రైతుల ఆందోళన విరమణ, 11 తేదీన సంబరాలు!


హిందూత్వ అహంభావ పాలకులపై చావు దెబ్బ కొట్టిన ‘భారతీయ’ రైతులు ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటించారు. రైతు సంఘాల సంయుక్త పోరాట వేదిక ‘సంయుక్త కిసాన్ మోర్చా’ (ఎస్‌కే‌ఎం) నేతలు విధించిన షరతులకు కేంద్ర ప్రభుత్వం రాతపూర్వకంగా ఆమోదం చెప్పడంతో శనివారం, డిసెంబర్ 9 తేదీన ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటించారు.

ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల నిరవధిక ఆందోళన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు బనాయించిన కేసులన్నింటినీ బేషరతుగా ఉపసంహరించుకుంటామని కేంద్రం రాత పూర్వకంగా హామీ ఇచ్చింది. డిసెంబర్ 7 తేదీన రైతు సంఘాలు విధించిన ఆరు డిమాండ్లలో అయిదింటికి అంగీకరిస్తున్నట్లు మౌఖికంగా కేంద్రం తెలిపింది. తమకు అధికారికంగా రాతపూర్వకంగా ఆ మేరకు వర్తమానం ఇస్తే తప్ప ఆందోళన విరమించేది లేదని ఎస్‌కే‌ఎం స్పష్టం చేసింది. దానితో  అధికారిక వర్తమాన పత్రాన్ని ఎస్‌కే‌ఎం నాయకులకు ప్రభుత్వం అందజేసింది.

ప్రభుత్వం అందించిన రాతపూర్వక హామీ గురించి ఎస్‌కే‌ఎం నేతలు ఈ రోజు మధ్యాహ్నం జరిగిన సమావేశంలో చర్చించారు. అనంతరం ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటించారు. డిసెంబర్ 9 తేదీ నుండి ఢిల్లీ సరిహద్దులను ఖాళీ చేయడం ప్రారంభిస్తామని చెప్పారు. డిసెంబర్ 11 తేదీన ‘విజయ్ దివస్’ జరుపుతామని తెలిపారు. డిసెంబర్ 9 తేదీనే విజయోత్సవ సంబరాలు జరుపుకోవాలని రైతులు భావించారు. కానీ తమిళనాడు, కూనూరులో హెలికాప్టర్ కూలి 13 మంది మరణించిన దుర్ఘటన రీత్యా సంబరాలను డిసెంబర్ 11 తేదీకి వాయిదా వేస్తున్నామని తెలిపారు.

లఖింపూర్ ఖేరిలో రైతులపై నుండి కారు నడిపి రైతుల మరణానికి బాధ్యునిగా చేస్తూ కేంద్ర సహాయ మంత్రి అజయ్ మిశ్రాను మంత్రివర్గం నుండి తప్పించాలన్న డిమాండ్ ను రైతు సంఘాలు విరమించుకున్నట్లు తెలుస్తోంది. (కారులో ఉన్న ఆశిష్ మిశ్రా రిమాండ్ లో ఉన్నాడు.) ఆ డిమాండ్ మినహా మిగిలిన డిమాండ్లు అన్నింటికీ కేంద్రం ఆమోదం తెలిపినట్లు రైతు సంఘాలు చెప్పినట్లు పత్రికలు రిపోర్ట్ చేశాయి.

హిందూస్థాన్ టైమ్స్ పత్రిక ప్రకారం కేంద్రం ఆమోదించిన డిమాండ్లు ఇవి:

1. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాలు రైతులపై బనాయించిన కేసులు అన్నింటినీ బేషరతుగా ఉపసంహరించుకుంటుంది.

2. ఆందోళన కాలంలో సరిహద్దుల వద్ద మరణించిన రైతు కుటుంబాలకు నష్టపరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తాయి. పంజాబ్ ప్రభుత్వం ప్రకటించిన రు 5 లక్షల పరిహారాన్ని ఇతర రాష్ట్రాలూ చెల్లిస్తాయి. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పిస్తాయి.

3. ధాన్యం పంటలు కోతలు అయ్యాక మిగిలిపోయే చెత్త, దుబ్బు లను తగల బెట్టడం నేరంగా ప్రభుత్వాలు పరిగణించబోవు. అయితే సుప్రీం కోర్టు విధించిన జరిమానా చెల్లింపు ప్రభుత్వాల పరిధిలో లేనందున వాటిను రద్దు చేయడం వీలు కాదు.

4. కనీస మద్దతు ధర కు చట్టబద్ధత కల్పించేందుకు ఏర్పాటు చేసే కమిటీలో ఎస్‌కే‌ఎం నియమించిన రైతు ప్రతినిధులు మాత్రమే సభ్యులుగా ఉంటారు. ప్రభుత్వ చట్టాలకు మద్దతు తెలుపుతున్న రైతు సంఘాల నుండి ప్రతినిధులు కమిటీలో ఉండబోరు. (ఇప్పటికే 5 గురు ప్రతినిధులను ఎస్‌కే‌ఎం ఎంపిక చేసి ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది.)

5. విద్యుత్ చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టే ముందు బిల్లు ప్రతిపాదనలపై రైతు సంఘాలతో కేంద్రం చర్చిస్తుంది. రైతులతో చర్చలు జరిపాకే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతారు.

