నాగాలాండ్ కూలీల హత్య: పార్లమెంటును తప్పుదారి పట్టించిన హోం మంత్రి?


Funeral

14 మంది నాగాలాండ్ కూలీలను భారత భద్రతా బలగాలు కాల్చి చంపిన విషయంలో హోం మంత్రి అమిత్ షా, పార్లమెంటుకు తప్పుడు సమాచారం ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. కూలీలు వారు ప్రయాణిస్తున్న వాహనంలో భద్రతా బలగాల సంకేతాలను లెక్క చేయకుండా పారిపోవడానికి ప్రయత్నించడం వల్లనే సైనికులు కాల్పులు జరపవలసి వచ్చిందని మంత్రి రాజ్య సభలో చెప్పారు. దుర్ఘటనలో ప్రాణాలతో బైటపడిన కూలీలు చెబుతున్నది ఇందుకు పూర్తిగా విరుద్ధంగా ఉన్నదని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి గురువారం లోక్ సభలోనే ఆరోపించారు.

నాగాలాండ్ లోని మోన్ జిల్లాలో బొగ్గు గనిలో పని చేస్తున్న కార్మికులు 8 మంది సాయంత్రం పని ముగిశాక ఒక పిక్ అప్ ట్రక్ లో 4 గంటల ప్రాంతంలో ఓటింగ్ గ్రామంలోని తమ ఇళ్లకు ఇంటికి వస్తుండగా భద్రతా బలగాలు చుట్టుముట్టి విచక్షణా రహితంగా కాల్చడంతో 6 గురు కూలీలు అక్కడికక్కడే చనిపోయిన సంగతి తెలిసిందే. గ్రామ ప్రజలు కోపంతో సైనికులపై దాడి చేయడంతో వాళ్ళు మళ్ళీ జరిపిన కాల్పుల్లో మరో 8 మంది చనిపోయారు. ప్రజల దాడిలో ఒక సైనికుడు చనిపోయినట్లు తెలుస్తోంది.

ట్రక్కు ప్రయాణీకుల్లో ఇద్దరు కూలీలు 23 యేళ్ళ షీవాంగ్, 30 యేళ్ళ యీ వాంగ్ లు తీవ్ర బులెట్ గాయాలతో బతికి బైటపడ్డారు. వాళ్ళిద్దరూ అస్సాం మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చిత్రం ఏమిటంటే వారిని ఆసుపత్రిలో ఎవరు చేర్చారో తెలియదు. తీవ్ర గాయాలతో వారిద్దరిని ఆసుపత్రి ముందు పడేసి వెళ్లిపోయారని మాత్రమే డాక్టర్లు చెబుతున్నారు. కాల్పులు జరిపాక శవాలను సైనికులే తమ శిబిరానికి తీసుకెళ్లి మిలిటెంట్ల యూనిఫారం తొడిగి, చేతుల్లో తుపాకులు ఉంచి వారిని మిలిటెంట్లుగా ముద్ర వేసేందుకు కాల్పులు జరిపిన సైనికులు ప్రయత్నించారని షీవాంగ్ చెబుతున్నాడు. కనుక వారిని ఆసుపత్రిలో చేర్చింది ఎవరో ఊహించడం కష్టం ఏమీ కాదు.

ఇండియన్ ఎక్స్^ప్రెస్ విలేఖరులు శనివారం (డిసెంబర్ 4) ఆసుపత్రికి వెళ్ళి షీవాంగ్ తో మాట్లాడారు. “వాళ్ళు నేరుగా మాకు గురిపెట్టి కాల్చారుఅని షీవాంగ్ చెప్పాడని పత్రిక తెలిపింది. మోచేయి, ఛాతీలలో బులెట్ గాయాలు తగిలిన షీవాంగ్ ట్రక్కులో బోర్లా పడుకుని తనను తాను కాపాడుకున్నాడు. అతని కళ్లెదుటే అతని తమ్ముడు కాల్పుల్లో చనిపోయాడు.

మా వాహనాన్ని ఆపాలని సైనికులు ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. మమ్మల్ని నేరుగా కాల్చి చంపేశారు. మేము పారిపోవడానికి అసలు ప్రయత్నించలేదు. మేము కేవలం వాహనంలో కూర్చొని ఉన్నామంతేషీవాంగ్ చెప్పాడు. “పని ముగిశాక బొగ్గు గని నుండి పిక్అప్ ట్రక్కులో ఇంటికి తిరిగి వస్తున్నాము. దారిలో అకస్మాత్తుగా మీ మీదికి కాల్పులు జరిగాయి. కాల్పులు ఎంతసేపు జరిగాయో నాకు గుర్తు లేదు. కొంతసేపటి వరకు జరిగాయని మాత్రం గుర్తుంది. బాంబులు పేలిపోతున్నట్లుగా శబ్దాలు వచ్చాయి. అది చీకటి కూడా కాదు. అయినా మా పైన కాల్పులు జరిపారుఅని చెప్పాడు.

కాల్పులు వినగానే మేమంతా కిందకు నక్కాము. కాల్పులు ఆయ్యాక నన్ను వేరే వాహనంలోకి మార్చారు. నా తమ్ముడితో పాటు నాతో ఉన్న ఇతరులు చనిపోయారని అప్పటికే నాకు తెలుసుఅని షీవాంగ్ వివరించాడు. యీవాంగ్ కంటిలో, పుర్రెకు బులెట్ గాయాలయ్యాయి. విలేఖరులు వెళ్లినప్పుడు అతను స్పృహలో లేడు.

