ఒమిక్రాన్ పైన వ్యాక్సిన్ ప్రభావం లేదు -యూ‌ఎస్ స్టడీ


తాజాగా విస్తరిస్తున్న కొత్త రకం కోవిడ్ వైరస్ ఒమిక్రాన్. దీని దెబ్బకు పశ్చిమ దేశాలు అల్లాడుతున్నాయి. భారత దేశంలో ఒమిక్రాన్ విస్తరణ ఇంకా పెద్దగా నమోదు కాలేదు గానీ అమెరికా, ఐరోపా దేశాల్లో మాత్రం ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్నట్లు అక్కడి పత్రికలు తెగ వార్తలు ప్రచురిస్తున్నాయి.

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఒమిక్రాన్ రకం వైరస్ గురించి అదే పనిగా హెచ్చరిస్తోంది. ఉదాసీనత వద్దని, తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసుకోవాలని ప్రకటనలు గుప్పిస్తోంది.

మరోపక్క అమెరికాలో, జర్మనీ, ఫ్రాన్స్ లాంటి ఆధునిక ఐరోపా దేశాల్లో అనేక మంది ప్రజలు వ్యాక్సినేషన్ కి వ్యతిరేకంగా ఆందోళనలు, నిరసనలు చేస్తున్నారు. మొన్నటి వరకూ మాస్క్ లు తప్పనిసరి చేయడంకు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేశారు. ఇప్పుడు బలవంతపు వ్యాక్సినేషన్ కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు.

పశ్చిమ దేశాల ప్రభుత్వాలు మాత్రం వ్యాక్సిన్ వేయడానికి అనేక విధానాలుగా ప్రయత్నిస్తున్నాయి. పబ్లిక్ స్ధలాల్లో చేరాలన్నా, స్కూళ్లకు, ఆఫీసులకు వెళ్లాలన్నా, ఇంటినుండి బైటికి రావాలన్నా, విమానాలు ఎక్కాలన్నా వ్యాక్సినేషన్ ని తప్పనిసరి చేస్తూ నిబంధనలు రూపొందిస్తున్నాయి.

ఈ వరుసలో అమెరికాలో తాజాగా ఒక అధ్యయన నివేదిక వెలువడింది. ఈ అధ్యయనం ప్రకారం అమెరికా ప్రభుత్వం ఆమోదించిన మూడు రకాల వ్యాక్సిన్ లు ఒమిక్రాన్ రకం కోవిడ్ వైరస్ పైన అంతగా ప్రభావం చూపడం లేదని తేలిందట. ఒమిక్రాన్ వైరస్ వల్ల కోవిడ్ సోకినవారిలో అప్పటికే వ్యాక్సిన్ వేసి ఉన్నప్పటికీ దాని ప్రభావం తక్కువగా ఉంది లేదా అసలు ప్రభావం లేదు అని తేలిందట.

అమెరికాలో ప్రఖ్యాతి గాంచిన హార్వర్డ్ యూనివర్సిటీ, ఎం‌ఐ‌టి యూనివర్సిటీ, మసాచూసెట్స్ జనరల్ హాస్పిటల్ లు మూడు సంయుక్తంగా జరిపిన అధ్యయనంలో ఈ సంగతి తెలిసిందని రాయిటర్స్ వార్తా సంస్ధ చెబుతోంది.

అమెరికాలో Pfizer/BioNTech, మోడర్నా, జాన్సన్ & జాన్సన్ వ్యాక్సిన్ లను అక్కడి ప్రభుత్వం ఆమోదించింది. ఒమిక్రాన్ కోవిడ్ – 19 వైరస్ ను పోలిన సూడో-వైరస్ ని తయారు చేసి దానిపైన ఈ మూడు వ్యాక్సిన్ లను ప్రయోగించి చూశారు. జనానికి వేస్తున్నట్లు రెండు డోసులు వేసి చూశారు. జాన్సన్ & జాన్సన్ వ్యాక్సిన్ ని ఒక్క డోసు వేశారు.

ఈ పరీక్షలో ఒమిక్రాన్ వైరస్ కు వ్యతిరేకంగా తగినంత రోగ నిరోధక శక్తి (ఇమ్యూనిటీ) ని అభివృద్ధి చేసి వైరస్ ని పని చేయనివ్వకుండా చేయడంలో మూడు వ్యాక్సిన్ ల ప్రభావం తక్కువగా ఉండడం లేదా పూర్తిగా లేకపోవడం గమనించారు.

