త్వరలో మోడి, జిన్^పింగ్, పుతిన్ ల సమావేశం?


Xi-Putin video conference

బ్రిక్స్ కూటమిలో ప్రధాన రాజ్యాలైన చైనా, రష్యా, ఇండియా దేశాల అధినేతలు త్వరలో సమావేశం కానున్నట్లు సమాచారం. వ్లాదిమిర్ పుతిన్, ఛి జిన్^పింగ్ ల మధ్య ఇటీవల జరిగిన వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ఇరువురు నేతలు త్రైపాక్షిక సమావేశం జరపాలన్న అంశాన్ని చర్చించినట్లు తెలుస్తోంది.

రష్యా అధ్యక్షుడు పుతిన్ సహాయకుడు యూరీ ఉషకోవ్ ఈ విషయాన్ని వెల్లడించినట్లు రష్యన్ వార్తా సంస్ధ టాస్ (TASS) తెలియజేసింది. పుతిన్, ఛి ల మధ్య జరిగిన వీడియో కాన్ఫరెన్స్ తాలూకు వివరాలను పత్రికలకు వెల్లడిస్తూ ఉషకోవ్ ఈ అంశాన్ని తెలిపాడు.

“ఈ విషయంలో తమ తమ అభిప్రాయాలను పరస్పరం తెలియజేసుకోవాలనీ, ఆర్‌ఐ‌సి (రస్యా-ఇండియా-చైనా) ఫ్రేమ్ వర్క్ పరిధిలో సమీప భవిష్యత్తులో తదుపరి శిఖరాగ్ర సమావేశం జరిపే అవకాశాలను పరిశీలించాలి” అని ఇరువురు నేతలు అంగీకరించారని యూరీ ఉషకోవ్ పత్రికలకు చెప్పాడు.

డిసెంబర్ 6 తేదీన పుతిన్ కొన్ని గంటల పాటు ఇండియా సందర్శించిన సంగతి తెలిసిందే. ఇండియా నుండి వెళ్ళిన తర్వాత పుతిన్, ఛి జిన్^పింగ్ తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చలు జరిపాడు. ఇండియా సందర్శించిన వెంటనే పుతిన్ చైనా అధ్యక్షుడితో చర్చలు చేయడం ఖచ్చితంగా విశేషమే.

పుతిన్, ఛి ల మధ్య వీడియో కాన్ఫరెన్స్ లో త్రైపాక్షిక చర్చలు జరిపే అంశం చర్చకు రానున్నందు వల్లనే ఆ విషయమై మొదట ఇండియాతో చర్చించి, ఇండియా అభిప్రాయాన్ని తీసుకునే ఉద్దేశంతోనే రష్యా అధ్యక్షుడు హుటా హుటిన ఇండియా వచ్చి ఉండవచ్చన్న ఊహాగానాలు సాగాయి.

ఘర్షణ పడుతున్న దేశాల మధ్య ముఖ్యంగా పశ్చిమేతర రాజ్యాలు ఘర్షణ పడుతున్న చోట్ల మధ్యవర్తిత్వం వహించడానికీ, లేదా పశ్చిమ దేశాలతో ఘర్షణ పడుతున్న మూడో ప్రపంచ దేశాల తరపున ప్రైవేటు మిలట్రీ కాంట్రాక్టర్ల ద్వారా సహాయం అందించేందుకు రష్యా ఇటీవలి కాలంలో ముందుకు వస్తోంది.

సిరియా యుద్ధంలో టర్కీ-సిరియాల మధ్య ఘర్షణ తీవ్రత తగ్గించి తద్వారా అమెరికా, ఐరోపా దేశాలు సిరియాపై సాగిస్తున్న పరోక్ష యుద్ధంలో సిరియాకు సానుకూలత పెంచడానికి రష్యా తీవ్ర ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. ఆ మేరకు రష్యా చాలా వరకు సఫలం అయింది కూడా.

అలాగే లిబియాలో హఫ్తార్ సైన్యాల తరపున ఇసిస్, ఆల్-ఖైదా మూకలను ఓడించేందుకు రష్యా సహకరించింది. సౌదీ అరేబియా, యెమెన్ ల ఘర్షణలోనూ రష్యా యెమెన్ కు పరోక్ష సహకారం అందించింది.

