రిపేర్ ఖర్చు పెట్టలేక టెస్లా ఎలక్ట్రిక్ కారు పేల్చేసిన ఓనర్!


ఇది ఫిన్లాండ్ దేశంలో జరిగింది.

టెస్లా కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాలకు పెట్టింది పేరు. ఎలాన్ మస్క్ ఈ కంపెనీ వ్యవస్ధాపకుడు. టెస్లా కంపెనీకి సి‌ఈ‌ఓ ఆయనే.  ఫేస్ బుక్, వాట్సప్, ఇన్స్టాగ్రాం కంపెనీల యజమాని మార్క్ జుకర్ బర్గ్ వాట్సప్ ప్రైవసీ పాలసీలో మార్పులు చేశాక, వాట్సప్ ని మొబైల్ ఫోన్ల నుండి తీసేసి దాని బదులు సిగ్నల్ అప్లికేషన్ ను ఇన్స్టాల్ చేసుకోమని యూజర్లకు ట్విట్టర్ ద్వారా సలహా ఇవ్వడం లాంటి చర్యలు, ప్రకటనల ద్వారా తరచూ వార్తల్లో నిలిచే ఎలాన్ మస్క్ ఈసారి తన కంపెనీ కస్టమర్ చర్య ద్వారా వార్తల్లో నిలిచే భాగ్యం దక్కించుకున్నాడు.

అనేక ఆధునిక ఫీచర్లతో, ఆకర్షణీయమైన డిజైన్లతో ఎలక్ట్రిక్ వాహనాలు ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్ లోకి తేవడంలో టెస్లా కంపెనీ ప్రసిద్ధికెక్కింది. టెస్లా ప్రవేశపెట్టే ఎలక్ట్రిక్ కార్లు ఫ్యూచరిస్టిక్ కార్లుగా పేరు తెచ్చుకున్నాయి.

టెస్లా కార్లలో ‘టెస్లా మోడల్ ఎస్’ ఒకటి. ఈ కారును కోనుగోలు చేసిన ఫిన్లాండ్ దేశస్ధుడు ఒకరు తన కారు రిపేర్ కి రావడంతో టెస్లా డీలర్ కి అప్పగించాడు. వాళ్ళు నెల రోజులు కారుని తమ వద్ద పెట్టుకుని చివరికి కారులో ఇక ముఖ్యమైన పార్టుని పూర్తిగా కొత్తది వేస్తే తప్ప రిపేర్ కాదని తేల్చేశారు. ఆ పార్టు కొనడానికి దాదాపు 20,000 యూరోలు లేదా 22,480 డాలర్లు లేదా 17 లక్షల రూపాయలు ఖర్చు చేయాలని చెప్పడంతో కారు ఓనర్ ఫ్రస్ట్రేషన్ తో 30 కే‌జిల డైనమేట్ తో కారుని పేల్చేశాడు.

కారుని పేల్చడంతో ఆయన సరిపెట్టుకోలేదు. మొత్తం పేల్చుడు కార్యక్రమాన్ని షూట్ చేయడానికి ఒక యూ ట్యూబ్ చానల్ కు భాద్యతలు అప్పగించాడు. వాళ్ళు తాము షూట్ చేసిన దాన్ని ఒక షార్ట్ ఫిల్మ్ తరహాలో ఎడిట్ చేసి ఇంటర్నెట్ లో పోస్ట్ చేశారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అయింది. అనేక వార్తా పత్రికలు, వెబ్ సైట్లు దానిని ప్రముఖ వార్తగా మార్చేశాయి. టెస్లా మామూలు కంపెనీ కాదు మరి!

ఆ కారు ఓనర్ పేరు ధామస్ కేటనిన్. కిమెన్లాక్సో ప్రాంతానికి చెందిన ధామస్ కొన్నేళ్ళ క్రితం కారు కొనుగోలు చేశాడు. ఈ ‘మోడల్ ఎస్’ కారు 60 లక్షల రూపాయల నుండి 1.5 కోట్ల రూపాయల వరకు ధర పలుకుతుంది. అత్యాధునిక మైన ఆకర్షణీయ ఫీచర్లు దాని సొంతం.