షీవాంగ్ తో ఆసుపత్రిలో ఉన్న బంధువు న్యేమ్ ఖా మరిన్ని వివరాలు చెప్పాడువాళ్ళు వెనక్కి తిరిగి వస్తూ తీరు బ్రిడ్జి దాటారు. దాని తర్వాత లోతైన డ్రెయిన్ ఉంటుంది. డ్రెయిన్ లోకి వాహనం దిగుతూ ఉంది. డ్రెయిన్ లో ట్రక్కు కదులుతుండగా అకస్మాత్తుగా కాల్పులు జరిపారు. వాహనం ముందూ, వెనకా రెండు వైపుల నుండి కాల్పులు జరిపారు. దాదాపు 2-3 నిమిషాల సేపు కాల్పులు కొనసాగాయి. శవాలను వేరే వాహనం లోకి తరలించడం అంతా షీవాంగ్ చూశాడు. తర్వాత ఏం జరిగిందో అతనికి తెలియదుఅని న్యేమ్ ఖా చెప్పాడు.

డిసెంబర్ 6 తేదీన రాజ్య సభలో హోమ్ మంత్రి అమిత్ షా నాగాలాండ్ కూలీల హత్యలపై ప్రకటన చేశారు. మార్గంలో మిలిటెంట్లు ఒక వాహనంలో వస్తున్నారని గూఢచార వర్గాలు సమాచారం ఇచ్చాయని సదరు సమాచారం మేరకు భద్రతా బలగాలు అక్కడ కాపు కాశాయని ఆయన చెప్పారు. వాహనాన్ని ఆపాలని కోరుతూ బలగాలు సంజ్ఞ చేసినా వాహనం వేగం పెంచి పారిపోవాలని ప్రయత్నించారని దానితో బలగాలు కాల్పులు జరపవలసి వచ్చిందని హోమ్ మంత్రి చెప్పారు.

షీవాంగ్ ఇంటర్వ్యూని ఇండియన్ ఎక్స్^ప్రెస్ పత్రిక ప్రచురించాక ప్రతిపక్షాలు హోమ్ మంత్రి కధనాన్ని ప్రశ్నించాయి. “సభ లోపల హోమ్ మంత్రి భద్రతా బలగాలు వాహనం ఆపాలని కోరినా పట్టించుకోకుండా కూలీలు పారిపోయారని అందుకే కాల్పులు జరిపారని చెప్పడం ద్వారా సభను తప్పుదోవ పట్టించారుఅని లోక్ సభలో అధిర్ రంజన్ చౌదరి ఆరోపించారు. “కానీ ఆసుపత్రిలో బాధితులు నేరుగా కాల్పులు జరిపినట్లు చెబుతున్నారుఅని ఆయన ఇండియన్ ఎక్స్^ప్రెస్ కధనాన్ని చూపారు.

హోమ్ మంత్రి వివరణపై దుమారం చెలరేగడంతో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలతో ప్రజల ముందుకు రావడానికి బదులు విలేఖరులు ఆసుపత్రికి వెళ్లకుండా అప్రకటిత నిషేధం విధించారు. కాంగ్రెస్ నేతలతో కూడిన బృందం మోన్ జిల్లాకు వెళ్లకుండా రాష్ట్ర పోలీసులు నిరోధించారు. బాధితులు, మృతుల బంధువులను కూడా పత్రికలతో మాట్లాడనివ్వడం లేదు.

విచిత్రం ఏమిటంటే అధిర్ రంజన్ లేవనెత్తిన అంశం రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విషయమని లోక్ సభకు చెందిన విషయం కాదని చెబుతూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అర్జున్ రామ్ మెఘ్వాల్ సమాధానం ఇచ్చేందుకు నిరాకరించారు.

పార్లమెంటు లోపల గానీ బైట గానీ మోడి ప్రభుత్వం ఎన్నడూ నేరుగా జవాబుదారీ తనంతో దేశ ప్రజలకు గానీ ప్రజా ప్రతినిధులకు గానీ సమాధానం చెప్పిన పాపాన పోలేదు. ప్రధాన మంత్రి అసలు పత్రికలు, చానెళ్లతోనే మాట్లాడరు. మాట్లాడేవాళ్లేమో డొంక తిరుగుడుగా మాట్లాడడం, కాంగ్రెస్ హయాంలో అలా జరిగింది కదా అనివాట్ అబౌటరీఎత్తుగడలోకి దిగి సమాధానాలు తప్పించుకోవడం, అదీ కాకపోతే ఎదురు దాడికి దిగడం తప్ప తమ చర్యలకు బాధ్యత వహించి సమాధానం చెప్పింది ఎప్పుడూ లేదు. దాదాపు మంత్రులు అందరూ బాపతే. వీళ్ళేమి పాలకులో, వీళ్ళేమి ప్రజా ప్రతినిధులో గానీ కనీసం బూర్జువా విలువలు కూడా పాటించకపోతే ప్రజలకు ఏదీ దారి?!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s