కర్ణాటక: క్రైస్తవ పుస్తకాలు తగలబెట్టిన హిందుత్వ గ్రూపులు


ఇప్పుడిక క్రైస్తవుల వంతు వచ్చింది. దేశంలో ఓ పక్క ముస్లింలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. కర్ణాటకలో ఏడాది నుండి క్రైస్తవుల పైనా చర్చిల పైనా వరుస దాడులు జరుగుతున్నాయి.

తాజాగా కోలార్ జిల్లాలో శ్రీనివాస్ పురా లో హిందుత్వ కి చెందిన రైట్ వింగ్ గ్రూప్ కార్యకర్తలు నలుగురు క్రైస్తవ యువకుల పైన దాడి చేశారని ఇండియన్ ఎక్స్^ప్రెస్, NDTV తెలిపాయి. ఈ నలుగురు క్రైస్తవ మత పుస్తకాలను ఇల్లిల్లూ తిరిగి పంచుతున్నట్లు తెలుస్తోంది. హిందూత్వ సంస్థల కార్యకర్తలు వారిని అడ్డగించి వారి నుండి పుస్తకాలూ లాక్కుని కుప్ప పోసి తగల బెట్టారు.

కర్ణాటకలో గత 12 నెలల్లో 38 సార్లు క్రిస్టియన్ మతాన్ని లక్ష్యం చేసుకుని వివిధ చిన్నా పెద్దా హిందూ మత ఫ్రిన్జ్ గ్రూపులు దాడులు జరిపాయి. జనవరి నుండి సెప్టెంబర్ వరకు 32 దాడులు, అక్టోబర్ నవంబర్ లలో 6 దాడులు జరిగాయని NDTV చెప్పింది.

మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలు మత మార్పిడిలను నిషేధిస్తూ వరుసగా చట్టాలు తెస్తున్నాయి. బలవంతపు మత మార్పిడిని అడ్డుకుంటున్నామని అవి చెబుతున్నాయి. కానీ అందుకు ఇప్పటికే చట్టాలు ఉన్నాయి. బీజేపీ ప్రభుత్వాలు బలవంతపు మార్పిడి పేరుతొ అసలు మార్పిడినే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి.

యూపీ ప్రభుత్వం తెచ్చిన బలవంతపు మతాంతర వివాహాల నిషేధ చట్టాన్ని ఇలాగే అమలు చేశారు. ఎక్కడ ముస్లిం హిందూ యువతి యువకులు ప్రేమ పెళ్లి చేసుకున్నా అది బలవంతపు పెళ్లి అనీ ఆ పేరుతో లవ్ జిహాద్ కి పాల్పడుతున్నారని కేసులు పెట్టారు. ఈ చట్టం కింద పెళ్లి పైన ఫిర్యాదు చేసేందుకు హిందూ యువతి తల్లి దండ్రులకు బంధువులకు చివరికి వారితో సంబంధం లేని వారికీ కూడా అవకాశం ఇచ్చ్చారు.

దానితో హిందూ ముస్లిం పెళ్లిళ్లకు తల్లి దండ్రుల అనుమతి ఉన్నా సరే పోలీసులకు ఫిర్యాదు చెయ్యడం ముస్లిం యువకుడిని అరెస్ట్ చేసి కేసు పెట్టడం అమ్మాయిని బలవంతంగా ఆమె తల్లి దండ్రులకు అప్పగించడం జరిగాయి. చివరికి కోర్టులు జోక్యం చేసుకుని మేజర్ అయిన యువతి యువకులకు ఎవరికీ ఇష్టం ఉన్నా లేకపోయినా ఏ మతం వారైనా తమకు నచ్చిన వారిని పెళ్లి చేసుకునే హక్కు ఉన్నదని స్పష్టం చేసాక కేసుల నుండి వివాహితులకు ఉపశమనం లభించింది. రాష్ట్ర చట్టాన్ని సుప్రీం కోర్టులో సవాలు చేయడంతో అది విచారణలో ఉన్నప్పటికీ ఆ చట్టాన్ని పట్టించుకోకుండా హై కోర్టులు వ్యతిరేక తీర్పులు ఇవ్వడం గమనార్హం.

తలాక్ నిబంధన నుండి ముస్లిం స్త్రీలకు రక్షణ కల్పించే పేరుతో మోడీ చేసిన చట్టాన్ని కూడా ఇలాగే అమలు చేశారు. తలాక్ నిషేధ చట్టాన్ని వినియోగించి అనేకమందిని కేసులు మోపి నిర్బంధం లోకి తీసుకున్నారు.

ఇలా మత మార్పిడిల నిషేధం, లవ్ జిహాద్, మతాంతర వివాహ నిషేధం మొ.న నినాదాలు పైకి ఏ లక్ష్యం ప్రకటించినా చివరికి మైనారిటీ మతాల ప్రజలను లక్ష్యంగా చేసుకుని చట్టాలు చెయ్యడం, వారిపై దుష్ప్రచారం చెయ్యడం, విద్వేష ప్రచారం చెయ్యడం చేస్తున్నారు. తద్వారా అభూత కల్పనలతో హిందూ మత సెంటిమెంట్లు రెచ్చ గొడుతున్నారు. అంతిమంగా బీజేపీ ఎన్నికల ప్రయోజనాలు నెరవేరే వరకు ఈ కార్యకలాపాల గొలుసు కొనసాగుతోంది.

చాలా సందర్భాల్లో మైనారిటీలు తమపై దాడులు జరిగిన విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు కూడా ధైర్యం చేయడం లేదు. కొన్ని సార్లు పోలీసులు ఫిర్యాదులు తీసుకోరు. ఫిర్యాదు చేస్తే ఏదో ఒక నేరాన్ని తిరిగి బాధితుల పైనే మోపడం చేస్తున్నారు.