“ఆ టెస్లా కారు కొన్నప్పుడు మొదటి 1500 కి.మీ ప్రయాణం చాలా బాగుంది. అది బ్రహ్మాండమైన కారు. ఇన్నాళ్లూ వాడాక ఎర్రర్ కోడ్స్ ప్రత్యక్షం అవడం మొదలయింది. దానితో ఒక టో ట్రక్కుకి ఆర్డర్ ఇచ్చి కారుని సర్వీస్ స్టేషన్ కి చేర్చాను. దాదాపు నెల రోజుల వరకు కారు డీలర్ వర్స్క్ షాపు లోనే ఉంది. చివరికి వాళ్ళు నాకు ఫోన్ చేసి కారుని ఏం చేయలేమని చెప్పారు. మిగిలిన్ ఒకే ఒక ఆప్షన్ మొత్తం బ్యాటరీ సెల్ మార్చడమే అని చెప్పారు” అని ధామస్ యూ ట్యూబ్ వీడియోలో చెప్పాడు.

“బ్యాటరీ ఖరీదు 20,000 యూరోలు. దాంతో నేను వస్తున్నానని వాళ్ళకి చెప్పాను. ఇప్పుడు ఆ కారుని పేల్చివేయబోతున్నాను. ఎందుకంటే కారు పని చేస్తుందన్న గ్యారంటీ ఏమీ లేదు” అని ధామస్ వాపోయాడు. కారు పేల్చివేయడానికి ధామస్ నిపుణుల సహాయం తీసుకున్నాడు. పేల్చివేత కార్యక్రమాన్ని షూట్ చేసిన యూ ట్యూబ్ చానెల్ పేరు ‘Pommijatkat’. ఈ చానల్ కొంతమంది వాలంటీర్ల సాయంతో షూటింగ్ పూర్తి చేసి ఇంటర్నెట్ లో పెట్టింది.

కారుని పేల్చివేసి ఆ దృశ్యాన్ని ఇంటర్నెట్ లో పెట్టడం ద్వారా టెస్లా కంపెనీ అందజేస్తున్న సర్వీస్ క్వాలిటీ గురించి ప్రచారం చేయాలని ధామస్ ఆలోచన. కార్ల అమ్మకాల తర్వాత కంపెనీ అందజేస్తున్న సర్వీసు విధానం కస్టమర్లకు అనుకూలంగా లేదని ధామస్ ఫిర్యాదు.

కారు రిపేర్ కి వచ్చేసరికి దాని వారంటీ ముగిసిపోవడంతో ఖర్చు మొత్తం భరించాల్సిన పరిస్ధితి. కానీ అంత డబ్బు పెట్టినా కారు మళ్ళీ రోడ్డు ఎక్కుతుందన్నా గ్యారంటీ కంపెనీ/డీలర్ ఇవ్వలేదుట.

పూర్తిగా మంచుతో కప్పబడి ఉండే జాల గ్రామంలో పేల్చివేత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒక కొండ పక్క కారుని నిలబెట్టి ఒక పక్క డైనమైట్లను పేర్చారు. కారు ముందు భాగంలో టెస్లా అధినేత ఎలాన్ మాస్క్ దిష్టి బొమ్మని కూర్చోబెట్టారు. తర్వాత దూరంగా ఒక బంకర్ లో నిలబడి ఫ్యూజు వైర్ ని అంటించి కారుని పేల్చేశారు.

కారు పేల్చివేత అంత తేలిక కాదని నిపుణులు వీడియోలో వివరించారు. మొత్తం తతంగాన్ని మనం వీడియోలో చూడవచ్చు. టెస్లా మోడల్ ఎస్ కారుని నడపడం కంటే దాన్ని పేల్చివేయడంలోనే తాను ఎక్కువ థ్రిల్లింగ్ అనుభవించానని ధామస్ చెప్పడం కొసమెరుపు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s