
KIPM, Chennai, Established in 1899
ప్రజల కంపెనీలు అంటే పబ్లిక్ సెక్టార్ కంపెనీలు అని. వ్యాక్సిన్ల తయారీలో భారత దేశం పేరెన్నిక గన్నది. ప్రభుత్వ రంగంలో వ్యాక్సిన్ పరిశోధన మరియు తయారీ కంపెనీలను స్ధాపించి నిర్వహించడంలో భారత దేశానికి పెద్ద చరిత్రే ఉన్నది.
ఎల్‌పిజి (లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ విధానాలను చేపట్టిన ఫలితంగా ఈ ప్రజల/ప్రభుత్వ కంపెనీలను ఒక్కటొక్కటిగా మూసివేస్తూ వచ్చారు. దానితో వ్యాక్సిన్ తయారీలో స్వయం సమృద్ధ దేశంగా ఉన్న భారత దేశం ఇప్పుడు పరాధీన దేశంగా మారిపోయింది. విదేశీ ప్రైవేటు బహుళజాతి కంపెనీలను అడుక్కునే పరిస్ధితి వచ్చింది.
ప్రైవేటు కంపెనీలు ఎంత డిమాండ్ చేస్తే అంత మేరా ప్రజా ధనాన్ని కుమ్మరించి మన స్వావలంబనను మనమే అమ్మేసుకుంటున్నాము. బ్రిటిష్-స్వీడిష్ మల్టీనేషనల్ కంపెనీ ఆస్ట్రా జెనెకా తయారు చేసిన కోవి షీల్డ్ ని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసి అమ్ముతుంటే దేశ వ్యాక్సిన్ అవసరాల్లో 90% పైగా దానినే భారత ప్రభుత్వం కొంటున్నది. ఇండియా కంపెనీ భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్సిన్ వ్యాక్సిన్ తో మాత్రం 10% అవసరాలనే తీర్చుకుంటున్నాము.
గతంలో అంటే 2016లో సుప్రీం కోర్టు ఒక పిటిషన్ పైన తీర్పు ఇస్తూ వ్యాక్సిన్ తయారు చేసే భారత పబ్లిక్ సెక్టార్ కంపెనీలను తిరిగి పునరుద్ధరించాలని వాటి ద్వారా భారత వ్యాక్సిన్ అవసరాలు తీర్చుకోవడంలో తిరిగి స్వయం సమృద్ధి సాధించుకోవాలని సుప్రీం కోర్టు ఆ పిటిషన్ ని విచారిస్తూ తీర్పు చెప్పింది. మోడి నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వం అందుకు అంగీకరించింది. కానీ వాస్తవం లోకి వచ్చేసరికి సుప్రీం కోర్టు తీర్పుని ఏ మాత్రం ఖాతరు చేయలేదు. తీరా కోవిడ్-19 వైరస్ దేశాన్ని చుట్టుముట్టాక వెతుక్కోవాల్సిన పరిస్ధితి వచ్చింది.
భారత దేశం పబ్లిక్ సెక్టార్ కంపెనీల ద్వారా వ్యాక్సిన్ తయారు చేసే కార్యక్రమాన్ని బ్రిటిష్ రాజ్ కాలం నుండే అమలు చేస్తూ వస్తోంది. గత పబ్లిక్ సెక్టార్ వ్యాక్సిన్ తయారీ కంపెనీల్లో 25 కంపెనీలు బ్రిటిష్ కాలంలోనే స్ధాపించ బడ్డాయి.
1980ల నాటికి స్వావలంబన, స్వయం-సమృద్ధి ఏకైక లక్ష్యంగా యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రాం (యూఐపి) కింద 29 పబ్లిక్ సెక్టార్ వ్యాక్సిన్ కంపెనీలను భారత ప్రభుత్వం నెలకొల్పింది. 1986 లో ప్రారంభం అయిన యూఐపి కోసం స్ధాపించిన ఈ కంపెనీల ద్వారా భారత దేశంలోని పిల్లల్లో మరణాల రేటు తగ్గించడం, ప్రాణాంతక జబ్బులను నివారించడాలను లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ లక్ష్యం ప్రపంచ ఆరోగ్య సంస్ధ (డబల్యూహెచ్‌ఓ) నిర్దేశించిన ప్రపంచ స్ధాయి ప్రయత్నాల్లో భాగంగా ఇండియా నిర్దేశించుకుంది.