జూన్ 2020లో గాల్వాన్ లోయలో ఇండియా, చైనా అనధికార సరిహద్దు ‘వాస్తవాధీన రేఖ’ వెంబడి తీవ్ర స్ధాయిలో ఘర్షణ జరిగిన దరిమిలా ఇరు దేశాల మధ్య సంబంధాలు బాగా దెబ్బ తిన్నాయి. ఇండియా-చైనా ల ఘర్షణ బ్రిక్స్ కూటమి పురోగమనానికి తీవ్ర ఆటంకం కలిగిస్తుంది. ఈ ఆటంకాలు రష్యా ప్రయోజనాలకు కూడా బహుళ పక్ష కోణంలో ఆటంకం కాగలవు.

కనుక ఇండియా-చైనాల మధ్య వేడి తగ్గడం రష్యాకూ అవసరమే.

అదీకాక, ట్రంప్ అధ్యక్షరికంలో ఉరుకులు పరుగులు తీసిన ఇండియా-అమెరికాల స్నేహం బైడెన్ అధ్యక్షరికంలో బాగా నెమ్మదించింది. మోడి అమెరికా పర్యటనకు ట్రంప్ అధ్యక్షరికంలో దక్కిన ఆదరణ, ఆహ్వానం బైడెన్ అధ్యక్షరికంలో దక్కలేదు.

మరోవైపు ఆకస్ (ఆస్ట్రేలియా, యూ‌కే, అమెరికా) కూటమి ఆవిర్భావం వలన క్వాడ్ (ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్) కూటమికి ప్రాధాన్యత తగ్గిపోయిందని తద్వారా అమెరికా మిత్ర దేశంగా ఇండియా స్ధానం డిమోట్ అయిందని భౌగోళిక రాజకీయాల్లో ఒక అవగాహన వచ్చేసింది.

ఈ అవకాశాన్ని పుతిన్ లాంటి వ్యూహకర్త ఏ మాత్రం వదులుకోరు. ఇండియా-చైనాల మధ్య దూరాన్ని తగ్గించి, బ్రిక్స్ కూటమి బలాన్ని, దాని భవిష్యత్తును మరింత శక్తివంతం కావించేందుకు, బ్రిక్స్ పురోగమనాన్ని వేగవంతం చేసేందుకు తప్పకుండా ప్రయత్నిస్తారు.

అయితే పుతిన్, మోడి మధ్య చర్చల్లో చైనా విషయం చర్చకు వచ్చిందీ లేనిది అనధికారికంగా కూడా వెల్లడి కాలేదు. భారత దేశం నుండి విదేశాంగ అధికారులు గానీ, రాజకీయ నేతలు గానీ ఎటువంటి సూచనలు అందలేదు. భారత ప్రజల్లో బి‌జే‌పి నేతలు, కేడర్లు రెచ్చగొట్టి పెట్టిన చైనా-వ్యతిరేక భావోద్వేగాల రీత్యా అలాంటి సమాచారం వెల్లడి కావడం బి‌జే‌పి రాజకీయ ప్రయోజనాలకు మంచిది కాదు మరి!

బహుశా నాలుగు రాష్ట్రాల ఎన్నికల తర్వాత త్రైపాక్షిక చర్చల గురించి ప్రకటన లేదా కనీసం సూచన వెలువడ వచ్చు.

మోడి, ఛి, పుతిన్ లు 2019లో జి20 సమావేశాల సందర్భంగా కలిసి మాట్లాడుకున్నారు. అప్పటికి గాల్వాన్ లోయ ఘర్షణ జరగలేదు.

అయితే మొన్న పుతిన్ ఇండియా రావటానికి ముందు నవంబర్ 26 తేదీన రష్యా, ఇండియా, చైనా దేశాల విదేశాంగ మంత్రులు వీడియా కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం అయ్యారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అమెరికా సాగిస్తున్న మిలట్రీ-రాజకీయ కార్యకలాపాల నేపధ్యంలో మూడు దేశాల మధ్య స్వాభావికంగానే విభేదాలు తప్పవన్న సంగతి ఈ సమావేశంలో స్పష్టం అయింది.

