ఇండియా రష్యా 2+2 డైలాగ్: ఏ‌కే-203 ఒప్పందం ఒకే


AK-203 Rifle

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇండియా సందర్శన సందర్భంగా ఇరు దేశాల మధ్య 2+2 ఫార్మాట్ లో ఈ రోజు చర్చలు జరిగాయి. చర్చల్లో రష్యా రక్షణ మంత్రి సెర్గి షోయిగు, విదేశీ మంత్రి సెర్గీ లావరోవ్ లు రష్యా తరపున పాల్గొనగా, ఇండియా తరపున రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్, విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్ లు పాల్గొన్నారు.

సోమవారం జరిగిన ఈ సమావేశం ఇండియా రష్యాల మధ్య 2+2 ఫార్మాట్ లో జరిగిన మొట్ట మొదటి సమావేశం. ఈ ఫార్మాట్ లో (ఇరు దేశాల రక్షణ మరియు విదేశీ మంత్రులు సంయుక్తంగా సమావేశం కావడం) ఇండియా, రష్యాలు చర్చలు జరపడం ఇదే మొదటిసారి. (2+2 ఫార్మాట్ గురించి తర్వాత టపాలో చూద్దాం.)

సమావేశంలో ప్రధాన అంశం సైనిక-సాంకేతిక సహకార ఒప్పందం (మిలట్రీ-టెక్నికల్ కో-ఆపరేషన్ అగ్రిమెంట్) ను మరో పదేళ్ళ పాటు పొడిగించడం. 2021లో ముగియనున్న ఈ ఒప్పందాన్ని మరో పదేళ్ళ పాటు అనగా 2031 సం. వరకూ పొడిగించడం ద్వారా ఇరు దేశాలు తమ ‘సర్వకాల సంబంధం’ (all-weather relationship) నిర్నిరోధంగా కొనసాగుతుందని చాటాయి.

ఇటువంటి ఆల్-వెదర్ సంబంధం పాకిస్తాన్-చైనా సంబంధాల గురించి చెప్పేటప్పుడు తరచుగా వినిపిస్తుంది. పాక్-చైనా మరియు ఇండియా-రష్యాల ఈ తరహా సంబంధానికి పునాది ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అమెరికా, రష్యాలు వైరి ధృవాలుగా ప్రపంచాన్ని శాసించిన కాలంలో పడింది. ప్రచ్ఛన్న యుద్ధం ముగిసినప్పటికీ ఈ సంబంధాలు కొనసాగుతున్నాయి.

బి‌జే‌పి హయాం నుండి ఇండియా-అమెరికాల మధ్య సంబంధాలు విస్తృతమై, దృఢతరమై అమెరికా ప్రారంభించిన చైనా-వ్యతిరేక ప్రపంచాధిపత్య వ్యూహంలో ఇండియా భాగస్వామిగా చేరడం వరకు అభివృద్ధి చెందాయి. ఈ కారణం చేత ఇండియా-రష్యాల మధ్య సంబంధాలు ప్రచ్ఛన్న యుద్ధ కాలం నాటి కంటే కాస్త బలహీనపడ్డ మాట వాస్తవం. అయితే పాక్-చైనా సంబంధాలు మాత్రం బలహీనపడటం అటుంచి మరింత గట్టి పడ్డాయి. చైనా అమలు చేస్తున్న ప్రపంచ వాణిజ్య కేంద్రాల నెట్ వర్క్ ‘బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్’ లో పాకిస్తాన్ చురుకుగా పాల్గొనడం, అలాగే పాక్, అమెరికాకు దూరం జరగడం ఇందుకు కారణాలుగా పని చేస్తున్నాయి.

రష్యా అధ్యక్షుడు పుతిన్ సోమవారం సాయంత్రం ఇండియాలో విమానం దిగుతారు. ఆయన రావడానికి ముందు ఇరు దేశాల రక్షణ, విదేశాంగ మంత్రులు చర్చలు జరిపి వివిధ ఒప్పందాలను పూర్తి చేయాల్సి ఉంటుంది. వీటిపై ఆధారపడి రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇండియా ప్రధాని నరేంద్ర మోడి ఇరు దేశాల ప్రభుత్వాల సంబంధాలపై విధాన ప్రకటనలు చేస్తారు.

21వ ఇండియా-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో భాగంగా నేడు (06/12/2021) వ్లాదిమిర్ పుతిన్, నరేంద్ర మోడి సమావేశం కానున్నారు. ప్రతి యేటా ఇండియా రష్యాల శిఖరాగ్ర సమావేశాలు జరిపే సంప్రదాయాన్ని వాజ్ పేయి ప్రధాన మంత్రిత్వంలో 2000 సం. లో నెలకొల్పారు. అప్పటి నుండి ప్రతి యేటా వార్షిక సమావేశం జరుగుతూ వస్తోంది. ఈ రోజు జరగబోయేది 21వ వార్షిక సమావేశం.