అయితే అదనంగా బూస్టర్ డోసు వేశాక రోగ నిరోధక శక్తి అద్బుతంగా పెరిగిందట. ఒమిక్రాన్ వైరస్ ను సమర్ధవంతగా నిరోధించబడిందట. ఈ సంగతి అధ్యయనంలో తేలిందని వార్తా సంస్ధలు చెబుతున్నాయి.

ఒమిక్రాన్ రకం కోవిడ్ వైరస్, ఇతర రకాల కోవిడ్ వైరస్ లు అన్నింటి కంటే వేగంగా విస్తరిస్తున్నట్లు అధ్యాయనంలో తేలింది. డెల్టా రకం వైరస్ తో పోల్చితే ఒమిక్రాన్ వైరస్ రెట్టింపు వేగంతో వ్యాప్తి చెందుతున్నట్లు అధ్యయనంలో గుర్తించారు.

ఈ అధ్యయనం ఫలితాలు ఆక్స్^ఫర్డ్ యూనివర్సిటీ జరిపిన అధ్యయన ఫలితాలతో సరిపోలుతున్నాయని తెలుస్తోంది. డబల్యూ‌హెచ్‌ఓ కూడా ఇదే సంగతి చాలా సార్లు చెప్పింది.

ఆక్స్^ఫర్డ్ అధ్యయనంలో ఫైజర్, ఆస్ట్రా జెనెకా వ్యాక్సిన్ లు ఒమిక్రాన్ వైరస్ పైన పెద్దగా ప్రభావం చూపడం లేదని వెల్లడి అయింది. అనగా ఒమిక్రాన్ వైరస్ సోకినవారిలో ఈ వ్యాక్సిన్ లు తగినంతగా రోగ నిరోధక శక్తి చొప్పించడంలో బలహీనంగా ఉన్నాయి.

ఈ అధ్యాయనాలను విశ్వాసం లోకి తీసుకునే ముందు కొన్ని అంశాలను ప్రజలు గమనంలో ఉంచుకోవాలి. ఏమిటంటే పశ్చిమ దేశాల ప్రభుత్వాలు బహుళజాతి ఔషధ కంపెనీల వ్యాపార ప్రయోజనాలను నెరవేర్చడంలో పూర్తిగా సహకరిస్తాయి. జనం చేత ఈ కంపెనీల ఉత్పత్తులను కొనేలా చేయడంలో చిత్తశుద్ధితో పని చేస్తాయి. ఆ క్రమంలో ప్రజల జేబులు కొల్లగొట్టి కంపెనీల ఖజానాలు నింపడంలో శక్తివంచన లేకుండా కృషి చేస్తాయి. డబల్యూ‌హెచ్‌ఓ కూడా అందులో తీసిపోదు.

కోవిడ్ వైరస్ గురించి ప్రజల్ని భయపెట్టడం, హెచ్చరించడంలో పశ్చిమ దేశాల ప్రభుత్వాలు క్రమం తప్పకుండా నిబంధనలు ప్రకటిస్తూ, వాటిని అమలు చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఇండియా, చైనా లాంటి భారీ జనాభా ఉన్న దేశాలు సమర్ధవంతంగా వైరస్ వ్యాప్తిని అరికట్టగలుగుతుండగా అమెరికా, ఐరోపా దేశాలేమో రోజు రోజుకీ అత్యధిక కేసులు, మరణాలు నమోదు చేస్తూనే ఉన్నాయి.

ఇండియాలో మూడో వేవ్ ఇంకా మొదలే కాలేదు. ఐరోపాలో ఇటలీ, జర్మనీ లాంటి చోట్ల మాత్రం నాలుగో వేవ్ కూడా పూర్తయి అయిదో వేవ్ మొదలైనట్లు అంచనాలు వేస్తున్నారు.

ఈ వేవ్ లతో పాటు సమాంతరంగా మూడో డోస్ కూడా అవసరమేమో అని ఒకసారీ, కాదు బూస్టర్ డోస్ వేయాలని ఒకసారీ అటు ఔషధ కంపెనీలతో పాటు ఇటు ప్రభుత్వ నేతలు కూడా ప్రకటనల మీద ప్రకటనలు గుప్పిస్తున్నారు. అలాగే చిన్న పిల్లలకు కూడా వ్యాక్సిన్ సిద్ధం అయిందని కొన్ని కంపెనీలూ, ఇదిగో త్వరలో సిద్ధం అని మరి కొన్ని కంపెనీలు ప్రకటిస్తున్నాయి. టీనేజి పిల్లలకు వ్యాక్సిన్ మొదలు పెట్టేశామ్ అని కొన్ని దేశాలు చెబుతున్నాయి.