అయితే 1991 లో ప్రవేశ పెట్టిన సరళీకరణ, ప్రయివేటీకరణ విధానాల దరిమిలా భారత దేశం వ్యాక్సిన్ తయారీలో నిర్దేశించుకున్న స్వావలంబన, స్వయం సమృద్ధి లక్ష్యాలను అటకెక్కించారు. కారణం ఊహించలేనిది ఏమీ కాదు. సరళీకరణ, ప్రయివేటీకరణ విధానాల లక్ష్యం దేశంలోని పబ్లిక్ సెక్టార్ ని నాశనం చేసి వాటి స్ధానంలో విదేశీ బహుళజాతి కంపెనీలు తయారు చేసే ఆరోగ్య, వైద్య, ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులకు మార్కెట్ కల్పించడమే.
ఈ విధానాల్లో భాగంగా 2005 నాటికి 17 భారతీయ ప్రభుత్వ రంగ వ్యాక్సిన్ తయారీ కంపెనీలను నిర్దాక్షిణ్యంగా మూసేశారు. 2007 నాటికి దేశంలో 7 ప్రభుత్వరంగ కంపెనీలు మాత్రమే మిగిలాయి. వాటిలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు స్ధాపించినవి కాగా 5 కంపెనీలు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యం లోనివి.
చెన్నై, తమిళనాడు లోని కింగ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (KIPM); ముంబై, మహా రాష్ట్ర లోని హాఫ్కిన్ ఇన్స్టిట్యూట్ అనుబంధ వాణిజ్య కంపెనీ హాఫ్కిన్ బయో ఫార్మాస్యూటికల్స్ కంపెనీ లిమిటెడ్… ఈ రెండూ రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యం లోనివి.
వీటిలో KIPM కంపెనీ గత రెండు దశాబ్దాల కాలంలో ఒక్క వ్యాక్సిన్ కూడా ఉత్పత్తి చేయలేదు. ముంబై లోని హాఫ్కిన్ బయో ఫార్మా కంపెనీ ఒక్కటే అరా కొరా వ్యాక్సిన్ లను ఉత్పత్తి చేస్తోంది.
ఇక కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యం లోని పబ్లిక్ సెక్టార్ వ్యాక్సిన్ తయారీ కంపెనీలు ఇవి:
-
భారత్ బయోలాజికల్ అండ్ ఇమ్యూనోలాజికల్స్ లిమిటెడ్. (చోలా, యూపి)
-
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనోలాజికల్స్. (హైద్రాబాద్, తెలంగాణ)
-
సెంట్రల్ రీసర్చ్ ఇనిస్టిట్యూట్ (కసౌలి. హిమాచల్ ప్రదేశ్)
-
పాశ్చర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (కూనూరు, తమిళనాడు)
-
బిసిజి వ్యాక్సిన్ లేబొరేటరీ (చెన్నై, తమిళనాడు)
పోలియో, బిసిజి, యాంటీ ర్యాబిస్, డిపిటి వ్యాక్సిన్ తదితర వ్యాక్సిన్ లను ఈ ఐదు ప్రభుత్వ కంపెనీలు తయారు చేస్తున్నాయి. ఈ కంపెనీల ద్వారా భారత దేశంలో పసి పిల్లలకు చిన్నతనం నుండే ఉచితంగా వ్యాక్సిన్ లను వేయించడం ద్వారా ప్రాణాంతక వ్యాధులు రాకుండా నివారించడంలో చాలా వరకు సఫలం అవుతున్నాము.
- BCG Vaccine Laboratory
- Bharat Biologicals and Immunologicals Ltd
- Central Research Institute
- Haffkin Biopharmaceuticals Co Pvt Ltd
- Indian Immunologicals Ltd
- Pasteur Institute of India, Coonoor
భారత ప్రభుత్వరంగం లో స్ధాపించబడిన వ్యాక్సిన్ తయారీ కంపెనీల ప్రత్యేకత ఏమిటంటే అవన్నీ ప్రపంచ స్ధాయి ప్రమాణాలకు సరితూగే “గుడ్ మాన్యుఫాక్చరింగ్ ప్రాక్టీసెస్” (జిఎంపి) ప్రమాణాలను తు.చ తప్పకుండా పాటించడం.
భారత ప్రభుత్వం సస్పెండ్ చేసిన ప్రభుత్వరంగ వ్యాక్సిన్ తయారీ కంపెనీలను 2016 నాటి సుప్రీం కోర్టు తీర్పు మేరకు తిరిగి పునరుద్ధరించినట్లయితే ఈ నాడు కోవిడ్-19 వ్యాక్సిన్ కోసం విదేశీ ప్రైవేటు కంపెనీల పరిశోధన, తయారీలపైన ఆధారపడే దుస్ధితి వచ్చి ఉండేది కాదని నిపుణులు అనేకమార్లు ఈ మధ్య కాలంలో ప్రభుత్వానికి గుర్తు చేశారు. కానీ ప్రైవేటు కంపెనీ సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా లాభార్జన అవసరాలను తీర్చడం పైనే ప్రభుత్వాలు దృష్టి కేంద్రీకరించాయి తప్పితే ప్రజల కోసం ఆలోచన చేసిన పాపాన పోలేదు.
