
Modi welcomes Putin
భారత విదేశాంగ విధానంలో గత కొన్నేళ్లుగా వినిపిస్తున్న మాట “2+2 ఫార్మాట్ డైలాగ్” (2+2 నమూనా లో జరిగే చర్చలు)! సాధారణ పాఠకుల్లో చాలా మందికి ఈ పద బంధం అర్ధం ఏమిటన్నది తెలియదు. తెలియని అంశాల కోసం ఇంటర్నెట్ ని వెతికి చదివే అలనాటు ఉన్నవాళ్లకి తప్ప ఇతరులకి తెలిసే అవకాశాలు తక్కువ ఉంటాయి.
ఈ పద బంధాన్ని విదేశాంగ విధానం, విదేశీ సంబంధాల రంగంలో ఉపయోగిస్తారు. ఈ పేరే దాని అర్ధం ఏమిటో చెబుతోంది. రెండు పక్షాల మధ్య జరిగే క్రమంలో చెరో వైపు నుండి ఇద్దరు చొప్పున చర్చల్లో పాల్గొనడమే ఈ 2+2 నమూనా.
విదేశాంగ విధానంలో ఒక దేశానికి చెందిన విదేశాంగ మంత్రి మరియు రక్షణ మంత్రి ఇరువురు మరో దేశానికి చెందిన విదేశీ & రక్షణ శాఖల మంత్రులతో చర్చలు చేస్తే అది “2+2 డైలాగ్” అవుతుంది.
2+2 డైలాగ్ లో కేవలం విదేశాంగ శాఖ మరియు రక్షణ శాఖ మంత్రులు మాత్రమే పాల్గొంటారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను విదేశాంగ శాఖ పర్యవేక్షిస్తుంది. రక్షణ కొనుగోళ్ళు, అమ్మకాల ఒప్పందాలు కేవలం మిత్ర దేశాల మధ్యనే జరుగుతుంటాయి.
ఈ రెండు మంత్రిత్వ శాఖలే ఒక దేశం యొక్క వ్యూహాత్మక మరియు భద్రతా అంశాలతో, సమస్యలతో సంబంధం కలిగి ఉంటాయి. వ్యూహాత్మక సమబంధాలలో మిలట్రీ మరియు విదేశీ సంబంధాలు రెండూ ఇమిడి ఉంటాయి.
ప్రపంచంలో ఒక దేశం తన ఆర్ధిక శక్తిని తద్వారా రాజకీయ స్ధానాన్ని పటిష్టపరుచుకోవాలనుకుంటే అది తన స్వల్ప మరియు దీర్ఘ కాలిక వ్యూహాత్మక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలి. తదనుగుణంగానే మిలట్రీ బలగాల సేకరణ, సమీకరణ జరుగుతుంది.
మిలట్రీ ఉత్పత్తులను తయారు చేసే దేశాలు కేవలం డబ్బు చెల్లించినంత మాత్రాన జెట్ ఫైటర్లనో లేదా మిసైల్ డిఫెన్స్ వ్యవస్ధలనో అమ్మజూపవు. ఒక దేశానికి తన మిలట్రీ సాంకేతిక పరిజ్ఞాన్ని అమ్మడం అంటే ఆ దేశంతో దీర్ఘకాలిక సంబంధాలకు సిద్ధం అవుతున్నట్లు లెక్క. శత్రు శిబిరానికి తన పరిజ్ఞానం చేరేలా ఉంటే అలాంటి అమ్మకాలకు అవి పూనుకోవు. అలా చేస్తే భవిష్యత్తు యుద్ధంలో తన లోగుట్టును, బలాలు, బలహీనతలను ఎంతో కొంత మేర శత్రువుకి ఇచ్చినట్లే.
ఉదాహరణకి మూడేళ్ళ క్రితం వరకు అమెరికా నుండి ఎఫ్-35 జెట్ ఫైటర్లను కొనుగోలు చేసేందుకు టర్కీ ఆసక్తిగా ఉండేది. ఆ మేరకు ఇరు దేశాల మధ్య ఎఫ్-35 తయారీలో సహకారం సాగింది. కానీ టర్కీ రష్యా తయారు చేసిన ఎస్-400 మిసైల్ రక్షణ వ్యవస్ధలను కూడా కొనుగోలు చేసేందుకు నిర్ణయించడంతో టర్కీకి ఎఫ్-35 సరఫరా చేసే ఒప్పందాన్ని రద్దు చేసుకుంది.
