
Brazil President Jair Bolsonaro & Fin Min Paulo Gudes
ఐఎంఎఫ్ ని బ్రెజిల్ గెంటివేసింది. మీ సేవలు చాలు, దేశాన్ని విడిచి వెళ్ళండి అని మొఖం మీదే చెప్పింది. బ్రెజిల్ ఆర్ధిక మంత్రి స్వయంగా ‘ఇక చాలు, మూటా ముల్లె సర్దుకోండి’ అని చెప్పేశాడు. దానితో బ్రెజిల్ లో తమ కార్యాలయాన్ని మూసివేస్తామని బ్రెజిల్ ప్రకటించింది.
ఐఎంఎఫ్ సంస్ధ ప్రపంచ కాబూలీవాలా. ఆర్ధిక కష్టాల్లో ఉన్న దేశాలకు అప్పులిచ్చి ఆదుకుంటామని చెప్పుకుంటుంది. సంక్షోభంలో ఉన్న దేశాలకు సంక్షోభ నివారణ ఔషధాలు అందజేసి కోమా ఉన్న ఆర్ధిక వ్యవస్ధలను తిరిగి లేపి నిలబెట్టే పేరుతో ఆయా దేశాల ఆర్ధిక కార్యకలాపాలను తన నియంత్రణలోకి తెచ్చుకుంటుంది.
అంతిమంగా ఆ దేశాలు పూర్తిగా అమెరికా, పశ్చిమ దేశాలపై ఆధారపడి ఉండేలా తయారు చేస్తుంది. తీరా అంతా అయ్యాక చూస్తే ఆయా దేశాల ఆర్ధిక వ్యవస్ధలు మునుపటి కంటే మరింత సంక్షోభంలో కూరుకుపోయి కోమాలో నుండి మరణ శయ్య మీదికి చేరినట్లు తెలుస్తుంది.
బ్రెజిల్ ఆగ్రహానికి కారణం ఆ దేశ ఆర్ధిక వ్యవస్ధ జిడిపి వృద్ధి రేటు గురించి ఐఎంఎఫ్ కార్యాలయం వేసిన అంచనాలు ఘోరంగా తలకిందులు కావడం. బ్రెజిల్ ఆర్ధిక వ్యవస్ధ అసలే మాంద్యం (recession) లో ఉంటే ఐఎంఎఫ్ మరింత నిరాశాపూరిత అంచనాలతో బ్రెజిల్ పై విశ్వాసం దెబ్బ తినేలా చేస్తోందని బ్రెజిల్ ఆర్ధిక మంత్రి పావ్లో గెడెస్ ఆరోపించాడు.
“ఇక వాళ్ళు లేచి నడవడం మొదలు పెట్టొచ్చు” అని ఆయన వ్యంగ్యంగా ఇక వెళ్లండంటూ సూచించాడు.
“ఇక్కడ కూర్చుని బ్రెజిల్ ఆర్ధిక వ్యవస్ధ 9.7 శాతం కుచించుకుపోతుందని (2020 లో) బ్రిటన్ ఆర్ధిక వ్యవస్ధ 4 శాతం కుచించుకుపోతుందని అంచనా వేశారు. తీరా చూస్తే మా దేశం 4% మాత్రమే కుచించుకుపోగా బ్రిటన్ 9.7 శాతం కుచించుకుపోయింది” అని పావ్లో గెడెస్ వ్యాఖ్యానించాడు.
ఐఎంఎఫ్ అధికారులకి ఆర్ధిక వ్యవస్ధను పర్యవేక్షించి సహాయం చేయడం కంటే ఫుట్ బాల్ పైనా, ఫీజోడా (మాంసం వంటకం) పైనా మాత్రమే ఆసక్తి ఉందని గెడెస్ పరుషంగా వ్యాఖ్యానించాడు.
ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకులు అమెరికా, ఐరోపా రాజ్యాలు ప్రపంచం పైన ఆర్ధిక పెత్తనం చేయడానికి స్ధాపించుకున్నాయి. ఐఎంఎఫ్ కి ఐరోపా నేతలు సారధ్యం వహిస్తే ప్రపంచ బ్యాంకుకు అమెరికా నేతలు సారధ్యం వహిస్తారు.