ఆఫ్తికాలో చాలా దేశాల్లో మొదటి డోస్ వ్యాక్సిన్ వేయడమే గగనంగా మారింది. వారికి వ్యాక్సిన్ లు సరఫరా చేసే కంపెనీలే కరువయ్యాయి. ఎందుకంటే ఆ దేశాలకు వ్యాక్సిన్ లు డబల్యూ‌హెచ్‌ఓ ద్వారానే అందాలి. లేదా ఎవరైనా దయ తలచి మిగిలిపోయిన వ్యాక్సిన్ లు, కొద్ది రోజుల్లో గడువు ముగిసే డోసులు సరఫరా చేస్తే వాటిని వేసుకోవాలి తప్ప, కంపెనీలు డిమాండ్ చేసి డబ్బు చెల్లించి వ్యాక్సిన్ సరఫరా చేసే శక్తి వాటికి లేదు.

ఈ పరిస్ధితుల్లో అప్పుడే బూస్టర్ డోస్ తప్పనిసరి చేస్తూనో లేదా ఆదేశాలు ఇస్తూనో అమెరికా లాంటి దేశాలు ప్రకటనలు చేయడం, అందుకు ఏర్పాట్లు చేయడం ఏమిటని కొన్ని స్వచ్ఛంద సంస్ధలు, వైద్య హక్కుల సంస్ధలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

ఈ విమర్శలను ఎదుర్కొంటూ వాటిని అధిగమించి బూస్టర్ డోస్ లు వేయడం మొదలు పెట్టి ఆ వేడిలోనే కంపెనీలకు కాసుల పంట కురిపించాలంటే ఆకస్కాత్తుగా ఇలాంటి అధ్యయనాలు వెలువడుతూ ఉంటాయి. ప్రతిష్టాత్మక సంస్ధలే ఈ అధ్యయనాలు చేయడం కొసమెరుపు.

కనుక పశ్చిమ దేశాల నుండి పశ్చిమ గుత్త స్వామ్య వార్తా సంస్ధల ద్వారా వెలువడే అధ్యాయనాలను నమ్మడానికి అనేక మంది ఒక పట్టాన సుముఖంగా ఉండరు. ఎవరో ఎందుకు, పశ్చిమ దేశాల్లోని జనమే వ్యాక్సిన్ లకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నట్లు పైన చెప్పుకున్నాం. ఔషధ కంపెనీల కోసం ప్రభుత్వాలు జానాన్ని ఇబ్బంది పెడుతున్నాయని వారు గాఢంగా నమ్ముతున్నారు.

దానితో పాటు అసలు కోవిడ్-19 వైరస్ విస్తరణే ఒక కుట్రగా, ప్రజలను నియంత్రణలోకి తెచ్చుకునేందుకు ప్రభుత్వాల ద్వారా బహుళజాతి కంపెనీలు చేస్తున్న ప్రయత్నంగా విశ్లేషిస్తున్న వారు కూడా ఉన్నారు.

వారి విశ్వాసం ఎలా ఉన్నప్పటికీ వైరస్ అయితే విస్తరించిన మాటా దాని వల్ల జనం చనిపోతున్న మాటా నిజం. కానీ డి‌ఎన్‌ఏ ఆధారంగా, జన్యు పరమైన కోడ్ ద్వారా తయారు చేస్తున్న వ్యాక్సిన్ లతోనే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని కొందరు వైద్యులు, పరిశోధకులు కూడా చెబుతున్నారు. మానవ దేహంలో జన్యు మార్పిడిలను ప్రేరేపించే వ్యాక్సిన్ ల వలన మును ముందు ఎలాంటి మార్పులు జరుగుతాయో, ఎన్ని ఉపద్రవాలు వచ్చి పడతాయో, ఎన్ని రకాల సారి కొత్త జబ్బులు ఉత్పన్నం అవుతాయో ఊహించలేమని వారు హెచ్చరిస్తున్నారు.

వైరస్ లను డీ-యాక్టివేట్ చేయడం ద్వారా ఉత్పత్తి చేసే వ్యాక్సిన్ లకు బదులు జన్యు పరివర్తనాన్ని, డి‌ఎన్‌ఏ మార్పులను ప్రేరేపించే వ్యాక్సిన్ లతో జాగ్రత్తగా ఉండడమే ప్రస్తుతానికి శ్రేయస్కరం. ఎందుకంటే లాభార్జన కోసం ఎంతటి వినాశనానికైనా బహుళజాతి కంపెనీలు తెగిస్తాయని జి‌ఎం పత్తి, జి‌ఎం మిరపల ద్వారా ప్రపంచానికి తెలిసింది. తస్మాత్ జాగ్రత్త!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s