ఒక్క 2016 నాటి సుప్రీం కోర్టు తీర్పు మాత్రమే కాదు. 2020, 2021 సంవత్సరాల్లో రెండు విడతలుగా కోవిడ్ వైరస్ భారత దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రతి రోజూ వందల మంది ప్రాణాలు కోల్పోతూ, ఆసుపత్రుల్లో మంచాలు దొరకక, ఆక్సిజన్ సిలిండర్లు దొరకక, ఔషధాలు సైతం లభ్యం కాక ఎన్నడూ ఎరుగని వైద్య సంక్షోభం నెలకొన్న పరిస్ధితుల్లో అనేక హై కోర్టులు సుమోటో గా కేసులు నమోదు చేసి పరిస్ధితి మెరుగుపరిచేందుకు తీవ్ర కృషి చేశాయి. ఆ సందర్భంలోనే వివిధ హై కోర్టులు ప్రభుత్వ రంగంలో మూసివేసిన ఆక్సిజన్, వ్యాక్సిన్ తయారీ కంపెనీలను తిరిగి తెరిచే అవకాశాలు పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు సూచించాయి. ఈ సూచనలను కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. వెస్ట్ బెంగాల్ ఎన్నికలు, కుంభ మేళా, ట్రంప్ భారత్ సందర్శన మొ.న కార్యక్రమాలకు ఇచ్చిన ప్రాధాన్యం కోవిడ్-19 వ్యాప్తి నిరోధానికి, నివారణకు ఇవ్వలేదు.
సుప్రీం కోర్టులో తాజా పిటిషన్
ఈ నేపధ్యంలో సుప్రీం కోర్టులో కొన్ని స్వచ్ఛంద సంస్ధలు, స్వతంత్ర సంస్ధలు, రిటైర్డ్ ఐఏఎస్ ప్రముఖులు మరోసారి పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వరంగంలో గతంలో నిర్వహించి సస్పెండ్ చేసిన వ్యాక్సిన్ కంపెనీలను, ఔషధ కంపెనీలను తిరిగి పునరుద్ధరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని వారు పిటిషన్ లో కోరారు.
పైన చెప్పినట్లు భారత ప్రభుత్వరంగ వ్యాక్సిన్ కంపెనీలు ఆధునిక ప్రమాణాలు పాటించడంలో ప్రసిద్ధి చెందినవి. జిఎంపి ప్రమాణాలను పాటించాయి. ఈ కంపెనీలు ఇప్పటికే స్ధాపించబడ్డాయి. వాటి కోసం మళ్ళీ కొత్తగా స్ధల సేకరణ, భవనాల నిర్మాణం, యంత్ర సామాగ్రి కొనుగోలు మొ.న చర్యలు చేపట్టనవసరం లేదు. పైగా ఫార్మాస్యుటికల్ రంగంలోని నిరుద్యోగులకు బ్రహ్మాండమైన ఉపాధి లభిస్తుంది.
పిటిషన్ దాఖలు చేసినవారు:
-
అమూల్య రత్న నంద, ఐఏఎస్ (రిటైర్డ్)
-
ఆల్ ఇండియా డ్రగ్ యాక్షన్ నెట్ వర్క్
-
లో కాస్ట్ స్టాండర్డ్ థెరప్యూటిక్స్
-
మెడికో ఫ్రెండ్ సర్కిల్
పై పిటిషన్ దారులకు అడ్వకేట్ సత్యా మిత్రా, అడ్వకేట్ ప్రగ్యా గంజూ లు ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారు.
నమ్మకమైన వ్యాక్సిన్ కోసం దేశ ప్రజలు ఎదురు చూస్తున్న నేటి పరిస్ధితుల్లో కూడా ఈ ప్రభుత్వరంగ కంపెనీలను పునరుద్ధరించడంలో కేంద్ర ప్రభుత్వం ఉదాసీనంగా ఉన్నదని, ఈ కంపెనీల చేత తిరిగి ఉత్పత్తి ప్రారంభింపజేసేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ దారులు కోరారు. జస్టిస్ డివై చంద్ర చూడ్ నేతృత్వం లోని ధర్మాసనం ఈ పిటిషన్ ను డిసెంబర్ 13 తేదీన విచారణకు స్వీకరించింది. పిటిషన్ పై కేంద్రం తన అభిప్రాయం చెప్పాలని కోరింది.
కేంద్ర ప్రభుత్వం తరపున హాజరయిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా “ఇది కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణయాల పరిధిలోనిది” అని ఏదో కొత్త విషయం చెబుతున్నట్లు చెప్పబోయాడు. “అవును. ఆ విధానం ఏమిటన్నదే మేము తెలుసుకోగోరుతున్నాము. పిటిషన్ కి ప్రతిస్పందనను కేంద్రం ఫైల్ చేయాలి” అని జస్టిస్ చంద్ర చూడ్ ఆదేశించారు.
