టుకున్నారని ఇండియన్ ఎక్స్^ప్రెస్ పత్రిక వెల్లడించింది.

గత రెండు రోజులుగా పత్రిక కుంభకోణం గురించిన కధనాలను వెలువరిస్తోంది. ఈ కుంభకోణంలో భాగంగా దళితులకి కేటాయించిన భూములను కూడా మోసంతో కాజేసి బి‌జే‌పి నేతలు సొమ్ము చేసుకున్న వైనాన్ని పత్రిక వెల్లడి చేసింది.

ఈ సందర్భంగా శివసేన పత్రిక సామ్నా, కుంభకోణంపై ఈ రోజు సంపాదకీయం ప్రచురించింది. ఇందులో బి‌జే‌పి అవినీతిని ఉతికి ఆరేసింది. అయోధ్యలో రామాలయం నిర్మాణాన్ని అపవిత్రంగా మార్చేసిందని విమర్శించింది. ఇది హిందూత్వ కాదు, చోర్ బజార్ అని తిట్టిపోసింది.

సంపాదకీయంలోని కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి.

  • బి‌జే‌పి హిందూత్వ ఒక చోర్ బజార్. ఆ సంగతి అంతకంతకూ ఎక్కువగా స్పష్టం అవుతోంది. అయోధ్య (భూమి) ఒప్పందాలు ఆ చోర్ బజార్ లో భాగమే.
  • అయోధ్యపై సుప్రీం కోర్టు తీర్పు తర్వాత బి‌జే‌పి నాయకులు, ఎం‌ఎల్‌ఏలు, మేయర్ అక్కడ లీగల్-ఇల్లీగల్ తరహాలో భూముల్ని కొనుగోలు చేశారు. ఈ లావాదేవీలన్నీ అనుమానాస్పదం మరియు దిగ్భ్రాంతికరమైనవి.
  • ప్రధాన మంత్రి మోడి, ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్, యూ‌పి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ ల సమక్షంలో ఆలయం కోసం భూమి పూజ జరిగింది. ఆ సమయంలో బి‌జే‌పి లోని వ్యాపారులు ప్రతిపాదిత ఆలయ స్ధలం సమీపంలో ప్రైమ్ భ్హూమి ప్లాట్లతో వ్యాపారం మొదలు పెట్టారు. ఆలయ ట్రస్టు 70 ఎకరాల స్ధలాన్ని సేకరించింది. అదే సమయంలో బి‌జే‌పి ఎం‌ఎల్‌ఏలు, కార్పొరేటర్లు, పార్టీకి సన్నిహితంగా మెలిగే పోలీసు అధికారులు స్ధలాలను కొనుగోలు చేసి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టారు.
  • ఎం‌ఎల్‌ఏలు, మేయర్, రాష్ట్ర ఓ‌బి‌సి కమిషన్ సభ్యుడు, డివిజనల్ కమిషనర్, ఇంకా ఇతర అధికారుల బంధువులు ఆలయ సమీపంలో ఏ విధంగా కోట్ల ఖరీదు చేసే భూములను కొనుగోలు చేసిందీ ఎత్తి చూపింది.
  • ఆలయ నిర్మాణం జరిగాక అక్కడ ఏరియా మొత్తం మారిపోతుంది. భూముల ధరలు అమాంతం పెరిగిపోతాయి. ఇది మతం పేరుతో జరుగుతున్న వ్యాపారం. వాస్తవంగా తమ రక్తాన్ని ధారపోసింది ఎవరు? చనిపోయింది ఎవరు? లాభాల్ని ఎవరు పోగేసుకుంటున్నారో చూడండి! ఇది ఒక కుంభకోణం.
  • అయోధ్య మేయర్ కొన్ని లక్షలు మాత్రమే పెట్టి ఒక ప్లాట్ ల్యాండ్ కొన్నాడు. అనంతరం కేవలం 5-10 నిమిషాల్లో ఆ ప్లాట్ ను రామ జన్మభూమి ట్రస్టుకి 16 కోట్ల రూపాయలకు అమ్మాడు. ఆ మేయర్ బి‌జే‌పి నేత. ఇది రామ ప్రభువు పేరుతో జరుగుతున్న చోర్ బజార్. ఎవరైనా దీనిని హిందూత్వ అని పిలుస్తున్నారంటే మనం వాళ్ళ ముందు చేతులు జోడించి సాష్టాంగ నమస్కారం చేయాల్సిన అవసరం ఉంది.
  • శివసేన అధికారం కోసం హిందూత్వతో విడిపోయిందని బి‌జే‌పి పాఠాలు చెబుతోంది. కానీ బి‌జే‌పి ఈ వాణిజ్య హిందూత్వను తమతోనే అట్టిపెట్టుకోవాలి. వీళ్ళు తమ వ్యాపార లావాదేవీల నుండి దూరంగా ఉండేందుకు రామ ప్రభువుని కూడా అనుమతించడం లేదు.
  • ఆలయం కోసం ఎవరెవరో చనిపోయారు. బి‌జే‌పి వారి త్యాగాల నుండి లబ్ది పొందుతోంది. అయోధ్యలో రామాలయం కోసం ఆందోళనకు నాయకత్వం వహించిన లాల్ కృష్ణ అద్వానిని బి‌జే‌పి పక్కకు నెట్టేసింది. ఆ బి‌జే‌పి ఇప్పుడు అయోధ్యలో వ్యాపార కేంద్రాలు నెలకొల్పుతోంది.
  • బి‌జే‌పి ప్రవేశపెట్టిన నూతన హిందూత్వ హిందూ మతాన్ని అప్రతిష్టపాలు చేస్తుంది. భూముల్ని కాజేయడానికి బి‌జే‌పి టెక్నాలజీని అభివృద్ధి చేసుకుంది.
  • బి‌జే‌పి హిందూత్వలో రామ ప్రభువుకు స్ధానం లేదని కేవలం వ్యాపారానికి మాత్రమే స్ధానం ఉందని ఇప్పుడు వెల్లడి అయిన కుంభకోణం రుజువు చేస్తోంది. సమీపంలోని భూములు స్వాధీనం చేసుకునేందుకే వాళ్ళకి ఆలయాలు కావాలి.
  • ఇతరులకి మాత్రమే “రామ్ నామ్ సత్యా హై” బోధన వర్తిస్తుంది. బి‌జే‌పి కేమో డబ్బు, అధికారం దక్కుతుంది. తాము ‘దేవాచి అలండి’ కి వెళ్తున్నామని ప్రజలు భావిస్తున్నారు. కానీ బి‌జే‌పి వాళ్ళని ‘దొంగల అలండి’ కి తీసుకెళ్తోంది. (దేవాచి అలండి అంటే టెంపుల్ టౌన్ గా పిలిచే పూణే).
  • బి‌జే‌పి దేశాన్ని అమ్మేసింది. కానీ వారు అయోధ్యని అమ్మడానికి మనం అనుమతించకూడదు. ఎందుకంటే శివసేన హిందూత్వ కాషాయ జెండాను సమున్నతంగా ఎత్తి పట్టుకుంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s