
బాంబే హై కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. PM CARES ఫండ్ ఎంబ్లమ్ లో నుండి ప్రధాని నరేంద్ర మోడీ బొమ్మ, జాతీయ జెండా బొమ్మ వెంటనే తొలగించాలని ఈ పిటిషన్ సారాంశం.
జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఎం ఎస్ కార్నిక్ లతో కూడిన బెంచి ఈ పిటిషన్ విచారణకు స్వీకరించింది. విచారణ క్రిస్మస్ సెలవుల తర్వాత తేదికి వాయిదా వేయాలని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ కోరారు. “ఇది ముఖ్యమైన పిటిషన్ మిస్టర్ సింగ్” అని బెంచి స్పష్టం చేసింది. డిసెంబర్ 23 లోపు రిప్లై ఇవ్వాలని కోరింది. పిటిషన్ దారులు డిసెంబర్ 30 లోపు పిటిషన్ దారులు రిజాయిండర్ దాఖలు చెయ్యాలని ఆదేశించింది.
PM CARES ఫండ్ ని కోవిడ్ 19 వైరస్ వ్యాప్తి దేశంలో మొదలైనప్పుడు ప్రధాని మోడీ స్ధాపించారు. ఎమర్జెన్సీ పరిస్ధితుల్లో ఈ నిధి వాడతాం అన్నారు. వ్యాధులు ప్రబలినప్పుడు ప్రక్రుతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఈ నిధులు వినియోగిస్తాం అన్నారు. PRIME MINISTER అన్న పేరు టైటిల్ లో చూసి అంతా ఇది ప్రభుత్వ నిధి అనుకున్నారు. అనేక ప్రభుత్వ రంగ కంపెనీలు ఈ నిధి కి పదుల కోట్ల రూపాయలు విరాళం ఇచ్చారు. మార్చి 31, 2020 నాటికి 3076.62 కోట్ల రూపాయలు సమకూరాయని ట్రస్ట్ ప్రకటించింది.
కానీ ట్రస్ట్ నుండి కోవిడ్ కోసం అవసరం అయినప్పుడు డబ్బులు తీయడానికి సుముఖత చూపలేదు. అసలు డబ్బు ఎంత వసూలు అయింది, దేనికి ఎంత ఖర్చు చేసారో చెప్పాలని కోరుతూ RTI చట్టం కింద దరఖాస్తు చేస్తే జవాబు నిరాకరించారు. ఢిల్లీ హై కోర్టుకి వెళ్తే ట్రస్ట్ అసలు ప్రభుత్వానిదే కాదని ఇది ప్రయివేటు ట్రస్ట్ అని చల్లగా చెప్పారు. దానితో అంతా హతాశులయ్యారు.
ట్రస్ట్ పేరు PRIME MINISTER’S CITIZEN ASSISTANCE AND RELIEF IN EMERGENCY SITUATIONS FUND. ఈ పేరు బట్టి ఇది ప్రభుత్వ నిధి అని అందరూ అనుకున్నారు. పైగా ఆదాయ పన్ను నుండి సెక్షన్ 80జి కింద 100 శాతం మినహాయింపు ఇచ్చారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కంపెనీలకు ఉపశమనం ఇచ్చారు. ప్రధాన మంత్రి ఎక్స్ అఫిషియో చైర్మన్ అన్నారు. ఆర్ధిక మంత్రి, రక్షణ మంత్రి, హోమ్ మంత్రి, భారత ప్రభుత్వం ఎక్స్ అఫిషియో ట్రస్టీలు అన్నారు.
ఇవి కాక pmcares.gov.in అనే అడ్రస్ తో ప్రభుత్వ సర్వర్లలో వెబ్ అడ్రస్ కల్పించారు. వెబ్ సైట్ లో జాతీయ చిహ్నాన్ని, జాతీయ జెండాని, ప్రధాని మోడీ ఫోటో ని ముద్రించారు. తీరా RTI చట్టం కింద సమాచారం అడిగితేనేమో ప్రభుత్వ నిధి కాదు అని అనడం మొదలు పెట్టారు. ప్రభుత్వ నిధులు ఏమీ ట్రస్ట్ కి ఇవ్వడం లేదు అంటున్నారు. వివిధ మంత్రులు తమ వ్యక్తిగత హోదా లోనే ఎక్స్ అఫిషియో ట్రస్టీలు గా ఉన్నారు తప్ప అధికారిక హోదాలో కాదు అన్నారు.
ఇవన్నీ పిటిషనర్ ప్రస్తావిస్తూ ప్రభుత్వేతర సంస్థలు జాతీయ జెండా, జాతీయ చిహ్నం, PRIME MINISTER అన్న పేరు ఉపయోగించడానికి వీలు లేదు అని చెప్పారు. 1950 NGO చట్టం, 2005 NGO చట్టం అందుకు ఒప్పుకోవు అని గుర్తు చేసారు. కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ చిహ్నాల, జెండాల, పేర్ల గౌరవాన్ని కాపాడాలని, కమర్షియల్ ప్రయోజనాల కోసం ఎవరూ వాడకుండా నిరోధించాలని ఆ మేరకు రాజ్యాంగ సూత్రాలు పాటించాలని గుర్తు చేసారు.
పిటిషన్ జనవరి 3 తేదీన విచారణకు రానుంది.
నిజానికి ప్రయిమ్ మినిష్టర్ రిలీఫ్ ఫండ్ పేరుతో ఇప్పటికే ప్రభుత్వ సహాయ నిధి ఉన్నది. ఒకటి ఉండగా మరో నిధి ఎందుకని ఆరంభం లోనే ప్రతిపక్షాలు, వ్యక్తులు, సంఘాలు ప్రశ్నించాయి. ఆనాడు ప్రధాని గానీ, బీజేపీ నేతలు గాని జవాబు ఇవ్వలేదు. తీరా RTI పిటిషన్ వేస్తే గానీ విషయం బైటికి రాలేదు.
తాజా పిటిషన్ తో నైనా మరిన్ని నిజాలు వెలుగు లోకి వస్తాయేమో చూడాలి.