
Afghan women
ఆఫ్ఘనిస్తాన్ నేల నుండి ఒక శుభ వార్త!
మహిళల హక్కులను, ఆకాంక్షలను అణచివేయడంలో పేరు పొందిన తాలిబాన్ ఆఫ్ఘన్ ఆడ పిల్లలకు అనుకూలంగా ఒక ముఖ్యమైన డిక్రీ జారీ చేయడం ద్వారా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.
“స్త్రీ ఏ ఒక్కరి ఆస్తీ కాదు. ఆమెను ఒక గౌరవప్రదమైన మరియు స్వేచ్ఛాయుత మానవునిగా పరిగణించాలి. శాంతికి బదులుగానో లేక శతృత్వానికి ముగింపు పలికే లక్ష్యంతోనో ఏ స్త్రీనీ మారకానికి ఇవ్వడం జరగరాదు” అని తాలిబాన్ ప్రభుత్వం డిక్రీ జారీ చేసింది.
ఈ డిక్రీనీ తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహిల్లా ముజాహిద్ ఈ రోజు (డిసెంబర్ 3, 2021) పత్రికలకు విడుదల చేశాడు.
మహిళా వివాహం, మహిళల ఆస్తి హక్కుల విషయాలకు సంబంధించి కూడా కొన్ని నియమ నిబంధలను ఈ డిక్రీ నిర్దేశించింది.
వాటి ప్రకారం మహిళలకు బలవంతంగా వివాహం చేయకూడదు. భర్త చనిపోయిన స్త్రీలకు తమ భర్తల ఆస్తిలో తప్పనిసరిగా వాటా ఉండాలి.
కోర్టులు తాజా డిక్రీలో పొందుపరిచిన అంశాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకుని వివిధ నిర్ణయాలు తీసుకోవడం, మత వ్యవహారాలను నిర్ణయించడం చేయాలని డిక్రీ నిర్దేశించింది. . సమాచార మినిస్త్రీలు ఈ డిక్రీలో పొందుపరిచిన హక్కులకు విస్తృత ప్రచారం కల్పించాలని కూడా డిక్రీ నిర్దేశించింది.
అయితే ఆస్తి హక్కు, వివాహాల పై ముఖ్యమైన నిర్ణయాలు చేసిన తాలిబాన్ ప్రభుత్వం ఆడ పిల్లలకు విద్యా హక్కు కల్పించే విషయంలో మాత్రం ఇంతవరకు ఏమీ నిర్ణయం చేయకుండా మౌనం వహిస్తోంది. మహిళలు ఇంటినుండి బైటికి వచ్చి ఉపాధి పనులకు హాజరయ్యే విషయంలో కూడా తమ పాత అభిప్రాయాలను మార్చుకున్నదీ లేనిదీ చెప్పలేదు. నిర్ణయాలూ ప్రకటించలేదు.
1996-2001 కాలంలో ఆఫ్ఘనిస్తాన్ ని పాలించిన తాలిబాన్ మహిళలు ఇంటి బైటికి రావడానికి అంగీకరించలేదు. ఒకవేళ వస్తే శరీరం అంతా ముసుగు కప్పుకుని ఒక మగతోడు తెచ్చుకోవాలని నిబంధన విధించింది. ఆలాగే ఆడ పిల్లలకు విద్య నిషేధించింది. ఈ విధానాలను మార్చుకున్నామని ఆగస్టు 15 తేదీన ఆఫ్ఘన్ అధికారం చేపట్టినప్పుడు తాలిబాన్ ప్రకటించింది.
ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో ఆడ పిల్లలకు పాఠశాలలు తెరవడానికి తాలిబాన్ పాలకులు అంగీకరించారు. మరి కొన్ని రాష్ట్రాల్లో పాఠశాలలు ఇంకా తెరవలేదు. త్వరలో తెరుస్తాం అంటున్నారు గానీ చాలా మందికి అనుమానాలున్నాయి. ఆఫ్ఘన్ హక్కుల కార్యకర్తలు పలువురు తాలిబాన్ ప్రకటనలను పూర్తి విశ్వాసం లోకి తీసుకోవడం లేదు.
ఆఫ్ఘనిస్తాన్ కి చెందిన బిలియన్ల డాలర్ల నిధులు పశ్చిమ రాజ్యాల సెంట్రల్ బ్యాంకుల్లో ముఖ్యంగా అమెరికాలో స్తంభించబడి ఉన్నాయి. వీటిని విడుదల చేయాలంటే తాలిబాన్ పలు సంస్కరణలు చేపట్టాలని ముఖ్యంగా స్త్రీ విద్య, స్త్రీ హక్కుల పట్ల తమ వైఖరి మారినట్లు రుజువు చేసుకోవాలని షరతు విధించినట్లు చెబుతున్నారు.
అయితే తాలిబాన్ స్త్రీల హక్కులను గుర్తించినప్పటికీ పశ్చిమ రాజ్యాల కంపెనీలకు తగిన విధంగా మైనింగ్, చమురు తవ్వకాలు తదితర కాంట్రాక్టులు ఇవ్వనట్లయితే ఆ నిధులు విడుదల చేస్తారా అన్నది అనుమానమే. ప్రజాస్వామ్యం పట్ల పశ్చిమ రాజ్యాల నిబద్ధత ఏమిటో సౌదీ అరేబియా, కతార్, జోర్డాన్ లాంటి అరబ్ రాచరికాలను భేషుగ్గా మిత్రదేశాలుగా స్వీకరించడంలోనే తెలిసిపోయింది. కనుక ఆఫ్ఘన్ స్త్రీల హక్కులు తాలిబాన్ ప్రభుత్వాన్ని అదుపులో ఉంచుకోవడానికి మాత్రమే పశ్చిమ రాజ్యాలు ఉపయోగిస్తాయి.
అలాగని తాలిబాన్ స్త్రీల పట్ల అనుసరించే విధానాలను ఎంత మాత్రం సమర్ధించడానికి వీలు లేదు. అమెరికా, ఐరోపా ఆజ్ఞలతో, షరతులతో సంబంధం లేకుండా ఆఫ్ఘన్ స్త్రీలు, ఇతర ప్రజాస్వామిక శక్తులు పొరాడి సాధించుకుంటేనే ఆ హక్కులు నిలబడతాయి. బైటి దేశాల షరతులతో వచ్చే అవకాశాలు ఎంతో కాలం నిలబడవు.
ఈ సంగతి గుర్తెరిగి ఆఫ్ఘన్ ప్రజలు తాలిబాన్ నియంతృత్వ పాలనపై తామే స్ధిరమైన పోరాటాలు నిర్మించి తమ హక్కులు తామే సాధించుకోవాలి. అలా సాధించుకునే హక్కులు సామాజిక ద్రుకధంలో కూడా మార్పు తీసుకు వస్తుంది. దృక్పధంలో మార్పు తెచ్చే హక్కులే ప్రజల్లో నిలబడి ఉంటాయి.