
On 20 May 1951, Dr. Ambedkar addressed a conference on the occasion of Buddha Jayanti organised at Ambedkar Bhawan, Delhi. The Guest of Honour was the then Ambassador of France in India.
మహారాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ రచనలు, ప్రసంగాలను ప్రచురించే ప్రాజెక్టును నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం మహారాష్ట్ర ప్రాంతీయ పత్రిక లోక్ సత్తా ఒక వార్త ద్వారా వెలుగులోకి తెచ్చింది. సదరు వార్తను పరిగణలోకి తీసుకున్న బొంబే హై కోర్టు, ప్రచురణ ప్రాజెక్టు నిలిపివేయడాన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా సుమోటుగా డిసెంబర్ 1 న స్వీకరించింది.
మరాఠీ పత్రిక లోక్ సత్తా నవంబర్ 24 తేదీన అంబేద్కర్ రచనలు, ప్రసంగాల ప్రచురణను నిలిపివేసిన అంశాన్ని ప్రచురించింది. జస్టిస్ ప్రసన్న బి వరాలే, జస్టిస్ శ్రీరామ్ ఎం. మొదక్ లతో కూడిన డివిజన్ బెంచి ఈ అంశాన్ని సుమోటు విచారణకు స్వీకరిస్తూ “ఇది దయనీయమైన పరిస్ధితి” అని వ్యాఖ్యానించింది. ఈ అంశాన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించి చీఫ్ జస్టిస్ దీపంకర్ దత్తా దృష్టికి తీసుకెళ్లాలని కోర్టు రిజిస్త్రీని ఆదేశించింది.
ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ లో తగినంత మంది సిబ్బంది లేకపోవడం, ముద్రణా యంత్రాలు పాతబడి పోవటం లను ప్రాజెక్టు నిలిపివేతకు కారణాలుగా ప్రభుత్వం చెప్పింది. దీనిని హై కోర్టు డివిజన్ బెంచి “Sorry state of affairs” గా అభివర్ణించింది. ఇప్పటివరకు 21 వాల్యూంలుగా వెలుగులోకి తెచ్చిన అంబేద్కర్ రచనల ప్రచురణను సిబ్బంది కొరత, ఆధునిక యంత్రాల కొరత కారణాలుగా చెప్పి ఒక రాష్ట్ర ప్రభుత్వం, అందునా అత్యంత ధనిక రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేయడం నిజంగానే ‘దయనీయమైన పరిస్ధితి’. ఇదే కారణం చెప్పి మంత్రులు, ఎంఎల్‌ఏలకు అందజేసే లగ్జరీ సౌకర్యాలు, వృధా ఖర్చులు నిలిపివేయ గలరా అన్నది అనుమానమే.
అంబేద్కర్ రచనలు, ప్రసంగాల మొత్తాన్ని పలు వాల్యూంలుగా విభజించి ప్రచురించాలని, దేశ ప్రజలకు విస్తృతంగా అందుబాటులోకి తేవాలని మహా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రచురణ మొత్తానికి “డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు, ప్రసంగాలు” (The Writings and Speeches of Dr. Bahasaheb Ambedkar) అన్న టైటిల్ పెట్టాలని నిర్ణయించింది. రచనలు మొత్తం 9 లక్షల కాపీలు ప్రచురించాలని లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించుకుంది.
ఈ ప్రాజెక్టు నిమిత్తం ప్రభుత్వం నవంబర్ 2017లో 5.45 కోట్ల రూపాయలతో ప్రచురణ కాగితం కొనుగోలు చేసింది. 8.17 లక్షల రూపాయలతో బైండింగ్ క్లాత్ కొనుగోలు చేసింది. కానీ 2017 నుండి ఇప్పటివరకు 33,000 కాపీలు మాత్రమే ప్రచురించింది. ప్రచురించిన కాపీలలో కూడా కేవలం 3,675 కాపీలను మాత్రమే వివిధ లైబ్రరీలలో పంపిణీకి అందుబాటులోకి తెచ్చింది. ప్రచురించడానికి పాత ముద్రణ యంత్రాలు, సిబ్బంది కొరత కారణాలు సరే, ముద్రించిన పుస్తకాలను పంపిణీ చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఏ ఆటంకాలు ఎదురయినట్లు? ఈ కొరతలు కేవలం అంబేద్కర్ రచనల ప్రచురణకే ఎదురయిందా లేక ఇతర ప్రభుత్వ ప్రచురణలకు కూడా ఎదురవుతోందా?
మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వానికి ముంబై, పూణే, నాగపూర్ లలో ప్రింటింగ్ ప్రెస్ లు ఉన్నాయి. ఈ ప్రెస్ లలో తగినంత మంది సిబ్బంది లేరట. పాత కాలపు యంత్రాలు భారీ ప్రచురణ ప్రాజెక్టులకు అనువుగా లేవట. అందువలన అంబేద్కర్ వర్క్స్ ప్రచురణకై నిర్దేశించిన గడువు లోపు ముద్రణ పూర్తి చేయడం ప్రెస్ లకు సాధ్యం కాకుండా పోయిందని ప్రభుత్వం చెబుతోంది. ఈ కారణాలు పరిష్కారం చేయలేనివి కావు. యంత్రాల కొనుగోలు, సిబ్బంది నియామకం అన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో పని. అవేమీ భారీ ఖర్చుతో కూడుకున్న పని కూడా కాదు. అంబేద్కర్ రచనల ప్రచురణ వల్ల కలిగే మేధో సంపత్తి లాభాలతో పోల్చితే యంత్రాల కొనుగోలు, సిబ్బంది నియామకానికి పట్టే ఖర్చు చాలా తక్కువ. అయినా దానిని భారంగా మహారాష్ట్ర ప్రభుత్వం తలపోయడం దారుణం.
ముద్రణకు నిర్దేశించిన కాగితం పెద్ద మొత్తంలో భద్రంగా నిలవ ఉందని ప్రభుత్వ ముద్రణా విభాగం డైరెక్టరేట్ కార్యాలయం తెలియజేసింది. గవర్నమెంట్ ప్రింటింగ్, స్టేషనరీ అండ్ పబ్లికేషన్స్ డైరెక్టర్ రూపేంద్ర మోరే ప్రకారం ఈ కాగితం “అత్యంత నాణ్యమైనది” మరియు “అనేక యేళ్ళ పాటు మన్నిక గలది”. దీనిని అలా వృధా చేయడానికే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపడం బొత్తిగా అర్ధం కాని సంగతి.
“వార్తా కధనంలో లేవనెత్తిన సమస్య స్వభావాన్ని బట్టి మేము ఈ విషయాన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణిస్తున్నాము” అని బొంబే హై కోర్టు డివిజన్ బెంచి తెలిపింది. “అంబేద్కర్ రచనలు న్యాయ వ్యవస్ధలోని సిబ్బంది, న్యాయవాదులకే గాకుండా సాధారణ ప్రజలకు కూడా ఎంతో ఉపయోగకరం. ఇవి ప్రస్తుత తరానికే గాక భవిష్యత్ తరాలకు కూడా అత్యంత అవసరమైన రచనలు” అని బొంబే హై కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.
“అంబేద్కర్ రచనల పుస్తకాలకు భారీ యెత్తున డిమాండ్ ఉందనడంలో ఎలాంటి బేదాభిప్రాయం లేదు. పరిశోధకులే కాక సాదారణ ప్రజానీకం కూడా ఈ పుస్తకాలను కొని చదువుతుంటారు. అందువల్లనే వాటికి భారీ డిమాండ్ నెలకొని ఉంది” అని కోర్టు తెలిపింది. “కనుక ప్రచురణ ప్రాజెక్టు నిలిపివేత అంశాన్ని తగిన విధంగా పరిశీలించాలని కోర్టు భావిస్తోంది” అని డివిజన్ బెంచి ప్రకటించింది.