తమ పిటిషన్ లో పిటిషన్ దారులు భారత దేశంలో ప్రభుత్వరంగ వ్యాక్సిన్ కంపెనీలు అందించిన సేవలను, వాటిని మూల పడేసిన తీరును, ప్రభుత్వ ఉదాసీనతను, 2016 సుప్రీం కోర్టు తీర్పును గౌరవించని అంశాన్ని ఎత్తి చూపారు.
జిఎంపి ప్రమాణాలు పాటించిన వ్యాక్సిన్ పిఎస్‌యూ లను పునరుద్ధరించి వాటికి ఉత్పత్తి లైసెన్స్ లు మజూరు చేయించాలని కోరారు. పిఎస్‌యూ లను సస్పెండ్ చేసేనాటికే అవి ఆధునిక ఉత్పత్తి యంత్రాలను, ప్రమాణాలను నెలకొల్పుకున్నాయని, అప్పటి వరకు దేశంలో 80 నుండి 85 శాతం వ్యాక్సిన్ అవసరాలు అవే తీర్చాయనీ వారు కోర్టుకు గుర్తు చేశారు.
అలాగే పునరిద్ధరించబడిన వ్యాక్సిన్ పిఎస్‌యూ లకు పూర్తి స్వయం ప్రతిపత్తి కల్పించాలని వారు కోరారు. 2010 లో కేంద్రం నియమించిన జావిద్ చౌదరి నివేదిక ‘వ్యాక్సిన్ పిఎస్‌యూ లు పూర్తి స్ధాయిలో మునుపటి వైభవాన్ని పొందడానికి, భవిష్యత్తులో అవి ఎలాంటి ఆటంకాలు లేకుండా పని చేసేందుకు వీలుగా పూర్తి స్వయం ప్రతిపత్తి కల్పించాలని సిఫారసు చేసిన సంగతిని గుర్తు చేశారు.
“ఏ తరహా వ్యాక్సిన్ తయారు చేయటానికి కైనా ఏ ఒక్క వాక్సిన్ పిఎస్‌యూ ని మినహాయించకుండా చూడాలి. అలాగే ప్రభుత్వ వాక్సిన్ కంపెనీ తయారు చేసిన వ్యాక్సిన్ ని, అవి తగిన క్వాలిటీ మరియు సామర్ధ్యం, స్ధోమత కలిగి ఉన్నంత కాలం, తప్పనిసరిగా ప్రభుత్వం సేకరించేలా పురమాయించాలి” అని పిటిషన్ దార్లు తమ పిటిషన్ లో కోరారు.
పిటిషన్ దారుల ఉద్దేశ్యం ఇక్కడ స్పష్టమే. విదేశీ బహుళజాతి కంపెనీలకు లాభాలు, మార్కెట్ గ్యారంటీ చేసేందుకు భారత ప్రభుత్వం కట్టుబడి ఉన్న నేపధ్యంలో ప్రభుత్వరంగ కంపెనీలు ఉత్పత్తి చేసే వ్యాక్సిన్ లను వివిధ కారణాలు చూపి సేకరించకుండా వాటిని బొంద పెట్టే అవకాశాలు తప్పనిసరిగా ఉన్నాయి.
బిఎస్‌ఎన్‌ఎల్, ఫోన్ పే లాంటి ప్రభుత్వ కంపెనీలను తగిన కనెక్టివిటీ కల్పించకుండా 4జి టవర్ల నిర్మాణానికి అనుమతి ఇవ్వకుండా 5జి పరిశోధన, అభివృద్ధి, మౌలిక నిర్మాణాలకు అనుమతి ఇవ్వకుండా ప్రభుత్వమే మూల పెట్టడం, తద్వారా రిలయన్స్, ఎయిర్ టెల్, వోడా ఫోన్ లాంటి ప్రైవేటు కంపెనీల మార్కెట్ ను కాపాడటం, చివరికి 50,000 మందికి పైగా బిఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగులను ఇంటికి పంపటం… ఇవన్నీ మన కేంద్ర ప్రభుత్వ నిర్వాకాలే.
కనుక ప్రభుత్వరంగ వ్యాక్సిన్ పిఎస్‌యూ లను పునరుద్ధరించడమే కాకుండా వాటి నైపుణ్యాన్ని, సామర్ధ్యాన్ని మొద్దుబార్చకుండా చూడాల్సిన బాధ్యత కూడా సుప్రీం కొర్టే తీసుకోవాలని కొరవలసిన అగత్యం దాపురించింది.
phone pe is psu?
Yes. It was established by government.