బ్రెట్టన్ వుడ్ కవలలు గా పేర్కొనే ఈ రెండు సంస్ధల ప్రధాన లక్ష్యం మూడో ప్రపంచ దేశాలకు అప్పులు ఇచ్చి ఆ పేరుతో విషమ షరతులు విధించడం ద్వారా ఆయా దేశాల ఆర్ధిక వ్యవస్ధలను పూర్తిగా పశ్చిమ దేశాలకు సేవ చేసే వ్యవస్ధలుగా మార్చి వెయ్యడం.
వాటి షరతుల వల్ల దేశాలలోని వ్యవసాయం, పరిశ్రమలు, విద్య, వైద్యం ఇలా అన్ని రంగాలు పశ్చిమ దేశాల కంపెనీల చేతుల్లోకి వెళ్లిపోతాయి. స్ధానికంగా ఉండే దేశీయ కంపెనీలకు మార్కెట్ లేకుండా పోతుంది. ఆర్ధిక వనరులు పశ్చిమ దేశాల గుప్పెట్లోకి వెళ్లిపోతాయి. స్వంత నిర్ణయాలు తీసుకునే శక్తి లేకుండా పోతుంది. సాయం తీసుకున్న దేశాలకి చివరికి అప్పులు, దరిద్రం మిగిలితే పశ్చిమ దేశాల కంపెనీలకి ఆర్ధిక పగ్గాలు చేజిక్కుతాయి.
బ్రెజిల్ లో ఐఎంఎఫ్ 1999 లో తన కార్యాలయం స్ధాపించింది. పైన చెప్పినట్లే ఆర్ధిక సంక్షోభం లో కూరుకుని సాయం కోసం ఐఎంఎఫ్ ని అర్ధించింది. అప్పటి నుండి ఐఎంఎఫ్ కార్యాలయం అక్కడ పని చేస్తోంది.
బ్రెజిల్ సంక్షోభం పరిష్కారానికి ఐఎంఎఫ్ ఒక సహాయ కార్యక్రమం రూపొందించి అమలు చేసింది. ఆ కార్యక్రమం 2005లో ముగిసింది. అయినా కార్యాలయం కొనసాగింది.
“వాళ్ళు ఇప్పటికే ఎక్కువ కాలం ఉన్నారు. ఇరు పక్షాల సంబంధాల భారీగా అసమతూకం నెలకొని ఉన్నది” అని ఆర్ధిక మంత్రి నిరసించాడు. అనగా ఐఎంఎఫ్, బ్రెజిల్ మధ్య గౌరవ పూరితమైన సమాన సంబంధాలు కాకుండా పెత్తందారు, ఆదేశాల అమలుదారు సంబంధాలు ఉన్నాయని ఆయన పరోక్షంగా సూచించారు.
బ్రెజిల్ లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల కోసం అధ్యక్షుడు బోల్సనారో భారీ ఎత్తున సామాజిక పధకాలకు ఖర్చులు ప్రకటించాడు. వాటివల్ల భారీ అప్పులు చేయాల్సి ఉంటుంది. ఇది ఎకనామిక్ పాపులిజం విధానాలే అని ఐఎంఎఫ్ తో పాటు బహుళజాతి కంపెనీలు విమర్శించాయి.
ఈ నేపధ్యంలో ఐఎంఎఫ్ అంచనాలు తల కిందులు అవడంతో బ్రెజిల్ నేతలకు ఐఎంఎఫ్ జుట్టు అందివచ్చింది. అందిందే తడవుగా జుట్టు పట్టుకుని గెంటివేతకి పూనుకున్నారు.
భారత నేతలు ఈ తరహా పని ఎప్పటికీ చేయలేరు. ఐఎంఎఫ్ లో, ప్రపంచ బ్యాంకులో భారతీయ ఆర్ధిక వేత్తలు పై పదవుల్లో ఉన్నారని పొంగిపోతారు గానీ ఆ పదవుల్లో ఉంటే మనవాళ్ళైనా అమెరికా, ఐరోపా రాజ్యాల మాటలే వింటారనీ, వారి ప్రయోజనాల కోసమే పని చేస్తారనీ గుర్తించరు. లేదా గుర్తించనట్లు నటిస్తారు.
నిజానికి ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకుల్లో పై పదవుల్లో భారతీయులు ఉండడం అంటే మన వేలితో మన కళ్ళని పొడుచుకునేలా చేయడం అన్నట్లు!