ఉత్తర ప్రదేశ్, ఉత్తర ఖండ్, గోవా పంజాబ్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నందున రైతుల డిమాండ్లకు మోడి ప్రభుత్వం అంగీకరించి మూడు సాగు చట్టాలను రద్దు చేసిందన్న మాట పాక్షిక సత్యం మాత్రమే. ఎన్నికల కంటే ముందు రైతులు పట్టు విడవకుండా సంవత్సరం పైగా చేసిన నిరవధిక ఆందోళనే మోడి ప్రభుత్వం దిగి రావడానికి ప్రధాన కారణం. ఎన్నికలు సెకండరీ కారణంగా ఉంటాయి తప్ప ప్రధాన కారణం కాజాలవు.

మూడు సాగు చట్టాలను రద్దు చేయడం ద్వారా మోడి ప్రభుత్వం వ్యవహార నిర్వహణ వాదం (pragmatism) లోకి దిగిందని, మునుపటిలా తమ మాటే నెగ్గాలన్న మొండి పట్టుదలను విడిచి పెట్టిందని కొందరు ఆశావాహులు విశ్లేషిస్తున్నారు. ఇది సత్యదూరం. ఇది పైకి చూసేందుకు ప్రాగ్మాటిజం లాగా కనిపించినప్పటికీ భారత రైతులు ప్రజా శక్తిని మోడి ప్రభుత్వానికి రుచి చూపించడమే అసలు నిజం. అందువల్లనే రద్దు నిర్ణయం తీసుకోవలసిన అనివార్య పరిస్ధితిని ప్రధాన మంత్రి మోడి ఎదుర్కొన్నారు.

రైతుల ఆందోళనను అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్ని కుయుక్తులు పన్నిందో మర్చిపోయి నట్లయితే ఇలాంటి ఆశావాహ విశ్లేషణలు దొర్లుకొస్తాయి. రైతుల ఆందోళన తమకు అసౌకర్యంగా మారిందని స్ధానికులు ఆందోళన చేస్తున్నారన్న పేరుతో హిందుత్వ కిరాయి బలగాలు రైతు శిబిరాలపై దాడులు చేశారు. రైతు సమూహాల మధ్య, తగాదాలు రేపి తద్వారా పోలీసు జోక్యానికి అవకాశం కల్పించుకునేందుకు ప్రయత్నాలు జరిగాయి. హింసా ప్రయోగం ద్వారా రైతుల నుండి హిస్మాత్మక ప్రతిఘటన రాబట్టాలని ప్రయత్నించారు. కోర్టులో పిటిషన్లు వేయించి సుప్రీం కోర్టు ద్వారా ఆందోళనలను ఎత్తివేయించడానికి, పోలీసు నిర్బంధం అమలు చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. శిక్కు మతంలోని శాఖల మధ్య విభేదాలు సృష్టించి తద్వారా మతపరమైన అలజడి సృష్టించడానికి ప్రయత్నాలు జరిగాయి. కొన్ని హత్యలు కూడా జరిగాయి. విదేశాల్లోని భారతీయుల నుండి రైతుల ఆందోళనకు మద్దతుగా నిధులు రాకుండా కట్టడి చేశారు.

ఆందోళనలపై వార్తలు వెలువడకుండా పత్రికలు, ఛానెళ్లను మేనేజ్ చేశారు. కొన్ని స్వతంత్ర వార్తా పోర్టల్స్ తప్ప ప్రధాన పత్రికలు, చానెళ్లు ఏవీ సంవత్సరం పాటు జరిగిన రైతుల ఆందోళనను కవర్ చేయకపోవడాన్ని ఎవరూ విస్మరించరాదు. తమ ఆందోళన కొనసాగుతున్నా ప్రజలు విస్మరించి తమ రోజువారీ రొటీన్ లో పడిపోయినా రైతులు చెదిరిపోలేదు. రోడ్లపై ఇనప మేకులు ఎత్తైన గోడలు నిర్మించినా బెదిరిపోలేదు. ఎప్పటికప్పుడు సంయమనం పాటిస్తూ ఓపికగా నిరసన కొనసాగించిన రైతులు పార్లమెంటు మందబలం పైనా, హిందూత్వ పాలకుల అహంభావ పూరిత అణచివేత పైనా, అనేకానేక కుయుక్తుల పైనా చిరస్మరణీయమైన విజయం సాధించారు. ఇది ప్రజా విజయం. రైతుల విజయం. హిందూత్వ పాలకుల నియంతృత్వ పోకడలకు చెంపపెట్టు లాంటి పరాజయం.

అమరులైన రైతన్నలకు జోహార్లు!

One thought on “రైతుల ఆందోళన విరమణ, 11 తేదీన సంబరాలు!

  1. ఉత్తర ప్రదేశ్, ఉత్తర ఖండ్, గోవా పంజాబ్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నందున రైతుల డిమాండ్లకు మోడి ప్రభుత్వం అంగీకరించి మూడు సాగు చట్టాలను రద్దు చేసిందన్న మాట పాక్షిక సత్యం మాత్రమే.

    నిజమే, కానీ రాజకీయపార్టీలు ఎన్నికలకు ఇచ్చే ప్రాధాన్యతలు గురించి, ఇటీవల పాలక పక్షం ఉపఎన్నికలలో తిన్న దెబ్బలు, రాబోయే ఎన్నికలపై దీని ప్రభావం(ముఖ్యంగా రైతుల వ్యతిరేకత) గురించి కూడా వివరించి ఉంటే పై అంశం మరంత సమగ్రంగా ఉండేదని నా భావం!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s