అయితే ఇండియా రష్యాల మధ్య 2+2 ఫార్మాట్ లో సమావేశం జరగడం మాత్రం ఇదే మొదటిసారి. గతంలో ఇండియా, జపాన్ ల మధ్య ఈ ఫార్మాట్ సమావేశాలు జరిగేవి. అమెరికాతోనూ ఇలాంటి సమావేశం ఇండియా 3 సార్లు జరిపింది. 4వది నవంబర్ లో జరగాల్సి ఉండగా ఇంకా జరగలేదు. ఆస్ట్రేలియాతో ఒకే ఒక్కసారి గత సెప్టెంబర్ లో జరిపింది.

ఒప్పందాలు

2+2 ఫార్మాట్ లో ఈ రోజు జరిగిన చర్చల్లో నికరంగా ఒక ఒప్పందం జరిగింది. అది ఏ‌కే-203 రైఫిళ్ళ సరఫరా ఒప్పందం. 6.1 లక్షల ఏ‌కే-203 రైఫిళ్ళను ఇండియా-రష్యాల సంయుక్త ఆధ్వర్యంలో ఇండియాలోనే తయారు చేసేందుకు ఈ ఒప్పందం జరిగింది. ఒప్పందం ఖరీదు రు 5,000 కోట్లు. ఇరు దేశాలు సంయుక్తంగా నెలకొల్పే జాయింట్ వెంచర్ రైఫిల్స్ ను తయారు చేస్తుంది.

ఉత్తర ప్రదేశ్, అమేధి లోని కొర్వాలో “ఇండో-రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్” పేరుతో జాయింట్ వెంచర్ కంపెనీ నెలకొల్పుతారు. ఇండియాకు చెందిన అడ్వాన్స్ వెపన్స్ అండ్ ఎక్విప్^మెంట్ ఇండియా మరియు మ్యూనిషన్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీలు, రష్యా తరపున రోజోబొరోనెక్స్^పోర్ట్ కంపెనీ మరియు కలష్నికోవ్ ఆఫ్ రష్యా లు సంయుక్తంగా ఐ‌ఆర్‌ఆర్‌పి‌ఎల్ కంపెనీని స్ధాపిస్తాయి.

ఈ ఒప్పందం గతంలోనే పూర్తి కావలసి ఉండగా అధిక ధరల వలన చర్చలు సాగుతూ వచ్చాయి. ధరలు తగ్గించడానికి రష్యా ప్రభుత్వం రైఫిల్ ధరలో నుండి రాయల్టీ చార్జీలను పూర్తిగా తొలగించడానికి అంగీకరించింది. రైఫిల్ తయారీలో ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానానికి గాను ఆయా కంపెనీలు మేధో సంపత్తి హక్కుల కింద రాయల్టీ వసూలు చేస్తాయి. ఆ రాయల్టీని రష్యా తొలగించడంతో ఒప్పందం పూర్తి కావడానికి మార్గం సుగమం అయింది.

సాధారణంగా ఏ రంగంలో నైనా తమ ఉత్పత్తులపై రాయల్టీని తప్పించడానికి కంపెనీలు సుతరామూ అంగీకరించవు. ఔషధ కంపెనీలైతే ఈ రాయల్టీల పైనే అనేక రెట్లు లాభాలు ఆర్జిస్తూ రోగుల కుటుంబాల ఆర్ధిక పరిస్ధితులను దివాళా తీయిస్తాయి. వారి అధిక ధరలే ఆరోగ్య భీమా కంపెనీలకు వందల బిలియన్ల డాలర్ల మార్కెట్ ప్రపంచ వ్యాపితంగా సృష్టిస్తున్నాయి. అలాంటి రాయల్టీని రష్యన్ కంపెనీ వదులుకోవడం బట్టి ఇండియాతో సంబంధాలకు రష్యా ఇస్తున్న ప్రాముఖ్యతను గుర్తించవచ్చు.

ఫిబ్రవరి 2019లో మొదట ఏ‌కే-203 రైఫిల్ కోసం అంతర్ ప్రభుత్వ ఒప్పందం జరిగింది. 6.71 లక్షల రైఫిళ్ళ కొనుగోలుకు ఆనాడు నిర్ణయించారు. అయితే ఈ లోపు 70,000 రైఫిల్స్ ను ఎమర్జెన్సీ ఉపయోగం కోసం మరో ఒప్పందం ద్వారా కొనుగోలు చేశారు. ఈ రోజు మిగిలిన 6.1 లక్షల రైఫిల్స్ కొనుగోలుకై ఒప్పందం జరిగింది. గతంలో 30 యేళ్ళ నుండి వాడుతున్న ఇన్సాస్ రైఫ్ల్స్ స్ధానంలో ఇండియన్ మిలట్రీ ఏ‌కే-203 రైఫిల్స్ వాడుతుంది.

