ప్రస్తుతం ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్న కోవిడ్ వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత దేశంలో కూడా ప్రవేశించిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.రెండు కేసులూ కర్ణాటక రాష్ట్రంలో కనుగొన్నట్లు ప్రభుత్వం గురువారం తెలిపింది.
ఒమిక్రాన్ వేరియంట్ వైరస్ సోకిన ఇద్దరూ పురుషులే. ఒకరి వయసు 66 సం.లు కాగా మరొకరి వయసు 46 సం.లు. ఈ ఇద్దరి జాతీయత ఏమిటో వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారో భారత పత్రికలు వెల్లడించడం లేదు.
అయితే WION వెబ్ సైట్ అందజేసిన వివరాల ప్రకారం 66 యేళ్ళ వృద్ధుడు విదేశీయుడు ఈయన ఇటీవల సౌత్ ఆఫ్రికా వెళ్ళి వచ్చాడు. 46 యేళ్ళ వ్యక్తి మాత్రం భారతీయుడు, బెంగుళూరు నివాసి.
ఈ ఇద్దరి రోగుల ప్రైమరీ మరియు సెకండరీ కాంటాక్తులు అందరినీ గుర్తించామని, వారిని జాగ్రత్తగా గమనిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది.
ఇప్పటివరకు అందుతున్న వివరాల ప్రకారం ఇద్దరు ఒమిక్రాన్ బాధితులకు తీవ్ర లక్షణాలు ఏవీ లేవు. సాధారణ లక్షణాలే ఉన్నాయి.
నవంబరు 24 తేదీన మొదటిసారి సౌత్ ఆఫ్రికాలో కనుగొన్నప్పటి నుండి ఒమిక్రాన్ వేరియంట్ విపరీత స్ధాయిలో భయాందోళనలకు కారణం అయింది. సౌత్ ఆఫ్రికాలో ఒమిక్రాన్ మొదట కనుగొన్నప్పటికీ అది అంతకుముందే అమెరికా, హాలండ్ లలో బైటపడినట్లు తర్వాత తెలిసింది. దానితో ఇది మొదట అనుకున్నట్లు మొదట సౌత్ ఆఫ్రికాలో పుట్టింది అనడం సత్య దూరం.
బొట్స్వానా, హాంగ్ కాంగ్ లలో కూడా సౌత్ ఆఫ్రికా కంటే ముందే ఒమిక్రాన్ ని కనుగొన్నట్లు తెలుస్తోంది.
ఒమిక్రాన్ వేరియంట్ వైరస్ లో పెద్ద సంఖ్యలో ఉత్పరివర్తనలు (mutations) చోటు చేసుకోవడం వల్ల దానిపై దృష్టి కేంద్రీకరించవలసిన పరిస్ధితి వచ్చింది. అధిక సంఖ్యలో మ్యూటేషన్స్ చోటు చేసుకోవడం వల్ల వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఒక్క స్పైక్ ప్రోటీన్ లోనే 32 రకాల మ్యూటేషన్ లు ఒమిక్రాన్ లో జరిగాయని వారు చెబుతున్నారు.
సార్స్-కోవ్-2 వైరస్ ఈ స్పైక్ ప్రోటీన్ ద్వారానే మానవ శరీరంలోని కణాల్లో ప్రవేశించగలుగుతోంది. ఇప్పటివరకు తయారు చేసిన వ్యాక్సిన్ లు గత వేరియంట్ లలోని స్పైక్ ప్రోటీన్ లు లక్ష్యంగా అభివృద్ధి చేసుకున్నవి. ఈ స్పైక్ ప్రోటీన్ లే మ్యూటేషన్ చెందడం అంటే అవి కొత్త రూపం లోకి మారడం అన్నమాట.
కనుక వ్యాక్సిన్ ల ద్వారా పుట్టే యాంటీ బాడీలు ఈ కొత్త స్పైక్ ప్రోటీన్ లను గుర్తించడంలో విఫలం కావచ్చన్న అనుమానాలు బయలుదేరాయి. యాంటీ బాడీలకు పట్టుబడకపోతే ఒమిక్రాన్ తరహా వైరస్ కు ఇక అడ్డూ అదుపూ లేకపోవచ్చు. ఇందుకే శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు.
ఇప్పటిదాకా 10 దేశాలు సౌత్ ఆఫ్రికా, బొట్స్వానా, ఇంగ్లండ్, హాంగ్ కాంగ్, ఆస్ట్రేలియా, ఇటలీ, ఇజ్రాయెల్, చెక్ రిపబ్లిక్, బెల్జియం, ఇండియా లు ఒమిక్రాన్ వేరియంట్ కోవిడ్ వైరస్ కేసులు రిపోర్ట్ చేశాయి.