రష్యా, చైనా దేశాల దృష్టిలో ఇండో-పసిఫిక్ ప్రాంతం అన్న కాన్సెప్ట్ కు సంభావ్యత గానీ, ప్రాసంగికత గానీ లేవు. ఎందుకంటే ఇండో-పసిఫిక్ అన్నది చైనా, రష్యాల పైన ఆధిపత్యం నెలకొల్పడానికి మరియు ఆ రెండు దేశాల ఆర్ధిక, వాణిజ్య అభివృద్ధిని ఆటంకపరిచేందుకు అమెరికా కనిపెట్టిన ప్రత్యేక ప్రాంతం. అమెరికాకి తప్ప మరో దేశానికి ఇండో-పసిఫిక్ కాన్సెప్ట్ వల్ల ప్రయోజనం లేదు.

రష్యా, చైనాల దృష్టిలో ఆసియా-పసిఫిక్ ప్రాంతం మాత్రమే ప్రాముఖ్యత కలిగిన ప్రాంతం. భౌగోళిక సామీప్యత దృష్ట్యా చూసినా, చారిత్రక సంబంధాల దృష్ట్యా చూసినా, వాణిజ్య సంబంధాల దృష్ట్యా చూసినా ఆసియా-పసిఫిక్ ప్రాంతానికి ప్రాముఖ్యత ఉన్న విషయం స్పష్టమే.

రెండో ప్రపంచ యుద్ధ కాలంలో స్వప్రయోజనం కోసం జర్మనీ ఇండో-పసిఫిక్ పదజాలాన్ని కనిపెట్టింది. ఆ తర్వాత అది కనుమరుగైంది. మళ్ళీ చైనా అనూహ్యంగా ఆర్ధిక ఆధిపత్యాన్ని సాధించడంతో దాని అవసరం అమెరికాకి మళ్ళీ గుర్తొచ్చింది. అమెరికా గ్రేట్ గేమ్ లో పావుగా మారడానికి మోడి సారధ్యం లోని ఇండియా సిద్ధపడిపోయింది. బహుశా కాంగ్రెస్ అధికారంలో ఉన్నా ఇదే జరిగేదేమో!

“ఇండో-పసిఫిక్ ప్రాంతం అన్నది సమాన రాజ్యాల భాగస్వామ్యం కాదు” అని చైనా విదేశీ మంత్రి నవంబర్ 26 సమావేశంలో చేసిన వ్యాఖ్య అక్షర సత్యం. రష్యా విదేశీ మంత్రి లావరోవ్ అయితే “ఇండో-పసిఫిక్ ప్రాంతం” అన్న ప్రయోగం “ప్రచ్చన్న యుద్ధం తాలూకు ఉద్రిక్తతలను గుర్తు చేసేది” అని అభివర్ణించాడు.

అనగా ఇండో-పసిఫిక్ విషయంలో ఇండియా ఒక పక్క ఉంటే చైనా, రష్యాలు ఒక పక్క ఉన్నాయి. ఇది అనివార్యం. ఎందుకంటే మోడి నేతృత్వంలోని ఇండియా దూకుడుగా అమెరికా పక్షంలోకి లంఘించింది. రష్యా, చైనాలతో కాస్తో, కూస్తో సమాన సంబంధాల కంటే అమెరికా రాజ్యంతో అసమాన సంబంధాలకే సై అన్నది. ఈ విభేదాలే విదేశీ మంత్రుల సమావేశంలో ప్రస్ఫుటం అయ్యాయి.

మూడు దేశాల అధినేతల మధ్య జరగనున్న (ఒక వేళ జరిగితే) త్రైపాక్షిక సమావేశంలో ఈ విభేదాల పరిష్కారం వైపుగా అడుగులు పడితే అది ప్రపంచ రాజకీయాలకు, భారత ప్రయోజనాలకు శ్రేయస్కరం.

అమెరికా పక్షం చేరినా, చైనా-రష్యా పక్షం చేరిన భారత పాలకులు ఇండియా స్వతంత్ర ప్రయోజనాలకు, స్వావలంబన సూత్రాలకు కట్టుబడి ఉన్నప్పుడే సరైన నిర్ణయాలు చేయగలరు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s