
Helicopter crashes in Coonoor, TN
భారత సాయుధ బలగాల చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సిడిఎస్) జనరల్ బిపిన్ రావత్ తమిళనాడు లోని నీలగిరి కొండల్లో ఆయన ప్రయాణిస్తున్న ఎం-17 హెలికాప్టర్ కూలి దుర్మరణ చెందారు. జనరల్ బిపిన్ రావత్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ కి ఛైర్మన్ కూడా. ఈ పదవిలో నియమితులైన మొట్ట మొదటి ఆర్మీ అధికారి ఆయన.
జనరల్ బిపిన్ రావత్ డిపార్ట్^మెంట్ ఆఫ్ మిలట్రీ అఫైర్స్ కి కూడా అధిపతిగా వ్యవహరించారు. 1 జనవరి 2020 తేదీన మొదటి జేసిఎస్ (జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్) గా ఆయన నియమితులయ్యారు. ఈ పదవిని మోడి నేతృత్వంలోని బిజేపి ప్రభుత్వం సృష్టించింది.
హెలికాప్టర్ లో మొత్తం 14 మంది ప్రయాణిస్తుండగా ప్రమాదంలో 13 మంది చనిపోయారని పిటిఐ తెలిపింది. ఒక్కరు (పురుషుడు) మాత్రమే తీవ్ర గాయాలతో బ్రతికి బైటపడ్డారు. చనిపోయినవారిలో జనరల్ బిపిన్ రావత్ తో పాటు ఆయన భార్య మధూలిక రావత్ కూడా ఉన్నారు.
భూ ప్రాంతాన్ని స్పష్టంగా చేసేందుకు వీలుగా హెలికాప్టర్ తక్కువ ఎత్తులో ఎగురుతున్నందున చెట్టు కొమ్మలకు తగిలి హెలికాప్టర్ కూలిపోయినట్లు పత్రికల ద్వారా తెలుస్తోంది. హెలికాప్టర్ ప్రయాణించడానికి అనుకూలంగా లేని వాతావరణంలో ఎం-17 ప్రయాణిస్తోంది. సాధారణంగా అననుకూల వాతావరణలో హెలికాప్టర్ నడిపేందుకు పైలట్లు అంగీకరించరు. ప్రయాణీకులు అత్యంత ముఖ్యమైన అత్యున్నత స్ధాయి అధికారులు అయి ఉండి వెళ్ళి తీరాలని వారు ఒత్తిడి తెస్తే పైలట్లకు మరో దారి ఉండదు.
“జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధూలికా రావత్ లతో పాటు మరో 11 మంది దురదృష్టవశాత్తూ జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారని ప్రకటించేందుకు తీవ్రంగా చింతిస్తున్నాము” అని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ట్విట్టర్ లో ప్రకటించింది.
“అత్యంత దురదృష్టకరమైన రీతిలో తమిళనాడులో ఈ రోజు జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మరో 11 మంది ఇతర సాయుధ బలగాల అధికారులు అకస్మాత్తుగా చనిపోయారని తెలిసి తీవ్రంగా దుహ్ఖిస్తున్నాను. మన సాయుధ బలగాలకు, దేశానికి ఆయన అకాల మరణం కలిగించిన నష్టం తిరిగి పూడ్చలేనిది” అని రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ ప్రకటించారు.
-
సెప్టెంబర్ 30, 2001 తేదీన అప్పటి సివిల్ ఏవియేషన్ మంత్రి మాధవరావ్ సింధియా వాతావరణం బాగోలేకపోయినా ఒత్తిడి తెచ్చి కాన్పూర్ లో జరిగే ఎన్నికల సమావేశానికి చార్టర్డ్ విమానంలో బయలుదేరారు. విమానం గాలిలోనే మంటలు అంటుకుని కూలిపోవడంతో ఆయన చనిపోయారు. ఆయనతో పాటు విమానంలో ఉన్నవారంతా (8 మంది) చనిపోయారు.