ప్రాజెక్టు నిలిపివేత నిర్ణయం గత బిజేపి ప్రభుత్వ హయాంలో జరిగిందా లేక 2019 అక్టోబర్ ఎన్నికల్లో అధికారం చేపట్టిన ఎన్‌సిపి-శివసేన-కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిందా అన్న విషయం తెలియరాలేదు. అంబేద్కర్ పై గౌరవం నటిస్తూనే ఆయన ప్రబోధించిన కుల నిర్మూలన తదితర ఆదర్శాలను తుంగలో తొక్కే పాలకుల ఏలుబడికి అంబేద్కర్ భావజాలం ప్రాచుర్యం పొందటం ఇష్టం లేకపోవడంలో ఆశ్చర్యం లేకపోవచ్చు.
మహారాష్ట్ర ప్రభుత్వం 1987లో మొదటిసారి అంబేద్కర్ రచనలను మరాఠీ, ఇంగ్లీష్ లలో ప్రచురించడం ప్రారంభించింది. దళిత సంఘాలు, రచయితలు, ఆలోచనాపరులు అనేకమార్లు ఒత్తిడి తేవడంతో ఆయన రచనల మొత్తం సేకరించి ప్రచురించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తర్వాత యూపిఏ ప్రభుత్వం అంబేద్కర్ ఫౌండేషన్ ఏర్పాటు చేసింది. ఆనాటి కాంగ్రెస్ నేతృత్వం లోని మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకున్న ఫౌండేషన్ ఇతర భారతీయ భాషల్లో కూడా అంబేద్కర్ రచనలను ప్రచురించి అందుబాటులోకి తెచ్చింది. ఇవి 2017 నాటికే పూర్తిగా అమ్ముడైనాయి.
కానీ ఆ తర్వాత అంబేద్కర్ ఫౌండేషన్ అంబేద్కర్ వర్క్స్ ప్రచురణ కొనసాగించలేకపోయింది. దాదాపు రెండు డజన్ల పుస్తకాలను అది ప్రచురించలేకపోయింది. దానికి కారణం మహారాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన అనుమతిని రద్దు చేయడమే. అంబేద్కర్ ఫౌండేషన్ కు ఇచ్చిన ముద్రణా హక్కులను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవడంతో ఫౌడేషన్ ప్రచురణ అటకెక్కింది.
ఫౌండేషన్ కి ఇచ్చిన ముద్రణా హక్కులను వెనక్కి తీసుకున్నాక తానే ప్రచురణ ప్రాజెక్టు చేపట్టిన మహారాష్ట్ర ప్రభుత్వం సదరు ప్రాజెక్టును అర్ధాంతరంగా నిలిపేసింది. విచిత్రం ఏమిటంటే 2018లో జేఎన్‌యూ లైబ్రరీకి మోడి ప్రభుత్వం ‘అంబేద్కర్ లైబ్రరీ’ అని పేరు పెట్టింది. కానీ ఆ లైబ్రరీలో ఒక్కటంటే ఒక్కటి కూడా అంబేద్కర్ రచనల కాపీ లేదు. జేఎన్‌యూ విద్యార్ధులు, పరిశోధకులు అంబేద్కర్ ప్రసంగాలు, రచనల కోసం తమ లైబ్రరీకి వెళ్ళి అవి దొరక్క తెల్లమొఖం వేసుకుని వెనక్కి మళ్లుతారు. ఇంతకంటే ‘దయనీయమైన పరిస్ధితి’ మరొకటి ఉంటుందా?
పాఠశాల విద్యార్ధుల పాఠ్య గ్రంధాల నుండి యూనివర్సిటీ పరిశోధనాంశాల వరకు హిందూత్వ పాఠాలతో నింపడానికి బిజేపి ప్రభుత్వం ఆహరహం శ్రమిస్తుంది. అంబేద్కర్ ఫోటోలకు విగ్రహాలకు పూలమాలలు వేసి, అవకాశం వచ్చినప్పుడల్లా ఆయన పట్ల భక్తి ప్రపత్తులు ప్రకటించుకునే బిజేపి ప్రభుత్వం ఆయన రచనల ముద్రణ బాధ్యతను ఎందుకు తీసుకోదు?