కర్ణాటక ముఖ్య మంత్రి ఏడాది క్రితం మత మార్పిడి నివారణకు ముఖ్యంగా క్రిస్టియన్ మతం లక్ష్యంగా చట్టం తెస్తామని ప్రకటించిన తర్వాత క్రైస్తవులపై దాడులు పెరిగాయి. బీజేపీ RSS పెద్దల నుండి అనుమతి లేకుండా ఇన్ని దాడులు జరగవు. మత మార్పిడి నిషేధ చట్టం అవసరం ఉందన్న అభిప్రాయాన్ని జనంలో పెంచడానికి చట్టానికి అనుకూల వాతావరణం రాష్ట్రంలో కల్పించడానికి ఈ వరుస దాడులు జరుగుతున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి.

నిజానికి క్రైస్తవులు ఇల్లిల్లూ తిరిగి ప్రచారం చెయ్యటం ఇదే కొత్త కాదు. దట్టమైన అడవుల్లో ఉండే గిరిజన గ్రామాలకు వెళ్లినా పోర్టబుల్ మైకు పట్టుకుని సింగిల్ గా పాటలు పాడుతూ క్రీస్తు బోధనలు అంటూ ప్రసంగిస్తూ ఒకడు కనిపిస్తారు. వారిని ఆలకించేవారు ఎవరూ లేకున్నా వారి పని చేస్తూ పోతారు. అందుకే క్రిస్టియన్ జీల్ అన్న నానుడి ప్రచారం లోకి వచ్చింది.

క్రైస్తవ మత మార్పిడి దేశంలో నిజంగా పెరిగిందా? అని చూస్తే వారి దామాషా దేశ జనాభాలో స్ధిరంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఉదాహరణకి 1951 జనాభా లెక్కల్లో వారి భాగం మొత్తం జనాభాలో 2.3 శాతం. 2021 జనాభా లెక్కల్లో కూడా క్రైస్తవ జనాభా మొత్తం జనాభాలో 2.3 శాతమే. అనగా క్రైస్తవుల నిష్పత్తి స్వతంత్రం వచ్చిన తర్వాత గత 75 ఏళ్లలో పెరగ లేదు తరగ లేదు.

ఇక బీజేపీ రాష్ట్రాల ముఖ్య మంత్రుల భయాలు, RSS అనుమానాలు దేని గురించి? అసలు వీళ్ళు మనుషులను మనుషులుగా కాక మతాలుగా కులాలుగా జాతులుగా గుడులు చర్చిలు మసీదులకు వెళ్లేవారిగా గుర్తించ కుండా ఒక్క క్షణం అన్నా ఉండ లేరా?

హిందూ మతంలో దళితులను హీనంగా చూడకపోతే దేశంలో క్రైస్తవ ముస్లిం జనాభా వేళ్ళ మీద లెక్కించ గల స్థితిలో ఉండేవి. అంటరానితనం మొదలుకొని రోజువారీ జీవనం లో ప్రతి క్షణం అణచివేతకు గురి కావడం వల్లనే అనేకమంది దళితులు లేదా పంచములు గౌరవం కోసం మెరుగైన ఆర్ధిక జీవనం కోసం క్రైస్తవ ముస్లిం మతాల్లోకి వెళ్లారు. అయితే అక్కడా వారికి విముక్తి దొరక్కపోవడం వేరే సంగతి.

అంతెందుకు! రాజ్యాంగ నిర్మాత మొదటి న్యాయ శాఖా మంత్రి డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ హిందూ మత సంస్కరణ కోసం మత పెద్దలతో వివిధ మఠాల పెద్దలతో వేద పండితులతో ఏళ్ళ తరబడి చర్చలు చేశారు. చివరికి విసిగిపోయి బౌద్ధ మతం స్వీకరించారు.

బౌద్ధం వలన హిందూ మతం ప్రభ పడిపోతున్న రోజుల్లో మధ్య యుగాల్లో శంకరాచార్యులు లాంటి వారు కూడా సంస్కరణలకు ప్రయత్నించారు. వివేకానందుడు సైతం తన ప్రయత్నాలు తాను చేసారు. కానీ హిందూ మతంలో కుల వివక్ష, కుల ఆధిపత్యం వదులుకునేందుకు గాని, జనాభా సమాంతర కదలికకు అవకాశం ఇచ్చేందుకు గానీ హిందూ పెద్దలు సంస్ధలు అంగీకరించలేదు. వివక్ష ఇప్పటికి కూడా సరి కొత్త రూపాల్లో బలపడుతున్నదే గాని సమానత సాధనకు కృషి చేయడం లేదు.

అవేవి చేయక పోగా నిర్బంధ చట్టాలు అణచివేత చట్టాలు హిందుత్వ పాలకులు తెస్తున్నారు. అనగా హిందూ మతం వేల ఏళ్లుగా కింది కులాలపై సాగిస్తున్న పెత్తనం అణచివేత లను మను ధర్మ శాస్త్రం రీతిలో మరింత శక్తివంతం చేసేందుకే బీజేపీ RSS కట్టుబడి ఉన్నట్లు తమ విధానాల ద్వారా రుజువు చేస్తున్నారు. శూద్ర కులాల్లోని పాలక వర్గాలు ఈ భారాన్ని నెత్తిన వేసుకోవడం ఒక విషాదం. ఆధిపత్య వర్గం లోకి చేరాక శూద్ర పాలకులకు సైతం హిందూ మత కుల వ్యవస్థ అవసరం అయింది!

3 thoughts on “కర్ణాటక: క్రైస్తవ పుస్తకాలు తగలబెట్టిన హిందుత్వ గ్రూపులు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s