ఆయుధ రంగంలో అమెరికా, రష్యాలు ప్రధాన పోటీదారులు, ఎఫ్-35 జెట్ ఫైటర్, ఎస్-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఒకే దేశం చేతిలో ఉంటే ఏమవుతుంది. ఇలాంటి భారీ ఆయుధ వ్యవస్ధల అమ్మకాలు కేవలం అమ్మకంతోటే ఆగిపోవు, దశాబ్దాల తరబడి సర్వీసింగ్ కూడా చేయాల్సి ఉంటుంది. ఎస్-400 ఎప్పుడన్నా మొరాయిస్తే రష్యన్ ఇంజనీర్లే రావాలి. అలాగే ఎఫ్-35 రిపేర్ వస్తే అమెరికన్ ఇంజనీర్లు రావాలి.
ఎఫ్-35 జెట్ ఏదన్నా మిసైల్ ప్రయోగిస్తే దానిని అడ్డగించి నిర్మూలించే శక్తి ఎస్-400 కి ఉంటుంది. అంటే ఎఫ్-35 ని కూల్చే పరిజ్ఞానం కూడా టర్కీ వద్ద ఉంటుంది. అది రష్యన్ ఇంజనీర్ల ద్వారా రష్యాకు చేరిపోతుంది. ఆ విధంగా ఎఫ్-35 ద్వారా అమెరికాకి లభించే వూహాత్మక సానుకూలత యుద్ధంలో పనికిరాకుండా పోతుంది.
మిత్ర లేదా శత్రు సంబంధాల లెక్కలు విదేశాంగ శాఖ పరిధిలో ఉంటాయి. విదేశీ శాఖ గైడెన్స్ లేకుండా మిలట్రీ సంబంధాలకు ఆయా దేశాలు సిద్ధ పడవు.
ఈ నేపధ్యంలోనే విదేశాంగ శాఖ, రక్షణ శాఖల మంత్రులు ఒకే సారి కూర్చొని చర్చించే సంప్రదాయం అభివృద్ధి అయింది. దీనివల్ల వివిధ అనుమానాలు, సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించుకునే వెసులుబాటు కలుగుతుంది.
2+2 డైలాగ్ ని మొదట జపాన్ ప్రారంభించింది. జపాన్ అనేక మార్లు ఇండియాతో 2+2 చర్చలు జరిపింది. జపాన్ తర్వాత ఇండియా అమెరికాతోనూ, ఆ తర్వాత ఆస్ట్రేలియాతోనూ 2+2 చర్చలు జరిపింది. జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా, ఇండియాలు క్వాడ్ మిలట్రీ కూటమిలో సభ్యులు అన్నది ఈ సదర్భంగా గమనంలో ఉంచుకోవాలి.
ఆ తర్వాత రష్యాతో ఇండియా 2+2 డైలాగ్ కి సిద్ధపడింది. మోడి నేతృత్వంలోని ఇండియాకు ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ఇచ్చినంత ఆదరణ బైడెన్ నేతృత్వం లోని అమెరికా ఇవ్వడం లేదు. క్రితం సారి ప్రధాని మోడి అమెరికా సందర్శించినప్పుడు ఆ సంగతి స్పష్టం అయింది.
2019 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు ప్రధాని మోడి “అబ్ కి బార్ ట్రంప్ సర్కార్” నినాదంతో ట్రంప్ కు మద్దతుగా ప్రచారం చేయడాన్ని బైడెన్ మర్చిపోలేదు మరి!
రష్యాతో ఇండియా 2+2 చర్చలకు సిద్ధపడేందుకు ఈ నేపధ్యం పని చేసిందేమో తెలియాల్సి ఉన్నది.
పుతిన్ వచ్చాక 2+2 డైలాగ్ తో కలిపి మొత్తం 10 ముఖ్యమైన ఒప్పందాలపై ఇండియా రష్యాలు సంతకాలు చేసే అవకాశం ఉన్నదని పత్రికలు చెబుతున్నాయి. వేచి చూద్దాం.