-
మార్చి 3, 2002 తేదీన అప్పటి లోక్ సభ స్పీకర్ బాలయోగి భారీ వర్షంలో హెలికాప్టర్ లో ప్రయాణిస్తూ కూలిపోయి మరణించారు.
-
సెప్టెంబర్ 2, 2009 తేదీన ఏపి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రయాణించిన హెలికాప్టర్ కర్నూలు వద్ద అడవుల్లో కొండను ఢీకొనడంతో కూలి మరణించారు. మృత దేహం ఆనవాలు దొరకనంత తీవ్ర ప్రమాదంగా అది రికార్డ్ అయింది.
-
ఏప్రిల్ 2011లో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమ ఖండూ వర్షంతో నిండిన వాతావరణంలో హెలికాప్టర్ లో ప్రయాణిస్తుండగా తవాంగ్ వద్ద హెలికాప్టర్ కూలి మరణించారు.
ఇవి కొన్ని మాత్రమే పోలండ్ అద్యక్షుడు లే కాసిన్ స్కీ రష్యాలో విమానంలో ప్రయాణిస్తూ చనిపోవడం లాంటి ఘటనలు విదేశాల్లో కూడా చోటు చేసుకున్నాయి. ఆయన కూడా వాతావరణం అనుకూలంగా లేకున్నా ప్రయాణానికి ఒత్తిడి తెచ్చి ప్రాణం మీదికి తెచ్చుకున్నాడు.
ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు విచారణ జరిగినప్పటికీ ప్రతికూల సమాచారాన్ని విచారణ నివేదికల్లో పొందుపరచకుండా దాచి పెట్టడం కద్దు. తద్వారా రాజకీయ నాయకులపైనా, ఉన్నతాధికారులపైనా అపప్రధ రాకుండా జాగ్రత్త పడుతుంటారు.
జనరల్ బిపిన్ రావత్ రక్షణ వ్యవహారాలు, సాయుధ బలగాల వ్యవహారాలకే పరిమితం కాకుండా రాజకీయ, సామాజిక అంశాలపై కూడా వ్యాఖ్యానాలు చేస్తూ ప్రతిపక్ష పార్టీల నుండి విమర్శలు ఎదుర్కొన్నారు.
ఉన్నత స్ధాయి పదవులు నిర్వహించిన అధికారులు తమ తమ పదవుల నుండి రిటైర్ అయ్యాక మోడి ప్రభుత్వాన్ని సంతృప్తి పరుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, అందుకు ప్రతిఫలంగా పదవీ విరమణ అనంతరం మరో విడత పదవులు పొందే ప్రయత్నాలు చేయడం ఒక ధోరణిగా ముందుకు వచ్చిందని కూడా ప్రతిపక్షాలు ఆరోపించాయి.
ఈ విమర్శల్లో నిజా నిజాలు ఎలా ఉన్నా జనరల్ బిపిన్ రావత్ ఈ విధంగా చనిపోవలసి రావడం అవాంఛనీయం. ప్రభుత్వాలు, అధికారులు, నేతలు ఈ ప్రమాదాల నుండి పాఠాలు నేర్చుకుని అలాంటివి పునరావృతం కాకుండా చూడాల్సి ఉన్నది.
మీరు తక్కువ వ్యవధి లోనే వార్తకు సంబంధించిన సమాచారం సేకరించి, సంక్షిప్తపరచి , విశ్లేషణ చేస్తూ అందించారు. థాంక్స్.
In a short period of time ,
you have collected, summarized and analyzed the news related information.
Thanks Sir.
ప్రధాన త్రివిధ దళాల అధిపతితోపాటు ఇంతమంది ఆర్మీ పర్సనల్, ఒక ఆధునికమైన , సురక్షితమైన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం చాలా బాధాకరం.
Hi agkanth,
It’s nice to have you here.
Yeah. It’s really unwarranted and avoidable. It is pity it still happened.