India, Russia 2+2 dialogue

ఇవి ప్రధానంగా టెర్రరిస్టు వ్యతిరేక, తిరుగుబాటు వ్యతిరేక కార్యకలాపాల కోసం వినియోగించ నున్నారు. అనగా భారత పౌరులే టెర్రరిస్టులు, తిరుగుబాటుదారుల పేరుతో రష్యన్ రైఫిళ్ళకు ప్రధాన టార్గెట్ కానున్నారు. హత విధీ!

2+2 సమావేశం సందర్భంగా రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ పొరుగు దేశం చైనాపై ఆ దేశం పేరు ఎత్తకుండా ఫిర్యాదు చేశారు. అమెరికా ప్రకటించిన ‘ఆసియా-పివోట్’ పుణ్యమాని చైనా, రష్యాలు బాగా దగ్గరైన నేపధ్యంలో ఇండియా, చైనాల మధ్య వారధిగా రష్యా పని చేయాలని భారత రక్షణ మంత్రి భావిస్తున్నట్లు కనిపిస్తోంది.

“ఇండియా ఎదుర్కొంటున్న సరికొత్త సవాళ్ళ గురించి, రష్యా ఇండియాల మధ్య మరింత దగ్గరి మిలట్రీ టు మిలట్రీ సాంకేతిక సహకారం అభివృద్ధి చెందవలసిన అవసరం గురించి చర్చించే అవకాశం నాకు లభించింది. (కోవిడ్) మహమ్మారి, మా పొరుగున తీవ్ర స్ధాయి మిలత్రీకరణ మరియు ఆయుధ విస్తరణ చోటు చేసుకోవడంతో పాటు మా ఉత్తర సరిహద్దులో దూకుడుగా దాడులు జరగడం 2020 వేసవి నుండి మేము ఎదుర్కొంటున్న సవాళ్ళు” అని రక్షణ మంత్రి 2+2 చర్చల్లో ప్రస్తావించారు.

ఇండియా రష్యా ముందు ఉంచిన మరో కోరిక- మధ్య ఆసియా మరియి హిందూ మహా సముద్రంలో మరింత విస్తృత పాత్రను ఇండియాకు కల్పించాలి అని. ఇటీవల ఇండియాకు సమాచారం ఇవ్వకుండానే అమెరికా యుద్ధ నౌకలు లక్ష దీవులకు అత్యంత సమీపంగా వచ్చి వెళ్ళడం ఇండియాకు ఆందోళన కారకంగా నిలవడం ఈ సందర్భంగా గమనించాలి. అమెరికాతో వైరం నెరపుతున్న చైనా తోనూ స్నేహ సంబంధాలు లేకపోవడంతో హిందూ మహా సముద్రంలో కూడా రష్యానే సహాయం కోరడం ఇండియా ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్ధితిగా చెప్పవచ్చు.

ఇండియా-రష్యాల మధ్య ఎస్-400 క్షిపణి సరఫరా ఒప్పందం ఇప్పటికే ఆచరణ రూపం దాల్చుతోంది. మరో పది రోజుల్లో అత్యంత ఆధునిక మైన ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్ధ ఇండియాకు అందనున్నది. ఈ క్షిపణుల కొనుగోలు వల్ల కూడా ఇండియా, అమెరికా ఆగ్రహాన్ని ఎదుర్కొంటున్నది. నిజానికి ఎస్-400 వ్యవస్ధలను కొనుగోలు చేసే దేశాలపై పలు ఆర్ధిక, వాణిజ్య ఆంక్షలను అమెరికా విధిస్తోంది. ఈ వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి రాకపోయినప్పటికీ క్షిపణి వ్యవస్ధ కొనుగోలుకే భారత ప్రభుత్వం నిర్ణయించడం గమనార్హం.

2+2 సమావేశంలో పూర్తయిన ప్రధాన అంశాలు:

1. 6.1 లక్షల ఏ‌కే-203 రైఫిల్స్ ఇండియాలో తయారీకి ఒప్పందం.

2. ఇండియా-రష్యా మిలట్రీ-టెక్నికల్ సహకార ఒప్పందం మరో పదేళ్ళ వరకు కొనసాగించడం.

3. హిందూ మహా సముద్రంలో పాత్ర పెంచుకునేందుకు, చైనాతో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి ఇండియా, రష్యా సహాయం కోరడం.

4. రష్యా అధ్యక్షుడు పుతిన్, భారత ప్రధాని నరేంద్ర మోడి మధ్య చర్చలకు అజెండా స్ధిరపరచడం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s